ధారావాహికలు
రామ నామ రుచి
- ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం
(గత సంచిక తరువాయి)

తే.గీ. ఐన శ్రద్ధ వీక్షించి కళ్లార్పకుండ
మనసు నేకాగ్రతను నిల్పి మసలనీక
చూచినాడను హారతి శోభలోన
వెడలుపైనట్టి నా మంబు భృకుటిపైన.

తే.గీ. దీని నే చిన్ననాటను మానసమున
నెంచి ఎన్నియో మాఱ్లు పూజించినాడ
భక్తితో గాన, నా మన:ఫలక మందు
సతము చెరలాడు చెఱుగక శ్వాశ్వతముగ.

తే.గీ. కాని ఈ నాడు నామంబు కాంతి దక్కి
నట్లు కనిపంచె ననిపించె నాత్మలోన -
నలుబదేండ్లాయె - నా జ్ఞప్తి నమ్మగలనె -
నేనె పొరబడి నాడనో మానసమున.

తే.గీ. అంతలో పూజ సంపూర్తి యగుటవలన,
నేను చెలికాడు పూజారి నెలవుజేరి
తీపి పొంగలి, పులిహోర తిని యొకింత,
పిచ్చపాటియు మాట్లాడి ఇచ్చ తీర,

తే.గీ. వీడుకోల్ చెప్పి అవ్వారి వీడు వదలి,
చెట్లదరి కూరుచుంటిమి సేద దీర -
అంతలో వచ్చి మా వెన్క నర్చకుండు
మమ్ము కానక పండెను మంటపాన.

ఉ. అల్లన పిల్లగాలి తెర హాయిని వీవగ నంబి తృప్తితో
చల్లగ విశ్రమించి సుఖ శాంతి హృదంతరమందు నిండి అ
ల్లల్లన రామదాస కృత హార్దిక కీర్తన నార్తితోడ మా
యుల్లము లంత ఝల్లనగ నుద్యత పాడుచునుండె నాదృతిన్.

తే.గీ. "రామ! శ్రీరామ! నీనామ నేమి రుచిర!
ఎంత రుచిర! ఏమి రుచిర! ఎంత రుచిర!"
అనుచు చర్విత చర్వణాయుతముగాగ
ఒక్క పాదంబు మాత్రమే ఓర్మితోడ.

తే.గీ. పాట వినుచును మేమంత పరవశించి,
ఏగిరిమి లేత చీకట్ల నింటికడకు -
దారిలో నిద్దరము గూడ నోరు మెదప
కుంటి మాలోచనలు మమ్ము కుదిపివేయ.

తే.గీ. గృహములో నాటి రాత్రి నా హృదయమందు
చింత ముప్పిరిగొని, ఇసుమంతయైన
నిదుర పట్టక, కనుమూయు కుదురులేక
కలచివైచెను నాటి సంఘటనలన్ని.

తే.గీ. అర్చకున కెట్లు సిరి యబ్బె నబ్బురముగ,
దాయలెవరైన ఇచ్చిన దాచనేల !
అప్పనంబుగ వచ్చిన నొప్పడేల !
పాతరేదైన దొరికెనో పర్వతాన !

ఆ.వె. ధర్మకర్త కొడుకు దుర్మార్గుడై సొమ్ము
లన్ని దోచుకొనిన యపుడు - మఱచె
నేమొ కొన్ని, వదలె నేమొ రత్నాల హా
రంబు కానక యొక ప్రతిమ మెడను.

తే.గీ. నిధులు దొరికి నట్లైనచో నేలలోన,
కనక మేదైన గుడియందు కానబడిన
ధర్యనిరతుడౌ పూజారి దాచ డెపుడు,
ఊరి పెద్దలతో చెప్పి తీరు నతడు.

తే.గీ. కాక సొమ్ము నతడు కాంచి కాంక్షతోడ
వాడుకొనుచున్న తెలివిగా వాని పట్టి
బైట పెట్టుట నా వృత్తి, బాధ్యతయును,
మిత్రుడైనను పంకజ మిత్రుడైన.

తే.గీ. ప్రభువు లెంకలు భయమున రామమూర్తి
వదనమున నున్న వజ్రపు స్వర్ణ తిలక
మును వదలిపోయిరని మిత్రముండు పలికె,
నదియు నచ్చటనే ఇప్పు డమరెగాదె.

తే.గీ. కళుకు మనిపించె హారతి వెలుగు లోన,
కాంతి పాతమై కనిపించె కొంత మెఱుగు
తఱిగి నల్లనై - క్షణము మాత్రంబె కనుల
బడియె - దీని పరీక్షింప వలయు నింక.

తే.గీ. అంతియేగాక పూజారి వింతగాను
కోరి రామదాసుని పాట కొంతమార్చి
పాడినా డొకే చరణంబు వదలకుండ -
దీని లోనున్న భావంబు తెలియవలయు.

తే.గీ. అనుచు నాలోచనల తోడ నర్ధరాత్రి
వఱకు మేల్కొని అట్టిట్టు దొరలు కొనుచు,
కలత నిద్రకు జాఱితి క్రమముగాను,
తెల్లవాఱు ఝామునకు నే నొళ్ళుమఱచి.

చ. మఱుసటి నాల్గు రోజులును మానుగ సాగెను పెళ్ళి సందడిన్
సరసము లాటతో చెలుల సంగడితొ చిననాటి జ్ఞప్తితో -
మురిసితి నెంతయో కనగ పూర్వపు మిత్రుల, వారి సంతతిన్
చెఱిగిన తీపి సంగతులు చేరువయై మది త్రచ్చి రేగగన్.

ఉ. ఆ మఱునాడు పెండ్లి - నిశయందు ముహోర్తము రెండుగంట్లపై
గోముగ కొండపైకి రవి గ్రుంకక పూర్వమె పెండ్లి వారితో
మేమును మిత్ర, బాంధవ సమేతముగా చని చేరినారమున్
రాముని ఆలయంబు దరి రంగుగ కట్టిన పెండ్లి పందిరిన్.

కం. ఆలో నిర్మించితి రతి
వేలముగా నొక్క పెండ్లి వేదిక నచటన్
చాలా ముచ్చటగా సుమ
మాలల, విద్యుత్ లతాంత మాలల తోడన్.

కం. ప్రద్యోతించుచు శిఖరము,
ఖద్యోతుని రీతి నిలను కానంబడె వి
ద్యుద్దీపాలకృత స
ద్యుద్దీప్తి విరియ వివాహ ధామము నందున్.

తే.గీ. రామ, లక్ష్మణ, మారుతి, రామసతుల
విగ్రహములకు కృత్రిమ ప్రగ్రహ రుచు
లెనయగను కనకాంబరపు నన లల్లి
శోభ కూర్చె నాచారి విస్ఫురితముగను.

ఉ. వచ్చిన పెండ్లి పెద్దలును, బందుగులున్, హితులున్, వధూవరుల్
నచ్చిక నిచ్చ తోడను వినమ్రత నేగుచు దేవళానకున్
చెచ్చర రామలక్ష్మణుల, శ్రీసతి సీతను, మారుతాత్మజున్
మచ్చిక మ్రొక్కి పూజల సమాహృతిగా నొనరించి రంతటన్.

తే.గీ. అర్చకుం డిచ్చు శఠకోప మందుకొనుచు,
భోజనంబులు కానిచ్చి పోడిమిగను,
పెండ్లి మండపంబును జేరి పెందలకడ
వేచి రట పెండ్లి కార్యంబు చూచు వేడ్క.

ఉ. ప్రామినుకుల్ పురోహితులు బంధుర రీతి పఠింప, గాయక
స్తోమము వాద్య బృందములతో మధురంబుగ పాడుచుండగా
మామిడి తోరణాల నడుమన్ గల వేదికలో వధూవరుల్
ప్రేముడి పెండ్లియైరి కుఅ పెద్దలు సేసలు జల్లుచుండగన్.

కం. అంగకుడు కోర్కె రేపగ,
మంగళ సూచిగ వధువుకు మందాక్షముతో
వంగిన గళమున బంగరు
మంగళ సూత్రంబు వరుడు మానుగ గట్టెన్.

తే.గీ. పదపడి పురోహితులు వధూవరుల చేత
శేషహోమంబు చేయింప చేసి రపుడు,
హోమధూమంబు చుఱ్ఱని ప్రాముకొనగ
అరుణమై వారి నేత్రంబు లార్ద్రమయ్యె.

అంగకుడు కోర్కె రేపగ,
మంగళ సూచిగ వధువుకు మందాక్షముతో
వంగిన గళమున బంగరు
మంగళ సూత్రంబు వరుడు మానుగ గట్టెన్.

తే.గీ. ముఖ్యమౌ తంతుల లన్నియు ముగియువరకు
మూడు గంటలయ్యెను - నిద్ర ముంచివేయ
పెండ్లి పెద్దలు కూర్చుండి కండ్లుమూసి
తూగుచుండిరి మధ్యలో త్రుళ్ళిపడుచు.

కం. చప్పుడు చేయక కొందఱు
నెప్పరు లట కండ్లు తెరచి నిదురించి రొగిన్;
అప్పట్టున మఱి కొందఱు
దుప్పట్లను ముసుగుదన్ని దొర్లిరి నేలన్.

(సశేషం)

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)