తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత నాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిస్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.


వీణా విద్వాంసుడు, మహా మహోపాధ్యాయ పద్మశ్రీ డాక్టర్ ఈమని శంకర శాస్త్రి


వైణికుల కుటుంభంలో జన్మించి, వీణా నాధ సాధనలో నిమజ్ఞమై సర్వోచ్చ శిఖరాలను అధిరోహించారు ఈమని శంకర శాస్త్రి గారు. సంగీత నాటక అకాడమి పురస్కారం అనుదుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ గౌరవం లభించింది. ఆల్ ఇండియా రేడియో శంకర శాస్త్రి గారి వీణా వాదనలు అనేక మార్లు ప్రసారం చేశింది. ప్రముఖులు ఈమని గారికి " చతుర్ధండి పండిత" బిరుదునిచ్చి గౌరవించారు.

ఈమని శంకర శాస్త్రి గారు సెప్టెంబర్ 23, 1922 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం లో వైణికుల కోవలో జన్మించారు. వీరి తండ్రి వైణిక భూషణ వీణా ఆచార్య ఈమని అచ్చుత రామ శాస్త్రి గారు.

కాకినాడ పిఠాపురం మహారాజ కళాశాలలో బి ఏ డిగ్రీ పూర్తి చేశారు. పంతొమ్మిదవ ఏట, కాకినాడ దశరా వేడుకల్లో తన ప్రప్రధమ కచేరి నిర్వహించారు.

చిన్నతనంలోనే వైణిక విద్యను తన తండ్రిగారి వద్ద అభ్యసించారు. క్రమేపి వారి ప్రజ్ఞా పాటవాలు వెల్లి విరిశాయి. స్రోతలను రంజింపజేశారు. 1959 లో ఆల్ ఇండియా రేడియో, మద్రాసు కేంద్రంలో ప్రొడ్యూసర్ గా పనిచేశారు. అక్కడ నుంచి అంచలంచెలుగా ఎదిగారు శంకర శాస్త్రి గారు. మద్రాస్ మ్యూసిక్ అకాడమి లో నిపుణుడిగా ఉన్నారు.

పండిత్ రవిశంకర్, ఉస్తాద్ హాలిం జఫర్ ఖాన్ తో కలసి సంగీత కచేరిలు నిర్వహించారు. జుగల్బందీలు చేశారు.

ప్రముఖ వీణా విద్వాంసులు శ్రీ చిట్టిబాబు గారు కూడా వీరి శిష్యులే. సినీ సంగీత దర్శకుడు పాలగుమ్మి విశ్వనాధం, వి సరస్వతి, ఎం యై కామ శాస్త్రి, ఎస్ ఎన్ సత్యమూర్తి గారు కూడా వీరి శిష్యులే. శాస్త్రి గారి కుమార్తె ఈమని కల్యాణి వీణా విద్యనభ్యసించి మంచి ప్రావీణ్యం సంపాయించారు. నేడు కల్యాణి గారు ఏ ఐ ఆర్ లో ఆర్టిస్ట్ గా ఉండి శంకర శాస్త్రి గారి పందాలోనే నడుస్తున్నారు.

ఈమని శంకర శాస్త్రి గారు కట్టిన రాగాలలో - " జగదానందకారకా", " రఘువంశ సుధాంభుది ", " ఎందరో మహానుభావులు ", " బ్రోచేవారెవరురా ", " మంత్రపుష్పం ", "వాతాపి గణపతిం భజే" ఉన్నాయి. కొన్ని తెలుగు, తమిల, హిందీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. లలిత గీతాలకు, భజన్లకు కూడా స్వరాలు కట్టారు. వీణ పై వేద మంత్రాలు పలికించారు. " గమకములను" సుష్పష్టముగా నిర్వహించిన మహావిద్వాంసుడు. శ్రీ చిట్టి బాబు గారు కూడా ఈ క్రమమునే అనుకరించారు. "పంచ దశ గమకములు ", దశ విద గమకములు " శాస్త్రి గారి ప్రత్యేకతలు.

గమకాల మీద, అనుస్వరాల మీద శంకర శాస్త్రి గారు అనేక ప్రసాంగాలు చేశారు. అటు పండితులను ఇటు పామరులను రంజింప చేసిన వారు శంకర శాస్త్రి గారు. శంకరాభరణం రాగమాలాపించడం లో శాస్త్రి గారు ఒక ప్రత్యేక ఒరవడి సృస్టించి అందరినీ ఆకర్షించారు.

శ్రీ ఈమని శంకర శాస్త్రి గారు వీణా ప్రావీణ్యుడిగా ఉత్తర అమెరికా, యూరోప్ లో విభిన్న దేశాలలో కచేరీలు నిర్వర్తించారు. అనేక సభలు నిర్వహించి, గౌరవ మన్ననలు అందుకున్నారు. సి బి ఎస్, ఫ్రాన్స్ శాంకర శాస్త్రి గారి కార్యక్రమం ప్రసారం చేశింది.

అవార్డులు, గౌరవాలు:

ఈమని శంకర శాస్త్రి గారు ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు అన్ని పట్టణాలలో కచేరీలు నిర్వహించారు. అనేక సంస్థల ఆదరణ, మన్ననలు అందుకున్నారు. వారు పొందిన గౌరవాలు, అవార్డులలో కొన్ని ముఖ్యమైనవి:

- 1973 లో సంగీత నాటక అకాడమి అవార్డు అందుకున్నారు
- 1974 లో భారత ప్రభుత్వం నుండి కళల క్షేత్రంలో విశిష్ఠ సాధనకు పద్మశ్రీ గౌరవం అందుకున్నారు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా గైకొన్నారు
- శంకరాభరణం రాగం తనదైన రీతిలో బాణీ కట్టి, యునెస్కో సంస్థ నుండి ఏషియన్ రోస్ట్రం అవార్డు శ్రీకరించారు
- సంగీత ఆస్వాధకులు, న్యూ యార్కు లో శాస్త్రి గారికి " వీణా వర్చుసో" గౌరవాన్ని ఇచ్చారు
- 1980 లో రోం, ఇటలీ లో నిర్వహించిన పాన్ ఏసియాటిక్ మ్యూసిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి "కళాప్రపూర్ణ" గౌరవం అందుకున్నారు

ప్రముఖ వైలిన్ విద్వాంసుడు యెహుది మెనుహిన్ నిమంత్రణ మేరకు, 1974 లో పారిస్ నగరం లో నిర్వహించిన అంతర్జాతీయ సంగీత మండలిలో పాల్గొన్నారు.


డిసంబర్ 23, 1987 లో గుంటూరు లో నాగార్జున సాంస్కృతిక సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో కళాభిమానుల గౌరవ మర్యాదలు అందుకున్నారు. తన శిష్యుడు శ్రీ చిట్టి బాబు గారి చేతుల మీదుగా సభలో గౌరవం అందుకున్నారు. అక్కడ నుండి మద్రాసు (నేటి చెన్నై) కి సర్కార్ ఎక్స్ ప్రెస్ రైలు లో వెళుతూ నిద్రలో తన తుది స్వాస విడిచారు. శంకర శాస్త్రి గారు కట్టిన అనేక రాగాలు, సంగీత నిధి సీ డీ ల రూపం లో ఇంకా సౌలభ్యమవుతూ ఉన్నాయి. వారి వీణానాదం స్రోతలకు స్రవణానందకరముగా ఉండి అచిర కాలం నిలచిపోతుంది. వీణా నాద సాధనలో వారి జీవితం పరిపక్కం చెందింది. వారు ధన్య జీవులు.

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech