గురజాడ

విహారి

 

గురజాడ బహుముఖనమైన ప్రజ్ఞా,ప్రయోగ దక్షతల్లో ఒక పాయగా ఆధునిక కథనికా ప్రక్రియను ఆయన నెరపిన తీరులో అనన్య సామాన్య మార్గ నిర్దేశకత ద్యోతకమవుతుంది.గురజాడ రాసిన కథానికలు ఐదు. దిద్దుబాటు, మీ పేరేమిటి? మెటిల్డా,పెద్దమసిదు సంస్కర్త హృదయం.వీటిలో‘దిద్దుబాటు’ఒక నమూనా కథానికగా నిలిచిపోతుంది.

‘గురజాడ ప్రప్రథమ ఆధునిక కథానిక రచయిత అని చెప్పడానికి మూడు హేతువులున్నాయి. 1.శిల్పం, 2. వస్తువు, 3. భాష. ఎత్తుగడా మొదలగు ముగింపు వరకు కథా విన్యాసంలో రచయిత చూపే కళానైపుణ్యమే శిల్పం. కథానిక కథే గీటు రాయి’ అని వివరించారు డా|| పోరంకి దక్షిణామూర్తి.

‘ఆధునిక తెలుగు కథానిక’- ఇందులో మూడు పదాలున్నాయి. ఒకటి : ఆధునికత. ఆధునికత కాలసూచి కాదు. అది వస్త్వంశం. ఆధునికత లక్షణాల్లో ముఖ్యమైనది: వస్తుపరమైన సమకాలీనత, సమాజ జీవన నేపథ్య చిత్రణ, భావనలో అభ్యుదయ కామన. ఇవన్నీ ‘దిద్దుబాటు’ లో చాలా ప్రస్ఫుటంగా భాసిస్తున్నాయి. రెండవ పదం: తెలుగు. ఇది భాషా సూచి. గురజాడ వ్యవహారిక భాషాభిమానం, సాహిత్య ప్రక్రియలన్నింటా వాడుక భాషా ప్రయోగ దక్షత - సాహితీ లోకంలో నిర్వివాదమైన వాస్తవాలే. ‘కమలిని’ గా కథని ముందు కొంత గ్రాంథికంలో రాసినా తన కథానికని చదువరులకు చేరువ చేసే ఆకాంక్షలతో,తాను నమ్మిన భాషా సంస్కరణోద్యమ స్ఫూర్తికి అనుగుణంగా - ‘దిద్దుబాటు’ గా ఆ తర్వాత వ్యవహారికంలో తిరిగి రాశాడు గురజాడ.

మూడవ పదం కథానిక. కథానిక ప్రధానంగా శిల్ప సమన్వితం కావాలని చెప్తూ దాని ఇతర లక్షణాలు పదుగురు వివరించే ఉన్నారు. అవన్నీ ‘దిద్దుబాటు’ కథానికలో ఎలా ప్రతిఫలిస్తూ ఉన్నాయో కూడా ఎందరో విశదీకరించారు.

‘ఆధునిక స్త్రీలు మానవ చరిత్రను తిరిగి రచిస్తారనే అభ్యుదయ కాంక్షని వందేళ్ళ ముందే పేర్కొన్న గురజాడ దార్శనికత మహత్తరమైనది.నిజానికి ‘దిద్దుబాటు’ఆయన ఆశాభావానికి అచ్చమైన వ్యాఖ్యానం.‘మెటిల్డా’ కథలోనూ దయనీయమైన వివాహిత జీవితమే కథావస్తువు. మతమౌఢ్యం వెర్రితలలు వేయడాన్ని నిరసిస్తూ రాసిన కథలు ‘మీ పేరేమిటి?’,‘పెద్ద మసీదు’.ఈ కథల్ని దృష్టిలొ ఉంచుకొని ‘మత మౌఢ్యాన్ని తీవ్రంగా నిరాకరించే రచనలు గురజాడ కథల తర్వాత రాలేదనే చెప్పాలి’ అన్నారు కె.కె.రంగనాథాచార్యులు. కథానికాంశాల్లో సామాజిక వాస్తవికత ఆవశ్యకతని స్పష్టీకరిస్తూ గురజాడ రాసిన కథానికలూ,ఉగ్గడించిన అభిప్రాయాలూ-కథకులకు మార్గనిర్దేశం చేశాయి.ప్రక్రియాపరంగా తొలి ఆధునిక తెలుగు కథానిక స్వరూప స్వభావాల్ని,నిశితంగా పాయింట్ లుగా నిర్ధారించుకుని ఆ పాయింట్ల వరుస క్రమంలో ఆయా కథానికల్ని అధ్యయనం చేయగలిగితే ఆహ్వానించదగిన పరిణామమే. అలాంటి అధ్యయనం తెలుగు కథానిక పురోగమనానికి దోహదం చేస్తే అంతకన్నా కావలసిందేముంది?

‘నాది ప్రజల ఉద్యమము. దానిని ఎవరిని సంతోషపెట్టటానికైనా వదులుకోను’ అని నిర్ద్వందంగా ప్రకటించిన ధైర్యశాలి గురజాడ.అందుకే కిళాంబి రంగాచార్యులు గురజాడని ‘ప్రజా సామాన్య రక్తధ్వజము నెత్తిన కవీంద్రుడాయన’ అన్నాడు. సంస్క్రణాభిలాషిగా, అభ్యు దయాకాంక్షిగా, నూతన ప్రక్రియా ప్రయోగశీలిగా, దార్శనికుడుగా గురజాడ ‘తెలుగు సారస్వతానికి సరిహద్దు’! ‘చలనశీల సాహిత్య స్రష్ట’కనుకనే గురజాడను డా||సినారె ‘యుగకర్త’ గా ప్రశంసించారు! లోకజ్ఞత, సంస్కారవిజ్ఞత, ప్రక్రియా శిల్పజ్ఞత - మూర్తీభవించిన సాహిత్యశక్తి గురజాడ.

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech