తెలుగు తేజోమూర్తులు

- రచన : ఈరంకి వెంకట కామేశ్వర్.

మేటి ఆర్ధోపిడిక్ డాక్టర్ ఆచార్య చావలి వ్యాఘ్రేశ్వరుడు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర, విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి ప్రప్రధమ ఆర్థోపిడిక్ క్షేత్ర ఆచార్యుడిగా, రాష్ట్రంలో ఆర్థోపిడిక్ వైద్య విభాగ వ్యవస్థాపకుడు; ప్లేసెంటల్ గ్రాఫ్ట్ పద్ధతిని పోలియో వ్యాధి చికిత్సకు ఉపయోగించిన తొలి భారతీయుడు; సబ్త్రో చాంటరిక్ ఓస్టియోటొమి కి మెటాలిక్ గైడ్ పద్ధతిని ప్రవేశ పెట్టిన తొలి భారతీయుడు, మేటి ఆర్తో పిడిక్ ఆచార్యుడు, డాక్టర్ చావలి వ్యాఘ్రేశ్వరుడు. అంతే కాదు మూడు వందల పోలియో క్యాంపులు నిర్వహించి, 30,000 (ముప్పై వేలకు పైగా) శస్త్ర చికిత్సలు చేసి, లక్షా యాబై వేల రోగులకు వైద్య సేవలు అందించిన శ్రేష్ట వైద్యుడు శ్రీ వ్యాఘ్రేశ్వరుడు గారు. ప్రపంచంలో బహు కొద్ధిమందికి తెలసిన హాఫ్ నీ జాయింట్ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్ర చికిత్స నిపుణుడు, తొలి భారతీయుడు కూడా చావలి వ్యాఘ్రేశ్వరుడు గారే. ఈ క్షేత్ర వికాసానికి దోహదపడుతూ, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఆర్తో పిడిక్స్ పుస్తకం రచించిన తొలి భారతీయుడు డాక్టర్ వ్యాఘ్రేశ్వరుడు. అహో!.... తెలుగు నాట ఇలాటి వారు మరిందరు ఉంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది యవ్వరికైనా. వీరు చేసిన పనులు తలచుకుంటే అబ్బుర పడక తప్పదు. వీరి ప్రతిభ, తదైక భావం సేవానురక్తి శ్లాఘనీయం.

ఆచార్య చావలి వ్యాఘ్రేశ్వరుడు ఎం బి బి ఎస్, ఎం ఎస్, ఎఫ్ ఐ సి ఎస్, ఎఫ్ ఏ సి ఎస్

చావలి వ్యాఘ్రేశ్వరుడు గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో జన్మించారు. వీరి తండ్రి ఆయుర్వేద డాక్టర్. ఎం బి బి ఎస్ చేసిన పిదప, ఆంధ్రా మెడికల్ కాలేజి నుండి ఎం ఎస్ (సర్జరి), ఎం ఎస్ (ఆర్తో పిడిక్స్) చేశారు. తరువాత ఇక్కడే ఆర్థోపిడిక్ సర్జరీ ఆచార్యుడిగా వ్యవహరించారు.

1948 లో కార్ నికోబార్ ద్వీపాలకు వెళ్ళి చాలా మంది పోలియో వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించారు. వీరు చేసిన మంచి పనికి గుర్తింపుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫెల్లోషిప్ ఇచ్చి ఉన్నత శిక్షణకు అమెరికా పంపించింది. 1954 లో మూడవ అంతర్జాతీయ పోలియో కాన్ఫరెన్స్ లో పురస్కారం అందుకున్నారు.

1956 లో ఇంటర్నేష్నల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఫెల్లోషిప్ అందుకున్నారు. 1965 లో అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్, ఫెల్లో నేషనల్ అకాడమి ఆఫ్ మెడికల్ సైన్సెస్ గౌరవం గైకొన్నారు.

వ్యాఘ్రేశ్వరుడు గారు డాక్టర్ మంగళంపల్లి గోపాల్ కిని వద్ద శిక్షణ పొందారు. రాణి చంద్రమణి దేవి కిని గారి వద్ద వైద్యం చేయించుకునే వారు. కిని గారు ముంబై ఆసుపత్రికి తరలి వెళ్ళడంతో, స్థానికి వైద్య సధుపాయం కోసం స్థలం విరాళముగా ఇవ్వగా, డాక్టర్ వ్యాఘ్రేశ్వరుడు వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. దేశం నలుమూలలనుంచి జనం ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందారు.

డాక్టర్ వ్యాఘ్రేశ్వరుడు గారు పలు రాష్ట్రాలు సందర్శించి పోలియో క్యాంపులు నిర్వహించి బాధితులకు ఉపశమనం కలిగించారు.

1967 లో ఆచార్య డాక్టర్ పి బ్రహ్మయ్య శాస్త్రి గారి సహకారముతో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విద్యార్ధుల సంఘం నెలకొల్పారు. వారి సహాయ సహకారలతో వైద్య సేవలను మెరుగు పరిచేదిశలో మిక్కిలి కృషి చేశారు.

1972 లో ప్రభుత్వం ఉద్యోగం నుంచి రెటైర్ అయ్యారు. కాని, పోలియో రోగులకు వైద్య సేవలు కొనసాగిస్తూ వచ్చారు. ఆపరేషన్ పోలియో ప్రాజెక్ట్ , సత్య సాయి పోలియో ట్రస్ట్ ఆరంభించారు. వీటి ద్వారా మూడు వందల పోలియో క్యాంపులు నిర్వహించారు. 1.5 లక్షల మందిని పరీక్షించారు. 30,000 కి పైగా శస్త్ర చికిత్సలు చేశారు. ఈ సేవలన్నీ ఆయన ఉచితముగానే అందిచారు. ప్రపంచ వైద్య రంగ ఇతిహాసంలోనే ఇలాటి ఉదంతాలు అరుదు. ఈ కోవలో ఓ భారతీయుడు, అందులోనూ ఓ తెలుగు వాడు ఉండడం అందరికీ గర్వకారణం.

వ్యాఘ్రేశ్వరుడు గారి శిష్యుడు, మేటి డాక్టర్ ఎస్ వి ఆదినారాయణ రావు వీరికి సహకారం అందిస్తూ ఉండేవారు. ఒక దరిమిలా ఆయన వ్యాఘ్రేశ్వరుడు గారిని ఉద్దేశించి ఉచితంగా సేవలు అందించడంలో మీకు ఏమొస్తుంది? అని ప్రశించారు. దానికి ప్రత్యుత్తరముగా రోగుల కళ్ళలో వారి దేవుడి పట్ల ఉన్న కృతజ్ఞత కనిపిస్తుంది; ఆ అనుభూతి, సంతృప్తి ఎంత డబ్బు పెట్టినా కొనలేము అని సమాధానమిచ్చారు. వారి నిష్ట అటువంటిది. ప్రజా క్షేమమే తన అశయంగా మలుచుకున్న గొప్ప వ్యక్తి.

మీకో విషయం చెప్పాలి వైద్య విధ్యార్ధులు శిక్షణా తరగతిలో ఓ మనిషి శరీరాన్ని డైసెక్ట్ , చేస్తుండగా అది చూడ లేక అక్కడనుండి పారిపోయారు. అప్పట్లో మేటి వైద్యుడు శ్రీ దిగుమర్తి గోపాలస్వామి ఆ కుర్రాడిని దిగ్భందం చేసి శిక్షణా తరగతులలో కూర్చో బెట్టారు. అలా గోపాలస్వామి గారు చేయబట్టే నేడు అంతర్జాతీయ విశిష్ఠత నార్జించిన ఆర్థోపిడిక్ నిపుణుడు డాక్టర్ వ్యాఘ్రేశ్వరుడు లోకానికి సౌలభ్యమైయ్యారు.

రచనలు:

డాక్టర్ వ్యాఘ్రేశ్వరుడు అనేక పత్రాలను, పుస్తకాలను వెలువడించారు:

ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఆర్తో పిడిక్స్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1966
బోన్ ట్యుబర్కిలోసిస్ ఇన్ చిల్డ్రెన్, ఇండియన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్
ప్లాసెంటల్ టిష్యూ గ్రాఫ్టింగ్ ఇన్ పోస్ట్ పోలియో పరాలసిస్, జర్నల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్
అటిపికల్ రినల్ రికెట్స్, జర్నల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, 1962
ప్లసెంటల్ ఇంప్లాంట్స్ ఇన్ పోలియో మెలిటిక్స్, ది ఇండియన్ ప్రాక్టీష్నర్, 1965
చొన్ జెనిటల్ ఆబ్సెన్స్ ఆఫ్ సాచ్రం అండ్ కొక్కిక్ష్, ఇండియన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్, 1961
చొన్ జెనిటల్ ఆబ్సెన్స్ ఆఫ్ హుమెరుస్, ఇండియన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్ 1961
మోసిటిస్ ఓసిఫికన్స్ ప్రోగ్రెసివ: రిపోర్ట్ ఆఫ్ తొ కేసెస్, ఇండియన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్

వీరి జ్ఞాపకార్ధం, విశాఖపట్నం, కే జి హెచ్ ఆసుపత్రిలో వీరి శిలా విగ్రహాన్ని నెలకొల్పారు.

వైద్యో నారాయణో హరి! అన్న నానుడిని యదార్ధం చేసిన మహానుభావుడు డాక్టర్ చావలి వ్యాఘ్రేశ్వరుడు. ఇలాటి మహానుభావుల వల్ల పోలియో లాటి భయంకర వ్యాధిని భారతావని నుంచి నిర్మూలించగలిగారు. వీరి సేవలను మాటలలో చెప్పడం కష్టం. ప్రేరణకు, ఇటువంటి మేటి పురుషులు ఆదర్శముగా నిలుస్తారు. సేవంటే ఇలా చెయ్యాలి; వైద్యం ఇలా అందించాలి అని ఎవ్వరికైనా ప్రేరణ ఇవ్వాలి అంటే, డాక్టర్ చావలి వ్యాఘ్రేశ్వరుడు గారిని ఉదాహరించవచ్చు. డాక్టర్ చావలి వ్యాఘ్రేశ్వరుడు ధన్య జీవి.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech