మంత్ర శక్తి కలలు -  కాశీ మజలీ కధలు

(2 వ భాగం, క్రితం నెలనుండి ధారావాహికం)

"మరి నిజమైన ఉపదేశం అంటే ఏది? నిజమైన ఆధ్యాత్మిక లక్షణం ఏది? ఏ లక్షణాలుంటే ఒక మనిషి నిజంగా ఆధ్యాత్మికత వైపు పయనిస్తున్నట్టు?" అని ప్రశ్నించాడు కృష్ణ స్వామి.

 

"ప్రేమ" అని ఒకే ఒక్క పదం జవాబు చెప్పి, పరమకాకి విమర్శానంద, "ఉండండి బాబు, ఇప్పుడే వస్తాను" అని పక్క ఉన్న చిన్న వంటశాలలోకి వెళ్ళారు.

 

"విమర్శానంద రోజూ తనే వండి వచ్చినవారికి ప్రసాదం పెడుతుంటారు. తను కూడా కూరలు అవి తరిగి, స్వయంగా వంట కూడా చేస్తారు. మిత్రులతో బాటు" అని చెప్పాడు అక్కడున్న ఒక వృద్ధుడు.

 

"ఆయనెందుకు వండుతారు? మిత్రులతో వండడం ఏమిటి? ఆయన శిష్యులెవ్వరూ లేరా వంటల్లో పనుల్లో సహాయం చెయ్యడానికి?" అని అడిగాడు ఒక కృష్ణస్వామి శిష్యుడు.

 

"ఆయన తను గురువని ఎప్పుడు భావించుకోరు. అందుకని ఎవరిని శిష్యులని సంబోధించరు, పిలవరు. తన మిత్రులుగానో, పిల్లలు గానో చూస్తారు. ఆయన తను కూడా రోజూ ఎందుకు వండుతారో మాకూ తెలియదు కానీ మాకో మిత్రుడు చెప్పాడు తనకి అర్ధమైనది అన్నిటికన్న గొప్పది అన్నం! అది కేవలం తినే ఆహారం కాదు, మన శరీరం ద్వారానే కాక, మానసికంగా గ్రహించే అనేక విషయాలు కూడా ఆహారమే! తినే తిండిలో ఒక్క రాయి వచ్చినా మనం తినలేం. వెంటనే తీసేస్తాం. మరి మన మెదడు, మనసు గ్రహించే విషయాల్లో అన్ని పాషాణాలని, కీటకాలని ఎల గ్రహిస్తున్నాం? సహిస్తున్నాం? వాటిని కూడా తీయగల అలౌకిక ప్రక్రియ ధ్యానం అందుకు చేసే ప్రయత్నం సాధన. ఇక్కడ ఎవరూ ఎవరికి బోధించరు. పంచుకుంటారు"  అని అక్కడున్న పెద్ద అన్నపూర్ణాదేవి చిత్రాన్ని చూపించాడు, "ఈ తల్లి అందరిని కరుణించాలని ప్రార్ధిస్తాము. ప్రపంచంలో అన్నం కూడా దొరకని పేదలని ఆదరించాలని మా ప్రయత్నం" అని ఆ మూర్తికి నమస్కరించాడు ఆ వృద్ధుడు.

 

"మా అశ్రమం నడపడానికి నెల నెలా చాల ఖర్చవుతోంది. మరి మీకు వీటన్నిటికి డబ్బులెలా వస్తాయి. రోజూ ఓ నలభైమందికి భోజనం పెట్టడం కూడా మాటలు కాదుగా ఈ రోజుల్లో. ఎలా?" అని అడిగాడు అనుమానంగా కృష్ణ స్వామి.

 

"నాకూ తెలియదు బాబు. కానీ విమర్శానంద గారు మాత్రం ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోరు. ఎవరూ ఎవరికి ఇక్కడ దానంగా డబ్బులివ్వడానికి వీల్లేదు" అని కొంచెం ఆలోచించి మళ్ళీ చెప్పాడు, "నాకు తెలిసినంత వరకు ఇది వీరి గురువుగారి వాక్కుట. ఆయన విమర్శానంద గారికి చెప్పారుట, నాన్నా వీలున్నంత వరకు ఏమి ఆశించకుండా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టు, ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యి" అని.

 

ఈలోపల విమర్శానంద అక్కడికి వచ్చారు. "భోజనం వేళయింది కదా కాళ్ళు కడుక్కుని రండి. అందరం భోజనం చేద్దాం. భోజనం అయ్యాక మాట్లాడు కోవచ్చు" అని ప్రేమగా ఆహ్వానించారు.

 

అందరికి తనే వడ్డించి భోజనం పెట్టారు విమర్శానంద. మౌనంగా ఉన్నా రామ స్వామి చూస్తూనే ఉన్నాడు, ఆయన మాటల్లో కానీ నడవడికలో కానీ నాకెన్నో తెలుసు అన్న గర్వం కాని, ఇవన్నీ చేస్తున్నానన్న అహం కానీ లేవు. ఎంతో ప్రేమగా అసలు వచ్చిన వాళ్ళే తనకు అవకాశం ఇస్తున్నారన్నంత కృతజ్ఞతగా అత్యంత సహజంగా ఆనందంగా కనిపిస్తున్నారు విమర్శానంద. అక్కడున్నవారు కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నారు.

 

రామ స్వామి హిమాలయాల్లో ఓ ఆశ్రమంలో చూసాడు. అందులో శిష్యులంతా ఎంతో క్రమ శిక్షణగా మెలిగే వారు, కానీ అక్కడ ఒక రకమైన భయం కనిపిస్తుండేది, "ఇది తొందరగా చెయ్యండి గురువుగారు కోప్పడతారు" అన్న మాటా భగవన్నామం కన్నా ఎక్కువ సార్లు వినపడేది. 'గురువు గారు కోప్పడం ' ఏమిటి? శిష్యులు 'భయ పడ్డం ' ఏమిటి? ఇవి రామ స్వామికి నచ్చేవి కాదు. చిన్నప్పడినించి తమ అన్నదమ్ములు చాలా ప్రేమగా పెంచారు తల్లి తండ్రులు. క్రమశిక్షణ అంటే క్రమంగా శిక్షించడం కాదు అని రామ స్వామి అభిప్రాయం. ఇదే విషయాన్ని ఆ హిమలయాల్లోని గురువు గార్ని కూడా అడిగాడు. "గురువు గారూ ఇక్కడందరికి మీరంటే భయం ! మీపై అభిమానంతో కాక భయంతో సాధన చేస్తున్నారు. మీరు వాళ్ళకి సరిపడ సమయాన్ని కూడా కేటాయించట్లేదు. ఇక్కడి వచ్చే పెద్ద వ్యాపారస్తులు, పలుకుబడి గల పెద్దలతో కాలం గడిచిపోతోంది. ఎలా?" అని బాధ పడ్డాడు. ఆ గురువు గారు నవ్వి చెప్పారు, "చూడు నాయనా అంతా జగన్మాత అనుగ్రహం. మనం నిమిత్త మాత్రులం. నువ్వు ప్రతి చిన్న దాన్ని గమనిస్తూ కూర్చుంటే ఏకాగ్రతగా సాధన చెయ్యలేవు. నీ లక్ష్యాన్ని సాధించు, తప్పకుండా మంచి స్థితి కలుగుతుంది. భారతంలో అర్జునుడిని చూస్తే తను ఏకాగ్రతగా విల్లు ఎక్కు పెట్టినప్పుడు చెట్టు కొమ్మ మీద ఉన్న పక్షి కన్ను మాత్రమే కనిపించేదిట, చుట్టు ఉన్న ఆకులు కొమ్మలు కనిపించేవి కాదుట! అంత ఏకాగ్రతగా ఉండే వాడు. నువ్వూ ఆ ప్రయత్నం చెయ్యి, ఉన్నతమైన విషయాలు ఆలోచించు" అని వివరించారు. అయినా రామ స్వామి కి పెద్దగా రుచించ లేదు. ఇంకొన్ని విషయాలు కూడా అతన్ని బాధించేవి. ప్రచారం - ఆధ్యాత్మికత రెండూ కలిసి ఒక చోట ఎలా ఉంటాయి అని చాలా రోజులు ఆలోచించేవాడు.

 

రాముడు నా దేముడు

ఆత్మారాముడు నా దేముడు

నా మనసుకు వెలకట్టి

బానర్లు గ నిలబెట్టి

గనిపెట్టిన

కనిపెట్టున మానవుడు?

 

అని చింతించేవాడు. రామకృష్ణ పరమహంస చెప్పుకోలేదు నేనో గురువునని. వివేకానందుడు ఆజన్మం జ్ఞాన మార్గ చైతన్యంగా, శిష్యుడిగా ఉన్నాడు. వీరిరువురూ జగన్మాతకి చేరువనే ఉండి కూడా ఏనాడూ తమ స్వార్ధ ప్రయోజనాలకి జగదాధార శక్తిని వినియోగించుకోలేదు.

 

ఇంతలో విమర్శానంద చెప్పారు, "నాయనా నేను రేపు కాశీ వెడుతున్నాను. కావాలంటే మీరూ నాతో రావచ్చు.నేను అక్కడ శ్రీ త్రైలింగ స్వామి వసించిన ప్రాంతంలో ధ్యానం, కాలభైరవుని సన్నిధిలో కొంత స్వర్ణాకర్షణ భైరవ సాధన చేసుకుందామనుకుంటున్నాను. ఇక అన్నపూర్ణాదేవిని చూసి కూడా చాలా ఏళ్ళయింది" అని అన్నదమ్ముల వంక చూశారు.

 

రామ స్వామి, కృష్ణ స్వామి ఆనందంగా అంగీకరించారు. వారికి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం సంతోషాన్ని కలిగించింది. రామ స్వామి అన్నాడు, "అయ్యా మాకు కూడా మీతో కాశీ రావడం ఆ విశ్వేశ్వరుడు, విశాలాక్షి పిలచినట్లయింది" అని, "ఓం నమశ్శివాయ " అని పెద్దగా అరిచి  గాలిలోంచి చటుక్కున కొంత వీబూది సృష్టించి విమర్శానంద వారి చేతిలో పోశాడు. అక్కడున్న కొత్తవారితో సహా అందరూ ఆశ్చర్య చకితులయ్యారు. అచ్చెరువంద కుండా నవ్వుతూ చూస్తున్నది విమర్శానంద ఒకరే! ఆ విబూదినొక సారి పరికించి చూసి నవ్వుతూ చేయి ముడిచారు.కనులు ధ్యానంలోకి వెళ్ళాయి ఒక క్షణం సేపు. 

 

"రామ స్వామి చెయ్యి పట్టు" అన్నారు, అంటూనే తన చేయి తెరిచారు. అందులో ఇంతకు ముందు విబూది లేదు. ఒక స్వచ్చమైన స్ఫటిక లింగం ఉంది. అది రామస్వామి చేతిలో పెట్టారు. అతని కళ్ళలో ఆనంద బాష్పాలు. విమర్శానంద కాళ్ళకి నమస్కరించబోయాడు. ఆయన ప్రేమగా తిరస్కరించారు.   

 

రామస్వామి ఆయనతో తన నిజమైన వ్యధని పంచుకోవాలనుకున్నాడు. "అయ్యా! నాకు సిద్ధశక్తులంటే ఇష్టం. అవి నేర్పమని కొందరు గురువులదగ్గరకు వెళ్ళాను. అలాంటివేమీ లేవని కొందరన్నారు, మహిమల్లాంటివి సాధించడం దుర్లభం అని కొందరన్నారు. ఒక గురువు మాత్రం నేను నేర్పుతానన్నారు. చాలా నెలలు గడిచినా ఆయనేమీ చెప్పలేదు. వచ్చిన వాళ్ళకి ఉంగరాలూ, గొలుసులూ సృష్టించి ఇచ్చేవారు. నాకూ చాలా కోరికగా ఉండేది అలా చిత్రాలు చెయ్యాలని. కొంత అధ్యయనం తర్వాత నాకు ఒక  'గోచర ' మంత్రం దొరికింది. ఆ మంత్రం సహాయంతో తెలుసుకున్నాను ఆ గురువుగారి 'సృష్టీకరణ ' రహస్యం ఏమిటో! ఆయన కేవలం వస్తువులని అక్కడ ఇక్కడ దాచి ఇస్తున్నారని, నిజంగా సాధనేమీ అక్కడలేదని. దాంతో అక్కడి నుండి వెళ్ళిపోయాను, దేశం సంచరిస్తూ అలా అన్వేషిస్తూ. ఢిల్లీనుండి రాజస్థాన్ వెడుతుండగా ఒక గారడి వాడు పరిచయం అయ్యాడు. వాడి దగ్గర చిన్న చిన్న ట్రిక్కులు నేర్చుకున్నాను. ఇవి శక్తులు కావు, కానీ వీటినుపయోగించి లోకోపకారం చెయొచ్చుననిపించింది. ధనాశ లేకుండా ప్రజలకి మనోబలాన్ని, సన్మార్గాన్ని చూపాలనే ప్రయత్నంలో ఉన్నాను. కానీ ఈరోజు చూశాను నిజమైన సిద్ధిని. నేనిచ్చిన గారడీ వీబూదిని శివలింగంగా మార్చిన మీరు సామాన్యులు కారు అని అర్ధమైంది. నిజమైన ఈ దివ్యస్థితిని ఆకళింపు చేసుకోవడం ఎలా? " అని అడిగాడు. అతని కళ్ళలో నిజాయితి, విశ్వసత్యాన్వేషణా తృష్ణ కనిపిస్తున్నాయి. జగద్విలీన రామస్వామి కనిపిస్తున్నాడు.

 

"తప్పకుండా నాకు తెలిసింది చెపుతాను.అది నీకు ఉపయోగపడితే సంతోషం బాబూ!" అన్నారు విమర్శానంద, "మనం రేపు ప్రయాణంలో మాట్లాడుకుందాం" అని కూడా చెప్పి ఎంతో చక్కని చిరునవ్వుతో పక్కనున్న గోశాలకు వెళ్ళారు అక్కడున్న ఆవులకి అన్నీ సరిగ్గా ఉన్నాయోలేదో చూడ్డానికి. ఆయన తనలో తను నెమ్మదిగా పాడుకుంటున్నా ఆ ప్రశాంత వాతావరణంలో చెవినపడుతోంది, "కృష్ణం వందే జగద్గురుం" అని.

 

కృష్ణస్వామికి వంద కొత్త ప్రశ్నలు ఉదయించాయి. తనకి వచ్చే దేవతా సంబంధమైన కలలు,అందులో పాములు,గుళ్ళు  కూడా చెప్పి వాటి గురించి తెలుసుకుందాం అనుకున్నాడు. అందరూ వారణాసి ప్రయాణం కోసం ఎదురు చూడ సాగారు.

 

 (వచ్చే సంచికలో ముగిద్దాం)

 

శ్రీ గురుభ్యో నమః

    

 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech