బాల రంజని
పరివర్తన
- ఆదూరి.హైమవతి.

పోలయ్య ఒంటెద్దు బండి తోలే ఒక పేద పల్లెవాడు. అతడి భార్య పోలమ్మ భర్తతో పాటుగా పట్నంవెళ్ళి అక్కడ మారు బేరానికి పండ్లు, కూరలు తట్టలో పెట్టుకుని ఇల్లిల్లూ తిరిగి అమ్మి సాయంకాలానికి ఇల్లు చేరేది .పోలయ్య ప్రతిరోజూ తన ఒంటెద్దు బండిలో పట్నానికి వెళ్ళే వారిని తోలు కెళ్ళి వదలి , అక్కడినుండీ తన పల్లెకు వచ్చే వారిని తీసుకువచ్చి వారిచ్చే రూకలకు భార్య తెచ్చే డబ్బు తోడు కాగా తృప్తిగా జీవనం సాగించసాగాడు. ఇలా ఉండగా వారికొక కొడుకు పుట్టాడు. సోమయ్య దంపతులు వాడిని అల్లారు ముద్దుగా పెంచ సాగారు.వాడు పెరిగి పెద్దవాడౌతుండగా, వారికి పట్నంలో చదివే పిల్లలను చూసి తమబిడ్డనూ అలా చదివించాలనే కోరిక రోజు రోజుకూ పెరగసాగింది.

పోలయ్య రాత్రులు సైతం బండి తోలుతూ కొంత సొమ్ము వెనకేయసాగాడు.రాత్రులు వచ్చే బాడుగ డబ్బులు ఎక్కువగా ముట్టడం వలన ఆ సొమ్ము ముట్టుకోకుండా దాచితే తన బిడ్డడ్ని పట్టణం బిడ్డల్లా చదవేయవచ్చని ఆశపడి రాత్రింబవళ్ళూ కష్టపడసాగాడు. పోలమ్మ సైతం రాత్రులు ఊర్లో పేడ తెచ్చి పిడకలు కొట్టి, వాటిని పట్టణంలో కూరలతో పాటుగా అమ్మి సొమ్ము దాచసాగింది.

పోలమ్మదంపతులకొడుకు ' బంగారు స్వామి ' కి ఐదేళ్ళు రాగానే పోలయ్య వాడ్ని పట్నం లోని కాన్వెంట్ స్కూల్ లో చదవేశాడు. నెల నెలా వాడికి ఫీజులు కట్టి ఇంగ్లీషు చదువు చదివించడం వారిద్దరికీ ఏమీ కష్టంగా అనిపించడం లేదు. క్రమంగా వాడు క్లాసులు మారుతూ హైస్కూల్ కు వచ్చాడు. వాడి టూషన్స్ పూర్తై ప్రతి రోజూ రాత్రి పూట ఇంటికి తిరిగి వచ్చేప్పుడు పోలయ్య మెత్తటి దిడ్లు వేసి కొడుకును కూర్చో బెట్టి బండి తోలుతుండగా , పోలమ్మ లాంతరు దారిపొడవునా ఎత్తిపట్టుకోగా 'బంగారు స్వామి 'చదువుతూ ఉండేవాడు. వాడు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే కళ్ళతో సైగలు చేసుకుంటూ ఆనందించేవారు పోలయ్య దంపతులు.

అలా అలా బంగారు స్వామి కాలేజ్ చదువులకు వచ్చాడు , పోలయ్య దంపతులకు ఆనందం పట్టతరం కావడంలేదు. ఎలాగోలా ఇంకొంతకాలం శ్రమిస్తే, బంగారు స్వామి చదువు పూర్తై , ఉద్యోగంలో చేరితే తమ కష్టాలు గట్టెక్కుతాయనీ, తామింక బండితోలడం, పిడకలు కూరలు అమ్మడం మానేసి హాయిగా నీడపట్టున కాలిమీద కాలేసుకుని కూర్చోవచ్చని కలలు కన సాగారు. ఓరోజున బంగారు స్వామి తనకు ఇంటికి రాను పోను కాలం వృధా ఔతున్నందున చదవను సమయం చాలడం లేదని బాధపడగా పోలయ్య వాడిని హాస్టల్ లో ఉంచాడు.

డబ్బు అధికంగా అవసరమై ఎద్దును బండిని వచ్చినకాడికి అమ్మేసి ఆ డబ్బంతా వాడి హాస్టల్ ఫీజు క్రింద ఒకేసారి కట్టేశాడు. రాత్రులు ఒకషాపు వద్ద కాపలాకి కుదిరాడు. పొలమ్మ సైతం రాత్రులు ఒకరింట్లో వంట చేయను పనికి కుదిరింది. అలావారిద్దరూ ఒకరిని ఒకరు చూసుకోడం కూడా కరువై ధనం సంపాదిస్తూ కొడుకు సౌకర్యంగా చదువుకోను వయస్సుకు మించిన శ్రమ పడసాగారు. క్రమంగా నిద్ర లేమి వలన పోలయ్య ఆరోగ్యం క్షీణించ సాగింది. దగ్గు ఆయాసం కూడా తోడయ్యాయి.

ఓరోజున వారిద్దరూ కొడుకు ' బంగారు స్వామిని 'కి డబ్బు ఇవ్వను కాలేజ్ కివెళ్ళారు.వారి బట్టలు, తీరు చూసి వాచ్ మ్యాన్ లోనికి వెళ్ళ నీయలేదు. చివరకు బ్రతిమాలి లంచ్ టైంకు లోనికి వెళ్ళగా, హాస్టల్ నుండీ భోజనం చేసి స్నేహితులతో కలసి వస్తున్న బంగారు స్వామి మెరిసి పోయే దుస్తుల్లో కనిపించాడు.

" ఓరి బిడ్డా ! నీకోసం ఈడ కాసుకోనున్నం రా! ఎట్టున్నవ్ రా బిడ్డా!" అని పలకరించగానే, స్నేహితులు " ఎవర్రా ! B S! ఈ అడవి మనుషులు ! నిన్ను' బిడ్డ ' అంటున్నారు ?" అని ప్రశ్నిం చారు." డియర్ ఫ్రండ్స్ ! వీళ్ళు మా పాలేర్లు ! మాఫాదర్ కు ఖాళీ లేక వీళ్ళుపనిమీద సిటీకి వస్తుంటే డబ్బిచ్చి పంపినట్లున్నారు." అనివారితో చెప్పి , పోలయ్య దంపతుల్ని దూరంగా తీసుకు వెళ్ళి, " ఎందుకొచ్చారిక్కడికి? నేను రాత్రికి వచ్చి డబ్బు తీసుకునే వాడ్నికదా? నా ఫ్రండ్స్ ముందు నా పరువు తీయకండి. మరెప్పుడూ ఇక్కడికి రాకండి. నాకు స్కాలర్షిప్ వస్తున్నది. మీరిచ్చేడబ్బు కేవలం హాస్టల్ కే . నేనే వచ్చి తీసుకుంటాను. మరెప్పుడూ ఈకాలేజ్ ఛాయలకు రాకండి.వెళ్ళండిక." అని కోపించి డబ్బు తీసుకుని విసవిసావెళ్ళి పోయాడు,

దగ్గుతో సతమత మౌతున్న తండ్రిని ' ఏమైదందని ' కూడా పలుకరించక. బిత్తరపోయిన పోలయ్య దంపతులు బయటికి వచ్చి బావురు మని కుమిలి కుమిలి ఏడ్చుకుని ఇంటిముఖం పట్టారు.తిరిగి తమ పల్లెలోని ఇంటికి మకాం మార్చుకున్నారు. పోలయ్య దిగులుతో ఏ పనీచేయలేని స్థితికి వచ్చాడు. పోలమ్మ మాత్రం కూరలు అమ్మి వచ్చిన డబ్బుతో ఇల్లు గడప సాగింది.

ఓరోజున కూరలు అమ్మను పట్నం వెళ్ళిన పోలమ్మ కు వారి ఊరి కుమరయ్య కనిపించి , " పోలమ్మా! నీకు తెల్సా! ఈ రోజున మనపిల్లల కాలేజ్ లో మనోళ్ళకు ప్రైజులు ఇస్తారంట! మావోడు చెప్పాడు, ఆడూ అక్కడే చదువుతున్నాడుగా ! మిమ్మల్ని చూసేగా నేనూ నా కొడుకును పట్నంలో చదివిస్తున్నది ! చాలాసంబరంగా ఉంటది. నేనూ వస్తాగా మనందరం కలిసెళ్దాం. " అని చెప్పాడు.ఆరోజున పోలమ్మ, పోలయ్య ఉన్నంతలో మంచి గుడ్డలు వేసుకుని కుమరయ్య , అతడికొడుకు వినయ్ తోపాటుగా కాలేజ్ కి వెళ్ళారు.

పెద్దసభ .అంతపెద్ద సభ ఎప్పుడూ చూడని పోలయ్య దంపతులను, కుమరయ్య కొడుకు తీసుకెళ్ళి తన తండ్రితోపాటుగా కుర్చీల్లో కూర్చోబెట్టాడు." వినయా! మావోడు చూత్తే కోప్పడతడేమోరా! మమ్మల్ని తెచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నవ్ ? " అన్నాడు పోలయ్య భయం భయంగా .

" పెద్దయ్యా! ఇది తల్లి దండ్రులను అందరినీ పిలిచి మాట్లాడేసభ. భయమేంలేదు. మాయ్యతోకలిసి కూర్చోండి." అని చెప్పి వెళ్ళాడు కుమరయ్య కొడుకు వినయ్. పెద్దపెద్ద చదువు కున్నవారంతా, కలెక్టర్ , కాలేజ్ ప్రిన్సిపల్ , లెక్చరర్స్ , పిల్లలతల్లి దండ్రులు ఎంతోమంది కార్లలో వచ్చారు. వారందరినీ చూస్తున్న పోలయ్య దంపతులకు తమని తాము చూసుకుని భయమేసింది." మన బట్టలు చూసి ఇక్కడివారంతా వింతగా చూస్తున్నారే! పోలా!" అన్నాడురహస్యంగా పోలయ్య. ఏమీ అన్లేక మౌనంగా కూర్చుంది పోలమ్మ.

కాస్సేపటికి సభ మొదలైంది. ఏదేదో ఇంగ్లీషులో చెప్పారు అంతా. బాగా చదివిన పిల్లలందరికీ ఏవేవో బంగారుపతకాలు, పెద్ద పెద్దపుస్తకాలు , ఇకంకా మరికొన్నీ ఇచ్చారు, పెద్దగా చఫ్ఫట్లు కొట్టారంతా.పోలయ్య కొడుకు బంగారు స్వామి కూడా స్టేజ్ పైకి మెరిసే బట్టలతోవచ్చి పతకాలు, మరేంటేంటో వారిచ్చినవన్నీ తీసుకున్నాడు. తమకొడుకైనా వాడి వైభవం వాడి అందం, దర్జా చూసి ఆశ్చర్య మేసింది పోలయ్య దంపతులకు. అందరూ వాడ్నిపొగుడుతుంటే " వీడికి దిష్టి గాని తగల్దుకదా!" అంది పోలమ్మ భర్తతో, తల్లిమనసుకదా మరి! కుమరయ్య కొడుకు వినయ్ కూడా స్టేజ్ పైకివచ్చి బహుమతులు, పతకాలూ తీసుకుంటుంటే కుమరయ్య సంతోషం పట్టలేక లేచి చప్పట్లుకొట్టాడు.

చివరకు కలెక్టర్ గారు లేచి తెలుగులో " విద్యార్ధులారా! మనలను కష్టపడి చదివించిన మన తల్లిదండ్రులను మనం పెద్ద చదువులు చదివి, ఉద్యోగాల్లో చేరగానే మరచి పోరాదు. వారిలో కొందరు కూలీ నాలీ చేసి మిమ్ము చదివించిన పేదలు ఉండవచ్చు. వారి స్థితిని బట్టికాక, వారి మనస్సును మనకోసం వారు శ్రమించిన తీరును మరువక వారికి సేవచేయడం, వారిని ఆదరించడం బిడ్డలుగా మీ మొదటి కర్తవ్యం.ఆతర్వాత మీ దేశానికి , తోటి మానవులకు మీజన్మ భూమికి సేవచేయవలసి ఉంది. విద్య వివేకాన్ని, మంచితనాన్ని పెంచాలి.ఇక్కడ పేదతల్లిదండ్రుల బిడ్డలెవరైనా ఉంటే వారిని స్టేజ్ పైకి పిలిచి మా అదరికీ పరిచయం చేయగల కృతఙ్ఞతగల విద్యార్ధులుంటే రావచ్చు" అని చెప్పగానే, వినయ్ స్టేజ్ పైకి వచ్చి ,

" సార్ !మా నాయనగారు ఇక్కడే ఉన్నారు, పిలవనా?" అని అడగ్గా, కలెక్టర్ గారు " వెంటనే పిలువు " అని చెప్పాడు, అంతా ఎదురుచూస్తుండగా, కుమరయ్య స్టేజ్ పైకి వెళ్ళాడు. కలెక్టర్ కుమరయ్యకు షేక్ హ్యండ్ ఇచ్చి " మీరేమైనా మాట్లాడుతారా!"అని అడిగాడు. రంగుమారిన గళ్ళ పంచతో, బనియన్ తో ఉన్న కుమరయ్య " అయ్యా! మీలాగా నేను మాట్లాడలేను కానీ, మా ఊరి సోమయ్యన్న తన కొడుకును ఇట్టా పట్నంలో చదివించడం చూసి , నేనూ నా కొడుకును చదివించినా.వాడింత వాడైనందుకు నేను సోమయ్యన్నకు దండంపెట్టాల. ఎందుకంటే సోమయ్యన్నను చూసే నేనూ నాబిడ్డను చదవేయాలని అనుకున్నా.నేను చదువు కున్నోడ్నికాదు, తప్పులుంటే మన్నించాల." అని చెప్పాడు. వినయ్ తన తండ్రి పాదాలకు నమస్కరించి" ఈరోజు నుండీ మాతండ్రిని కూలిపనులకు పంపక నీడపట్టున ఉంచి బాగా చూసుకుంటానని మీ అందరి సమక్షంలో మాట ఇస్తున్నాను." అని చెప్పినాక , కలెక్టర్ గారు " మిమ్ము స్పందింపజేసి బిడ్డను చది వించను ప్రేరేపించిన ఆ పోలయ్యన్నను చూడాలనుంది.పిలుస్తారా!" అని కోరగా , వెంటనే వినయ్ క్రిందికి దిగివచ్చి , పోలయ్య దంపతుల్ని చేతులు పట్టుకుని పైకి తీసుకెళ్ళాడు, వారు వద్దని ఎంత బ్రతి మాలుతున్నా.

స్టేజ్ మీదకు వచ్చిన , మాసికల చీర, పంచలతో ఉన్న పోలయ్య దంపతుల్ని చూసి, కలెక్టర్ గారు వారిపాదాలకు నమస్కరించారు.

" ఇక్కడ వీరిబిడ్డ ఉంటే కనీసం ఇప్పుడైనా వచ్చి తన తల్లి తండ్రులను పరిచయం చేసుకోడం మంచిది." అని చెప్పి కాస్త సేపు చూశాడు." చదువు సంస్కారాన్ని నేర్పనేగాని , గర్వాన్నిపెంచను కాదు.నాతల్లి దండ్రులూ కూలి చేసి నన్ను చదివించారు. నేనింత వాడినైనందుకు ఎంతో గర్వించారు, వారి శ్రమ , మమత , అభిలాష , తమబిడ్డపై ఉన్న ప్రేమ నన్ను నావృత్తికి అంకితంచేసి , వారి సేవ చేసుకుంటూ నాధర్మాన్ని పాటించేలా చేశాయి. దేవుడు మీబిడ్డను ఆశీర్వ దించు గాక." అని చెప్పాడు. మీటింగ్ పూర్తై అందరూ వెళ్ళసాగారు. పోలయ్య దంపతులు , కుమరయ్య , వినయ్ తోకలిసి గేటుదాటాక, ఎప్పట్లుంచో అక్కడవేచి ఉన్న ' బంగారు స్వామి ' వచ్చి వారి కాళ్లపైబడి, ఏడ్వసాగాడు. దూరం నుండీ కారెక్కుతూ ఈ దృశ్యం చూసిన కలెక్టర్ చిరునవ్వుతో సాగిపోయాడు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)