ధారావాహికలు
సుందరకాండ
- డా.అక్కిరాజు రమాపతిరావు

(గత సంచిక తరువాయి)
సీతాదేవి తర్కవితర్కాలు
ఇది చూసి హనుమంతుడు ఎంతో నొచ్చుకున్నాడు. ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడామె దీర్ఘంగా నిట్టూర్పులు పుచ్చి "నీవు రావణుడివి కావు కదా! అయితే నాకు ఇక దిక్కూ తెరువూ లేనట్లే. సన్యాసివేషంతో నన్ను వంచించాడు రావణుడు. కాని నీవు, రావణుడివి కాదేమో ననిపిస్తున్నది ఏమంటే నిన్ను చూస్తుంటే నాకు సంతోషమనిపిస్తున్నది. నీవు నిజంగా రామదూతవే అయితే రాముడి గురించి ఇంకా వివరంగా చెప్పు" అని సీతాదేవి ఆత్రుతతో హనుమంతుణ్ణి అడిగింది. ఆమె తహతహ గమనించి ’అమ్మా! శ్రీరామచంద్రుడు తేజస్సులో సూర్యుడు, లోకానికి ఆహ్లాదం చేకూర్చడంలో చంద్రుడు. సంపన్నులలో కుభేరుడు, పరాక్రమం విషయానికి వస్తే శ్రీమహావిష్ణువేనమ్మా ఆయన. చక్కగా మాట్లాడటంలో బృహస్పతి. సౌందర్యంలో మన్మథుడు. అందరినీ రక్షించడంలో సాటిలేనివాడు. లోకంలో అందరిలోనూ శ్రేష్ఠుడు. పంచవటిలో మాయామృగం సాయంతో రావణుడు నిన్ను అపహరించాడు. తల్లీ! ఈ పాపానికి ఫలం ఆ దుర్మార్గుడు త్వరలోనే అనుభవించ బోతున్నాడు. నీ కోసం శ్రీ రాముడెంతో దు:ఖార్తుడైనాడు. అమ్మా! రామలక్ష్మణులతో పాటు సుగ్రీవుడు కూడా నీకోసం దు:ఖిస్తున్నాడు. నీవు ఈ విధంగా నాకు కన్పడటం గొప్ప అదృష్టమే. నేను మహాసముద్రం దాటి లంకానగరం రాగలిగాను. రావణుడి శిరస్సుపై పాదం మోపి, తిరిగి శ్రీరాముడి దగ్గరకు వెళ్ళిన నీ దర్శనం నాకు లభించిందని చెబుతాను" అని రాముడి గూర్చి ఇంపుగా సీతాదేవికి విన్పించాడు హనుమంతుడు.

సీతమ్మకు సంతోషం
అప్పుడు హనుమంతుడిపై సీతాదేవికి ఎంతో ప్రీతి, అనుగ్రహమూ కలిగాయి. "తండ్రీ! శ్రీరాముడితో నీకు ఎట్లా పరిచయం కలిగింది? లక్ష్మణుడు నీకెట్లా తెలుసు? నరులకూ, వానరులకూ ఎట్లా పరిచయం తటస్థించింది? రామలక్ష్మణుల రూపరేఖలెటువంటివి? ఈ విషయాలు నీద్వారా వింటే నాశోకం తొలగిపోతుంది" అని హనుమంతుణ్ణి సీతాదేవి అర్థించింది. ’అమ్మా! రాముడు కమలపత్రాయతాక్షుడు, లోకమర్యాదలను తాను పాటిస్తూ ఇతరుల చేత పాటింపచేసే ధర్మప్రభువు. సదాచార సంపన్నుడు. వినయశోభితుడు. శత్రుభయంకరుడు. వేదవిదుడు. సకల రాజలక్షణాలతో శోభించే మహనీయమూర్తి. పరమ సౌందర్యవంతుడు. వయస్సుకు తగిన దేహమూ, రూపమూ కలవాడు. సాముద్రికశాస్తంలో చెప్పినట్లు అవయవాలు ఏయే శుభలక్షణాలతో ఎలా ఉండాలో ఆవిధంగా పొందికైన అవయవాలతో ప్రకాశించేవాడు శ్రీరాముడు. ఇక ఆయన తమ్ముడు లక్ష్మణుడు అన్ని విధాల అన్నవంటివాడు. శ్రీరాముడు మేఘశ్యాముడు. లక్ష్మణుడు అపరంజి వన్నెకాడు. ఇద్దరూ నిన్ను ఎప్పుడెప్పుడు చూడగలమా అని ఎదురుచూస్తున్నారు. నీకోసం అన్వేషిస్తుండగా వాళ్ళకు సుగ్రీవుడి పరిచయం కలిగింది. రాముడు సుగ్రీవుడి కార్యం చేసి పెట్టాడు. సుగ్రీవుడు రామకార్యర్థం వానరులను నాలుగు దిక్కులకూ పంపాడు. రావణుడు నిన్ను దొంగిలించుకొని పోతున్నప్పుడు ఋశ్యమూకపర్వతంపైన వస్త్రంలో చుట్టి కొన్ని ఆభరణాలు మేము చూస్తుండగా నీవు భూమి మీద పడవేశావు కదా తల్లీ.! నీవు కిందకు జార్చివేసిన ఆభరణాలను దాచి, ఆ నగల మూటను మేము రాములవారికి చూపాము. వాటిని చూసి ఆయన కన్నీళ్ళు పెట్టుకొని వలవల దు:ఖించాడు. తరువాత రామసుగ్రీవులకు గాఢస్నేహం కలిగింది. వారి దూతగా నేనిక్కడకు వచ్చాను. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నేను నిన్ను దర్చించగలగటం నా మహాభాగ్ర్యం.

అమ్మా! ఇక నా గూర్చి చెబుతాను విను. మాల్యవంతం అనే పర్వతం పై కేసరి అనే వానరశ్రేష్ఠుడు నివసించేవాడు. అక్కడి రాక్షసబాధ నివారించటానికి ఆయన గోకర్ణం అనే సముద్రతీరానికి వెళ్ళాడు. శంబసాదనుడనే రాక్షసుడు ఆ పుణ్యక్షేత్రంలోని వారికి సంక్షోభం కలిగిస్తుండగా మహర్షులు, దేవతల కోరికపై నా తండ్రి కేసరి ఆ దుర్మతిని హతమార్చాడు. ఆ మహాకపి భార్య అంజనాదేవి. ఆమెగర్బంలో వాయుదేవుడి అనుగ్రహం వల్ల నేను జన్మించాను. నా బాల్యచేష్టలవల్ల నాకు హనుమంతుడనే పేరు వచ్చింది.
నేను బలంలో వేగంలో, వాయుదేవుడంతటి వాణ్ణి" అని చెప్పాడు. హనుమంతుడి మాటలు విని సీతాదేవి ఆనందబాష్పాలు రాల్చింది.

ఆనవాలు
"అమ్మా! నీకు నాపట్ల విశ్వాసం కలగటానికి ఈ అంగులీయకం నీకు ఇవ్వవలసిందిగా శ్రీరాముడు నాకిచ్చాడు. దీన్ని నీవు స్వీకరించవలసిం"దని ఆ ఉంగరం హనుమంతుడు సీతాదేవికి ఇచ్చాడు. తన భర్తే తన సన్నిధిలో ఉన్నంతగా ఆ ఉంగరం చూసి ఆమె ఉప్పొంగి పోయింది. ఆ కపివరుణ్ణి అప్పుడామె ఎంతో పొగిడింది.

విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞ్ణ్ణస్త్వం వానరోత్తమ,
యేనేదం రాక్షసపదం త్వయైకేన ప్రధర్షితమ్. (సుందర. 36.37)

"నీవు పరాక్రమశాలివి. సమర్థుడివి. ప్రాజ్ఞుడివి. కాబట్టే నీవు ఒంటరిగా రాక్షసనివాసమైన లంకను ఎదిరించావు" అని అంటూ శ్రీరాముడు సత్యపరాక్రముడు, మహాతేజశ్శాలి. ఆయన, లక్ష్మణుడూ క్షేమంగా ఉన్నారని ఎంతటి చల్లని వార్త చెప్పావు తండ్రీ! సరే శ్రీరాముడికి ఆగ్రహం వస్తే ఈ సమస్త భూమండలం దగ్ధమై పోతుంది గదా? మరెందుకీ ఉపేక్ష! ఆయన దైవానుకూల్యం కోసం ప్రతీక్షిస్తున్నాడా? అంతులేని దు:ఖాబ్ధిలో ఆ ప్రభువు బాధపడటం ఎందుకు? నా కోసం ఆయన నిరంతరం దు:ఖమగ్నుడై ఉండటం నేను భరించలేను. భరతుడి కీ విషయం తెలిస్తే అపారమైన అక్షౌహిణీయుతమైన సేనలు పంపుతాడు కదా! ఎందుకీ విలంబం? అని సీతాదేవి హనుమంతుణ్ణి అడిగింది.

’అమ్మా! నీవు లంకలో ఉన్న సంగతి ఇప్పటివరకు శ్రీరాముడి కెవరూ చెప్పలేదు కదా! ఇక ఇప్పుడు ఆయన గొప్ప వానరసేనతో వచ్చి నిన్ను విపద్దశనుంచి తప్పించి తీసుకుని పోతాడు" అని హనుమంతుడు ఆమెకు చెప్పాడు. "వానరభల్లూకగణాలతో ఆయన వెంట మేమంతా వచ్చి లంకను నాశనం చేస్తాము" అని కూడా ఊరడించాడామెను హనుమంతుడు.

శ్రీరాముడి నీ కోసం ఎంతగానో శోకిస్తున్నాడని హనుమంతుడు చెప్పటంతో తన విషయం మరిచిపోయి ఆయన కోసం ఎంతగానో దు:ఖించింది సీతాదేవి.
అయితే శ్రీరాముడి కుశల వార్త విని ఆమె వదనం శరత్కాల చంద్రబింబంలా ప్రసన్నమయింది. నాయనా! శ్రీరాముడు ఎప్పుడూ శోకమగ్నుడై నన్నే తలచుకుంటున్నాడని, నన్నే స్మరిస్తున్నాడని నీవు చెప్పిన ఈ మాటలు నాకు దు:ఖాన్ని, సంతోషాన్ని కూడా ఏకకాలంలోనే కలిగిస్తున్నాయి.

ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే,
రజ్జ్వేవ పురుషం బద్ధ్వా కృతాంత: పరికర్షతి.
విధి ర్నూన మసంహార్య: ప్రాణి నాం ప్లవగర్షభ,
సౌమిత్రిం మాం చ రామం చ వ్యసనై: పశ్య మోహితాన్. (సుం. 37.3, 4)

దైవం మనిషిని అంతులేని ఐశ్వర్యంలోకి గానీ, దారుణమైన దు:ఖంలోకి గాని తాడుతో కట్టినట్టు బంధించి లాగుకొని పోతుంది.

వానరోత్తమా ! ప్రాణులు దైవాన్ని మీరి పోలే రనేది నిశ్చయం. ఎందుకంటే చూడు - నేను, రాముడు, లక్ష్మణుడూ కూడా ఆపదలపాలైనాము.

మారుతీ! దుష్టరావణుడు నాకు సంవత్సరం గడువు విధించాడు. అందులో ఇప్పుడు రెండునెలలే మిగిలి ఉన్నాయి. గడువు ముగిసేదాకా ఎట్లానో ప్రాణాలు ఉగ్గబట్టుకుంటాను. ఈ లోపున శ్రీరాముడు నన్ను రక్షించాలి అని నా వేడికోలు ఆయనకు అందచేయి. రావణుడి సోదరుడు విభీషణుడు నన్ను శ్రీరాముడికి అప్పగించవలసిందని ఎంతగా ప్రాధేయపడుతున్నా రావణుడు దురహంకారంతో లక్ష్య పెట్టటం లేదు. ఆయువు మూడినవాడు మంచి మాటలు విన్పుంచుకోడు గదా! విభీషణుడి పెద్దకూతురు నా దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ చెప్పింది. అంతేకాక అవింధ్యుడనే వృద్ధరాక్షసుడు - ’సీతను విడచిపెట్టక పోతే రాక్షసుల సర్వ నాశనం తథ్యం’, అని హితం చెప్పినా అతడి మాటలు చెవిని పెట్టటం లేదు రావణుడు." అని కూడా హనుమంతుడితో సీతాదేవి చెప్పింది.

"జనస్థానంలో ఒంటరిగా నిలిచి పధ్నాలుగు వేలమంది రాక్షసులను హతమార్చాడు కదా శ్రీరాముడు. మరి నన్ను ఎందుకు ఇంకా రక్షించడం లేదు?" అని నీరు నిండిన కనులతో సీత ప్రశ్నించింది.

"అమ్మా! నేను వెళ్ళి నీ ఉనికిని గూర్చి చెప్పగానే శ్రీరాముడు భల్లూక వానర సేనలతో వెంటనే వస్తాడు. లేదా ఒక మాట చెబుతాను తల్లీ విను. ఇప్పటి కిప్పుడే నీకు దు:ఖం తొలగిపోతుంది. అదే మంటావా? నీవు నా వీపు మీద కూర్చో అమ్మా! నిన్ను సురక్షితంగా శ్రీరాముడి దగ్గరకు తీసుకొని పోతాను." అన్నాడు హనుమంతుడు. "ఈ లంకలో ఉన్న వాళ్ళెవరూ నన్ను వెంబడించలేరు. నా వేగం ముందు వీళ్ళెవరూ నిలువలేరు."

 

(సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)