సారస్వతం    

     అన్నమయ్య కీర్తనలు

రచన : జి.బి.శంకర్ రావు

 

ఎదుట నున్నాడు వీడె


ఎదుట నున్నాడు వీడె ఈ బాలుడు
మదితెలియమమ్మ ఏమరులోకాని||

పరమ పురుషుడట పసులగాచెనట
సరపులెంచిన విన సంగతాయిది
హరియే తానట ముద్దులందరికి జేసెనట
ఇరవాయనమ్మ సుద్దులేవిటివో కాని||

వేదాలకొడయడట వెన్నలు దొంగిలెనట
నాదించి విన్నవారికి నమ్మికా యిది
ఆదిమూల మీతడట ఆడికెల చాతలట
కాదమ్మ ఈ సుద్దులెట్టికతలో కాని||

అల బ్రహ్మతండ్రియట యశోదకు బిడ్డడట
కొలదొకరికి చెప్పకూడునా యిది
తెలిపి శ్రీ వేంకటాద్రి దేవుడై నిలిచెనట
కలదమ్మ తనకెంత కరుణో కాని||

లీలమానుష వేషధరి శ్రీకృష్ణుని విశ్వవ్యాపకత్వాన్ని, వైశిష్ట్యాన్ని తెలిపే సంకీర్తన యిద్ర్!
సామాన్యుడుగ కన్పించే ఈ బాలకృష్ణుడు పరమపురుషుడు కాని నిరడంబరుడై రేపల్లెలో ఆలమందలను మేపాడు. వేదాలకు ఈతడు ప్రభువే కాక, వేదాలను కాపాడిన ఈతడు వెన్న దొంగతనం చేశాడు! ఎంత విడ్డూరం? సృష్టికర్తయైన బ్రహ్మకే తండ్రి, కాని రేపల్లెలో యశోదమ్మకు ముద్దుల బిడ్డడైనాడు.. ఎంతచోద్యం? భక్తజనుల యెడ కరుణ అపారంగా కల్గిన ఆ శ్రీ కృష్ణుడే కలియుగంలో వేంకటేశ్వరస్వామియై వెలిశారు అని అంటున్నాడు అన్నమయ్యగారు!

మది = మనస్సు;
ఏమరు = పరధ్యానం;
ఇరవు = స్థాణము, స్థిరము;
అడికెలచాతలు = కొంటెచేష్టలు;
సరవులు = వరుసలు, క్రమములు;
ఒడయడు = ప్రభువు;
నాదించి = చెవియొగ్గి, శ్రద్ధగా;
కొలది = కొలమానము, విలువ, పరిధి, పరిమితి


ఎన్నడు విజ్ఞానమిక

ఎన్నడు విజ్ఞానమిక నకు
మిన్నప మిదె శ్రీవేంకటనాథా||

పాసిన పాయపు బంధములు
ఆస దేహమున్నన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు
గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు||

కొఇచ్చిన గొరయవు కోపములు
గచ్చుల గుణములు గలనాళ్ళు
తచ్చిన తలగ్వు తహతహలు
రచ్చల విషయపు రతులన్నాళ్ళు||

వొకటి కొకటికిని వొడబడవు
అకట శ్రీవేంకటాధిపుడ
సకల్ము నీవే శరణంటే యిక
వికటములణగెను వేడుకనళ్ళు||

తత్త్వకీర్తన్! విషయవాంఛలతో, భౌతిక దేహపు వాసనల్తో సతమతమవుతున్న జీవుడి వేదన్ ఇది! ఓ శ్రీ వేంకటేశ్వరా! నాకు ఎప్పుడు జ్ఞానం గలుగుతుంది స్వామీ! నన్ను అంటిపెట్టుకున్న ఈ మమకార, అనురాగాల వల్ల భౌతిక బంధాలు వీడుట లేదు! చిత్తభ్రాంతి ఉన్నన్నాళ్ళు కోరికలు తొలగటం లేదు! ఓ స్వామీ! ఏమిటీ విపరీతం, పోలికలేని విరుద్ధ భావాలు అంటూ జీవుడి దైన్యస్థితిని తెలియజేసిన అన్నమయ్య సంకీర్తనాంతంలో విరుగుడు కూడ తెలియజేసాడు.

ఇటువంటి విరుద్ధ భావాల మధ్య ఎటువంటి పరిస్థితులలోనైనా నీవే శరణంటే కష్టాలు తీరతాయి! శ్రీ వేంకటేశ్వరుణ్ణి శరణు కోరటమే ఈ భవరోగానికి మందు! అప్పుడు ఈ వవికటాలన్నీ అణగి వేడుక (ఉత్సాహం-నందసిద్ధి) కలుగుతుంది.

గాసిలి = బాధ;
వికటము = వంకర్లు (నష్టాలు)
పాసిన పాయవు = విడిపించుకుందామన్న విడువవు;


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 







సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech