జూన్, 2010

me.jpg

జ్యోతిష్యులు - డా. పిడపర్తి సుబ్రహ్మణ్యం.

బెనారస్ హిందు విశ్వవిద్యాలయంలో ఆచార్య(MA) మరియు చక్రవర్తి(Ph.D) పట్టాలను పొంది రాష్ట్రీయ సంస్కృత సంస్థానంలో జ్యోతిష్య శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.               జ్యొతిష్య శాస్త్ర సంబంధిత అధ్యయనంలో విశేషమైన కృషిని, సేవలను అందిస్తున్న డా. పిడపర్తి సుబ్రహ్మణ్యంగారిని సుజనరంజని పాఠకులకు పరిచయం చేయడానికి గర్విస్తున్నాము..

  

http://www.jagjituppal.com/images/2aries.gif

            మేషరాశి

అశ్విని (అన్ని  పాదాలు), భరణి (అన్ని  పాదాలు), కృత్తిక (మొదటి పాదం) 

 

కుజుడు, బుధుడు, గురుడు ఈ రాశివారికి ఈ మాసమంతయూ శుభులు కారు. శని, శుక్రులు మాసమంతయూ శుభులు. రవి పూర్వార్థమునందు అశుభుడు మరియు ఉత్తరార్థమునందు శుభుడు. అందువలన ఈ రాశివారికి మాసమంతయూ ఇంచుమించు ఒకే విధముగా నుండును. సూర్య ప్రతికూలత కారణముగా పూర్వార్థమునందు విత్తభ్రంశము, నేత్రములందు ఇబ్బంది, మరియు సుఖము లేకపోవుట సంభవించును. కానీ ఈ ప్రతికూలత ఎక్కువకాలముండదు. ఉత్తరార్థములో సూర్యుని శుభత్వముకారణముగా ఉన్నతపదవులు లభించగలవు.

గృహిణులకు ఈ మాసమంతయూ శుభయుక్తముగా నుండును. స్త్రీకారక గ్రహములు మరియు శ్రమను సూచించు గ్రహములు అనుకూలముగా నుండుటయే దీనికి కారణము. శ్రమించువారికి ఇది అనుకూలమైన సమయము. విద్యార్థులు పరిశ్రమపై ఎక్కువ ఆధారపడాలి. శ్రమకు మాత్రమే ఈ నెలయందు సరియైన ఫలితములు ఉండును. తెలివితేటలు తమ ప్రభావమును అంతగా చూపలేవు.

ఉద్యోగస్థులు పూర్వార్థమునందు అధికారులతో తగవులాడుట, వారికి సలహాలిచ్చుట చేయరాదు. ప్రస్తుత సమయము నందు పనికి మాత్రమే గుర్తింపు లబించును. పై అధికారులు అనుకూలముగా ప్రవర్తించు అవకాశములు తక్కువ. క్రిందిస్థాయివారితో పని సులభముగా జరుగును. వ్యాపారస్థులు పూర్వార్థములో కొత్త లావాదేవీలు చేయరాదు. ఈ సమయమునందు మోసగింపబడు అవకాశమున్నది కావున జాగ్రత్తగా వ్యవహరించవలెను.

http://www.jagjituppal.com/images/2taurus.gif

వృషభరాశి

కృత్తిక (2,3,4 పాదములు), రోహిణి (అన్ని పాదాలు), మృగశిర (1,2 పాదాలు

 

ఈ మాసపు పూర్వార్థమునందు శారీరికముగా చాలా ఒత్తిడి ఉండు కాలమిది. హృదయము మరియు ఉదరములకు సంబంధించిన అనారోగ్యములు ఇబ్బందిని కలిగించు అవకాశములున్నవి. పలుకుబడి తగ్గగలదు. కుజుడు ఈ మాసమంతయూ శుభుడు కాడు. గురుడు మరియు శుకృడు పూర్తిగా అనుకూలముగా నున్నారు. శని అనుకూలుడు కాడు.

          ఈ మాసము విద్యార్థులకు పూర్తిగా అనుకూలముగా నుండగలదు. కానీ అది విద్యాపరమైన విషయములందు మాత్రమే అని గ్రహించాలి. అధికారులకు మరియు ఉద్యోగస్థులకు శాఖాపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశములు ఎక్కువ. పనికి గుర్తింపు ఉన్ననూ ఉన్నతస్థానములకు ప్రయత్నములు ఫలించు అవకాశములు తక్కువ.

          వ్యాపారస్థులకు మరియు గృహిణులకు చికాకు కలిగించు సమయమిది. వ్యాపారమునందు నష్టములు, విరోధులనుండి ఇబ్బందులు, కలహములకారణముగా లావాదేవీలు జరుగకపోవుట వీరిని ఎక్కువగా ఇబ్బందిపరచే అంశములు. వ్యాపారముచేయువారు కోర్టువాజ్యములు, మరియు ఒప్పందములవంటివి ఈ సయమమునందు జరుపకుండుట మరియు కొత్త పనులు ప్రారంభించకుండుట, కలహములకు దూరముగా ఉండుటద్వారా నష్టములను తగ్గించుకొనగలరు.

          కుజ శనులు పూర్తి ప్రతికూలురై ఉండుటచే వారి శాంత్యర్థము దేవాలయములను సందర్శించుట, వేంకటేశ్వరస్తుతి నిత్యము చేయుట మంచిది.

 

http://www.jagjituppal.com/images/2gemini.gif

మిథునరాశి

మృగశిర (3,4 పాదాలు), ఆరుద్ర (అన్ని పాదాలు), పునర్వసు (1,2,3 పాదాలు)

 

 

ఈ రాశివారికి ఈ మాసమంతయూ కుజ శుకృలు శుభులు. రవి శని బుధ గురులు ప్రతికూలురు అయి ఉన్నారు. ప్రస్తుతము వీరి మాటలు మిగిలిన వారికి శిరోధార్యములు. వీరి పరాక్రమమునకు ఎదురు లేదు. శుక్రప్రాబల్యముచే గృహ భోజనాదిసుఖములు లభించగలవు.

          కార్యసాధకులనదగ్గ ఏ గ్రహమూ ప్రస్తుతము వీరికి అనుకూలముగా లేకపోవుట మరియు మానసిక ఒత్తిడుల కారణముగా ఈ రాశివారు ఈ మాసమునందు ఎక్కువ అలసినవారివలె నుండు అవకాశములెక్కువ. విద్యార్థులకు సాహసమే మార్గము. అనగ ఆచి తూచి వ్యవహరించడముకన్నా వారు ధైర్యముగా నిర్ణయములు తీసికుని అమలు పరచుట ద్వారా ఎక్కువ అనుకూల ఫలితములను పొందగలరు. గృహిణులు శ్రమను ఎక్కువ అనుభవించిననూ తమ శక్తికి మించి పనిచేయుటలో వెనుకాడరు.

          వ్యాపారస్థులు కూడ సాహసించి పనులు చేసుకొనుటకు ప్రయత్నించగలరు. పరిస్థితులు ప్రతికూలముగానున్ననూ ఫలితములు మరీ ప్రతికూలముగా నుండు అవకాశములు లేవు కావున వీరు ప్రయత్నములను మానరాదు. ఉద్యోగస్థులకు పై అధికారులు ఇచ్చు వాగ్దానములే కానీ పనులు జరుగుచున్న సూచనలు కనబడవు. కావున వీరు తమ పని మరియు కర్తవ్యములపై శ్రద్ధ చూపగలరు.

          కుజుని అనుకూలత వలన వీరికి కార్యసాధన యందు ఇబ్బందులు లేకున్ననూ కార్యఫలితములు అంత ప్రయోజనకరముగా నుండు అవకాశములు తక్కువ. దీనికి ప్రధాన కారణము అధికాంశము గ్రహములు అశుభులై యుండుటయే. కావున గురు శనుల ప్రభావము కొరకు వీరు ఉభయతారకమైన రుద్రాభిషేకమును ప్రతి వారము జరిపించుకోగలరు.

http://www.jagjituppal.com/images/2canc.gif

కర్కరాశి

పునర్వసు (4 పాదం, పుష్యమి (అన్ని పాదాలు),ఆశ్లేష (అన్ని పాదాలు)

 

 

రవి బుధ గురు శుక్ర శనులు ఈ మాసమునందు ఈ రాశివారికి శుభులు. కుజుడు మాత్రము అశుభుడు.  అత్యధికగ్రహముల ఆనుకూల్యత ఈ రాశివారికి ఈ నెలలో శుభఫలితములను పరిపూర్ణముగా ఇవ్వగలవు.

విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్థులు, వ్యాపారస్థులు అందరికీ అనుకూలమైన సమయమిది. కానీ అత్యుత్సాహముకానీ ఆవేశము కానీ పనికిరాదు. కుజుని ప్రతికూలత అధికారుల ఆగ్రహమునకు మరియు కలహములకు కారణము కాగలదు.

          విద్యార్థులు నూతనప్రయత్నములు చేయుటకు సరియైన సమయము. వారికి మంచి పలితములనిచ్చు కాలము. ఈ సమయమునందు కొత్తరంగములు మరియు కొత్త స్థానములకై వారు అన్వేషించగలరు. ఉద్యోగస్థులు ఉద్యోగపరమైన అభివృద్ధి, ఉన్నతపదప్రాప్తి, కొత్తబాధ్యతలు పొందు అవకాశములు చాల ఎక్కువ. గృహిణులు బరువైన మరియు పదునైన వస్తువులతో పనిచేయు సమయమునందు అతి జాగ్రత్తగా వ్యవహరించగలరు. వీరికి ఈ సమయమునందు సాహిత్య విద్యారంగములపై ఆసక్తి పెరుగగలదు.

వ్యాపారస్థులు వివాదములకు తావునివ్వకుండ వ్యాపారమును విస్తరించుకొనగలరు. పుతృలు, మితృలు, స్త్రీలు మరియు కుటుంబసభ్యులకారణముగా ధనలాభము మరియు వ్యాపారాదిలాభములు జరుగు సూచనలున్నవి. కావున ఈ రాశివారు ఈ మాసమునందు ఈ మార్గమును కూడ పరీక్షించుకోగలరు.

 

http://www.jagjituppal.com/images/2eo.gif

సింహరాశి

మఖ(అన్ని పాదాలు), పూర్వ ఫాల్గుణి(అన్ని పాదాలు), ఉత్తర ఫాల్గుణి (1 పాదం)

 

ఈ రాశివారికి ఈ మాసము రవి బుధ శుకృలు ముగ్గురు పూర్తిగా శుభులు. మిగిలిన గ్రహములన్నియూ అత్యంత ప్రతికూలస్వభావమును కలిగి ఉన్నవి. కావున వీరు రవిబుధశుకృలపై పూర్తిగా ఆధారపడవలసిన సమయమిది. ప్రభావము ఎక్కువగా కలిగియుండు గ్రహములు వ్యతిరేక స్వభావమును కలిగియుండుటచే ఈ రాశివారికి శుభగ్రహశుభత్వముద్వారా కార్యములను నెరవేర్చుకొనుట అంత సులభము కాదు.

          విద్యార్థులకు సమయము అనుకూలముగా కనిపించకపోయిననూ, వారి ప్రయత్నములందు వారికి సంతృప్తి లేకున్ననూ ఫలితములు మాత్రము ఆశాజనకముగానుండును. ఉద్యోగస్థులకు ఉత్సాహము తక్కువగా ఉన్ననూ, వారు పూర్తిగా శ్రమకు తగ్గట్టు పనిచేయకున్ననూ అధికారుల సహాయసహకారములు వారికి పూర్తిగా లభించు సమయమిది.

          వ్యాపారస్థులకు వ్యాపారరంగమునందు వ్యతిరేకత ఉన్ననూ వ్యాపారఫలితములు నిరాశాజనకముగానుండవు. గృహిణులకు ఉత్సాహము తగ్గును. తమ పనులపై ఆసక్తి తగ్గును. శారీరకముగ  ఎక్కవ అలసటను పొందు అవకాశములున్నవి.

          ఒత్తిడి, వ్యతిరేకత, సహనము లేకపోవడము, త్రిప్పట ఈ నెలంతయూ ఈ రాశివారిని వెంబడించిననూ కొన్ని గ్రహముల పూర్తి ఆనుకూలత ఈ రాశివారికి అన్ని రంగములందునా మంచి ఫలితములను ఇచ్చుటలో సహకరించుచున్నది. శుభఫలశాతమును మరింత పెంచుకొనుటకు గణేశస్తుతి, రుద్రాభిషేకములను చేయించుకొనగలరు.

http://www.jagjituppal.com/images/2virgo.gif

కన్యా రాశి

ఉత్తర ఫాల్గుణి (2,3,4 పాదాలు), హస్త (అన్ని పాదాలు), చిత్ర (1,2 పాదాలు)

 

 

పూర్వార్థములో రవి, శుకృడు, అశుభులు. కుజ, శనులు మాసమంతయూ అశుభులు. మొదటి సప్తాహమందు మాత్రము బుధుడు శుభుడు. మిగిలిన మాసమంతయూ అతడు అన్ని కార్యములందూ విఘ్నకరుడు. మాసమంతయూ గురుడు శుభుడు.

అనగ ఈ రాశివారికి పూర్వార్థము పూర్తిగా వ్యతిరేకముగా నున్నది. ఈ సమయమునందు వీరు కొత్త ప్రయత్నములను చేయక వారి వారి కర్తవ్యములను మాత్రము నిర్వర్తించవలెను. ఈ కాలములో చేయు ఏ పనికీ ఫలితములు ఆశించవలసిన అవసరము లేదు. కలహములు మరియు మధ్యవర్తిత్వములనుండి దూరముగా నుండగలరు.

ఉత్తరార్థము ఆశాజనకముగానుండు కాలము. విద్యార్థులకు మంచి వార్తలు విను అవకాశములు వచ్చును. వ్యాపారస్థులు కొత్త ఒప్పందములను చేసుకొను అవకాశమున్నది. ముఖ్యముగ స్త్రీలకు మరియు ఉద్యోగస్థులకు పూర్తిగా అనుకూలముగా నుండును. కావున వారు కొత్త కార్యములను ప్రారంభించు ప్రయత్నములు చేసుకొనగలరు. అధికారులతో సంప్రదింపులు చేయుటకు, అభ్యర్థనలను విన్నవించుకొనుటకునూ అనువైన సమయము.

గురుని ప్రాబల్యము పెరుగుట ద్వారా ఈ రాశివారు ఈ మాసమునందు అత్యంత అనుకూలమైన ఫలములను పొందగలరు. ప్రతి సప్తాహము రుద్రాభిషేకము ఈ రాశివారికి గ్రహముల ఆనుకూల్యతను పెంచగలదు.

http://www.jagjituppal.com/images/2libra.gif

తులారాశి

చిత్ర (3,4 పాదాలు), స్వాతి (అన్ని పాదాలు), విశాఖ (1,2,3 పాదాలు)

 

      

పూర్వార్థము శారీరకముగా ఇబ్బందిపరచు అవకాశములున్నవి. భార్యాబంధువులపై అనాసక్తత పెరుగును. ధార్మికకార్యములపై దృష్టి మరలును. మాసము ప్రారంభదశలో కలహములు సంభవించు అవకాశమున్నది.

          మాసమంతయూ కుజ బుధుల అనుకూలత వలన, పూర్వార్థములో శుకృని ఆనుకూల్యతకారణముగా వీరికి శనిగురుల బాధలు అంతగా ఇబ్బంది పరచవు. కానీ ప్రాబల్యత గురు శనులది అధికమగుటచే ఈ శుభగ్రహములను మధ్య మధ్య బలపరచవలసిన అవసరము కూడ ఉన్నది. కేవలము కుజుని అనుకూలత కారణముగనే వీరికి అన్ని రంగములు అనుకూలఫలప్రదములుగ కనిపించును. కుజుడు అన్నిరంగములయందునా ఆర్థికముగా లాభములను చేకూర్చుటలో అన్ని విధములా బలమును కలిగి యున్నాడు.  కావున ఈ అవకాశమును ఈ రాశివారు సద్వినియోగపరచపకొనుటకు ప్రయత్నించవలెను.

          ఉద్యోగస్థులు, విద్యార్థులు తమ సామర్థ్యముపై నమ్మకమును పెంచుకొనవలెను. ఫలితములు ఆశించినంతగా కనబడు అవకాశము లేదు. అయిననూ ప్రయత్నములను మధ్యలో విడువరాదు. వ్యాపారులకు అనుకూలముగా నున్న సమయమిది. వారు యుక్తియుక్తముగా వ్యవహరించుచూ వ్యాపార లావాదేవీలను మరియు వ్యాపార సంబంధ వివాదములను తమకనుకూలముగా మార్చుకొనుటకు ప్రయత్నించగలరు.

          ఏలినాటి శనిప్రభావమునకు మిగిలిన గ్రహముల వ్యతిరేకత తోడగుటచే మానసికముగా మరియు శారీరికముగా శాంతి లోపించు అవకాశములెక్కువగా ఉండుటచే హనుమద్దర్శనము మరియు శివారాధన చేసుకొనగలరు.

http://www.jagjituppal.com/images/2scorp.gif

వృశ్చికరాశి

విశాఖ (4 పాదం), అనూరాధ (అన్ని పాదాలు), జ్యేష్ట (అన్ని పాదాలు)

 

సూర్యుడు మాసమంతయూ అశుభుడు. బుధుడు మొదటి వారము మాత్రము శుభుడు. కుజుడు సముడు. గురు శుకృ శనులు మాసమంతయూ శుభులు. అనగ వీరికి ఈ మాసము శుభఫలాధిక్యతను కూడి యున్నది. రవిబలలోపము కారణముగా దీనత్వము మరియు ఉదరమునకు సంబంధించిన ఇబ్బందులు పూర్వార్థమున ఇబ్బంది పెట్టు అవకాశమున్నది. ఉత్తరార్థమున అనారోగ్యములు కార్యవిఘ్నకరములగు సూచనలున్నవి.

ప్రభుత్వపరమైనకార్యములు, అధికారులతో సంప్రదింపులు, వైద్య రాజకీయపరమైన కార్యములు అనుకూలములుగా కనిపించిననూ అనుకూలఫలములు కనిపించుట లేదు. కావున వ్యయప్రయాసలతో ఈ రంగములయందలి కార్యములకై పాటు పడుట ఈసమయమునందు మంచిదికాదు. కార్యస్థానమునందు ఒత్తిడి పెరుగు అవకాశము కనిపించుచున్నది. విద్యార్థులకు ఆత్మస్థైర్యము చాలా అవసరము.

వ్యాపారాదులయందు ప్రభుత్వపరమైన వ్యవహారములు ఇబ్బందికరముగ మారగలవు. వ్యతిరేకముగా చేయబడిన ఫిర్యాదుల ఆధారముగ దాడులు జరుగు అవకాశములున్నవి కావున జాగ్రత్త అవసరము. ప్రభావయుక్తులైన గ్రహములు బలముగ మరియు అనుకూలముగా నుండుటచే అన్ని రంగములందునా అనుకూలఫలములను ఆశించవచ్చును. కానీ ముఖ్యమైన కొన్ని గ్రహముల వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని వ్యవహారములయందు ఆచితూచి వ్యవహరించవలెను.

http://www.jagjituppal.com/images/2saggi.gif

ధనూరాశి

మూల (అన్ని పాదాలు), పూర్వాషాడ (అన్ని పాదాలు), ఉత్తరాషాడ (1 పాదం)

       

పూర్వార్థము శారీరికముగ అనుకూలముగ ఉన్నది. వ్యతిరేకులు తగ్గుతారు. ఆధికారికమైన కార్యములు త్వరితగతిన ఫలించగలవు. ఉత్తరార్థమునందు శారీరికముగ ఇబ్బందులు మిగిలిన కార్యములందు విలంబమునకు కారణముకాగలవు.

కార్యములన్నియూ ఆలస్యముగా నడచును. బుధుడు మాసపు రెండవవారమునుండి పూర్తిగా అనుకూలముగా ఉన్నాడు. కావున కార్యములయందు ఆశించిన రీతిలో ఫలితములు కనిపించగలవు.  కానీ ఫలితములను అంచనా వేసి పని చేయుట సాధ్యము కాదు. కావున సకారాత్మక భావనతో మాత్రము పనిని ప్రారంభించవలెను.

గురుశనుల విపరీత స్థానకారణముగ చికాకులు, అన్ని రంగములయందు మరియు అన్ని కార్యములయందు ఆటంకములు ఈ సమయములో సర్వసాధారణములు. వీనిని అధిగమించు ప్రయత్నములో చికాకులు మరింత పెరుగు అవకాశములున్నవి. ధనవ్యయము మరియు ధననష్టమునకు సూచనలు  ఎక్కవగా ఉన్నవి కావున ఈ విషయమునందు ఓర్పుగా వ్యవహరించవలెను.

సప్తశతీపారాయణము, కనకధారాస్తోత్రపఠనము వీరికి చాలా విషయములనందు ఊరటనివ్వగలదు

  

http://www.jagjituppal.com/images/2capricon.gif

మకరరాశి

ఉత్తరాషాడ (2,3,4 పాదాలు), శ్రావణ (అన్ని పాదాలు), ధనిష్ట (1,2 పాదాలు)

 

పూర్వార్ధమునందు రోగములు మరియు విరోధులకారణముగా అసహనము చాలా వరకు పెరుగగలదు. ఉత్తరార్థములో పరిస్థితులు మరల అదుపులోనికి వచ్చును. గృహమునందు కలహములు పెరుగును. భార్యా పిల్లలతో సఖ్యత లోపించు అవకాశములున్నవి. ఇంటిలో మరియు కుటుంబసభ్యులతో వాగ్వివాదములకు దిగుటద్వారా మానసిక శాంతి కోల్పోవు అవకాశములు ఎక్కువగా ఉన్నవి. కావున సంయమనముతో వ్యవహరించగలరు.

చేయుచున్నకార్యములందు విఘ్నములు ఏర్పడుట మరియు తరచు స్థానమును మార్చుట కూడ జరుగగలదు. ఈ సమయములో బదిలీలు జరుగు అవకాశములు కూడ చాల ఎక్కువగా ఉన్నవి. ఏ రంగములో ఉన్నవారికిని పరిస్థితులు పూర్తిగా అనుకూలముగా లేకపోవుటచే అనువైన సమయము మరియు పరిస్థితులకొరకు వేచియుండుట ఎంతైనా అవసరము.

విద్యార్థులు, ఉద్యోగస్థులు, గృహిణులు, వ్యాపారస్థులు అందరి సహనమునకూ ఇది పరీక్షా కాలము. ప్రతిదినమూ గణేశస్తుతి, శివాలయసందర్శనము, శనివారము ఉపవాసముండుట ద్వారా గోచరములో నున్న వ్యతిరేకతను చాలా శాతము తగ్గించుకొనగలరు.

http://www.jagjituppal.com/images/2aqua.gif

కుంభరాశి

ధనిష్ట (3,4 పాదాలు), శతభిష (అన్ని పాదాలు) , పూర్వాభాద్ర (1,2,3 పాదాలు)

 

గత కొద్దికాలముగా కుజబలప్రభావముచే ఈ రాశివారికి అన్ని రంగములయందు విరోధులనేవారు లేకుండ పనులన్నీ సవ్యముగా జరుగుతూ వచ్చాయి. అదే సమయములో గురుని వ్యతిరేకత కారణముగా కార్యస్థానమునందు ఒత్తిడులు మరియు మనస్పర్థలు వెంటాడుతూ వచ్చాయి. ప్రస్తుతమాసమునందు ఈ పరిస్థితులు మారాయి. గురుని మార్పు క్రిందటి నెలలో సంభవించిననూ దాని ప్రభావము ఈ నెలలో పూర్తిగా గుర్తించు అవకాశములున్నవి. ప్రస్తుతమాసములో కుజుని మార్పు ఈ రాశివారిపై అధికముగా ప్రభావమును చూపు అవకాశమున్నది. ఈ ప్రభావము వ్యతిరేకతతో కూడినదై యుండుటచే ఆవేశమును తగ్గించుకోవలెను.

గురుని మార్పు ఆగి ఉన్న ధనవ్యవహారములను పూర్తి చేయుటలో సహకరించును. విరోధులనుండి కూడ ధనలాభము జరుగు అవకాశములు చాల ఎక్కువ. అనగ విరోధులనుండి రావలసిన ధనమును రాబట్టుకొను ప్రయత్నముచేయుటకు ఇది మంచి కాలము. శని అష్టమస్థితి కారణముగా స్త్రీలు సహకరించకపోవుట మరియు దీనత్వము వీరిని ఇంకనూ విడచు అవకాశములేదు.

          అన్ని గ్రహములూ ధనాగమము జరుగునని అందలి అడ్డంకులు తొలగుననీ సూచిస్తున్నవి. కావున ఆ విషయముపై దృష్టి కేంద్రీకరించవలెను. వ్యాపారములు, గృహనిర్మాణాదులు, ఉన్నతవిద్యలు మొదలగువాటికి ధన సంగ్రహము చేయుటకు ఇది మంచి సమయము. కుజ శనుల ప్రభావమును తగ్గించుటకు సప్తశతీపారాయణము, రుద్రాభిషేకము జరిపించగలరు.

 

http://www.jagjituppal.com/images/2psices.gif

మీనరాశి

పూర్వాభాద్ర (4 పాదం), ఉత్తరాభాద్ర (అన్ని పాదాలు), రేవతి (అన్ని పాదాలు)

 

గురు శనుల వ్యతిరేకప్రభావము అత్యధికముగా నున్నప్పటికీ ఈ మాసము ఈ రాశివారికి కుజ ప్రభావకారణముగా అనుకూలముగా నుండును. గురుని ప్రభావమువలన కార్యస్థానమునందు మార్పు మరియు ధనవ్యయము జరుగు అవకాశమున్నది. శని వైపరీత్యకారణముగ కుటుంబముతో కలహములు మరియు వారినుండి దూరముగ ఉండవలసి రావడము, దీనత్వము బాధించు అవకాశములున్నవి.

          పూర్వార్థములో సూర్యుడు అనుకూలముగా నుండుటచే ధనసంగ్రహము జరుగు అవకాశమున్నది మరియు రోగములు మరియు విరోధులనుండి ఉపశమనము లభించు అవకాశమున్నది. అనగ పూర్వార్థములో వీరికి వ్యయమునకు తగ్గ రాబడి ఉండగలదు. ఉత్తరార్థమునందు అదే రవి వ్యతిరేకత కారణముగా శారీరికముగ చికాకులు తలెత్తగలవు.

          మితృలవలన ఈ మాసములో  లాభించు అవకాశమున్నది. కానీ ప్రభుత్వపరముగ మరియు విరోధులకారణముగా నష్టము జరగవచ్చన్న అనుమానము వీరిని బాధించే అవకాశము ఎక్కువ. శుకృడు మాసమంతయూ శుభుడే. తద్వారా కుటుంబము వలన లాభము, బంధుజనుల ఆగమము మరియు మితృలను కలయుట జరుగగలవు.

          పరివార మిత్ర బంధుజనుల సహకారములు ఎక్కువగా లభించు సూచనలు ఉన్న కారణమున ఈ మాసమునందు ఆయా వర్గములనుండి సహాయసహకారములు మరియు వారి సూచనలు పొందుటకు ప్రయత్నములు శక్తి వంచన లేకుండ చేసిన అనుకూలఫలములను పొందగలరు.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం