కథా విహారం -
 గురుత్వ స్థాయిలో నిలిచే సాహిత్య దీపధారి డా. ఆవంత్స సోమసుందర్

- విహారి

  అభ్యుదయ సాహిత్య చరిత్రలో సోమసుందర్ స్థానం ఎంతో విశిష్టమైనదిగా సాహితీలోకానికి బాగా తెలుసు. అయితే, వారే చెప్పుకున్నట్టు ఈ దేశంలో పాఠకులెందరికో (ఆయన) కథలు రాస్తాడనిగాని, ఎన్నో వ్రాశాడని గానీ తెలియదు. అతిశయోక్తుళు, అభూత కల్పనలూ చేయలేకపోవడం కథకుడుగా నా బలమూ, బలహీనతా కూడా నేమో. జీవిత వాస్తవికత ప్రతి కథకూ ఆలంబనగా నిలిస్తే తను రాయలేకపోవడం నిజానికి కొంత బలహీనతే నేమో! అని రాసుకున్నారు సోమసుందర్.

సోమసుందర్ ‘మతాబాల తలంబ్రాలు’ ‘గోడమీద తెల్లసింహం’ వంటి గల్పికలూ రాశారు. శీర్షికల్లోనే ధ్వనిస్తున్న వ్యంగ్యం - వారికి శిల్పం పట్ల, సగటు పాఠకుడి స్థాయిని, అభినివేశాన్ని ఒకింత అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష పట్ల ఉన్న శ్రధ్ద తెలుపుతోంది.

కథ రాయడానికి ఎంత శ్రమ తీసుకుంటానో, శీర్షిక ఎన్నుకొందుకూ, అంత శ్రమపడతానని వారే చెప్పుకున్నారు. మొదటి గల్పికలో లోకం పెళ్ళి చేసుకుంటోంది అంటూ ప్రతీకాత్మకంగా - వ్యాంగ్యాత్మకంగా - పీడితుల పక్షాన తన గళమెత్తి నిరసిస్తారు ఎట్లా? లోకం దేవుడు లాంటి. లోకం దేవుడు లాంటిది. లోకం పెళ్ళికి అంతా పెద్దలే పేదవాళ్ళు తప్ప. మారుమూల మలినంలో మాలపల్లి.. ‘నిద్రలేని బోగంచాన కంట్లో పుసిలా పెళ్ళి చేసుకుంటున్న లోకమ్ళో మాలపల్లి...! ఇది చూసి విలోకి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ‘ఆలోచిందడానికి వీల్లేదని శాసించింది. - పెళ్ళి చేసుకుంటున్న లోకం. ఆలోచన మానెఫెస్టోల్ని కంటుందని లోకం భయం. అంచాతనే ఆలోచన పనికి రాదంటూ తెలివిగా..!’ ఇట్లా సాగుతుంది. అలాగే స్వాతంత్ర్యానంతరం రాజకీయాల మీదా, సమాజ దౌర్బల్య పరిస్థితుల మీదా వ్యంగ్యం ‘గోడమీద తెల్లసింహం’ గల్పిక.

సోమసుందర్ రాసిన 28 కథల సంపుటి 1984 లో వచ్చింది. ఆ సంపుటి ముందుమాట వ్రాస్తూ, విరియాల లక్ష్మీపతి అన్నారు, ‘మేం మా వ్యక్తిత్వాలు తీర్చిదిద్దుకోవడంలో ఆయన ప్రభావన్నుంచి తప్పించుకోలేకపోయాము’ అని, సోమసుందర్ వ్యక్తిత్వం ఉన్నతి అంతటిది.

కాగా, సోమసుందర్ కథానికల్లో ఎన్నో మంచి రచనలు ఉన్నాయి. ‘బొద్దెంకలు’ అని ఓ గొప్ప కథానిక ఉంది. బొంబాయి మహానగరంలో పసిపిల్లలతో బిచ్చమెత్తే కరుణరాహిత్య ధోరణి మూలాల్ని స్పృశించిందీ కథానిక. పిల్లలు పుట్టగానే కళ్ళల్లో సూదులు గ్రుచ్చి వాళ్ళని అంధుల్ని చేసి ఈ అడుక్కోవటమనే ‘వృత్తి’కి వాడుకోవడం వినే ఉన్నాం. అయితే ఈ ‘బొద్దెంకలు’ కథానికలో మరీ దారుణంగా మరో నగ్నసత్యం బహిర్గతమవుతుంది. పసిగుడ్డు కళ్ళమీద బొద్దెంకల్ని పెట్టి గుడ్డ కట్టేసి - ఆ పిల్లని వొళ్ళో వేసుకుని అడుక్కోవడం అనే గుండె కోతని కథాత్మకంగా చెప్పారు సోమసుందర్. ఆ బొద్దెంకలు పసిదాని కనుగ్రుడ్డు పొడుచుకు తింటూనే ఉంటాయి. ఆ పిల్ల గిలగిలలాడుతుంటుంది. నోరెరుగని పసికూన మీద జరిగే రాక్షసత్వం అన్నమాట!

‘దేశమంతా గ్రుడ్డివాళ్ళ గుంపులాగ పెద్ద ఆర్తనాదం చేస్తున్నట్టు తోచింది నాకు. దీనజన సముద్రం ఘోషిస్తున్నట్లు వినిపించింది నాకు’ అంటూ ముగుస్తుందీ కథానిక, ఆంధ్ర సచిత్రవారపత్రిక 28.11.1980 సంచికలో పడింది.

‘వజ్రాయుధం’ కవిగా, విమర్శకుడుగా, బహుగ్రంథకర్తగా, నవలా రచయితగా, శతకకర్తగా, అనువాదకుడుగా సోమసుందర్ సారస్వత గిరి వృక్షం. వారి రచనల మీద ఎన్నో పరిశీలనలూ, పరిశోధనలూ వచ్చాయి. కళాకేళి సాహిత్యమాసపత్రిక సంపాదకులుగా కూడా వారి సాహిత్యసేవలోక ప్రసిద్ధం. సోమసుందర్ అందుకున్న ప్రతిభా పురస్కారాలు, సత్కారాలు, సన్మానాలు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. గౌరవ డాక్టరేట్ ని పొందారు. కథానిక రచయితగా కూడా తనదైన ముద్రతో, సాహితీ నిబద్ధతతో ఎన్నో ఉత్తమ కథానికల్ని ప్రచురించారు. 86 వ ఏట కూడా యువరచయిత ల ప్రక్కన, నవతరం రచనల విశ్లేషణతో సాహిత్య కాలరేఖని అధ్యయనం చేస్తున్న మహామనీషి సోమసుందర్. వారి జీవితమూ, సారస్వతమూ రెండూ సమాజగతి శీలానికి ప్రతిస్పందనలుగా సాగిపోతూనే ఉన్నాయు. అస్తు!!
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech