కావ్య

 

శ్రీమతి తమిరిశ జానకి

 

కావ్య
ఆమె "స్త్రీ" శక్తికి మారుపేరు.....
ఆమె ప్రేమమయి..........
ప్రేమించిన వాడిని మనస్ఫూర్తిగా నమ్మి ప్రేమామృతాన్ని పంచి ఇచ్చిన అమృతమూర్తి...
ఆమె దయామయి........
మనసు స్పందించే సంఘటనలకి కదిలిపోయి కరిగి కన్నీరయ్యే కరుణామూర్తి...
ఆమె అబల...
శారీరకంగా పురుషుడి పశుబలానికి పువ్వులా నలిగిపోయే సుకుమారి.......
ఆమె సబల.........
మనో నిబ్బరం... మానసిక బలంతో మనుగడ సాగించగల అసలు సిసలు మనిషి....
ఆమె అగ్ని......
అగ్నికి అపవిత్రత లేదు..........
మలినాన్ని కాల్చి పారేయగల అగ్నికి మలినం అంటుకోదు...
తనలోని అధైర్యాన్ని, ఆవేదనని,నిరాశనీ, బాధనీ కాల్చి మసిచేసి మండిన మంట ఆమె.......
ఔను.... ఆమె స్త్రీ కదా! ఆమె "కావ్య"....
ఔను.......ఆమె ఒక "కావ్యం"...

ఒకప్పుడు ఇంట్లో........
అమ్మ వెనకే కొంగుపుచ్చుకుని కూడా కూడా తిరిగిన చిట్టిపాప....
బడిలో తోటి స్నేహితురాల్ని అంటిపెట్టుకొని అడుగులు వేసిన బిత్తర చూపుల చిన్నారి........
యవ్వనంలో......... వయసుపూదోటలో అందం హరివిల్లయి రంగులు విరజిమ్ముతున్నప్పుడు..........
అతగాడి చూపుల గాలంలో చిక్కుకున్న చేపపిల్ల...
ఔను......ఆమె "కావ్య"........ కోపిష్టి తండ్రి తల్లిని కొడుతున్నప్పుడు ఆయన మీద అసహ్యం కలిగినా, బేల చూపులు చూసిన మాట నిజం.

క్రమశిక్షణ పేరుతో తల్లినీ, తననీ ఆయన కాల్చుకు తింటున్నప్పుడు ఏడవలేక నవ్విన మాట నిజం. తిట్లు, దెబ్బలు, సణుగుళ్లు, సాధింపులతో అమ్మని జీవచ్ఛవంలా ఆయన తయారుచేసిందే కాక....కనిపించిన ప్రతి మనిషితోనూ తన భార్య అనారోగ్యవంతురాలని అదో రకంగా చులకనగా మాట్లాడుతుంటే వినలేక బాధతో... ఇలాంటి తండ్రిని నాకు ప్రసాదించావేమిటి భగవంతుడా అని మనసు ఆక్రోశించిన మాట నిజం. ఇలాంటి నిజాలు ఎన్నో ఎన్నో మరెన్నో..........మనసుని అల్లకల్లోలం చేసినా..... చేస్తూనే ఉన్నా... స్థిరత్వం కోల్పోలేదామె... ఔను.....స్త్రీ కదా! ఆమె కావ్య.......

"ఆ అమ్మాయా? ఎవరినో ప్రేమించి వాడితో తిరిగిందటగా?అలాంటి పిల్లని కోడలిగా ఎవరు చేసుకుంటారు.?..
"ఆ పిల్లకి జన్మలో పెళ్ళెలా అవుతుంది? ఎవరూ చేసుకోరు?.........."
"ఇంకెలా బతుకుతుందో?...."
ఇలా రకరకాలుగా మాటలు వినవలసివచ్చేది ఆమె బయట అడుగుపెట్టినప్పుడల్లా.......
ఎవరితోనో అనవసరపు తగవు పెట్టుకుని వాడిని కొట్టి వాడి చేతిలో తాను తన్నులు తిని తగలకూడని చోట దెబ్బతగిలి ఆయువు మూడింది తండ్రికి.
తల్లికి ఆ దిగులొక్కటే చాలదన్నట్టు తన గురించిన చింతకూడానూ.....
ఏ సంబంధమూ రావట్లేదని చింత...
శాశ్వతంగా కూతురిమీద మచ్చపడిపోయిందని బాధ....
నమ్మించి మోసం చేసిన పురుషుడిని విమర్శించదీ సమాజం.....
నమ్మి మోసపోయిన స్త్రీని దుయ్యబడుతుంది..... రకరకాల మాటలు అంటుంది...........హీనంగా చూస్తుంది...ఎందుకు?
శారీరకంగా పురుషుడి కంటే స్త్రీ బలహీనురాలు కావడం వల్లనా?..........
జననీ జన్మభూమిశ్చ అంటూ స్త్రీకి ఉన్నతాసనం వేసినది శ్లోకాలు వల్లెవేయటానికేనా?..........
అర్థం కాక తల్లడిల్లిపోతున్న "స్త్రీ" ఆమె..... ఔను........ఆమె........కావ్య...
వీధిలో అడుగుపెడితే చాలు.........వెటకారంగా వెంటాడే చూపులు.......ద్వంద్వార్థాల మాటల ఈటెలు.....
వంకర నవ్వులు.......అన్నిటిని భరిస్తుంది.......ఎందుకు?
చెమర్చే మనసుని ప్రతిక్షణం అద్దుతూనే ఉంటుంది తనకి తనే చెప్పుకునే ధైర్య వచనాలనే బ్లాటింగు పేపరుతో ......ఎందుకు?....
బ్రతుకు మీద తీపితో కాదు.......
చావంటే భయంతో కాదు.......
జీవించే హక్కు తనకెందుకు లేదన్న పట్టుదలతో...
చచ్చి సాధించేదేమీ లేదన్న ఇంగిత జ్ఞానంతో.
ఏదైనా సాధించగలిగితే బ్రతికే సాధించాలన్న వివేకంతో.
బ్రెయిన్ హెమరేజ్ వల్ల హఠాత్తుగా తల్లి ఊపిరి ఆగిపోతే తాను ఊపిరి పీల్చడం మరిచి స్థాణువే అయ్యింది.
ఆత్మహత్య అరనిమిషంలో చేసుకోవచ్చు... కానీ..అది పిరికితనమని పించుకుంటుంది.
ఆత్మధైర్యంతో ఆత్మ విశ్వాసంతో బ్రతకగలగటమే గొప్ప అన్న విచక్షణా జ్ఞానంతో అన్నిటినీ భరించగలిగే ఓర్పుని కవచంగా చేసుకొని జీవితాన్ని ముందుకి సాగనిచ్చే ఆలోచనా సరళిని ఆయుధంగా చేసుకుని ఒంటరి పోరాటంలో అడుగు ముందుకి వేసింది.
ఔను ఓర్పుకీ సహనానికీ మారుపేరు "స్త్రీ".
ఆమె తల్చుకోవాలేగాని.
ఆమె సహనానికి పరీక్ష పెట్టడం పురుషుడి తరమా?
ఆమె కావ్య
దిక్కు తోచని పక్షిలా ఒంటరిగా ఈ సమాజం నడి మధ్యన నిలబడవలసి వచ్చినా.. గుండెదిటవు పరుచుకుని తనకి తనే ఓ దిక్కు ఏర్పరుచుకుని విలువైన కన్నీళ్ళని వృధాగా కారనివ్వకుండా శాంతి దూతలా తెల్లని యూనిఫామ్ లో, చెరగని చిరునవ్వుతో, ఓర్పు, సహనాలనే ఆభరణాలతో మందుతలో పాటు సేవలు మాత్రమే కాక చల్లని మంచి మాటల ఉపశమనంతో సేదదీర్చే ఆమె రోగులపాలిటి దేవత దేవతామూర్తి.
విసిగించే ప్రశ్నలక్కూడా విరిసిన పువ్వులా నవ్వుతూ మృదువుగా సమాధానాలిచ్చే ఆమె చెక్కు చెదరని నిబ్బరానికి ప్రతిరూపం.
ఔను ఆమె ఒక నిండు కుండ
ఆమె కావ్య
"ఎలాగైనా సరే మా అబ్బాయిని కాపాడండి డాక్టర్ ప్రాణభిక్ష పెట్టండి డాక్టర్!" చేతులు జోడించి అర్థిస్తోంది ఆ తల్లి.
డ్రగ్స్ కి బానిస అయి ఆరోగ్యం సర్వనాశనం చేసుకున్న యువకుడిని పరీక్షించి చిన్నవయసులోనే ఆయుష్షు తీరబోతోంది పాపం పాడు మత్తుమందులు ఎందుకలవాటు చేసుకోటం ప్రాణాల మీదికి తెచ్చుకోడానికి కాకపోతే అని అనుకోకపోలేదా డాక్టర్.
శాయ శక్తులా రోగిని బాగుచేసే ప్రయత్నం చేయడం వైద్యుడిగా తన ధర్మం కాబట్టి ఆ ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
ఆ తల్లికి కాస్త ఊరట కలిగించిన వాడయ్యాడు.
డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన ఆ యువకుడికి ఆశనిపాతమే అయింది.
తండ్రికి వ్యాపారంలో తేరుకోలేనంతగా నష్టాలు రావటం.
ఆకాశంలోంచి ఒక్కసారిగా కింద గతుకుల బాట మీద పడినట్లయింది. ఇల్లు అప్పుల వాళ్ళ పాలవటం అప్పటివరకూ ప్రతివారి ఎదుటా ఫోజులు కొడుతున్న అహం, దర్పం, గర్వం హఠాత్తుగా పొమ్మంటే ఎలా పోతాయి.
ఔను
అహంకారం గర్వం పొగరు డాబూ దర్పం వాటికి ప్రతి రూపమే అతను.
నా అంతవాడులేడన్న గర్వంతో నేను ఆడిందే ఆట పాడిందే పాట అన్న తలబిరుసుతనంతో
తండ్రి సంపాదించే ఆస్తి తనే సంపాదిస్తున్నంత గొప్పగా.. కాలరు ఎగరేసుకుంటూ తోటి స్నేహితుల్తో చెప్పుకుంటూ ఫోజులు పెట్టి తిరిగిన అతను అతనో విలాస పురుషుడు మనిషికి ఉండాల్సింది నేలమీద నడిచే అలవాటు గాల్లో ఎగురుతూ ఉండిపోతాను. నేలమీద కాలు ఆన్చనంటే అది జరిగేపనా?
దబ్బున కింద కూలక తప్పదు.
అలా కూలే పరిస్థితి రాకముందే కాస్త జాగ్రత్త పడితే ఎంత మంచిది.
వ్యాపారంలో తగిలిన దెబ్బ ఆ తండ్రి గుండెలమీద కొట్టింది
ఒకవైపు అప్పులపాలైపోయిన ఇల్లు
భట్రాజు పొగడ్తలతో ఎప్పుడూ కాకాపడుతూ చుట్టూ మూగి వుండే స్నేహితులు హఠాత్తుగా దూరమైపోతే
తన వలలో చిక్కిన రామచిలుకలు తననే చిన్న చూపుచూసి తప్పించుకుని పారిపోతే
అవమానం కోపం నిస్సహాయత చేతకానితనం అన్నీ కలిపి దహించివేస్తూ మానసికంగా నలిగిపోయి మనిషిగా నిలబడలేక మత్తుమందులకి బానిస అయిపోయిన ఓ బలహీన మనస్తత్వమే అతను
ఆ మత్తు కోసం డబ్బు కావాలి కొనుక్కోవడానికి
అందుకు చిన్నా చితకా దొంగతనాలు చెయ్యడానికి కూడా వెనకాడని ఓ వికార మనస్తత్వమే అతను
అతన్ని ఆ మంచమ్మీద
ఆ స్థితిలో చూసి
చెక్కిన బొమ్మల్లే నిలబడిపోయింది కావ్య
నోటమాట రాలేదు
అతనూ గుర్తుపట్టాడు ఆమెని
పలకరించేందుకు శక్తి లేదు ధైర్యమూ చాల్లేదు
పిచ్చి చూపులు చూశాడు ఆ చూపులెక్కడో వున్నాయి.
ఆ వాలకం అయోమయంగా ఉంది.
చెరగని చిరునవ్వుతో తిరుగాడే ఆమె చూపుల్లో ఏవేవో నీలినీడలు.
ఆ కళ్ళల్లో అస్పష్టంగా మెరిసిన తడి.
తెప్పరిల్లింది అంతలోనే సర్ది చెప్పుకుంది తనకి తానే
నిండుకుండలా ఏ మాత్రం తొణకక నిబ్బరంగా నడిచింది అతని మంచం దగ్గరికి
"మన పెళ్ళిమాట ఎత్తితే ఇదిగో అదిగో అంటావు రోజుల తరబడి గడిపేస్తున్నావు ప్రకాష్ ఎన్నాళ్ళిలా?
"పిచ్చిదానా?" పగలబడి నవ్వాడు
"ఎందుకిలా నవ్వుతావు?"
"మరేం చెయ్యమంటావు?గొప్పింటి కుర్ర్తాడు బీదపిల్లని పెళ్ళి చేసుకోవడం అన్నది సినిమాల్లోనూ కధల్లోనూ తప్ప నిజ జీవితాల్లో జరుగుతుందా?
"ఏమిటి ప్రకాష్ నువ్వు మాట్లాడేడి?"
"ఉన్నమాటే అన్నాను అర్థం కాలేదా?"
"వొద్దు ప్రకాష్ సరదాకైనా అలా అనద్దు"
"సరదాకెవరన్నారు? నిజంగానే అంటున్నాను."
"అంటే? ఇన్నాళ్ళూ నన్ను ప్రేమించానంటూ నేను లేనిదే జీవించలేనంటూ నా చుట్టూ తిరిగి నా మనసు దోచుకున్నది కాలక్షేపానికా?"
"కరెక్టుగా చెప్పావ్ ."
ఇంకా నమ్మకం కలగట్లేదా బేలమనసుకి
నిజంగా నువ్వు నన్ను ప్రేమించట్లేదా?
భుజాలెగరేశాడు "ప్రేమా"?
మనసు కలుక్కుమంది కావ్యకి ఆ మాటతో
"ప్రేమా పెళ్ళీ అనే మాటలగ్గానీ లొంగవనీ
అలా అంటేగానీ నాతో తిరగడానికి ఒప్పుకోవనీ
ఆరెండు మాటలూ నీ మీద ప్రయోగించానంతే"
"ప్రకాష్!"
"ఉష్ ఎందుకలా అరుస్తావు?" చెప్పలేనంత విసుగు ఆ మాటలో
ఎక్కడలేని చిరాకూ చిందులాడింది ఆ మొహంలో
"నా బాధ నీకు అరుపులాగే అనిపిస్తుంది
నువ్వెంత అన్యాయంగా మాట్లాడుతున్నావో తెల్సా?"
"ఇందులో అన్యాయంగా ఏమీలేదు. నాకు మోజు కలిగిన వాళ్ళని లొంగదీసుకుంటాను.లైఫ్ ఎంజాయ్ చేస్తాను."
"ఛీ ఛీ నీ అసలు రంగు ఇదన్నమాట " ఆశ్చర్యం అంతకు మించిన అసహ్యం
"ఇలాంటి వాడివని తెలియక నిన్ను నమ్మాను మనస్పూర్తిగా ప్రేమించాను నీమీద ఆశలు పెట్టుకున్నాను. ఇంత మోసం చేస్తావని కల్లోకూడా ఊహించలేదు."
ఔను ముల్లు గుచ్చుకున్నది మనసుకి
అంతకంటే కష్టం మరొకటి ఉంటుందా మనిషికి?
మనసు చెనర్చినా వర్షించేది కళ్ళేగా?
ప్రేమ అనేది ఎంత ఇంద్రజాలం చెయ్యగలదో ఇప్పుడర్థమైంది ఆ పిచ్చిపిల్లకి
ప్రేమ అనే ఆ రెండక్షరాలూ ముందూ వెనకా ఆలోచించనివ్వకుండా ముందుకెలా పరిగెత్తించగలవో ఇప్పుడర్థమైంది. ఆ వెర్రి మనసుకి మూగగా రోదించే ఆమె మనసెలా కనిపిస్తుంది అతగాడి కపట ప్రేమకి? న్యాయాన్ని అర్థించే ఆమె హృదయవేదన పట్టించుకునే అవసరమేముంది అతడి వక్రబుద్ధికి.?
"పిచ్చిగా మాట్లాడి ఆవేశపడకు అందినంత మటుకు జీవితాన్ని అనుభవించడం నేర్చుకో రా టైము వేస్టు చెయ్యకు ప్రేమ గీమ అంటూ పెద్ద పెద్ద మాటలు మనకెందుకు చెప్పు" రెండు చేతులమధ్యా బంధించబోయాడామెని.
"ఛీ నన్ను ముట్టుకోకు. నామీద ప్రేమ లేనప్పుడు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు నామీద చెయ్యివేసే అధికారం చొరవా నీకుండవని మర్చిపోవద్దు. నా ఏడుపు నన్నేడవనీ నా దోవన నన్నుపోనీ"
"అలా వెళ్లిపోనిస్తానా నిన్ను? ఈ రోజు నానించి తప్పించుకోలేవు."కర్కశంగా పలికింది గొంతు.
"ప్రకాష్! అలా మాట్లాడటానికి సిగ్గనిపించటంలేదా నీకు?"
"సిగ్గు స్త్రీలకు సింగారం అన్నారు మొగవాళ్ళక్కాదు."
"ఔన్లే ప్రేమ గుడ్డిదని కూడా కవులు ఇపుడు తెలుస్తోంది ప్రేమ ఎంత గుడ్డిదో" శృతి తప్పిన రాగంలా వణికింది మాట
"చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా లాభం లేదుగా? అందుకని అయిందేదో అయిపోయిందిగా? నా నిజ స్వరూపం నీకు తెల్సిపోయింది కాబట్టి ఇంక రేపట్నించీ నా మొహం చూడవు నువ్వు ఇప్పుడు పోగొట్టుకుంటానా అవకాశం.?"
"ఛీ నన్నొదులు "విదిలించి కొట్టబోయింది
"నిన్ను లొంగదీసుకోలేననుకుంటున్నావా?
మొగవాడి బలం ముందు ఆడదెందుకు పనికొస్తుంది?" అణువణువునా గర్వం తొంగిచూసింది.
ఆ మాటలు మరింతగా మండించాయి ఆమెని కళ్లల్లో నిప్పులు కురిశాయి.
’తల్చుకుంటే ఆడదాని శక్తిముందు మీ మగవాళ్లెందుకూ పనికిరారు"
"అలాగా! అయితే నీ శక్తి నేను పరీక్షించాల్సిందే"
లేడిపిల్లకి క్రూరమృగాన్నెదుర్కొనేందుకు తగిన శారీరక బలం ఇవ్వలేదా భగవంతుడు.
మృదుత్వం సౌకుమార్యంనిండిన పుష్పాన్ని కాలరాచిన పైశాచిక ఆనందం పొందే శారీరక బలమూ ఎందుకూ నీ జీవితం దండగ
డాక్టరుగారు చెయ్యమన్న ఇంజక్షన్ అతనికి చేసి
అలాగే అతనివైపు చూస్తూ ఆ మంచం దగ్గరే నిలబడిపోయింది కావ్య.
మానవజన్మని కలుషితం చేసుకున్న ఓ బలహీన హీన మనస్కుడిగా కనిపించాడతను.
ఇప్పుడు సమయం సందర్భం కాదు గానీ లేకపోతే ఒక ప్రశ్న అతన్ని అడగాలనిపించిందామెకి
శారీరక బలం కంటే మానసిక బలం ముఖ్యం కాదా అని?
ఇంత బలహీన మనస్తత్వం ఉన్న నువ్వు నా మానసిక బలం ముందు నిలబడగలవా అని?
తల్చుకుంటే స్తీ శక్తి ముందు నీ లాంటి నిర్బలులు ఎందుకు పనికొస్తారని?
స్త్రీ శక్తి సహనంలో ఇమిడి ఉందని అర్థం చేసుకుని గౌరవించలేని అల్పుడివి కాదా నువ్వని.?
స్వంత కాళ్ళమీద నిలబడే ప్రయత్నం చేసే ఒంటరి స్త్రీని ఎప్పటికప్పుడు కాలుజారి పడేటట్టు చెయ్యాలని పొంచి చూసే గుంటనక్కల్లాంటి మనుషులున్న ఈ సమాజంలో నిలబడటానికి
నిలదొక్కుకోటానికి తానెన్ని కష్టాలనుభవించిందో
ఎంత మానసిక బలాన్ని కూడగట్టుకుందో ఊహించనైనా ఊహించగలడా ఇతను అని అనిపించిందామెకి
ఏ బలం గొప్పది?
ఏశక్తి గొప్పది?
అడగాలనిపించింది
ఓ దేవతలా
ఓ ప్రేమమూర్తిలా
ఓ దయామయిలా
చీకటిని పారద్రేలే ప్రయత్నం చేసే ఓ చిరుదివ్వెలా
అతనికెదురుగా నిలబడి ఉంది ఆమె ఔను ఆమె కావ్య...

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech