కృతజ్ఞతలు


 సుధాముడు అనే యువకుడు ఒకనాడు నిక్షేపరాయుడిని కలుసుకున్నాడు. తనకు ఏదైనా పని ఇప్పించమని కోరాడు. ఆ కుర్రవాడు సజ్జనుడిలా కనబడటంతో నిక్షేపరాయుడు మంత్రి వివేకుడిని పిలిపించాడు. అతనికి తగిన పని ఇప్పించమని చెప్పాడు. రాజు ఆదేశం ప్రకారం సుధాముడికి తన కార్యాలయంలో ఒక పని ఇప్పించాడు.
సుధాముడికి అప్పగించిన పని చురుకుగా సాగటం లేదు. రోజులు గడిచినకొద్దీ పని పేరుకుపోతోంది తప్ప పూర్తి కావటం లేదు. మంత్రి గమనించి ఆరాతీశాడు. సుధాముడు గొప్ప దైవభక్తుడనీ, రాత్రింబవళ్ళూ దేవాలయంలో ఉంటాడనీ తేలింది.
మంత్రి వివేకుడు సుధాముడ్ని పిలిచి,పని శ్రద్ధగా చేయనందుకు చీవాట్లు పెట్టాడు.
సుధాముడు మంత్రితో ’అయ్యా! నాకు జన్మనిచ్చిన భగవంతుడికి నా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అహోరాత్రులూ చాలటం లేదు’ అన్నాడు సుధాముడు.
’అలాగా? అయితే నీకు ఉద్యోగం ఇచ్చిన రాజుగారికి కూడా నీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండు’ అని చెప్పాడు.
అది భావ్యంగానే తోచింది సుధాముడికి. ఆరోజు నుంచీ అతడు రోజూ రాజుగారిని దర్శించి, ఉద్యోగం ఇచ్చినందుకు కృతజ్ఞ్తతలు చెప్పుకోసాగాడు.
నాలుగు రోజులు చూసి రాజు నిక్షేపరాయుడు చిరాకు పడి సుధాముడిని ఉద్యోగం నుండి తొలగించాడు.
సుధాముడు మంత్రిని కలుసుకున్నాడు.
’అయ్యా! తమ సలహా ప్రకారం చేస్తే ఉన్న ఉద్యోగం కాస్తా పోయింది!’ అన్నాడు.
’పోదామరి? రాజుగారు నీకు ఉద్యోగం ఇచ్చింది పనిచేయడానికి! దేవుడు నీకు జన్మనిచ్చింది నీ కర్తవ్యం నెరవేర్చడానికి, అంతేగాని దేవుడిని పొగడటానికి కాదు’అని మళ్ళీ చీవాట్లు పెట్టాడు మంత్రి.
సుధాముడికి తిరిగి ఉద్యోగం ఇచ్చాడు. ఈ సారి సుధాముడు తన ఉద్యోగాన్ని శ్రద్దగా చేసుకున్నాడు.

 

 
  చొక్కాపు వెంకటరమణ :

స్టేజి మీద మేజిక్ చాప్లిన్ గా మేజిక్ కార్యక్రమాలుచేస్తూ, పిల్లల కోసం అనేక కధలు వ్రాసిన బాలల రచయిత, ప్రతిభకల చిన్నారులతో ఎన్నో రికార్డు ప్రోగ్రాములు చేయించిన మేజిక్ ఫన్ స్కూల్ నిర్వాహకుడు, బాలభవన్ లో ఉద్యోగిగా ఎన్నో రచనలు అందించిన సంపాదకులు, పిల్లల మనోవికాసం కోసం ఊయల పత్రిక నిర్వహించిన పత్రికాధిపతి......ఊయల కమ్యునికేషన్స్ అధినేత..ఆల్ రౌండర్ అనే పదానికి అచ్చమైన నిర్వచనం చొక్కాపు వెంకట రమణ ఆంధ్ర్ర ప్రదేశ్ బాలల అకాడెమీవారికి అనేక పిల్లల పుస్తకాలు వ్రాసారు. వాటిని జవహర్ బలభవన్ ఇటీవల పున:ప్రచురుంచింది. చొక్కాపు వెంకట రమణ ఆధునిక పరవస్తు చిన్నయ సూరి గా అందిస్తున్న నీతికధల సమాహారం 'నిక్షేపరాయుడి కధలు ' ధారావాహికంగా బాలరంజని లో నెల నెలా వెన్నెల..

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech