పరదా మాటున (మొదటి భాగం)

- పెయ్యేటి శ్రీదేవి

 

 


కార్తీకమాసం ఇంకా వారం రోజులే వుంది.ఆఫీసులో అందరూ కలిసి యాదగిరిగుట్ట వెడదామని పిక్ నిక్ ప్రోగ్రాం వేసుకున్నారు.ఎవరెవరు ఏ ఏ పలహారాలు చేసి తీసుకురావాలో నిర్ణయించుకున్నారు.ఎప్పుడూ ఎవరితో ఎక్కువగా మాట్లాడని మురళీకృష్ణకూడా రావడానికి ఒప్పుకున్నాడు.తరువాత చెప్పారు అందరూ కుటుంబాలతో సహా రావాలని. అలా అనేసరికి మురళీకృష్ణ రావడానికి సందేహించాడు.ఎవరు రాకపోయినా ఏభై రూపాయలు ఫైన్ కట్టాలన్నారు.అందరూ కుటుంబాలతో రావడానికి ఒప్పుకున్నారు.మురళీకృష్ణ ఏ సంగతీ చెప్పలేదు.అందరూ అతనిని ఒత్తిడి చేశారు రమ్మని. హెడ్ గుమాస్తా గుర్నాథంగారు ఒప్పించారు.ఆయన మాటలంటే అందరికీ గౌరవం.

పిక్ నిక్ రోజు రానే వచ్చింది.అందరూ ఎనిమిదిగంటల కల్లా ఆఫీసు దగ్గరే ఆఫీసు వాను వద్దకు చేరుకోవాలన్నారు.పిల్లాజల్లాతో అందరూ వారు చేసిన వంటకాల క్యారియర్లు పుచ్చుకొని వస్తున్నారు.మురళీకృష్ణ,గుమాస్తా రాఘవ,టైపిస్టు మాధురి ఇంకా రావాలి.మాధురి రాఘవ ఇంట్లోనే అద్దెకు ఉంటోంది.అందుకని ఇద్దరూ కలిసే రావచ్చు.మురళీకృష్ణ గురించే సందేహం వస్తాడో రాడో అని.అందరూ వేన్ లో సమాన్లు సర్దుతున్నారు.

"ఏమండీ గుర్నాథంగారు! మురళీకృష్ణ వస్తాడంటారా?" అడిగాడు క్లర్కు శర్మ హెడ్ గుమాస్తా గుర్నాథాన్ని.’అందుకే కదోయ్ చూస్తున్నాను.అసలీ పిక్ నిక్ ఏర్పాటు చేసిందెందుకు?ఈ వంకతో అయినా అతని భార్యని బయటకి తీసుకొస్తాడని.నలుగురితో సరదాగా మట్లాడించాలని.అందుకే కుటుంబాలతో సహా రావాలని చెప్పాను.పోనీ, రాకపోతే ఏభై రూపాయలు ఫైను కట్టాలిగా!’

ఏభై రూపాయలు ఫైనన్నా కడతాడేమో కానీ అతను భార్యను మట్టుకు తీసుకురాడు.ఇది గ్యారెంటీ!అన్నాడు శర్మ."ఏమిటీ అంత ధీమాగా చెబుతున్నావు శర్మా?నామాటన్నా లెక్కలేదంటావా? నేనంటే అతడికి బాగా గౌరవం తెలుసా?"మనసులో తీసుకురాడని సందేహం వున్నా, బయటికి గంభీరంగా అన్నాడు హెడ్ గుమాస్తా గుర్నాథం తన మాటంటే గౌరవం అన్న మాటని కాపాడుకోడానికి.

నిజమే! హెడ్ గుమాస్తా గుర్నాథం అంటే అందరికీ గౌరవమే.మురళీకృష్ణ కూడా ఆయన మాటని ఎప్పుడూ కాదనలేదు.ఆ నమ్మకంతోనే అతడికి ప్రత్యేకం ఫ్యామిలీతో రమ్మని చెప్పాడు.ముందర సందేహించినా సరే అన్నడు మురళి ఆయన మాటని తీసెయ్యలేక.అతను ఫ్యామిలీతో వస్తాడనే సరికి అందరూ ఎగిరి గంతేశారు.వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు.దానికో కారణం ఉంది.ఇంతవరకూ అందరూ అందరిళ్లకీ వెళ్ళి,వారి వారి కుటుంబ సభ్యులతో పరిచయాలు చేసుకున్నా,ఒక్క మురళీకృష్ణ మాత్రం,ఇంటికి వెళ్ళినా అతని భార్యని ఎప్పుడూ ఎవరికీ పరిచయం చెయ్యలేదు.

ఏమోయ్ మీ ఆవిడ్ని పరిచయం చెయ్యవోయ్ అంటే ఏదో సమాధానం చెప్పి దాటేసేవాడు.
అతని భార్యని చూపించలేదని,పరిచయం చెయ్యలేదని ఆ కనిపించని భార్య మీద చూడాలనే ఆశక్తి కలిగి,ఎవరికి వారు ఊహాగానాలు చేసేసుకుంటున్నారు.
గుర్నాథం గారూ! మీరెన్నయినా చెప్పండి మురళీకృష్ణ రాడు అన్నాడు శర్మ.
అవును. అతను రాడు, వచ్చినా భార్యను తీసుకురాడు. వస్తే అందరూ నిలేసి అడుగుతారు.నీ భార్యని తీసుకురాలేదేం అని.అందుకు అతను కూడా రాడు క్లర్కు రమణమూర్తి.
అసలైనా ఎందుకంత భాదపడిపోతాడో అతని భార్యను పరిచయం చెయ్యడానికి మనమందరం అల్లాగే ఉంటున్నామా?ఏ ఫంక్షను వచ్చినా అందరం కలిసి ఒకళ్ళింటికి ఒకళ్ళం వెళ్ళటల్ల?నలుగురితో పరిచయాలు పెంచుకోవాలి గాని,అలా పట్టనట్టు ఒంటి కాయ శొంఠికొమ్ములా ఉంటే రేపు అవసరం వస్తే ఎవరైనా సాయం చేస్తారా? అన్నాడు ఈ మధ్యనే ప్రమోషనొచ్చి ఆఫీసరైన ప్రసాదు.ఇదిగో యాద్ గిరీ కొంచెం మంచినీళ్ళు పట్రావోయ్.

అతను తెచ్చిన నీళ్ళు తాగి మళ్ళీ ప్రసదే అన్నాడు.’అతని భార్యేమన్నా దివి నుంచి దిగి వచ్చిన దేవతా?’ఆవిడేమన్నా అప్సరసా? పోనీ అప్సరసే అనుకుందాం.ఆనందంగా నలుగురిలోకి తీసుకురావచ్చుగా?అందరం సంతోషిస్తాం.అతని భార్య అందంగా వుంటే అతనికి ఆనందం కాదూ?
అదేమీ కాదులెండి ఆవిడ శుద్ద అనాకారి అయి ఉంటుంది. అందుకే తీసుకు రావటల్లేదు.కట్నానికి ఆశపడి చేసుకుని ఉంటాడు అంది ప్రసాదు భార్య సునీత.
అవును. సునీత గారు చెప్పిందే కరెక్టు.ఆవిడ అనాకారన్నా అయిఉండాలి, లేదా అవిటిదన్నా అయి ఉండాలి.అందుకే బైటికి తీసుకురాడు మన గురుడు.అన్నాడు గుమాస్తా ఆనందం.
ఎందుచేత? అడిగారు అందరూ.
ప్రసాద్ అన్నాడు ఒకసారి మా అబ్బాయి పుట్టినరోజుకి పిలవడానికి వాళ్ళింటికి స్కూటరు మీద వెళ్ళాం.ఇంతలో ఏమండీ మురళీకృష్ణ వచ్చాడా.అంటూ హడావిడిగా వచ్చి అడిగాడు హెడ్ గుమాస్తా గుర్నాథం.
అందరూ ఆయనమీద విసుక్కున్నారు మధ్యలో చెప్పేది వినకుండా చేసినందుకు.
అందుకే కదండీ మేమంతా అతనికోసం ఎదురుచూస్తున్నాం?.అన్నాడు ప్రసాదు విసుగ్గా.
ఊ అప్పుడేమయింది ప్రసాదుగారు?. అందరూ ఆత్రంగా అడిగారు.
ఊ ఇప్పుడేం చెబుతున్నాను.
ఆ అదే స్కూటరు మీద వాళ్ళింటికి వెళ్ళాం.ఆ రోజు నేను శలవు పెట్టాను.ఆఫీసు నుంచి మురళి ఇంకా రాలేదు.పనిపిల్ల తలుపు తీసింది. అప్పుడే మురళీకృష్ణ స్కూటరు మీదవచ్చాడు.
ఏమిటిలా వచ్చారు?అన్నాడు మురళీకృష్ణ లోపలికి వస్తూ.
ఏం? రాకూడదా? అన్నాను.
అదేం కాదు అని నసిగాడే గాని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా రండి లోపలికి అని ముక్తసరిగా అన్నాడు.
సరే, లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాం.మురళీకృష్ణ కుర్చీలో కూర్చుని ఏవో కబుర్లు చెప్పాడు.అవయినా ఆఫీసు విషయాలు మాత్రమే. పనిపిల్ల కాఫీలు తెచ్చింది.
మా అబ్బాయి పుట్టినరోజుకి పిలవడానికి వచ్చాం.మీ ఆవిడని పిలు అన్నాను.
ఆవిడలేదు అన్నాడు ఇంకేం మాట్లాడలేదు.
ఎక్కడా ఏ అలికిడీ వినిపించలేదా? గదుల్లోకి తొంగి చూసినా కనిపించలేదా? అడిగారెవరో.
అసలు చుట్టూ పరదాలేసుంటే గదుల్లోకి ఎలా తొంగి చూడాలి?. ఎవరూ ఉన్న అలికిడి కూడా లేదు. ముందర గదిలోనే కూర్చున్నాము.అసలు మేమున్నంతసేపు అతను ముళ్ళమీదున్నట్టున్నాడు.ఎప్పుడెళ్ళిపోతామా అన్నట్టు ఫీలయ్యాడు.
పోనీ, పరదాల కింది నుంచి పాదాలు గాని, నీడ గాని కనిపించలేదా.? నిత్య శంకితుడు శర్మ అడిగాడు.
చుట్టూ నేలబారుకీ పరదాలేసుంటే పాదాలేం కనిపిస్తాయి.?ఇక ఆ పరదాలు కూడా దళసరిగా బొంతల్లా ఉన్నాయి.అందుకని నీడ కూడా కనిపించదు. సరేనా? ఆవిడుందో లేదో కూడా తెలీదు.
ఉన్నా, ఆవిడ బయటికి రాదండీ అన్నాడు ఆచారి.
ఏం. నీకేమైనా తెలుసా ఆవిడ గురించి.అంత ఖచ్చితంగా చెబుతున్నావు. అడిగాడు శర్మ.
ఒకసారి ఏదో అర్జెంటు ఫైలు కావాల్సి వచ్చి నేనూ, మెసెంజర్ మాధవన్ వాళ్ళింటికి వెళ్ళాం. ఆరోజు ఆదివారం. తలుపులేసి ఉన్నాయి. బెల్ నొక్కితే పనిపిల్ల తలుపుతీసింది.
మీ అమ్మగారు అయ్యగారు ఉన్నారా? అని అడిగాను.
లేరు. ఊరికి పోయిండ్రు అంది.
మరి ఎవరూ లేకపోతె నువ్వెందుకున్నావ్ ఇంట్లో? అడిగాడు మెసెంజర్ మాధవన్.
నేనెప్పుడుంటా. అంది.
సరే ఒక అర్జెంటు ఫైలు కోసం వచ్చా మీ అయ్యగారి రూం ఎక్కడుందో చెప్పు. నేను వెళ్ళి వెతుక్కుంటా అన్నాను.
ఆమె తోట్రుపాటుతో వద్దొద్దు.అక్కడేం వుండవు. అన్నది కానీ, మమ్మల్ని లోపలికి రానివ్వలేదు.అతనుండక పోవచ్చునేమో గానీ,ఆవిడ ఇంట్లోనే వుండవచ్చు. ఉన్నా లేరనే చెబుతుంది ఆ పనిపిల్ల.అంత కట్టుబాట్లలో, ఆంక్షల్లో ఉంచడమెందుకు ఆవిడని? ఆవిడ పరమ గయ్యాలా?అన్నడు ప్రసాదు.

ఏమిటా పిచ్చి ప్రశ్న? గయ్యాళి భార్య అయితే అతని ఆంక్షల్లో కట్టుబాట్లలో ఎందుకుంటుంది?. ఆవిడ ఆంక్షల్లో ఇతనుంటాడు గానీ? లేక అతనికి ఆవిడకి పడదేమో!లేక ఇతనే సరిగ్గా చూడడో?.ఏది ఏమైనా వాళ్ళలో వాళ్ళు ఏగొడవ పడ్డా ఆఫీసు వాళ్ళు వస్తే సరదాగా పరిచయం చెయ్యడానికేం. ఆవిడేమన్నా అంతఃపుర కాంతా?రాజపుత్ర స్త్రీయా? ఇంటికెడితే అంత చుట్టూ పరదాలే కనిపిస్తాయి గానీ, మనిషి నీడ గానీ, పాదాలు గానీ కనిపించవు. ఏమాత్రం అలికిడీ వినిపించదు.ఎప్పుడూ ఆ పనిపిల్ల మాత్రం మొహాన్నింత కాఫీనీళ్ళు పోస్తుంది. ఈ మర్యాదకేం తక్కువలేదు అన్నాడు ఆచారి.
కొంప తీసి ఈ పిల్లేనేమో అతని భార్య అన్నారెవరో.
వెధవ జోకులెయ్యకు ఆపిల్లకి ఏడెనిమిదేళ్ళకన్నా ఎక్కువుండవు. అన్నాడు ఆచారి.
పెళ్ళి కాలేదేమో అన్నారు మరొకరు.
అతనీ ఆఫీసుకి వచ్చినప్పటికే కొత్తగా పెళ్ళయింది. కాని ఎవరెళ్ళినా, ఆఖరికి ఆడవాళ్ళెల్లినా ఆవిడ మాత్రం కనిపించదు. పరిచయమూ చెయ్యడు.
ఆవిడ కారు నలుపేమో అన్నాడు శర్మ. మనం అందరం తెల్లగా మెరిసిపోతున్నామా? నలుపైనంత మాత్రాన మనమేమైనా హేళన చేస్తామా? అన్నాడు ప్రసాదు.
ఇంతకీ ఆ మురళీకృష్ణ వాళ్ళావిడ్ని తీసుకొస్తే గాని యాదగిరిగుట్ట వెళ్లమా? అసలీ ప్రోగ్రాము అతని కోసమే ఏర్పాటు చేసినట్టున్నారే హెడ్ గుమాస్తాగారు. అతన్ని ఎలాగైనా కలుపుగోలుతనంగా మాట్లాడించాలని ఆయన తాపత్రయం.అందరూ సఖ్యతగా, మంచిగా, సరదాగా వుండాలనుకుంటారు ఆయన. అతనేమో ముభావంగా వుండి ఎవరితోనూ కలవడు అన్నాడు ప్రసాదు.
ఏవండీ ప్రసాదు గారూ! మురళీకృష్ణ వచ్చాడా? అంటూ దూకుడుగా వచ్చింది రెండు చేతులతోనూ క్యారియర్లు మోసుకుంటూ టైపిస్టు మాధురి.
అందుకేకదమ్మా మేమింతవరకూ ఎదురుచూస్తున్నది.
ఐతే మా గురించి కాదన్నమాట!మేం రాకపోయినా ఫర్వాలేదు అంది మాధురి.
మీ గురించయితే ఎదురుచూడడమెందుకు? మీరెలాగూ వస్తారు. ఔను గానీ క్యారేజీలు మోసుకుని వచ్చావు.నాకు పులిహోర గాని తెచ్చావా?అడిగాడు ఆచారి.
పులిహోర మీ ఇంటో బాగా చేస్తారని గొప్పలు చెబుతారుగా? నేను మాత్రం ఏం తేలేదు బాబూ.మీరే ఏమన్నా పెట్టాలి.నాకు వంటే సరిగా రాదు. రాఘవ గారింట్లోనే కాస్త చెక్కరపొంగళి,వడలు చేశారు అంది మాధురి.
అబ్బ! వడలు తెచ్చావా? నాకు చాలా యిష్టం. ఏదీ ఒకటి పెట్టు. రుచి చూస్తాను అన్నాడు ఆచారి.
చారీ! ఆపుతావా నీసొద. నీకెప్పుడూ తిండి గొడవే. ఆ మాధురీ రాఘవ వాళ్ల ఫ్యామిలీ ఏరీ? అన్నాడు శర్మ.
రాఘవ గారే వచ్చారు ఆవిడ రాలేదు. రాత్రి వాళ్ళ అత్తగారూ, మామగారూ, తోటికోడళ్ళు, ఆడబొడుచులు ఇంటి నిండా బంధువులు చాలా మంది వచ్చారు. అందుకని ఆవిడ రాలేదు.
వచ్చేటప్పుడు మురళీకృష్ణ ఇంటికి వెళ్ళి చూడకపోయారా? వచ్చేదీ రానిదీ తెలిసేది? అన్నాడు ప్రసాదు.
అదే అక్కడికి వెళ్ళీ వస్తున్నాము రాఘవగారూ నేనూ. ఇల్లు తాళం వేసుంది. వచ్చేసుంటారనుకున్నాం.
ఐతే రాకుండా తప్పించేసుకున్నాడు. ఎక్కడికో చెక్కేసుంటాడు అన్నాడు రాఘవ.
ఇంట్లో ఉండే బయట తాళం వేసుండవచ్చుగా అన్నాడు ఆచారి.
ఐతే అదీ నిజమే అయ్యుండచ్చు అన్నారు అందరూ.
ఇంకెందుకు ఆలస్యం? ఇప్పటికే చాలా లేటయ్యింది. హెడ్ గుమాస్తాగారితో చెప్పండి. అందరూ వచ్చేసినట్లేగా?బయల్దేరదాం.మళ్ళీ పిల్లలు ఆకళ్ళంటూ ఇక్కడే గోలచేస్తారు.వేనులో అందరూ సరిగ్గా సర్దుక్కూచోండి.

ఏరీ గుర్నాథంగారు? అంటూ ప్రసాదు హడావిడి మొదలుపెట్టాడు. (...సశేషం)
 

 
  పెయ్యేటి శ్రీదేవి గారు: వీరు హైదరాబాద్ వాస్తవ్యులు. వీరి కథలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, స్వాతి, నవ్య, నది, చతుర వంటి అన్ని ప్రముఖ పత్రికలలోను ప్రచురితమైనాయి. గత సంవత్సరం స్వాతి-సి.పి.బ్రౌన్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో వీరి కథ "ప్రాచీన హోదా"కు బహుమతి లభించింది. వీరి కథలు సిడ్నీ (ఆస్ట్రేలియా)లోని తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించే వాహిని అన్న పత్రికలో ప్రచురింపబడుతూ వుంటాయి. అలాగే సిడ్నీ లోని "తెలుగు వాణి", బ్రిస్ బేన్ లోని "తెలుగు లహరి" రేడియో ఛానెల్స్ నుంచి వీరి కథలు ప్రసారం అవుతూ వుంటాయి. వీరికి సంగీతం అంటే కూడా చాలా మక్కువ. లలిత గీతాలకు బాణీలు కట్టడం వీరి హాబీ. ఈ సంవత్సరం సిలికానాంధ్రా వారు వెలువరించిన నాటికల ప్రత్యేక సంచికలో వీరి నాటిక "శ్రీకృష్ణ సాక్షాత్కారం " ప్రచురించబడింది.  

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech