శీర్షికలు
పద్యం హృద్యం
- పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
వర్ణన: 'తొలకరి'ని వర్ణిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో పద్యము వ్రాయాలి

గతమాసం ప్రశ్న:
చోరులు మంచి వారనుట చోద్యము కాదది ఎంచి చూడగన్!

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సి

మారిన లోకమందునను మాయలు గాంచగ సాధ్యమేరికిన్
నేరములెన్ని జేసినను నేరుపు తోడను సాధుశీలతన్
కూరిమి దైవచింతనము గోరుచు మైత్రిని పెంపు జేయగా
చోరులు మంచి వారనుట చోద్యము కాదది యెంచి చూడగన్


వారణాసి సూర్యకుమారి, మచిలీపట్నం

కూరిమి నుండు వారు మరి, కోమల గాత్రులు, గాన మాధురిన్
పేరును గన్నవారునిక, ప్రీతిగ నెల్ల పరోపకారమున్
ఏరికి నైన సల్పు జనులెప్పుడు, మానస చోరులౌ!మరా
చోరులు మంచి వారనుట, చోద్యము కాదది, ఎంచి చూడగన్


టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయవాడ (1)

పోరెను బాలపాపడుగ పోకిరి కన్నయ! రాక్షసాంతకా!
మీరిన లీలలన్ మిగుల మిన్నగ యన్నిట గోకులంబునన్
కోరగ నేస్తులందరును కొంటెగ వెన్నను దొంగిలించె, నా
చోరులు మంచి వారనుట చోద్యము కాదది ఎంచి చూడగన్!

(2)

దారుణ రీతిలో ధనము దాచెడి దొంగల కొల్ల గొట్టుచున్
భారపు కాలమున్ మిగుల బాధల దొర్లెడి బీదవారికిన్
తీరుగ పంచిపెట్టుచును తియ్యని రోజుల వేచిచూడ, నా
చోరులు మంచి వారనుట చోద్యము కాదది ఎంచి చూడగన్


కంది శంకరయ్య, వరంగల్

మారుని పుష్పబాణముల మానసమందున నాటజేసి, ము
ద్దారెడి హావభావము లుదారముగా గురిపించి, ప్రేమక
ల్హార సుగంధముల్ గురిసి హాయి నొసంగెడు ముద్దరాండ్రు హృ
చ్చోరులు మంచివా రనుట చోద్యము కాదది యెంచి చూడఁగన్!


మాజేటి సుమలత, క్యూపర్టీనో, కాలిఫోర్నియా

మారుని గన్న దండ్రి బలు మాయల జేయుచు బొంచి జూచుచున్
చీరల దొంగిలించి, మయి చింతల దీర్చగ గోప భామినుల్
కూరిమి గూడగం జెలగి గ్రుమ్మరుచో యటు రాస కేళిలోన్
"చోరులు మంచి వారనుట చోద్యము కాదది ఎంచి చూడగన్!"


చావలి విజయ, సిడ్నీ

(1)

మారుని రూపమున్‌ దలచి మానసమందెదొ మాధురీ స్మృతుల్‌
చేరిన రాగమే లయగ చెంతను విన్పడ వేణు నాదమై
నేరుగ తల్చెయా సుదతి నేర్పున గెల్వగ నాధులే మనో
చోరులు మంచివారనుట చోద్యము, కాదది ఎంచి చూడగన్‌

(2)

జారిన వక్త పల్కులను చక్కగ నెంచుచు చేర్చి కూర్చుచున్‌
పేరడి పాటలే ఘనత పెంచగ పేరును గౌరవమ్మునున్‌
నేరుగ తెచ్చులే, వదిలె నేర్పున తస్కర శబ్ద సొంపులన్
చోరులు మంచివారనుట చోద్యము, కాదది ఎంచి చూడగన్‌


గండికోట విశ్వనాధం, హైదరాబాద్‌

నేరములెన్నొ చేయుచును నీతులు చెప్పుచు దోచి దాచివే
దారుల భ్రష్ట దుష్ట సరదాలను దేలుచు, స్వర్ణ భూష సం
భారము లెన్నియో కపట భక్తితొ శ్రీహరి కిచ్చు దాతలౌ
చోరుల మంచివారనుట, చోద్యము కాదది ఎంచి చూడగన్‌.

చావలి శివప్రసాద్, సిడ్నీ

స్వైరగతిన్‌ అమాయకత స్వాంతముతో తిరుగాడు ప్రాయమున్‌
పోరల జీవనంబులను భోగ్యమొనర్చగ తల్లిదండ్రులున్‌
జోరుగసాగు ట్యూషనుల జొన్పగ నోవిధమున్‌ స్వతంత్రతా
చోరులు! మంచి వారనుట, చోద్యము కాదది, ఎంచి చూడగన్‌!


యడవల్లి ఆదినారాయణ శాస్త్రి, సికిందరాబాదు

(ఈ క్రింది పూరణ సమస్యలో "చోరులు మంచివారనుట" కు బదులు "చోరుడు మంచివాడనుట" గా పూరింపబడినది. అయినా మంచి పూరణ కావున స్వీకరించడమైనది.)

శ్రీ రఘురాము నామమును చిత్తము నందు సదా జపించుచున్
ధారుణి రాముడే మనకు దైవమటం చును నమ్ము వారలున్
చేరి భజించి కొల్చుచును సీతమనస్సును దోచుకొన్న యా
చోరుని మంచి వాడనుట, చోద్యము కాదది ఎంచి చూడగన్


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)