తాగాం.. ఆడాం... ఓడాం

 

 

మాటవరసకి మీ ఇంట్లోనే వెంకటేశం ఉన్నాడు. ‘‘వెధవాయా, ఈసారైనా పరీక్ష పాసైనావా’’ అని మీరడిగితే ‘‘రాత్రంతా పార్టీలాయె. తెల్లవార్లూ తాగితందనాలాడితే చదువుమీద ధ్యాస ఎక్కడుంటుంది? అందుకే పరీక్ష పోయింది’’ - అన్నాడనుకోండి. మీకు అరికాలిమంట నెత్తికెక్కదా? బుద్ధిగా చదువుకోరా అని పంపిస్తే పార్టీలంటావేమిటిరా? పరీక్ష రోజుల్లో కూడా రాత్రుళ్లు బలాదూరు తిరుగుళ్లేమిటి? వాటివల్ల పరీక్ష తన్నిందని సిగ్గులేకుండా చెప్పుకోవటమేమిటి? - అని లాగి లెంపకాయకొట్టరా? మరి అవేరకం సాకులు మన ఆరాధ్యదైవాలైన క్రికెట్ హీ(జీ)రోలూ జంకు లేకుండా చెబుతున్నారు కదా? వారినేమిటి చేద్దాం?!
* * *
క్రికెట్ ఆటకు బ్యాటు, బాలుతోనే పని అని ఇంతదాకా అనుకుంటున్నాం. రెంటికీ నడుమ బాటిలు కూడా ఉంటుందని స్కిప్పర్ ధోనీగా వల్ల ఇప్పుడు లోకానికి వెల్లడైంది. ‘‘రాత్రి పొద్దుపోయేదాకా .పి.ఎల్. మ్యాచిలాడి, మందుపార్టీల్లో తెల్లవార్లూ తాగి, మర్నాడే ప్రయాణం చెయ్యాల్సివస్తే ఒళ్లు పులిసిపోదా? టి20 వరల్డ్‌కప్‌లో మేము అంత చిత్తుగా ఓడిపోవటానికి అదిగో ఐపిఎల్ పార్టీలే కారణం’’ అన్న ధోనీ బాబు విచిత్ర వివరణ వింటే చాలా డౌట్లు వస్తాయి. రాత్రి పొద్దుపోయేదాకా ఆడినా, వెంటనే పార్టీకి పోయి నిష్ఠగా చెడ తాగాలని .పి.ఎల్.లో కండిషను ఏమైనా ఉందా? మందు పార్టీకి చచ్చినట్టు వచ్చి తీరాలని ఆడలేని ఆటగాళ్లను ఎవరైనా బలవంతం చేశారా? పోనీ తమను బోలెడు డబ్బుపెట్టి కొనుక్కున్న ఫ్రాంచైజిలు పిలిస్తే పార్టీకి పోకుండా ఎవరైనా ఎలా ఉండగలరని కాసేపు అనుకుందాం. మన వాళ్లలాగే ఫారిన్ ఆటగాళ్లూ అవే పార్టీలకు పోయి పూటుగా పట్టించారు కదా? టి20 వరల్డ్‌కప్‌లో వాళ్లంతా బాగానే ఆడుతున్నారు కదా? దీనికేమనాలి?
ఐనా- ఐపిఎల్ మ్యాచిలు ఎప్పుడో ఏప్రిల్ 25నే ముగిసాయి. మన వీరులు ప్రపంచాన్ని జయించటానికి 28 వెస్టిండీస్ వెళ్లారు. వెళ్లాక మూడు రోజులు హాయిగా తొంగున్నారు. తర్వాత రెండు మ్యాచిలు ఆడారు. గెలిచారు. మళ్లీ నాలుగురోజులు రెస్టు తీసుకున్నారు. ఐపిఎల్ పార్టీల మత్తు దిగటానికి, అప్పటి ప్రయాణబడలిక తీరటానికి ఇనే్నసి రోజులు సరిపోవా? పొరపాటున సూపర్8లో అడుగుపెట్టాక వరసగా మూడు ఆటలూ మహా నిర్లక్ష్యంగా ఆడి, పరమదారుణంగా ఓడి సెమిఫైనల్స్‌కు కూడా వెళ్లకుండానే మొగాలు వేలాడేసుకుని ఇంటిమొగం పట్టాక... ఎందుకు ఓడారయ్యా అంటే .పి.ఎల్. పార్టీలవల్ల, రోజుల్లో వరస ప్రయాణాలవల్ల అని జట్టు నాయకుడు కథలు చెప్పటం ఎంతగొప్ప జానతనం?! మైదానం ఆనుపానులను గ్రహించటానికి వీలున్నా ప్రాక్టీసు చెయ్యక, పిచ్ పరిస్థితిని బట్టి వ్యూహం పన్నక, బ్యాటింగ్ ఆర్డరును సరిగా ఉంచక, ఫామ్‌లో లేని ఆడగాళ్లతో తత్తిబిత్తిగా ఆడి ప్రపంచ గోదాలో ఏడూ బొక్కబోర్లపడిన ప్రతాపానికి ధోనీగారి భాష్యం దేశంలోని క్రికెట్ భక్తులందరూ పటంకట్టి పూజించదగ్గది!!
ఏప్రిల్ 27 వెస్టిండీస్ చేరగానే ‘‘మేమంతా ఫ్రెష్‌గా ఉన్నాం; ఫామ్‌లో ఉన్నాం’’ అని ఎం.ఎస్.్ధనీ స్వయంగా ప్రకటించాడు. కాబట్టి ఆనాటికి .పి.ఎల్. మందంతా దిగిపోయి, అంతా బాగున్నారనే అనుకోవాలి. మే 11 శ్రీలంక చేతిలో శృంగభంగమయ్యాక అర్ధరాత్రి పార్టీలతో అలిసిపోయాం అన్నాడు. కాబట్టి సదరు పార్టీలన్నీ కరేబియన్ నైట్‌క్లబ్బుల్లోనో, పబ్బుల్లోనో నడిచినవని స్పష్టం. శ్రీలంక చేతిలో పచ్చడి అయ్యాక కూడా నెత్తిన చెంగేసుకుని ఏడవకుండా మనవాళ్లు దగ్గర్లోని పబ్బుకు పరిగెత్తారు. ఓడినందుకు ఒళ్లుమండిన అభిమానులు అక్కడ అల్లరి పెడితే వాళ్లతో గొడవపడ్డారు. అబ్బెబ్బే గొడవ ఏదీ జరగలేదన్న యువరాజ్‌సింగ్ మాటలనుబట్టే పబ్బుకు పోయి తాగిన మాట నిజమని తేలిపోయింది. .పి.ఎల్. మ్యాచిల్లో కూడా ధనాధన్ ధోనీ నాయకత్వంలో హర్భజన్‌సింగ్, యువరాజ్ సింగ్, వీరేందర్ సెవాగ్ వగైరాలు ఎన్నిసార్లు ఎవరికీ చెప్పకుండా హోటల్ నుంచి రాత్రి మాయమై ఎక్కడో తిరిగి తెల్లవారుజామున ప్రత్యక్షంకాలేదు? అదే దినచర్యను తు.. తప్పక వెస్టిండీసులోనూ పాటించారు. పోయిన అసలు పని చెడగొట్టి ఆటను తగలెట్టారు. అయినా వారిని తప్పుబట్టి ప్రయోజనమేమిటి? మైదానంలో ఆడలేకపోతేనేమి, పబ్బుల్లో తాగి తందనాలు బాగానే ఆడారు కనుక జట్టును ఏమీ అనేదిలేదు; కెప్టెనుగా ధోనీని మార్చేదీ లేదు అని దేశంలో క్రికెట్‌ను కడతేర్చటానికి పుట్టిన కంట్రోలు బోర్డే తెగేసి చెప్పినప్పుడు తాగుబోతు ఆటగాళ్లను ఆడిపోసుకోవమెందుకు?
* * *
క్రికెట్‌లో ప్రపంచ కప్పులు మనవాళ్లు ఎప్పుడోకాని గెలవరు. పావు శతాబ్దం కింద కపిల్‌దేవ్ గెలుచుకొచ్చిన కప్పు గురించే ఇప్పటికీ అబ్బురంగా చెప్పుకుంటుంటాం. ఇదే మన పుణ్యభూమిలో విశ్వనాథన్ ఆనంద్ అనేవాడు ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ని 2007 నుంచీ ఒంటిచేత్తో వరసగా గెలుస్తున్నాడు. ఏడు బూడిదమబ్బులు అడ్డొచ్చి విమానం మధ్యలో ఆగిపోతే ఏకబిగిన 40 గంటలు రోడ్డుమీద ఒళ్లు హూనమయ్యే ప్రయాణంచేసి, బల్గేరియా చేరుకుని, రెస్టన్నది లేకుండా చదరంగం బల్లముందు కూచుని, విపరీతమైన ఒత్తిడిని తట్టుకుని అద్భుత ఏకాగ్రతతో బల్గేరియా వాడిమీదే ఆడి చాంపియన్‌గా నిలిచాడు. అతడు పడ్డ ప్రయాసతో పోలిస్తే... మన క్రికెట్ సుకుమారుల బడలిక ఏపాటి? అయినా- ఇరవైఏళ్లుగా ఇంతే గొప్పగా ఆడుతూ, దేశానికి పేరు తెచ్చి, చదరంగంలో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన విశ్వనాథన్ ఆనంద్ మనకంటికి ఆనడు. హాకీలో ప్రపంచ చాంపియన్లయిన ఆస్ట్రేలియాను మన జట్టు పల్టీకొట్టించి ట్రోఫీ గెలుచుకొచ్చినా మనం పెద్దగా గర్వపడం. మన దృష్టిలో ఆటంటే - డబ్బుచేసిన క్రికెట్టు ఒక్కటే. మొదట్లో కాస్త బాగా ఆడి, భారత జట్టులో చోటు సంపాదించగానే నానా అవలక్షణాలకు లోనై, కమర్షియల్ ఎండార్స్‌మెంట్లూ, అడ్వర్టయిజ్‌మెంట్ల రంధిలోపడి, కోట్లకు కోట్లు సంపాదన మరిగి, మాచ్ ఫిక్సింగులతో గబ్బుపట్టి, బెట్టింగు మాఫియాలు అడించినట్టల్లా ఆడి, అంతర్జాతీయ బరిలో సాధారణంగా ఓడే క్రికెటర్లే మన పాలిట దేవుళ్లు. మనల్నిబట్టే మన దేవుళ్లు!
-

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech