మనబడి
తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం


అమెరికాతో పాటు, ప్రపంచంలోని 14 దేశాలలో పుట్టి పెరుగుతున్న తెలుగు వారి పిల్లలకు తెలుగు నేర్పించేందుకు నిర్వహిస్తున్న `మనబడి' లో కోర్సు పూర్తిచేసిన అభ్యర్ధులకు, సిలికానాంధ్ర, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన స్నాతకోత్సవంలో పట్టాలను ప్రదానం చేశారు.

అమెరికాలోని కాలిఫోర్నియాలోను, న్యూజెర్సి, డల్లాస్, ఇతర నగరాలలో నిర్వహించిన పరీక్షలలో 539 మంది సీనియర్, జూనియర్ సర్టిఫికెట్ స్థాయిలలో ఉత్తీర్ణులయ్యారు. సన్నివేల్ లో జరిగిన స్నాతకోత్సవంలో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ర్టార్‌ ఆచార్య కర్నాటి తోమాసయ్య ముఖ్య అతిధిగా పాల్గొని పట్టాలను ప్రదానం చేశారు. ఆద్యంతం ఒక విశ్వ విద్యాలయ స్నాతకోత్సవాన్ని తలపించిన ఈ కార్య క్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ 2007 లో అమెరికాలో ప్రారంభమైన మనబడి ప్రపంచమంతటా విస్తరించటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మనబడి పీఠాధిపతి రాజు చమర్తి మాట్లాడుతూ 14 దేశాలలో, 225 కేంద్రాలలో వందలాది మంది స్వచ్చంద సేవకులయిన ఉపాధ్యాయుల బోధనలో నిర్వహిస్తున్న మనబడి కేంద్రాలలో సుమారు 4,300 మంది తెలుగును శాస్త్రీయ పద్ధతిలో అభ్యసిస్తున్నారని తెలిపారు. మనబడి ఆర్ధిక వ్యవహారాల ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల సభను అద్భుతమైన వ్యాఖ్యానంతో నిర్వహించారు. శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ లోని భారత దౌత్యాధికారి కూచిభట్ల వెంకట రమణ, విజయవాడ నుంచి విచ్చేసిన తోండేపు హన్మంత రావు, భారత్ ఎలక్ర్టానిక్స్‌ లిమిటెడ్ అధికారి రవి ప్రసాద్ దోనేపూడి, శ్రీదేవి గంటి,శరత్ వేట, శాంతి కూచిభొట్ల, దిలీప్ కొండిపర్తి, అనిల్ అన్నం, ఆనంద్ బండి, స్నేహ వేదుల, సంజీవ్ తనుగుల, ప్రభ మాలెంపాటి, రవి కూచిభొట్ల, మృత్యుంజయుడు తాటిపాముల తదితరులు పాల్గొన్నారు.

తెలుగు విశ్వవిద్యాలయం ప్రజా సంబంధ అధికారి డా. జుర్రు చెన్నయ్య తెలుగు పరిరక్షణకు కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య మునిరత్నం నాయుడు, పరీక్షా నిర్వాహణాధికారి డా. రెడ్డి శ్యామల ఆధ్వర్యంలో పట్టాల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమ ప్రారంభంలో వివిధ రంగులలో స్నాతకోత్సవ గౌన్లు. టోపీలు, కండువాలు ధరించి మనబడి విద్యార్ధులు, విశ్వ విద్యాలయ అధికారులు, ముఖ్య అతిధులు మరియు మనబడి కార్య నిర్వాహక వర్గం నిర్వహించిన కవాతుకు సభలో కూర్చున్న అందరు లేచి ప్రాంగణం మారు మోగే విధంగా చప్పట్లతో స్వాగతం పలికారు. ఇలాంటి స్నాతకోత్సవంలో పాల్గొనే అవకాశం మాకు ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసినప్పుడు కూడా కలుగలేదు అని చర్చించుకోవటం తల్లితండ్రుల వంతు అయింది.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)