గాంధారీ సిండ్రోం

 

 

"దేవుడెంతో స్వార్థపరుడు. తానూ మగవాడే కదా, అందుకే కష్టాలన్నీ ఆడాళ్ళ మొహం మీద కొట్టాడు. పుట్టినప్పటినుంచీ పెళ్ళయ్యే దాకా, ఆ తరువాత పిల్లలు పుట్టే దాకా, ఆ పైన వాళ్ళని పెంచడం... నిజంగా ఎంత యాతనో మగవాళ్ళకేం తెలుస్తుంది?" అంటూ కూర్చుంది ఒక పాతికేళ్ళ యువతి. ఆమె పొత్తిళ్ళలో ఒక బాబు ఉన్నాడు.
"నిజమే, ఆడవాళ్లకి కష్టాలెక్కువే. అందుకే మీకు భగవంతుడు ఎంతో సహనం ఇచ్చాడు..." అని సపోర్టు చేస్తూ కౌన్సిలింగ్ ప్రారంభిస్తుండగా మధ్యలో అడ్డొచ్చింది.
అవునులెండి. మీరూ మగవాడే కదా! కష్టాలు మాకే. అన్నిటికీ ఓర్చుకుంటూ సహనం కూడా మాకే" విసుగ్గా అంది.
"సరే తల్లీ. ఇంతకీ నీ సమస్య ఏమిటో చెప్పు. నేను నీకు ఏ రకంగా సహాయం చేయగలననుకుని వచ్చావు?" అని అడిగాను.
"నా సమస్యకు మీ దగ్గర పరిషారం ఉంటుందనుకోను. కానీ నా కొలీగ్ మిమ్మల్ని సంప్రదించమని చెప్తే వచ్చాను. నాది పెద్ద సమస్య కాదు. అందరు తల్లులకు ఉండేదే. కానీ వారందరూ బాగానే మేనేజ్ చేసుకుంటున్నారు. సమస్యలన్నీ నాకే."
మనసుతో సరైన ఒప్పందం లేని వాళ్లు ఇలాగే మాట్లాడుతారు. తామేం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో కూడా గుర్తించలేరు. నా వద్ద పరిష్కారం ఉండదని తెలిసీ కూడా, ఫ్రెండ్ సలహాపై వచ్చిందట. తనది పెద్ద సమస్య కాదు కానీ, సమస్యలన్నీ తనకే వున్నాయట. ఇటువంటి తత్త్వం కలవారు కష్టసుఖాల్లోని తేడాను గుర్తించలేరు. రెండింటినీ కష్టాలుగా భావించి "స్వసానుభూతి"ని పెంచుకుంటారు.
"నాకు ఆర్నెల్ల బాబు వున్నాడు. నేనో ఉద్యోగం చేస్తున్నాను. వీడిని బేబీకేర్ సెంటర్లో పెట్టాలంటే గిల్టీగా ఫీలవుతున్నాను."
"మీరన్నది నిజమే. కానీ కుదరనప్పుడు మనమేం చెయ్యగలం? ఏదో రకంగా అడ్జెస్ట్ అవ్వాలి కదా!"
"బేబీసెంటర్లో పడేయమంటారా నా బిడ్డని? అక్కడ పనిచేసేవాళ్లు డబ్బుకోసం పనిచేస్తారు తప్ప ప్రేమా గీమా వుండవు." అని గయ్ మని లేచింది.
"చూడమ్మా! నువ్విలా అన్నిటికీ ఆవేశం తెచ్చుకుంటే నష్టపోయేది నీవే. నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా వున్నాను. కాదు, కుదరదు - నేను వాదించడానికే వచ్చాను అంటే నువ్వు ఏ లాయరు దగ్గరికో వెళ్లు" అన్నాను.
"అది కాదండీ. ఇప్పుడు ఈ పసిపిల్లవాడిని, బేబీసెంటర్లో వేస్తే, వాడికి పెద్దయ్యాక మా మీద కోపం రాదా? వాడు ఆ కోపంతో మమ్మల్ని సరిగా చూస్తాడంటారా?"
"అది తర్వాత చెప్తాను. ఇంతకీ మీ ఆయన ఏం చేస్తుంటారు?"
"ఆయన ఇక్కడ ఓ ఫ్యాక్టరీలో ఇంజనీరుగా ఉన్నారు. ఆయన పదింటికి వెళ్తే రాత్రి ఏడుగంటలకి వస్తారు. ఆయనకు ఫ్యాక్టరీలో క్షణం తీరిక దొరకదు. ఈ చంటాడిని పగలు నేను తప్ప ఇంకెవరూ చూడరు. అదే నా సమస్య!"
"పోనీ, కొంతకాలం మీ అమ్మగారో, అమ్మమ్మ లాంటి వాళ్లనో బతిమాలి ఉంచుకోవచ్చు కదా!"
"ఆ ప్రయత్నం కూడా జరిగింది. కానీ మా ఆయనకి మా వాళ్లంటే పడదు. మా అమ్మని తెచ్చుకుంటానంటే 'నథింగ్ డూయింగ్. కావాలంటే మా అమ్మని పిలిపిస్తాను ' అన్నాడు." అంది.
"మరింకే! మీ సమస్య తీరిపోతుంది కదా! ఆవిడకి మీ బాబుని అప్పగించండి."
"మా అత్త ఎంత దుర్మార్గురాలో మీకు తెలియదు. ఆవిడ పెంపకంలో నా కొడుకు పెరిగితే వాడు రాక్షసుడైపోతాడు."
"మరి మీ ఆయన, ఆవిడ పెంపకంలో పెరిగినవాడే కదా!" అన్నాను నవ్వుతూ.
"అవును. మీకు నవ్వులాటగానే వుంటుంది. నా సమస్యల్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఈ భూప్రపంచంలో..." అంది కళ్లనీళ్లు పెట్టుకుంటూ.
"చూడమ్మా! నీది గాంధారి మనస్తత్త్వం లాగా వుంది. కళ్లున్నా చూడడానికి ఇష్టపడటం లేదు. సాధించడానికి నడుంకట్టుకోవడం లేదు. పూర్తి అడ్రసు లేని ఇంటికోసం వెదుకుతున్నట్టుగా వుంది. అత్తగారంటే పడదు, బేబీసెంటర్ల వాళ్ల పని నచ్చదు. పిల్లడిని చూసుకునేవారు కావాలి. ఉద్యోగం వదలాలని లేదు. ఇలా సమస్యల్ని పెంచుకుపోతే ఎలా? ఎక్కడో ఒక చోట రాజీపడాలి. ఇలా అడిగానని మరోలా అనుకోవద్దు. నువ్వు ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందులు వలన చేయాలనుకుంటున్నావా? కాలక్షేపం కోసం చేయాలనుకుంటున్నావా? నీ ఉద్యోగం ప్రభుత్వపరమైనదైతే సెలవు పెట్టొచ్చు."
"పెద్దగా ఆర్థిక ఇబ్బందులు లేవు. ఆయన జీతం సరిపోతుంది. ఎం.కాం. చదివి వేస్టు కదా. అందుకని ఉద్యోగం చేస్తున్నాను."
"ఇప్పుడు బాబు ఇంట్లో వున్నాడు కదా! వాడికి మూడేళ్లు వచ్చేవరకు నువ్వే చూసుకుంటే అద్భుతంగా వుంటుంది. నీకు తృప్తిగా కూద వుంటుంది."
"అంటే ఇంట్లోనే కూర్చుని వాడికి, ఆయనకి సేవలు చెయ్యమంటారా? మీ మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు." అంది కోపంగా.
"అమ్మా! తల్లీ! నీతో వాదించడం నా వల్ల కాదు. నీ సమస్యకు పది పరిష్కారాలున్నాయి. కానీ నువ్వు దేనికీ అంగీకరించవు. పరిష్కారం వెదికే ప్రయత్నం చేయడం లేదు. మీ ఆయన్ని కూడా తీసుకొస్తే ఇద్దరితో మాట్లాడుతాను." అన్నాను.
ఓ రోజు భర్తతో కలిసి వచ్చింది. అతనితో మాట్లాడి, చివరకు ఒక సలహా ఇచ్చాను. అతను అంగీకరించాడు. దాంతో వారి సమస్య శాశ్వతంగా పరిష్కారమయింది.
"చెప్పాను కదా! ఆమెది గాంధారి సిండ్రోం, అంటే కళ్లున్నా చూడడానికి ఇష్టపడదు." అన్నాను. ఇద్దరూ నవ్వారు.
ఇంతకీ భర్తకిచ్చిన సలహా చెప్పలేదు కదా! వెరీ సింపుల్! భర్త ఫ్యాక్టరీలో నైట్ డ్యూటీకి మార్పించుకున్నాడు. పొద్దున్న ఆవిడ ఉద్యోగానికి వెళ్లి వస్తుంది. దట్సాల్. బహుశా ఇది అందరి విషయంలో సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రయత్నిస్తే అన్నిటికీ పరిష్కారాలు పుష్కలంగా వుంటాయి.
 

 
 

Dr. బి.వి. పట్టాభిరాం:

బీ వీ పట్టాభి రాం, పరిచయం అక్కర్లేని పేరు...ఎన్నో ఏళ్ళుగా మేజిక్ రంగం లోనూ, ఇటు సైకాలజీ రంగంలోనూ తనదైన ముద్రతో ఎంతో మందికి స్ఫూర్తి కలిగించే అద్భుతమైన రచనలు అందిస్తూ, అనేక మంది యువతకి లక్ష్య సాధన వైపుకు నడిపించే ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న డాక్టర్ బి.వి. పట్టాభిరాం రచనల సమాహారం ఈ "పట్టాభిరామాయణం".

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech