సహవాసి

మల్లేశ్వరరావు యల్లాప్రగడ

 

అనాదికాలంగా
అతనితో సహవాసం
విశ్వ సంద్రాన నావలో విహారయానం
అవధుల్లేని మహాప్రస్థానం

అంతలో విడివడి
తీరాన వదలి పోయాడు సఖుడు
అతని ఎరుకలో గడిచాయి
యుగయుగాలు
అతని ఏలికలో గడిపాను
శతవసంతాలు

ఆలంబన లేని బ్రతుకులో
అతని అడుగుజాడలకై వెతుకుతోన్నా
కలల మాటున దాగినా
వెతల లోతున మునిగినా
ఆరాటం అతనికై
ఆరాధన అతనిపై

వేకువ ప్రాభాతంలో
వెలుగురేకై వచ్చి
స్పృశిస్తాడనే ఆశ
రోహిణి తాపంలో
ఎండబారిన బతుకున
మలయమారుతంలా వచ్చి
పలకరిస్తాడనే ఆశ

సెలయేటి రొదలు విన్నా
చిరుగాలి సొదలు విన్నా
అతనొచ్చాడనే
శుకపిక కలవరాలలో
నను పిలుస్తున్నాడనే

తనను వీడి యుగాలైనా
మరువకున్నానొక క్షణమైనా
మమతల పొదరిళ్ళనిండా
మాధవుని మధుమూర్తులే
పాటల పందిరిపై విరిసిన
మల్లెల పరిమళాలే

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం