ఫేర్వెల్ రాజేశ్వరి

-యండమూరి వీరేంద్రనాథ్

 


ఒక రాత్రి పదింటికి, అప్పటివరకూ మాగన్నుగా పట్టిన మగతలోంచి బాబుకి అకస్మాత్తుగా మెలకువొచ్చింది. వాడికి భయమెయ్యలేదు. ఇంకో రెండు నెలల్లో చచ్చిపోవటం ఖాయమని తెలిసిన కాన్సర్ రోగి మనసులో నిర్లిప్తతలా ఆ గదిలో చీకటి పేరుకుపోయింది. డబ్బు లేనివాడికి వచ్చే మలేరియా రోగంలా ఆగి ఆగి కురుస్తోంది వర్షం. చచ్చి పోయినవాడి కాష్ఠం తగలబడుతూ వుంటే దూరంగా కూర్చొని చూచే వాడి మనసులో స్మశాన వైరాగ్యంలా నిశ్శంబ్దం ఆ గదిలో పరుచుకొంది. ఇంత విరహాన్ని భరించలేక చూరులో ఎలుక అట్నుంచి ఇటు పరుగెత్తింది. ఐనా భయమెయ్యలేదు. అమ్మ చేతిక్రింది, అమ్మ వెచ్చని కౌగిలిలో వాడికి భయం వెయ్యదు.

ఐనా కడుపునిండా తిని పడుకొన్నవాడికి మెలుకువొస్తే భయం వేస్తుంది.కడుపులో ఏవీ లేనివాడికి మెలుకువొస్తే ఆకలేస్తుంది.
బాబు మనసులో మెదడులో చేపల కదలిక మల్లే ఆలోచన్లు. వాటికి స్పష్టత లేదు.స్పష్టత నివ్వగలిగేటంత వయసులో పరిపూర్ణత బాబుకి లేదు. పక్కకి తిరిగి అమ్మవైపు చూసేడు.
తెల్లటి మాసికలు పడి, పెచ్చులూడిపోయిన ఆ గది గోడల్ని చీకటి ముసుగువేసి కప్పేస్తోంది.
చలిగా వుంది.
నేలకీ,శరీరానికీ మధ్య నిస్సహాయంగా వున్న చాపలోంచి చెమ్మ కొద్దిగా తగుల్తూంటే మూడంకె వేసిపడుకొన్న మనిషిని సూదుల్తో గుచ్చి సంతృప్తి పడే చలి. ఇరవై నాలుగేళ్ళ అబ్బాయిల్నీ, అరవై యేళ్ళ ముసలోళ్ళనీ నిద్రపోనివ్వని చలి. బాబుకి ఇరవై నాలుగేళ్ళు లేవు. వాడికి యేడేళ్ళు, వాడు నిద్రపోకుండా వుండటానికి కారణం చలికాదు. అమ్మ వెచ్చని ఊపిరిలో చలివాడి దరిచేరదు. వాడికి డొక్కల్లో నొప్పి వున్నట్టుండి వస్తోంది. అక్కణ్నుంచి గుండెల వరకూ పాకుతోంది.
బాబుకి అపెండిసైటిస్ లేదు. అదుంటే జనరల్ హాస్పిటల్ లో రెండు రోజులు బ్రెడ్డూ,పాలూ,ఇచ్చి ఆపరేషన్ చేద్దురు.
ఏవీ తినకపోతే మొదటిరోజు ఆకలి విజృంభిస్తుంది. రెండో రోజుకి అది చచ్చిపోతుంది.మూడో రోజుకి డొక్కల్లో చేరి దెయ్యమై పీడించటం మొదలు పెడుతుంది.నిన్నే ఆకలి బాబుకి దెయ్యమైంది.
బల్లెంతో గుచ్చుతున్నట్టూ పక్కల్లో నొప్పికి వెల్లకిలా పడుకున్నాడు. పక్కకి తిరిగేడు, లాభం లేకపోయింది. అప్పుడన్నాడు-’అమ్మా!’
రాజేశ్వరి మాట్లాడలేదు. నిద్రపోవడం లేదు కూడా. ఆలోచిస్తోంది. ఆ గదిలోని తిమిర కల్మషంలోకి "రానా వద్దా". అని సంశయిస్తున్నట్టు వున్న వెలుగు రేఖల్ని తాటాకు సందుల్లోంచి చూస్తూ ఆమె ఆలోచిస్తోంది.
చుట్టూ నాలుగు గోడలూ, పైన కప్పు వుంటే దాన్ని "గది" అనవచ్చు అంటే అది గది. దాని వెనుకే ఇంకో గదిలాంటిది. దాని కప్పుమీద అక్కడక్కడ తాటాకుల్లేవు. అదే వంట గది. ఆ గదిలో కుంపటి వుంది.అది రాజేశ్వరి గుండేల్లోనూ వుంది.
నెలరోజుల క్రితం వరకూ ఆ గదిలో రాజేశ్వరీ, బాబూ, వాడి నాన్న వుంటున్నారు. ఇప్పుడు రాజేశ్వరి. బాబూ వుంటున్నారు. ఇంకొన్నాళ్ళుపోతే వాళ్ళూ వుండరు. ఇంటద్దె ఇవ్వకపోతే.
ఆ గది అద్దె పదిరూపాయలు. నెల తిరిగేసరికి గ్యారంటీగా ఇచ్చెయ్యాలి. ఇల్లు కూలదని గ్యారంటీ లేదు. ఇల్లు ఇన్నాళ్ళకి కూలుతుందని కాదు. పనిచేస్తూ పోయిన భర్త మరణానికి కాంపెన్ సేషన్ ఇవ్వటం ఎగ్గొట్టిన వాళ్ల గురించి కాదు. ఆ ఇంట్లో చేరిన దగ్గర్నుండీ ఎప్పుడు పడితే అప్పుడు కనబడితే చాలు వంకరనవ్వు విసిరే ఎదురింటి సోమేశ్వర్రావ్ గురించి అసలేకాదు. ఇకముందెలా అని.
పదిరోజుల్లో ఇల్లు ఖాళీ చెయ్యాలి. పరిస్థితి అంతవరకూ రాదు. ఇంకో రెండు రోజులు భోజనం చెయ్యకపోతే ప్రాణం పోతుంది. ఈ చీరె చిరిగిపోతే కట్టుకోవటానికి ఇంకో చీరెలేదు. మానం పోతుంది. ప్రాణవూ మానవూ ఒకేసారి పోతే ఫర్వాలేదు. కానీ ప్రాణం పోకపోతే? ఈ వయసు,ఈ శరీరం ఈ మనసు ఈ బాబు ఈ ప్రాణం పోకపోతే తాటాకు సందుల్లోంచి వర్షపు చినుకు మీదపడింది. కొద్దిగా కదిలింది.
"అమ్మా నిద్రరావటంలేదే" అన్నాడు బాబు. మాట్లాడలేదు రాజేశ్వరి. పక్కకు తిరిగి బాబు మీద చెయ్యేసింది. దూరంగా ఎక్కడో ఉరిమింది. బాబుని ఇంకా దగ్గిరగా తీసుకుంటూ "భయమేస్తోందా బాబు" అనడిగింది.
"భయం కాదమ్మా ఆకలి " అన్నాడు బాబు.
ఏడుపు రాలేదు రాజేశ్వరికి. ఆ నాల్రోజుల్లోనూ దాదాప్పదిసార్లని ఉంటాడు ఆమాట.
"కుండలో నీళ్ళుంటాయి. కొద్దిగా తీసుకుని తాగు బాబూ, అర్థరాత్రి పూట ఏం ఉంటుంది."
బాబు లేవలేదు ఒక క్షణంపాటు. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో లేచి వెళ్ళి మంచి నీళ్ళు తాగొచ్చి పడుకున్నాడు. నొప్పి కొద్దిగా తగ్గినట్టనిపించింది. గందరగోళంగా అనుక్షణం స్పందించే సంకీర్ణ ధ్వనుల నుంచి ప్రపంచం విశ్రాంతి తీసుకొంటున్నట్టూ వుంది. రాజేశ్వరి పైకప్పు కేసి చూస్తూనే వుంది. బాబు కొంచెం తల పైకెత్తి అన్నాడు.
"రేపు అన్నం వండుతావా అమ్మా"
రాజేశ్వరి ఉలిక్కిపడింది.
బాబు కళ్లలో ఆశ మసగ్గా మెరిసింది.
"రేప్పొద్దునే వండుతాను బాబూ, సరేనా?"
బాబు క్షణం ఆగి "ఒట్టేనా" అన్నాడు అనుమానంగా. చటుక్కున కొడుకు భుజాల చుట్టూ చెయ్యి వేసి గట్టిగా దగ్గరకు లాక్కుంది. ఎగిరెగిరి పడుతున్న ఆ రొమ్ముల మధ్య ఒక్క క్షణం వెచ్చదనం అనుభవించిన తరువాత తల్లి మొహంవైపు తలెత్తి చూసి బాబూ ఆశ్చర్యంగా అడిగేడు. "ఏడుస్తున్నావా అమ్మా"
ఆ మరుసటి రోజు సాయంత్రం రాజేశ్వరి అన్నం వండింది.
నాల్రోజుల తర్వాత బాబు భోంచేసేడు. వెంటనే నిద్రముంచుకొచ్చింది. ముందుగదిలోకి వచ్చి పడుకున్నాడు. ఆ తర్వాత రాజేశ్వరి భోజనం చేసింది. కంచం ఎత్తకుండానే వచ్చి బాబు పక్కన పడుకుంది.
అమ్మ చేతికింద బాబుకి భయం వెయ్యదు.
బాబు నిద్రలో కదిలేడు కంచం చుట్టూపడిన మెతుకుల్ని తింటోన్న ఎలుక బెదిరింది. అకస్మాత్తుగా రైడింగ్ జరిగితే పరిగెత్తే పెద్ద మనిషిలా ముందుకి దూకి బాబు మీదికి గెంతింది. బాబుకి అకస్మాత్తుగా మెలుకువవొచ్చింది. కళ్ళు విప్పి చూసేడు. బాబుకి ఎందుకో ఆ క్షణం భయం వేసింది.
"అమ్మా "గొణిగేడు.
తాటాకుల్లేని చోటుల్లోంచి ఆకాశం కనబడింది.
కింది చాపలేదు.
చటుక్కున లేచి కూర్చొని చుట్టూ తడిమేడు. అలికిన నేల తగిలింది. అది వంటిల్లు
కుంపటి కంచం వేలుకి అన్నం మెతుకు అంటుకుంది. ఉనికి అనుమానం వేసింది. లేస్తూ మళ్ళీ "అమ్మా" అన్నాడు.
రాజేశ్వరి మాట్లాడలేదు.
రాజేశ్వరి లేదు.
చుట్టూ గోడలు మూసుకుపోతున్నట్టు పైనుంచి ఆకాశం క్రిందికి పడిపోతున్నట్టు తను అఘాతంలోకి జారిపోతున్నట్టు భ్రమ కలిగింది. గోడల మీద వికృతంగా నాట్యం చేసే నీడలు భయంకరంగా తనని చుట్టుముట్టుతున్నట్టు భ్రమ కలిగింది. అడుగు ముందుకు వేసేడు. కాలి బొటన వ్రేలికి గడప తగిలి జివ్వున లాగింది. ఏడుపురాలేదు.
తనకేదో అవమానం జరిగింది. తననందరూ మోసం చేస్తున్నారు. తను లేకుండా రాత్రి సాగుతోంది. తనులేకుండా అమ్మ వుంది. తను లేకుండా ఒక రహస్యం పంచుకొంది. ఏడుపొచ్చింది.
ద్వారం పట్టుకొని "అమ్మా" అన్నాడు.
ఆ కంఠంలో ఆవేదన లేదు. భయం వుంది. గడప దగ్గర నిలబడ్డ బాబుని దూసుకుని బయటకు సోమేశ్వర్రావు వెళ్ళిపోయాడు. బాబు మిగిలేడు. రాజేశ్వరి మిగిలింది. తిమిరం, నీరసం తోడు తోడుగా మిగిలాయి.
రెండడుగులు వేసి లోపలికి వెళ్లాడు.
ముందు మాట్లాడకుండా కమిట్ అయిపోయి, తరువాత యేం చేద్దామా అని ఆలోచించే విటుడి మనసులో సందిగ్దంలాగా నీడలు ఆమె మీద అస్పష్టంగా పడుతున్నాయి.బేరం కుదరక వెళ్ళిపోయేవాడిని చూస్తూ నిలబడ్డ ప్రాస్టిట్యూట్ మనసులో రెపరెపలాడే ఆశలా దీపం మినుక్కు మినుక్కుమని వెలుగుతోంది. దానిచుట్టూ నిశ్చలత్వానికి ఒక ఆకృతి తెచ్చుకొన్నట్టు వుంది.
బాబు ఇంకో అడుగు ముందుకేశాడు. తల్లి పక్కగా మోకాళ్లమీద కూర్చుని కొద్దిగా కంపిస్తోన్న స్వరంతో "భయమేస్తోందే" అన్నాడు.
రాజేశ్వరి కొద్దిగా పక్కుకు జరిగి చోటిచ్చి "ఇలా పడుకో బాబూ" అంది. బాబు స్థలంలో ఇమిడిపోయాడు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుని కళ్ళు మూసుకున్నాడు. నిద్ర రాలేదు. కదిలే చేపల్లా ఆలోచన్లు, స్పష్టతలేని భావాలు, ఆకృతిలేని రూపాలు.
ఏమీలేని శూన్యంలో ప్రచండమైన వేగంతో తిరుగుతోన్న అసంఖ్యాకమైన గోళాల మధ్య పిపీలిక పరిమాణంతో తన వాస్తవం నిలబెట్టుకొనే ఈ చిన్న గోళం దాని మీద ఇన్ని జీవాల స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లో ఒక మారుమూల ఒక పాకలో రెండు ప్రాణులు కాలం గుర్తింపని జీవాలు మనకక్కరలేని వ్యక్తిత్వాలు. మనం చీదరించుకొనే ఈ పరిణామాలు మనం ఆలోచించని వాటి వెనుక పరిస్థితులు.
బాబు అన్నాడు "నువ్వు లేకపోతే నాకు భయమే అమ్మా! ఇంకెప్పుడూ నన్నిలా వదిలిపెట్టకే", మాట్లాడలేదు రాజేశ్వరి, హృదయం బద్దలవకుండా నిర్లిప్తత కోట కట్టింది.
"చెప్పమ్మా" వత్తిడి చేశాడు.
ఆర్తి ఆవర్ణమైతే దానికి చెలియలికట్టేది? అతడ్ని దగ్గరగా తీసుకుని, "వదిలిపెట్టను సరేనా ఇక పడుకో" అంది.
బాబు కళ్ళు మూసుకున్నాడు. ఈ లోకంలో అన్యాయాన్ని సాగనివ్వనట్టు బీటు కానిస్టేబుల్ విజిల్ వినపడింది. దీనికి జవాబుగా దూరంగా తీతువుపిట్ట ఒకటి వికృతంగా అరుస్తోంది. బాబు కళ్ళు తెరిచి, తల్లివైపు తిరిగి అడిగేడు "రేపు అన్నం వండుతావా అమ్మా".

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech