ఏకదంతుని అనేక రూపాలు

 

 - విద్వాన్ తిరుమల పెద్దింటి నరసింహాచార్యులు

 

 

సకల దేవతల స్వరూప,స్వభావాలు తొలుత వేదాలలో కనబడతాయి.తరువాత పురాణాలు, ఉపనిషత్తులు వివరించాయి. ముందుగా ఋగ్వేదంలో’అగ్నిమీఠ పురోహితం’అన్న మంత్రంలో అగ్ని తొలుత సృజించబడింది.తదుపరి మిగతా దేవతల సృష్టి జరిగింది.గణాధిపతి అయిన గణపతిని గూర్చి తొలుత పూజించే దేవతగా కీర్తించబడింది.నిర్విఘ్నంగా కార్యసిద్ధి జరగాలంటే గణపతి పూజ తప్పక చేయాలి అనే నమ్మకం,ఆచారం అంతటా వ్యాపించడానికి కారణం గణపతికి సంభందించిన మహిమాన్వితమైన కధలు,గాధలు మనకు పురాణాలలో కనిపిస్తాయి. గణపతి జననం, ఆకారం, వాహనం గూర్చి అనేక పురాణాలు వేర్వేరు విధాలుగా వర్ణించాయి.అవి వినాయకుని గొప్పతనాన్ని తెలిపేవిగా కనబడతాయి.వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం.

’గ’ అనగా బుద్ధిని ’ణ’ అనగా జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కనుక ’గణపతి’అని నాయకుడు లేనివాడు లేదా తానే అందరికీ నాయకుడు కనుక ’వినాయకుడని’ సర్వాన్ వినయతి హితమను శాస్త్రీతి వినాయకః అందర్నీ వినయవంతులుగాను, హితమును బోధించువాడు కనుక ’వినాయకు’డని పురాణాలు నిర్వచించాయి.
వివిధ నామాలతో పిలువబడే వినాయకుడి జన్మ పురాణాలు చూస్తే.......

స్కాంధ పురాణంలో శివపార్వతుల తపోశక్తితో ప్రణవాక్షరమైన ఓంకారమే గణపతిగా రూపుదాల్చెనని తెల్పబడింది, తొండము, బొజ్జ,ఓంకార రూపంగా దర్శనమిస్తాయి. ‘వరాహపురాణంలో శివుడు ఒకరోజు ఆలోచనాపరుడై ఆకాశం వైపు చూడగా’జలమునుకును పృధ్వికిని రూపములు కలవు. ఆకాశమునకెందుకు లేవు అని తలంచి పార్వతిని చూచెనట. వెంటనే ఆకాశము పుత్రుని రూపంలో వారికి కనపడినదని, ఆ బాలుని రూపం మిక్కిలి సుందరంగా ఉండుటచే పార్వతి కూడా వానిని చంచల చిత్తముతో చూచుటచో శివుడు కోపించి ఆ బాలునికి ఏనుగుతల,బొజ్జకలవానిగా కమ్మని శపించగా ఆ రూపమేర్పడినదని పార్వతి వేడుకొనగా గణాధిపతిగా చేసెనని వున్నది.

బ్రహ్మవైవర్త పురాణంలో శివపార్వతులు క్రీడించుచుండగా దేవతలు రాగా వీరి క్రీడకు భంగం కలుగుటచే శివుని వీర్యము నేలపై పడి అందుండి పుత్రుడు పుట్టెను.పార్వతి ఆ బాలుని శివునికి చూపగా, శివుడు చూసిన చూపులకు ఆ బాలుని తల ముక్కలు కాగా పార్వతి దుఃఖించుచుండగా ఆమె దుఃఖాన్ని పోగొట్టడానికి దేవతలు పుష్పభద్ర తీరమున నున్న ఏనుగు తలను తెచ్చి అతికించి వరము లొసంగనెనియు ఆ బాలుడే గజాణనుడిగా ప్రసిద్ధి చెందెననియు వివరించబడెను.

వినాయక పురాణంలో పరబ్రహ్మే పది బాహువులతో అవతరించి వేదాలు, దొంగలించిన ‘కమలాసురుడ’ను రాక్షసుని సంహరించి ‘మహా గణపతి’ గా అవతరించెనని తెల్పబడెను.

మత్స్య పురాణంలో:(నేడు లోక ప్రసిధ్ధమైన) పార్వతీదేవి పిండితో బొమ్మను చేయుట,శివుడు ఆ బాలుని తలనరుకుట,ఏనుగు తలతెచ్చి అతికించుట,దేవతలు వరములొసంగి గణాధిపతిని చేసిన కథ వివరించబడింది.

బ్రహ్మాండ పురాణం పార్వతీదేవి కామేశ్వరుని ముఖము తదేక దీక్షతో చూడగా గణపతి జన్మించెనని చెబుతోంది.బ్రహ్మ వైవర్తపురాణంలో విష్ణువే వినాయకునిగా అవతరించెనని తెల్పబడింది.వినాయక చవితినాడు తప్ప అన్ని శుభకార్యములందు గణపతిని పసుపు ముద్దతో చేసి పూజించు ఆచారం ఉంది. ఆంధ్ర కావ్యాలలో నన్నెచోడుడు రచించిన ‘కుమారసంభవం’లో గణపతి జననగాధ సహజసిద్ధంగా యుక్తి యుక్తంగా వున్నది. ఇది ప్రమాణము కాకున్నా చాలా మనోహరంగా వర్ణించబడెను.అది శివపార్వతులు వన విహారమునకు వెళ్లగా అచట గజకేళిని చూసి పార్వతి మనసులో కోరిక కలుగగా,శివుడు అంగీకరించి శివపార్వతులు గజరూపం ధరించి కామకేళి సలుప గజాననుడు ఉద్భవించెనని తెలిపెను.

గణపతి రూపమును పెద్దలు ఇలా నిర్వచించారు. పెద్ద శిరస్సు బుద్ధికి సంకేతము.మూషికము తెలివికి, పాము శక్తి స్వరూపమునకు,ముల్లు కర్ర,కొరడా బుద్ధి హీనతలు పారద్రోలుటకు,జపమాల మంత్ర ప్రాముఖ్యతమునకు మానసికాభివృధ్దికి , విరిగిన దంతము ఘంటముగాను, పెద్దబొజ్జ సర్వసృష్టికి మూలమని వివరించారు.

బ్రహ్మాండపురాణంలో వినాయకుడు ఏకదంతునిగా మారుటకు పరశురాముడు శివుని చూచుటకు రాగా గణపతి అడ్డగించాడని, అపుడు వారిద్దరి మధ్య యుద్దం జరగగా పరశురాముడు పరశువుచే కొట్టగా ఒక దంతము విరిగెననియు,అప్పటినుంచి ఏకదంతునిగా ప్రసిద్ధి గాంచెను అని ఉన్నది. వ్యాసుడు భారతం వ్రాయమని గణపతిని కోరగా ఒక దంతము పెరికి ఘంటముగా ఉపయోగించి భారత రచన చేసెనని, అమర వ్యాఖ్యానకారుడు, కుమారస్వావి ఒక దంతమును పెరికివేసెనని ప్రాచీన గ్రంథాలలో కలదు.

అనేక వరములొసగెడి ఏకదంతుని గొప్పతనమును ‘స్థాలీపులాక న్యాయము’ గా వివరించబడెను ఇంకా గణపతిని సస్యాధి దేవతగా వర్ణించారు. పార్వతిని భూమిగాను, శివుని సూర్యునిగాను సూర్య స్పర్శచే భూమి నుంచి పుట్టిన సస్యమును గణపతికి ప్రతిరూపముగా తెలిపి శివుడు వినాయకుని తల నరుకుట,కొడవలితో సస్యమును కోయుటకు సంకేతంగా తెలిపిరి. అలాగే మూషికము పంటకి విరోధి కనుక గణపతి దానిని అణచి వుంచెనని,వరివెన్ను,గరికెతో(పత్రితో)చేసే పూజ వరిపిండితో వండిన వుండ్రాళ్లు వినాయకునికి ప్రీతికరమగుటకు సస్యాది దేవత అగుటయే కారణమని విశదీకరించబడెను.ఇలా వినాయక వైభవమును గూర్చి తెలిపిన మహానుభావులు సత్ఫలితములనొంది తరించిరి.మనము కూడా గణేశుని పూజించి తరింతుము. జై గణేశ.

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech