కబుర్లు - సత్యమేవ జయతే
చీకు - చింత!
- సత్యం మందపాటి

శుక్రవారం రాత్రి.

మా ఆస్టిన్ నగరంలోని గ్రేహౌండ్ బస్టాండుకి వెళ్ళి, డల్లాస్ నించీ వచ్చే బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. కారణం మరేం లేదు, ముఫై ఏళ్ళ క్రితం చూసిన మిత్రుడు సూన్నాణని మళ్ళీ చూడబోతున్నాను.

వాళ్ళబ్బాయి సత్నాణ, అనకాపల్లినించీ అనకాపిల్లి బెల్లంతో పాటు, అమెరికాకి ఎగుమతి అయిన సాఫ్ట్వేర్ విద్వాంసుడు. అతను హెచ్వన్ వీసా మీద అమెరికాలోని డల్లాస్ నగరానికి వచ్చి రెండేళ్ళయిందిట. ఈ మధ్యనే ఆ కొత్త భారతీయ దంపతులకు, ఒక అమెరికన్ పాపాయి పుట్టిందిట. ఆ బాల ఇంతికీ, బాలింతకీ, ఇద్దరికీ సహాయంగా వుంటుందని సూన్నాణ భార్య సురేకాంతం వస్తుంటే, అలాగే భార్య వాళ్లకి సహాయం చేస్తుంటే చూసినట్టు వుంటుంది, ఎలాగూ వచ్చాడు కనుక పనిలో పని అమెరికా దేశాన్ని కూడా చూసినట్టు వుంటుందని సూన్నాణ కూడా సదరు భార్యతో కలిసి అమెరికా వచ్చాడుట!

రోజుకి ఇరవై గంటలు నిద్రపోతున్న మనమరాల్ని లేపి, రోజూ ఆ పసిదానితో కబుర్లు చెబుతూ డల్లాసులో నెలరోజులు గడిపాడుట. ఆ పసిదానికి నెల రోజుల వయసు రాగానే కుసింత బుద్ది తెలిసి, ఈయన మాటలు వినిపించుకోకుండా నిద్రపోతుంటే, నేను గుర్తుకి వచ్చానుట. నాకు ఫోన్ చేసి, గుర్తు పట్టావా అని అడిగాడు.

మేం కలసి చదువుకునే రోజుల్లో వాడికి ఛాటర్ బాక్స్ అని పేరుండేది. వాడి నోరు బుర్ర కన్నా వేగంగా పనిచేస్తుంది. వాడు మాట్లాడుతుంటే ఇంకెవ్వరూ నోరెత్తరు. భయపడి కాదు. మన మాటల్లో ఏదైనా కొత్త మాట వినపడితే, దాన్నే ఆసరాగా తీసుకుని మళ్ళీ ఇంకో అధ్యాయం మొదలుపెడతాడు. అందుకని.

ఇంతకీ ఈ సూన్నాణ అనే పేరేమిటి అని మీకు అనుమానం వస్తుందని నాకు తెలుసు. నేనే మా చిన్నప్పుడు ఒకసారి, మా గురువుగారు ముళ్ళపూడి వెంకటరమణగారు వ్రాసిన జోకు ఒకటి వాడికి చెప్పాను. మళ్ళీ ఆ జోకుని నా మాటల్లో చెబుతాను. చిత్తగించండి.

‘అరవ్వాళ్ళు అన్ని అక్షరాలూ పలకరు. కచటతపలు సాంబారులో ముక్కలుగా వేసుకుని జుర్రు మంటూ తినేసి, గజడదబలు మాత్రమే పలుకుతారని’ మన తెలుంగు వాళ్ళు అంటారుష! అంతేకాదు. మనం మాత్రమే అన్ని అక్షరాలూ అక్షరాలా లక్షణంగా పలుకుతామని గర్వంగా చెప్పుకోవటం కూడా, తెలుగు వాళ్ళ లక్షణం. అలా అంటాం కానీ, నిజంగా మనమే ఎన్నో అక్షరాలని, గోంగూర పచ్చట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్లా నంజుకు తినేస్తాం అన్నట్టుగా ఆయన చెబుతూ, ఒక ఉదాహరణ చెప్పారు. సూర్యనారాయణ అనే పేరు, పుట్టినప్పుడు బియ్యంలో అచ్చుతప్పులు లేకుండా వ్రాస్తారు కానీ, కాకినాడ సినిమా హాళ్ళ రోడ్డులో కనిపిస్తే మాత్రం శ్రీసూర్యనారాయణా అని ఎవరూ నోరారా పిలవరు. ఏరా సూన్నాణా అని అరుస్తూ పిలుస్తారు. వాడికి ఆ జోకు విపరీతంగా నచ్చేసి, నవ్వేసి తనూ ఆ పేరే ఖాయం చేసుకున్నాడు. మా సూర్యనారాయణకి సూన్నాణ అనే పేరు హలా వచ్చిందన్నమాట! అంతేకాదు, పక్కనే వున్న అన్నవరం వెళ్ళి వచ్చి వాళ్ళబ్బాయికి బియ్యంలో సత్నాణ అని కూడా వ్రాశాడు.

ఈలోగా గ్రేహౌండ్ బస్ వచ్చేసింది. కిటికీలోనించీ తల బయటికి పెట్టటానికి గ్లాసు కిటికీ అడ్డం వచ్చిందేమో, వంగి మరీ మరీ చూస్తూ బయటికి వచ్చాడు సూన్నాణ.

“ఏరా బాగున్నావా? ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. నాళ్ళూ ఏళ్ళూ ఏమిటి నీ ముఖం. మూడున్నర దశాబ్దాలయింది. కాస్త ఒళ్లూ గిళ్ళూ చేశావ్. చీకూ చింతా లేని బ్రతుకులు అమెరికాలో మీవి. మరి ఆరోగ్యం గీరోగ్యం బావుంటాయి కదా ఇక్కడ. అందుకే కాస్త బలంగా గిలంగా వున్నావ్” అన్నాడు.

అన్నాళ్ళ తర్వాత వాడిని చూడటం, వాడి మాటలు వినటం నిజంగా నన్ను ఎంతో సంతోషంలో ముంచేసాయి. వాడు నా చెయ్యి పట్టుకుని వదలలేదు. నేనూ వాడి చేయి పట్టుకుని అప్యాయంగా నిమిరాను.

“లగేజ్ వుందా” అని అడిగాను.

“నేను వుండేది రెండు రోజులేగా. అందుకే ఈ చిన్న లాగుడు సూట్కేసుతో వచ్చాను” అన్నాడు.

పార్కింగ్ దగ్గరికి వెడుతుంటే, నా భుజం మీద చేయి వేసుకుని, దగ్గరికి లాక్కుంటూ నడుస్తున్నాడు.

అమెరికాలో అలా నడిస్తే మరి బాగుండదు. ఏదో అనుకుంటారు. కానీ చిన్ననాటి స్నేహితుడు. ఆనాటి జ్ఞాపకాలను కళ్ళముందు కదలాడిస్తున్నాడు. అందుకే నేనూ ఏమీ అనలేదు.

“మా సత్నాణ అక్కడ బస్ ఎక్కించాడు. నువ్విక్కడ దించేసుకున్నావు. ఏమీ చీకూ చింతా లేకుండా వచ్చేశాను” అన్నాడు.

“ఔను. ఇది నాన్ స్టాప్ బస్సు కదా” అన్నాను.

కారులో ఇంటికి వస్తున్నప్పుడు అన్నాడు. “ఇక్కడ నాకు బాగా నచ్చిందేమిటంటే, ఎవడూ హారన్ కొట్టి చావడు. అలా చీకూ చింతా లేకుండా కారు నడిపేస్తుంటారు” అన్నాడు.

“అనవసరంగా హారన్ కొట్టి పట్టుబడితే, రెండు వందల డాలర్లు ఫైను కట్టమంటాడు కాపు. కాపు అంటే ఇక్కడతని కులం కాదు. పోలీసు. అందుకని, హారన్ కొట్టాలని వున్నా, మన భారతీయులు కొట్టరు. కారు నడపటం చీకూ చింతా లేని పని కాదురా! డ్రైవింగ్ చాల స్ట్రెస్ ఇస్తుంది. అవసరార్ధం చేస్తాం, అంతే!” అన్నాను.

దారి పొడుగునా అతను ఏదో మాట్లాడుతూనే వున్నాడు. ఇంకో రెండు నెలలలో ఇండియాకి తిరిగి వెళ్ళిపోతారుట. నేను దగ్గరే వున్నానని చూసిపోదామని వచ్చానన్నాడు.

నేను మనస్పూర్తిగా అన్నాను. “నాకూ చాల ఆనందంగా వుంది, నువ్విక్కడికి రావటం. మళ్ళీ మన పాత రోజులు జ్ఞాపకం చేస్తున్నావ్. కాకపొతే మరీ రెండు రోజులే వుంటున్నావ్. ఇంకో వారం రోజులు వుంటే బాగుండేది” అన్నాను.

“నిన్ను చూసాను. నాకంతే చాలు” అన్నాడు ప్రేమగా. ఈ సూన్నాణ వున్నాడే, వీడు స్నేహానికి ప్రాణం పెడతాడు. ఆప్యాయంగా చూసాను నా చిన్ననాటి ప్రాణ స్నేహితుడిని.

ఇంటికి వెళ్ళాక శ్రీమతికీ, మా ఇద్దరు పిల్లలకీ పరిచయం చేసాను. అందరితోనూ ఎంతో చనువుగా మాట్లాడుతున్నాడు. భోజనాల బల్ల దగ్గర వాడు చెబుతున్నవి కొంచెం ఎక్కువ మోతాదులో వున్నాయేమో, పిల్లలు మర్యాదకి తలలు వూపుతున్నా, ముభావంగా వింటున్నారు.

“అమెరికాలో మీ జీవితం బాగుంటుందిరా.. చీకూ చింతా వుండవు” అన్నాడు.

శ్రీమతి అన్నది. “అవన్నీ దూరపు కొండలండీ! ప్రొద్దున్న ఉద్యోగాలకి వెళ్ళినవాళ్ళు, అధ్ధాంతరంగా ఉద్యోగం పోయి, మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తున్నారు. సెలవులూ తక్కువే. మన పండగలని కూడా ఏ శనివారాలకో మార్చేసుకుని, అదీ వీలుంటేనే, చేసుకోవటం. మనకి ఇండియాలో శుభకార్యాలో, ఇంకేమన్నానో జరిగితే, చటుక్కున వెళ్ళే అవకాశమూ లేదు. ఇక్కడ వుండే చీకులూ చింతలూ ఇక్కడున్నాయి” పీత కష్టాలు పీతవి అన్నట్టుగా చెబుతున్నది శ్రీమతి.

పిల్లలిద్దరూ, భోజనాలకన్నా మాటలే ఎక్కువవటంతో, ‘ఎక్స్యూజ్ మీ’ అంటూ లేచి వెళ్ళిపోయారు. ఆరోజు రాత్రీ, శనివారం పగలూ, నేనూ సూన్నాణా మా పాతరోజుల కబుర్లు చాల చెప్పుకున్నాం. చెప్పుకున్నాం కాదు, వాడు చెబుతుంటే నేను విన్నాను.

పిల్లలిద్దరూ వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయి, రాత్రికి కానీ రాలేదు. అసలు కథ ఆ రాత్రి భోజనాల దగ్గరే జరిగింది.

మేం భోజనాలకి కూర్చుని, పిల్లల్ని రమ్మంటే – ఎప్పుడూ లేనిది – మీరు తినండి, మేము తర్వాత తింటాం అన్నారు. వాళ్ళ గదుల్లోకి వెళ్ళి, నేనే నచ్చచెప్పాను. “మీరు రాకపోతే బాగుండదు. రండి. అతను కొంచెం ఎక్కువ మాట్లాడతాడు. అంతే. అందులో ఏముంది. ఎక్కువగా మాట్లాడే అమెరికన్స్ ఎంతమంది లేరు. మీకు నచ్చకపోతే, ఈ చెవిలోనించీ విని ఆ చెవిలోనించీ వదిలేయండి” అని బలవంతపెట్టాను. ఏమనుకున్నారో ఏమో ఇద్దరూ కలసి, ఇక ఏమీ మాట్లాడకుండా వచ్చి కూర్చున్నారు.

“మాంఛి ఆంధ్రా ఊరగాయలు తిని చాల రోజులయిందిరా. ఏమన్నా ఊరగాయలు వున్నాయా ఇంట్లో“ అడిగాడు సూన్నాణ.

“అయ్యయ్యో.. మీకు ఇష్టమని తెలీక అడగటం మరచిపోయాను” అంది శ్రీమతి నొచ్చుకుంటూ.

అంటూనే లేచి వెళ్ళి, చింతకాయ పచ్చడి సీసా తెచ్చి బల్ల మీద పెట్టింది.

అది చూసి “ఇక్కడ చింతకాయలు దొరుకుతాయా, ఇండియానించీ తెచ్చారా” అన్నాడు సూన్నాణ,
తర్వాత వాళ్ళిద్దరి సంభాషణా ఇండియన్ షాపులో దొరికే చింతకాయల దగ్గర మొదలయి, శ్రీమతి చింతకాయ పచ్చడి తయారుచేయు విధమూ, దాని మంచిచెడ్డలు వివరించటం, తర్వాత అలా ఇటూ అటూ ఎటో ఇంకెటో వెళ్ళిపోయారు.

“ఇలాటి పచ్చడి తింటుంటే, ఎంత చీకూ చింతా వున్నా మరచిపోయి, హాయిగా వుండొచ్చు” అన్నాడు సూన్నాణ. అతనికి ఊరగాయ బాగా నచ్చినట్టుంది. రెండోసారి కలుపుకుంటున్నాడు.

ఉన్నట్టుండి మా అబ్బాయి గబగబా లేచి, సింక్ దగ్గర చేతులు కడిగేసుకుని, తన గదిలోకి వెళ్ళిపోయాడు.
సూన్నాణ ఇదేమీ పట్టించుకోకుండా, ఏదో చెబుతున్నాడు.

రెండు నిమిషాలయిందేమో, మా అమ్మాయి కూడా లేచి గబగబా బాత్రూములో దూరింది. శ్రీమతి అటే చూస్తున్నది. సూన్నాణ అదేమీ పట్టించుకోకుండా, మాట్లాడుతూనే పచ్చడన్నం తింటున్నాడు. తింటూనే మాట్లాడుతున్నాడు.
అతను చెబుతున్న కాలేజీ రోజులు, మధురస్మృతులను తెస్తున్నాయేమో వింటూ కూర్చున్నాను. అలా మాట్లాడుతూ, భోజనాలయిపోయినా దాదాపు అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా కబుర్లు చెప్పుకుంటూనే కూర్చున్నాం.

నిద్ర తూగుతున్నా, మర్యాద కోసం అక్కడే కూర్చున్న శ్రీమతిని చూస్తే జాలి వేసింది. పడుకోరాడూ అన్నాను. ఆమాటకి సూన్నాణ అన్నాడు, “మీరు పడుకోండి. నాకూ నిద్ర వస్తున్నది. మళ్ళీ ప్రొద్దున్నే డల్లాస్ వెళ్ళాలి కదా” అంటూ తనూ లేచాడు.

బెడ్ రూంలోకి వెళ్ళాక అడిగాను, “ఎందుకని పిల్లలు అంత హఠాత్తుగా డైనింగ్ టేబుల్ దగ్గర నించీ వెళ్ళిపోయారు. వాడెక్కువ మాట్లాడుతున్నాడనా?” అని అడిగాను.

పకపకా నవ్వింది శ్రీమతి. “నువ్వు వట్టి వెర్రిమాలోకానివి. కబుర్లే తప్ప చుట్టూ జరిగేవి చూసుకోవు”
ఆవిడకి అలా అనటం మామూలే. అందుకే అన్నాను, “ఆ డైలాగు ఎప్పుడూ చెప్పేదేనమ్మా.. అసలు సంగతేమిటో చెప్పరాదూ..“ అని.

వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అన్నది, “మీ మిత్రుడు ఏమీ చీకూ చింతా లేని మనిషి కాదు. చింత వుండాలే కానీ..“ నవ్వు ఆపుకోలేక, చేయి నోటికి అడ్డం పెట్టుకుంది.

“చెప్పయినా నవ్వు. నవ్వయినా చెప్పు...” అన్నాను ఏమీ అర్ధం కాక.

కొంచెం తమాయించుకుని అంది, “ఏమీ లేదు! ఆయన చింతకాయ పచ్చడి కలుపుకుని పచ్చడి తిన్నాక, ఒక్కొక్క వేలూ చీకుతున్నాడు. ప్చ్.. ప్చ్.. అని పెద్దగా శబ్దం చేసుకుంటూ మరీను. ఎక్కడన్నా ఏమన్నా మిగిలిందో ఏమోనని, వేళ్ళని పరిశీలనగా చూస్తూ మరీ చీకుతున్నాడు. ఐదు వేళ్ళూను. నాకే అసహ్యం వేసింది. అటు చూడలేక, దిక్కులు చూస్తూ తిన్నాను. మన అబ్బాయి లేచి వెళ్ళిపోయింది అందుకే. మనమ్మాయి సంగతి తెలుసుగా, అది ఇలాటివి అసలు భరించలేదు. బాత్రూంలోకి వెళ్ళి ఏం చేసిందో తెలుసా...”

నేను ఆమాత్రం ఊహించగలను. అందుకే నేను అడగలేదు. తను చెప్పలేదు.

“నేను ఇందాక దాని గదికి వెళ్ళి చూశాను ఎలా వుందోనని. ముందు కొంచెం అదోలా మాట్లాడినా, నేను నవ్వటం చూసి అదీ బయటపడింది. తన వచ్చీ రాని తెలుగులో, ‘చీకూ చింతా అంటాడే అంకుల్, అంటే వేళ్ళు చీకటమా.. చింతకాయ పచ్చడి తిని’ అని ఒక జోక్ కూడా వేసింది”

నేనూ నవ్వేశాను, చీకూ చింతా లేకుండా!


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)