కథా భారత
మనుమడా.. మజాకా!
- చెన్నూరి సుదర్శన్

శ్రీ సాయి నిలయం.. అది ఐదంతస్తుల అపార్ట్ మెంట్స్..

కరుణాకర్ ఫ్లాట్‍నుండి ఏడ్పులు పెడబొబ్బలు...

ప్లాట్‍లల్లో ఉంటున్న జనమంతా లిఫ్ట్ కోసం ఎదురి చూడకుండా ఉన్న ఫళంగా పరుగెత్తుకుంటూ వస్తున్నారు.

కరుణాకర్ భార్య కళావతి గుండెలపై బాదుకుంటూ ఏడుస్తోంది. మంచంలో కరుణాకర్ నోటి వెంట నురుసులు కక్కుకుంటూ మెలికలు తిరుగుతున్నాడు. వారి పిల్లలు వంశీకృష్ణ, సుమేధ ఏడ్పులతో వాతావరణమంతా హృదయవిదారకంగా మారింది..

‘ఫిట్స్ కాబోలు చేతిలో తాళం చెవులగుత్తి పెట్టండ’ ని ఒకరు సలహా యిస్తున్నారు. ‘పాత చెప్పులు వాసన చూపిస్తే త్వరగా కోలుకుంటారు’ అని మరొకరి సలహా.. ‘ఫిట్స్ కావేమో..! ఎప్పుడూ సదానందానికి ఫిట్స్ రావటం చూడలేదు..’ అని తలా ఓ రకంగా మాట్లాడుకుంటున్నారు.. మరొకరు ఆంబులెన్స్ కోసం ఫోన్ చేస్తున్నారు..

గుమ్మం బయట నిలబడ్డ భూపతి లోపలికి రావాలా వద్దా అన్నట్లుగా లిప్త కాలం సంశయించాడు. ఎంతైనా ఒక్కగానొక్క కొడుకు కరుణాకర్ అలాంటి పరిస్థితిలో కనబడేసరికి మనసు ఆగలేదు. భోరున ఏడ్చుకుంటూ కొడుకుపై వాలిపోయాడు. కళావతి భూపతిని ఈసడింపుగా ఒక చూపు చూసి తల పక్కకు తిప్పుకుంది. వంశీ, సుమేధలు తమ తాతయ్యను చూడగానే అమాంతం వాటేసుకోబోయారు. కళావతి అడ్డుకుంది. పిల్లలిద్దరినీ పక్కకు లాగి పక్క ఫ్లాట్‍లోని కాంతమ్మకప్పగించింది. అటు భూపతి, ఇటు పిల్లలు పడ్తున్న వేదన దృశ్యం చూస్తూ.. కఠినాత్ములు సైతం కంట తడిపెడ్తున్నారు. ఆడవారి గుండెలు చెరువులయ్యాయి..

భూపతి మనసులో కొడుక్కు ఏమైందోనని భయం ఒక ప్రక్క.. ‘మా ఇంట్లోకి వస్తే మమ్ముల్ని చంపుకు తిన్నట్లే..’ అని శాసించిన కోడలు మాటల తూటాలు మరో ప్రక్క బాధించ సాగాయి..

ఇంతలో ఆంబులెన్స్ రావటం.. కరుణాకర్ ను ఆంబులెన్స్ ఎక్కించారు. తనను తోసిరాజని ఆ ప్లాట్ ప్రెసిడెంటును తీసుకొని ఆంబులెన్స్ ఎక్కింది కళావతి.. పిల్లలను చూసుకొమ్మంటూ కాంతమ్మకు జాగ్రత్తలు చెప్తూ.. భూపతి నిశ్చేష్టుడై చూడసాగాడు.

పిల్లల ఏడ్పులు మిన్నంటాయి. భూపతి అచేతనంగా గోడకు చేరగిల పడి పోయాడు.

ఎలాగో అలాగా లాక్కొస్తున్న తన నూతన జీవనశకంలో అనుకోకుండా కొడుకు ఇలా ఆసుపత్రి పాలుగావటం.. భూపతి శరీరం కంపించింది..

‘యిక మీరు దయచేయండి..’ అన్నట్లుగా చూస్తున్న కాంతమ్మ చూపులను తప్పించుకుంటూ జీవశ్చవంలా సెల్లార్లో వున్న తన గదికి బయలు దేరాడు భూపతి.


గత తాలూకు స్మృతులు మదిలో అలజడి రేపసాగాయి..

***

“నాన్నా.. వెచ్చే నెల ఆరో తారీఖున మంచి ముహూర్తం వుందట.. కొత్త ఫ్లాట్ లోకి మారుతున్నాం” గుమ్మంలో అడుగు పెడ్తూనే అన్నాడు కరుణాకర్.

భూపతి హృదయం పులకించి పోయింది.. సొంత గూటిలో పొదిగిన విహంగమయ్యాడు.

‘ఎంత కాలానికి నా కోరిక తీరబోతోంది..! ’ అని పొంగి పోయాడు. కళ్ళు మూసుకొని ఆ పరమాత్మునికి నమస్కారాలు సమర్పించుకో సాగాడు.

ఇంతలో వంటింట్లో నుండి కళావతి సంకేతాలు అందినట్లున్నాయి.. వ్యక్త పరుస్తున్న తండ్రి సంతోషంలో పాలు పంచుకోకుండానే కరుణాకర్ అంతర్థానమయ్యాడు. అయినా ఈ కాలపు పిల్లలు అంతేలే.. అని మనసు నెమ్మదించుకున్నాడు భూపతి.

పిల్లలతో బాటు కొడుకూ కోడలు హాల్లో సమావేశమైనట్లు పసిగట్టాడు భూపతి. కళావతి వచ్చి హాలు తలుపులు మూసి బేడం పెట్టింది. భూపతి డ్రాయింగ్‍రూంలో అలాగే కుర్చీలో కూర్చుండి పోయాడు. అది అతడికి షరా.. మామూలే..!

అతడిలో కొత్త ఫ్లాట్ తాలూకు ఆలోచనలు కదలాడసాగాయి..

భూపతి బట్టల షాపులో గుమస్తా.. వర్తక వ్యవహారాల లెక్కా డొక్కా చూసేవాడు. లెక్కల్లో ఒక్క తప్పూ దొర్లేది కాదు. షావుకార్లు అతన్ని ‘లెక్కల మాస్టారైనా గాకపోతివి..పిల్లలు బాగు పడేవారు’ అని ప్రశంసించే వారు. పాత మొండి బకాయిలు వసూలు చేయడానికై అప్పుడప్పుడు ఊర్లూ తిరిగే వాడు.

భూపతి భార్య భరతమ్మ ఆరోగ్యం సరిగ్గా ఉండక పోవడం.. సంతానం ఆలస్యమైంది. ఒక్క కొడుకు కరుణాకర్ పుట్టగానే చాలనుకున్నారు. తమ మాదిరిగా కొడుకు కష్టాలపాలు కాగూడదని పైచదువులు చదివించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది..

కరుణాకర్ ప్రేమించిన అమ్మాయి వాళ్ళ కులం కాకపోయినా ముందుపడి పెళ్ళి చేసారు.

నేటి లోకం రివాజులా కరుణాకర్ సహజమైన కోరిక తన తండ్రి ముందుంచాడు.. ‘వేరే కాపురం..’.

కాదనలేక పోయారు భూపతి, భరతమ్మ దంపతులు. ‘వాడు సుఖంగా కాపురం చేయడమే మాకు కావాల్సింద’ని సరి పెట్టుకున్నారు. కొడుకును కన్నుల చలువగా చూసుకునే భాగ్యం కోల్పోవద్దని పక్క వీధిలోనే మరో ఇల్లు వారికి అద్దెకు ఇప్పించారు. అద్దె కూడా వాళ్ళ మెడకే పడ్డా సర్దుకు పోయారు.‘కొడుకు మమ్మల్ని కాదనుకున్నా.. వాని బాగోగులు చూసుకునే బాధ్యత ఇంకా మాపై వుంది..’ అనుకునేవారు.

ముందుగా వంశీకృష్ణ భూపతిని తాతయ్యగా పదోన్నతి కలిగించాడు. ఇప్పుడు వాడికి ఆరేండ్లు. ఆ తరువాత మరో ఏడాదికే సుమేధ.. పిల్లలు మమతానురాగాలతో పెనవేసుకు పోయారు. వారిరువురే వాళ్ళ ఊపిరి.

పరుగెత్తి పాలు తాగాలనే కాంక్షతో ఉద్యోగ బాధ్యతలు వదిలి నేల విడిచి సాము చేసాడు కరుణాకర్. సైడు వ్యాపారాలతో సయ్యాటలాడాడు. అనుభవ లేమితో అప్పులపాలయ్యాడు..

అటు ఉద్యోగంలోనూ సస్పెండయ్యాడు..

‘అత్తయ్యా.. మామయ్యా.. మీరే ఆదుకోవాలి.. ’ అని వారి కళావతి అడుగక ముందే భూపతి తన షావుకారు దగ్గర అప్పుజేసి కొడుకు అప్పులన్నీ తీర్చేసాడు.

కిరాయి కొంపలతో విసిగి పోతున్నాడు కొడుకు.. మనం కొన్న స్థలంలో వాడు తనకు నచ్చిన రీతిలో ఇల్లు తరువాత కట్టుకుంటాడు కాని ముందు ఒక ఫ్లాట్ కొనిద్దామని భరతమ్మ బుచ్చిమల్లు చెవిలో జోరీగై దూరింది. తన ఒంటి మీది నగలన్నీ ఒలిచి యిచ్చింది.

ఇద్దరు కలిసి ఫ్లాట్‍కు అడ్వాన్స్ అనకుండా ఏకమొత్తంగా కట్టారు.

కొడుకు కోడలును ఫ్లాట్ విషయం చెప్పి ఆశ్చర్యచకితుల్ని చేయాలని తిరిగి వస్తుండగా విధి వక్రించింది. వారు ప్రయాణిస్తున్న ఆటో నిల్చి వున్న వాటర్ ట్యాంకర్‍ను గుద్దుకున్నది. భరతమ్మ హఠాత్తుగా భూపతిని ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయింది.. చనిపోయిన ఘడియ మంచిది కాదని శవాన్ని వాకిలి కూడా తొక్కనివ్వ లేదు ఇంటి ఓనరు. బజారులో చిత్తు కాగితంలా కొట్టుకు పోయింది భరతమ్మ..

సంవత్సరీకం పోయిన నెలల జరిగింది. వారి ఇంటికి ఏడాది సూతకం వెళ్ళి మంచి రోజులు మొదలయ్యాయి..
‘నా భరతమ్మ కోరికలు మోసుకొని కొత్త ఫ్లాట్ లోకి వెళ్తున్నాం.. ’ అని భూపతి మనసు చిన్న పిల్లవాడిలా ఉరకలు వేయసాగింది..

ఇంతలో హాలు గుమ్మం తలుపులు తెరుచుకున్నాయి. అతడి ఆలోచనలు ఆగిపోయాయి.. ‘దీపం ఉండగానే ఇల్లు సదురుకోవాలె..’ అనే కళావతి మాటలు వంటింట్లో నుండి విన వస్తున్నాయి.

కరుణాకర్ వచ్చి భూపతికెదురుగా కూర్చున్నాడు ..

ఏదో చెప్పాలని తటపటాయిస్తున్నట్లు గమనించి బుచ్చిమల్లే కదిలించాడు.. కరుణాకర్ తడబడుకుంట గొంతు పెకిలించుకున్నాడు...

“నాన్నా!.. కొత్త ఫ్లాట్ లోకి మారబోతున్నాం అన్నాను కదూ.. కాని మీరు మాత్రం మాతో రావద్దు” నేల చూపులు చూసుకుంటూ అన్నాడు.

భూపతి గుండెలో రాయి పడింది. గొంతులో నుండి మాట రావటం లేదు..

“ఒక్కగానొక్క కొడుకుని. నీ బాగోగులు చూడ్డం నాకు తప్పుతుందా.. అసలే లోకులు పలు గాకులు..ఏమనుకుంటారు?.. నా మీద దుమ్మెత్తి పోయరూ..! మీకు నాలుగు దారులు చూపిద్దామనుకుంటున్నాను.. అందులో నీకు నచ్చిన దారి చూసుకో..” అంటూ మరో మారు తల దించుకున్నాడు. భూపతి ప్రాణమంతా ఆందోళనచెందసాగింది. ఊపిరి ఆగిపోతుందా అన్నట్లు చల్ల చెమటలు...

“మొదటి దారి.. మీ అన్నయ్య ‘బతుకైనా చావైనా నా ఇంట్లోనే..’ అనుకుంటూ తన కొడుకు వెంట కొత్త ఇంట్లోకి వెళ్ళకుండా ఒంటరిగా ఉంటున్న విషయం మీకు తెలియంది కాదు.. మీరు వెళ్ళి మీ అన్నయ్యతో షేర్ చేసుకో..
రెండవ దారి.. విధవరాలైన మీ చెల్లెలు అంటే మీకు ప్రాణం కదా..! ఆమె పిల్లలంతా అమెరికా వెళ్లిపోతే ఒంటరిగా బ్రతుకుతోంది. వెళ్ళి చెల్లెలికి చేదోడు వాదోడుగా వుండిపో..

మూడవ దారి.. ఎవరినీ కష్టపెట్టొద్దు అనుకుంటే.. పెద్ద మనసు చేసుకొని ఏదైనా అనాధ ఆశ్రమంలో చేరిపో..
ఇక చిట్ట చివరగా నాలుగో దారి. కాదూ..! కూడదూ..!! మాతోనే వుంటాను అని అనుకుంటే.. నేను మా ఫ్లాట్ సెల్లార్లో వుండే వాచ్‍మన్‍ను బతిమాలి ఒప్పించాను. ఒంటరి వాడు.. నిన్ను ఒక గదిలో ఉండనిస్తానన్నాడు. అతడితో షేర్ చేసుకో.. ఉదయం రాత్రి హోటల్ నుండి టిఫిన్లు తెప్పించుకో.. మధ్యాహ్నం ఒక పూట భోజనం టిఫిన్ బాక్స్ ఇచ్చి నేను స్కూల్ కు వెళ్తాను. మా ఫ్లా్ట్ లోనే కాబట్టి నాకేం కష్టం కాదు. ఆమాత్రం సాయం చేయలేనా..”

భూపతికి ఇదంతా కలా..? నిజమా..? అనిపించ సాగింది.. మెదడు మొద్దుబారిపోతోంది..

“నీవు మాతో కలిసి వుండటం నీ కోడలుకు గానీ.. నాకు గానీ.. నా పిల్లలకు గానీ సుతారమూ ఇష్టం లేదు. మీరు గదుల్లో అటూ యిటూ తిరగడం.. దగ్గడం.. అసహ్యం. కావాలంటే సుమీని.. వంశీని మీరే అడగండి..

ఫ్లాట్‍కు ఏదుర్ముహూర్తాన్నో డబ్బు కట్టి అమ్మను పొట్టన పెట్టుకున్నావ్.. ఇక నీవు మా ఫ్లాట్‍‍లో అడుగు పెడితే ఇంకా ఏమవుతుందో..! మాబాగు కోరే వాడివే అయితే బాగా ఆలోచించుకో.. నేను చెప్పేదేదో చాలా క్లియర్‍కట్‍గా చెప్పాను. ఏదైనా ఒక ఆప్షన్ సూసుకో.. నీ ఇష్టం. ఇంకా టైముంది.. వచ్చే నెల కదా..! మీకోడలు చాలా మంచిది కాబట్టి కాస్తా పెందరాళే హెచ్చరించమంది..” అంటూ తండ్రి వంకైనా చూడకుండా బిర బిరా వెళ్ళిపోయాడు కరుణాకర్.

భూపతి నిశ్చేష్టుడయ్యాడు.. కళ్ళు బైర్లు కమ్మి అలాగే కుర్చీల ఒరిగి పోయాడు.. ఆఖరి దారి ఆ గోదారి అని చెప్తే బాగుండేది నా కొడుకు అని అతడి మనసు మదనపడ సాగింది.. ‘అత్తలేని కోడలు ఉత్తమరాలు’ అనే వ్యంగ్యాస్త్రం అతడి నోటిగుండా అప్రయత్నంగా మొదటిసారిగా వచ్చింది.

రోజులు గడుస్తున్నాయి.. నిద్రాహారాలు మాని ఆలోచించ సాగాడు..

‘పిల్లలు భూపతి దగ్గరికి రావడం లేదు. కాని వారు దూరంగా కనిపించినా అనిర్వచనీయమైన తృప్తి కలుగుతోంది. వారు ఒక సెకను కనపడ్డా ఒక రోజంతా బతికే శక్తి అతడిలో పునరావేశం (రీచార్జ్) అవుతోంది. అలాంటప్పుడు వారిని విడిచి ఎలా వెళ్లగలను?..

చెల్లెలు, అన్నయ్య వాళ్ళ బ్రతుకేదో వాళ్లు ఈడ్చుకుంటున్నారు. తాను వెళ్ళి వారికి అపప్రథ మూట కట్టడం ఇష్టం లేదు. తాటి చెట్టు కింద పాలు తాగినట్లు వుంటుంది. వారి సొమ్మంతా నేనే తింటున్నానని వారి పిల్లలు అపోహపడక మానరు’ అని బుచ్చిమల్లు మనసులో ఆవేదన పడసాగాడు.

‘యిక అనాధాశ్రమంలో వుంటే సుమీ.. వంశీలు నన్ను చూడ్డానికి వస్తారన్న నమ్మకమూ లేదు. వారిని చూడకుండా నేను ఎలా బ్రతగ్గలను?.. రోజుకొక్కసారైనా వారిని చూడాలి.. లేకుంటే ఆగిపోతుంది నాఊపిరి.. నేను ఫ్లాట్లోనే వాచ్‍మన్ గదిలో వుంటాను..’ అని స్థిరంగా భూపతి నిర్ణయించుకున్నాడు.

‘నారెక్కలు ఆడినంత కాలం నలుగురు పిల్లలకు లెక్కలు చెప్తాను.. పని మనిషిని పెట్టుకొని ఆ ఒక్క పూట కూడా వంట చేయించుకుంటే ఆ శ్రమ కూడా తప్పుతుంది నా కొడుక్కు. కొన్నాళ్ళు చూద్దాం.. ’ అని దృఢనిర్ణయానికి వచ్చాడు.

‘నాకొడుకు కోడలుకు తృప్తి పడ్డారో లేదో..! ఎండిన ఎంగిలాకులా ఎగిరిపోతాడనుకుంటే ఎటొచ్చి మళ్ళీ మా మెడకే చుట్టుకుంటున్నాడని అనుకున్నా ఫరవాలేదు.. ప్రేమపాశం తెంచుకుంటే తెగిపోయేది కాదు.. నామనుమడు మనుమరాలును చూసుకునే భాగ్యం కల్గించుకుంటాను.. నాఊపిరి మరి కొన్నాళ్ళు నిలుపుకుంటాను..’ అనే తృప్తి అతడిలో బలపడింది.

నూతన జీవనం ఆరంభమైంది..

యింతలో.. కరుణాకర్ ఆసుపత్రి పాలుగావటం.. భూపతి తీవ్ర మనస్తాపానికి గురి అయ్యాడు.

***

ఆవాళ ఆదివారం..

భూపతి నిత్యం షిర్దీ సాయి దేవాలయానికి వెళ్ళి కొడుకు పేరు మీద అర్చన చేయించిన ఫలితం ఫలించింది. కొడుకు కోలుకొని ఆవేళ వస్తున్నాడని తెలిసి కూడా తన దిన చర్య మానుకోలేదు. అతడికి వారాలతో గాని సెలవు దినాలతో గాని పని లేదు. అలా ట్యూషన్ చెప్తుంటేనే.. అతడి బతుకుబండి సాగేది. పైగా యీ రోజు కరుణాకర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జై వస్తున్నట్లు తెలుసుకొని ద్విగుణీకృతోత్సాహంతో సెల్లార్లో ఉదయం పది గంటలకు లెక్కల ట్యూషన్‍లో చెప్పడంలో మునిగి పోయాడు భూపతి.

“తాతయ్యా!” అంటూ జింక పిల్లలా పరుగెత్తుకుంటూ వచ్చింది సుమీ.

భూపతి గుండె గుభేలుమంది. గభాల్న వీధి గుమ్మం మూసేద్దామంటే సుమీ రెండు కాళ్ళనూ చుట్టేసుకుని వుంది. అతడి ఒంట్లో వణుకు పుట్టింది. వెనకాల కోడలు వస్తుందేమోనని కలవరడ్డాడు కళ్ళజోడు సర్దుకుంటూ.. ఎవరూ రావడం లేదని నిర్థారణ కాగానే అమాంతం సుమేధను హృదయానికి హత్తుకున్నాడు. పోయే ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది..

‘ఎన్నాళ్ళయింది..?. తృప్తిగా యిలాంటి స్పర్శకు నోచుకోక..’ అని బుచ్చిమల్లు మనసు తల్లడిల్ల సాగింది. దుఃఖం పెల్లుబికింది. ఘొల్లుమన్నాడు.. సుమీ.. బిగ్గరగా ఏడ్చేసింది.

ట్యూషన్‍కు వచ్చిన పిల్లలంతా బిక్కు బిక్కుమంటు వారి వంక చూడసాగారు. బుచ్చిమల్లు తల ‘ఈ పూటకిక సెలవు..’ అన్నట్లుగా స్పందించడం గమనించి ఒకరి తరువాత పుస్తకాలు సర్దుకొని వెళ్ళి పోయారు.

కాసేపటికి తమాయించుకున్నాడు బుచ్చిమల్లు. సుమేధ బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించాడు. ఉప్పదనమైన అతడి పెదవులను తడుముకుంటూ తన్మయత్వం చెందసాగాడు.

భూపతి ఆనంద భాష్పాలను సుమేధ తన చిట్టి చేతులతో తుడువ సాగింది..

కన్నీరు తెరలు తెరలుగా ఉప్పొంగ సాగింది.. గుండె దిటవు చేసుకున్నాడు.

ఆవాళ్టి సంగతి జ్ఞప్తికి రాగానే అతడి చేతులు అప్రయత్నంగా సుమేధను దూరంగా తోసేసాయి.

“నేనంటే ఇష్టం లేదన్నవ్.. మళ్ళీ ఎందుకొచ్చావ్?.. మీ అమ్మా నాన్న దగ్గరికే వెళ్ళిపో..” అంటూ చిరు కోపం ప్రదర్శించాడు భూపతి. భుజంమ్మీది కండువాతో కళ్ళు తుడ్చుకుంటూ.. అలాగే వాలు కుర్చీలో వాలి పోయాడు.

సుమీ దూకుడుగా అడుగు ముందుకు వేసి వచ్చి కుర్చీ ఎక్కి భూపతి తొడల మీద కూర్చుండి పోయింది. తన తాతయ్య కడుపును గట్టిగ పట్టుకొని ఎదపై తల ఆనించింది. సుమేధ వీపు మీద తన రెండు చేతులతో నిముర సాగాడు భూపతి.. తెంచుకుంటే తెగి పోయే బంధం కాదది..

మనసును దహించి వేస్తోంది..

అతడి మనుమడు వంశీ అడుగులో అడుగు వేసుకుంటూ పిల్లిలా రాసాగాడు.

భూపతి చూసీ చూడనట్లే చూసి దృష్టి మరల్చు కున్నాడు.

సుమీ ఏడుస్తూ అలాగే అతడి ఎదపైన నిద్రపోయింది.

“తాతయ్యా నాతో మాట్లాడవా?.. ” అన్నాడు వంశీ. అంతవరకూ ఏడ్చినట్లున్నాడు.. వెక్కిళ్ళు వస్తున్నాయి. కన్నీటి చారలు కనబడ్తున్నాయి. జుట్టు చెదిరిపోయి వుంది.

ఇంతలో వంట మనిషి వచ్చి అతడి ఒళ్ళోని సుమీని తన భుజంమ్మీదకు మార్చుకుంది.

“సారూ..! మీ కొడుకును తీసుకు రావటానికి హాస్పిటల్ కు వెళ్ళింది మీ కోడలు ” అనుకుంటూ వంట గదిలోకి వెళ్ళింది.

అందుకే పిల్లలు వచ్చారు అనుకున్నాడు మనసులో భూపతి.

“నేనంటే మీకిష్టం లేదు కదా.. నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు కదా..” అన్నాడు భూపతి.. మునివేళ్ళతో నొసలు కొట్టుకుంటూ..

వంశీ ఒక్క పెట్టున ఏడ్పు అందుకున్నాడు.

భూపతికి జాలేసింది..

“తాతయ్యా నేను త్వరగా ఎలా పెద్దవాన్ని అవుతానో చెప్పవా?.. నేను పెద్దవాన్నైతే నిన్ను నాదగ్గరే ఉండనిస్తాను” అంటున్న వంశీని అమాంతం తన హృదయానికి హత్తుకున్నాడు భూపతి. కళ్ళు కన్నీటి కడవలయ్యాయి.
“తాతయ్యా నాన్న కాఫీలో విషం నేనే కలిపాను” ఠక్కున అన్నాడు వంశీ.

బుచ్చిమల్లు గుండె ఝల్లుమన్నది. తత్తర పడ్తూ..

“మీ నాన్న కాఫీ కప్పులో విషం కలిపావా..?” తాను విన్నది నిజమేనా అన్నట్లుగా అడిగాడు భూపతి. అవును అన్నట్లుగా తల ఊపుతూ అసలు విషయం చెప్ప సాగేడు వంశీ.

“తాతయ్యా.. మీరు మాకు కథలు చెబ్తారు.. హోంవర్క్ చేయిస్తారు.. స్కూల్‍కు తీసుకెళ్తారు.. పార్కుకు తీసుకెళ్తారు..
యింకా మన ఇల్లు కూడా మీరే కొన్నారట కదా.. అంతా అనుకుంటారు. అయినా నాన్నకు మీరంటే ఎందుకు ఇష్టం లేదు..

మేము మీతో మాట్లాడినా దగ్గరికి వెళ్ళినా విషమిచ్చి మిమ్మల్ని చంపేస్తానని చెల్లిని నన్ను భయపెట్టాడు నాన్న. అందుకే మీరంటే ఇష్టం లేదని ఆరోజు చెప్పాం.. నాకు కోపం వచ్చింది. నాన్నను చంపేస్తే మీతోనే ఉండొచ్చు అని నేనే విషం కలిపాను” అన్నాడు ఆవేశంగా.. పై పళ్ళతో కింది పెదవి కరుచుకుంటూ..

“అయ్యొయ్యో..! ఎంత పని చేసావు?.. ఇంకా ఎక్కడా ఈ మాట అనొద్దు ” అంటూ వంశీ నోరు ఠక్కున మూసాడు భూపతి.

ఇంతలో భళ్ళున తలుపు తెరుచుకొంది.. కరుణాకర్ కళావతి లోనికి వస్తూనే భూపతి కాళ్ళపై పడ్డారు.
భూపతి నిర్ఘాంత పోయాడు.

“నాన్నా.. మమ్మల్ని క్షమించండి.. వంశీ మాటలన్నీ విన్నాం.. మా కళ్ళు తెరుచుకున్నాయి. నిజమే.. ఆ రోజు నేను విషమని చెప్పి పిల్లలను భయపెట్టించాను. నిజంగా అది విషమయితే నేనీపాటికి పైలోకానికి వెళ్ళే వాన్ని. అది ఒక కోయ దొర ఇచ్చిన విరేచనాల మందు.. అది వికటించింది. అదృష్టం కొద్దీ గండం గడిచి బయట పడ్డాను. కుటుంబంలో తాతయ్య బంధాన్ని అర్థం చేసుకోలేని అవివేకిని.. యిక ముందు మనమందరం కలిసే వుందాం..” అంటూ ప్రాధేయపడసాగాడు.

తమ కన్నీళ్ళతో భూపతి తండ్రి పాదాలను ప్రక్షాళనం చేయసాగారు కరుణాకర్ దంపతులు.

“మీరు సరే అనే వరకు మీపాదాలను వదలను..” అంటూ కళావతి కన్నీరుమున్నీరు కాసాగింది.

“తాతయ్యా ప్లీజ్..” అంటూ సుమేధ వంశీ భూపతి చేతులు పట్టుకొని కదుపసాగారు.

ఆ మధుర క్షణాలు చూడటానికి తన భార్య భరతమ్మ వుంటే బాగుండేదననే ఆలోచన భూపతి మదిలో రాగానే ఆనంద భాష్పాలు రాలాయి.

***

“అది విషం కాదని నాకు తెలుసు తాతయ్యా.. నాన్న అమ్మతో చెబుతుంటే నేను విన్నాను. అందుకే ఏమీ కాదనే ధైర్యంతో కాఫీలో ఆ మందు కలిపాను. అయితే నాన్న అలా ఎందుకు పడి పోయాడు..? నాకు భయమేసింది..”
నిన్న మీతో మాట్లాడుతుంటే హాస్పిటల్ నుండి వచ్చిన అమ్మా నాన్న వాళ్ళు తలుపు చాటుగా వింటున్నట్లు చూసాను.. అందుకే విషం కలిపానని చెప్పాను.. మందు బాగానే పని చేసింది కదూ..! తాతయ్యా..” వంశీ అంటుంటే సుమేధ కళ్ళు బండి చక్రాలయ్యాయి. మనుమని తెలివితేటలకు.. తనపై గల ప్రేమకు ముగ్ధుడయ్యాడు భూపతి.
పార్కులో పక్షుల కిల,కిలారావాలు మిన్నంటాయి.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)