గగనతలము-9
                       

 

గతము-వర్తమానము-గమ్యము

కాలరహస్యమును తెలుసుకోవడానికి చాలా ప్రయత్నములు జరిగాయి. వేదములో కాలమునుగూర్చి, కాలాంగములయిన తిథ్యాదులను గూర్చిన వివరములు చాలా ఉన్ననూ అవి నేటికినీ అసంపూర్ణముగా మనకు గోచరిస్తున్నాయి. వేదముయొక్క అర్థగాంభీర్యమే దానికి కారణమయిననూ దానికి సంబంధించిన భిన్న కారణములను అన్వేషించడానికి ఇతిహాసకారులు చాలా వరకు ప్రయత్నములు చేశారు. చేస్తున్నారు కూడా. యజ్ఞమునకు ప్రాధాన్యతనిస్తూనే వైదిక సాహిత్యము నక్షత్రములను దేవ నక్షత్రాది విభాగముల ద్వారా వాని యందు లభించెడి శుభాశుభఫలములను నిర్వచించింది. యజ్ఞ సంబంధిత ఫలములతో బాటు మానవ శ్రేయస్సును కాంక్షించే ఈ వైదిక చర్చే ప్రస్తుతము మన విజ్ఞానమునకు ఆధారము.
మన చుట్టూ చాలా ధ్వనులు ఉన్నా మనము గ్రహించగలిగినవి మాత్రమే మనము వినగలుగుతున్నాము. చాలా విషయములు మన చుట్టూ ఉన్నా మన కళ్ళు చూడగలిగినవి మాత్రమే మనము చూడగలుగుతున్నాము. దానికి hidden misteries అను గ్రంథ రచయిత ఒక ఉదాహరణను ఇచ్చాడు. మనము రేడియోని ప్రారంభించినపుడు వివిధ కేంద్రములు ప్రసారము చేస్తున్న వివిధ విషయములను మనము వినగలుగుతాము. ఆ రేడియో ప్రారంభించని ముందు కూడ ఆ విషయములు మన చుట్టూ ఆ ప్రదేశములో ఉన్ననూ మనకు వానిని గ్రహించు శక్తి లేకపోవుటచే మనము దానిని గ్రహించలేకపోతున్నామని ఆ రచయిత వక్కాణించారు. కుక్కలు, ఆవులు, గబ్బిలములు వంటి జంతువులను మనము పరిశీలించినపుడు ఇటువంటి భావన మనలోనూ కలుగుతుంది.
గ్రహముల ద్వారా గతం వర్తమానం మరియు గమ్యాన్ని చెప్పడం వెనుక దాగి ఉన్న రహస్యం చాలా లోతులను కలిగి యున్నది. ఆ విధముగా చెప్పడాన్ని దైవిక శక్తి అని లేక స్ఫురణ (intution) అని తేలికగా కొట్టి పారేయడానికి లేదు. ఆ విధముగా చెప్పే వారిని మన ప్రాచీనులు దైవజ్ఞులు అనే వారు. అంటే దైవము తెలిసినవారని అర్థము. మన ప్రాచీన జ్యోతిష్యములో మరియు మిగిలిన వేదాంగములలో కూడ కాలమునే దైవముగా వర్ణించడము జరిగినది. దైవజ్ఞునికి మరో పేరు సాంవత్సరుడు. సంవత్సరమంటే కాలము, దానిని ఎఱిగినవాడు సాంవత్సరుడు అన్నమాట. అంటే భూత భవిష్యద్వర్తమానములను తెలిసినవాడు లేక వాని గురించి చెప్పగలిగినవాడు దైవజ్ఞుడన్నమాట.
ఈ భూమిపై విజ్ఞానము ఖగోళ శాస్త్రముతోనే ప్రారంభమయినది. ఈ సృష్టిని లేక ఈ విశ్వమును గూర్చి మనిషి తెలుసుకునే ప్రయత్నములోనే మనిషి విజ్ఞానములో నేటి ఎత్తుకు ఎదిగాడన్నది నిర్వివాదాంశము. సూర్యుని నుండి మనకు కిరణములు ప్రసరించడానికి మధ్యవర్తిగా ఒక వాయువు (ether) కారణమన్న వైజ్ఞానికులు కొంత కాలమునకు ఈ సృష్టి అంతా ఒక యంత్రమువలె పని చేస్తున్నదని నిర్థారణకు వచ్చారు. ఈ నిర్థారణ యొక్క ఫలితమే యాంత్రిక విజ్ఞానము(mechanics) యొక్క సృష్టి. యంత్రములో ప్రతి భాగము ఒక నిర్థిష్ట నియమముతో పని చేస్తుంది. కానీ సృష్టి చాలా విషయము లందు ఆ నియమములను ఉల్లంఘిస్తున్న కారణముగా ఈ విశ్వమును ఒక యంత్రముగా భావించలేమని వారు తరువాతి కాలములో నిర్థారణకు వచ్చారు.
ఆ దశలో ఒక కొత్త సిద్ధాంతము ఆవిర్భవించినది. అదే కిరణ (శక్తి) సంప్రేషణము లేక ప్రసరణము మరియు పదార్థము (Radiation & matter). ఒక వస్తువు ఆవిరిగా మారి మాత్రమే ప్రకాశమును లేక తన శక్తిని మరొకరికి ఇవ్వగలదు. సూర్యాది ఖగోళ పిండములలో జరుగుతున్నది ఇదియే. ఈ పిండములు రోజు రోజుకీ కరిగిపోతున్నాయి. తద్వారా మనకు ప్రకాశమును, కాంతిని , శక్తిని ఇవ్వగలుగుతున్నాయి. ఇలా కొంత కాలమునకు అవి అదృశ్యమవుతాయి. అపుడు సృష్టి అంతమవుతుంది అని కొంతమంది భావన. మరికొందరు ఈ శక్తి ప్రసరిస్తూ వెళ్లి ఒక చోట ఘనీభవించి మరల పదార్థముగా రూపొందుతుంది అని భావిస్తున్నారు.
ఈ సిద్ధాంతములన్నీ నిశితముగా పరిశీలిస్తే వీరందరికన్నా మన మహర్షులు చాలా ముందుకు వెళ్లారని చెప్పవచ్చును. ఈ విశ్వమును వారు పూర్తిగా అర్థము చేసుకున్నారు. దీనిలో అణువణువూ వారికి తెలుసు. దానికి తార్కాణము ఋగ్వేదము. నభోమండలము (ఆకాశము) ను సూక్ష్మముగా వర్ణించిన ఋగ్వేదము మహాభారతమునకు ఆధారము. అందువలననే మహాభారతము పంచమవేదముగా అభివర్ణించబడినది. ఋగ్వేదములో వర్ణించబడిన ఖగోళ దృశ్యములే యథార్థఘట్టములుగా మహాభారతమునందు వర్ణించబడినవి. ప్రస్తుతము ఆ వర్ణనలను మనము కపోలకల్పితములు, యథార్థములు కాదని కూడ నిరూపించలేకపోతున్నాము. ఆ విధముగా చేయలేనంత వరకూ అది మనకు యథార్థమే.
ఋగ్వేదము మరియు మహాభారతములో వర్ణించబడిన ఈ వర్ణనలకు ప్రతిరూపమే పంచాంగములలో మనము పొందుపరుస్తున్న వివిధ పర్వములు మరియు వ్రతములు. అనగ మన శాస్త్రములన్నీ ఒక దానికి ఒకటి పెనవేసుకుని ఉన్నాయి మరియు వీటీ మూలములు ఋగ్వేదములో ఉన్నాయి. మేథాతిథిచే వర్ణింపబడిన ఋక్కులన్నీ గణితము మరియు ఖగోళమునకు సంబంధించినవే. మేషాదిరాశులు, అగ్ని దేవుని వాహనాదుల వర్ణన, కామదహనము, ఇంద్రవృత్రాసురయుద్ధము, గంగావతరణము ఇలా క్రమముగా అచట వర్ణింపబడినవాటి ఆనవాళ్లలోనే నేటికీ మనము నడుస్తున్నాము. కార్తెలలో సంభవించెడి ప్రాకృతిక వైజ్ఞానిక వర్ణన ఈ సందర్భముగా ముఖ్యముగా చర్చించుకోవాలి.
జాతకమును చూసి ఫలాదేశము చెయ్యడానికి పైన వివరించిన విషయములకు సంబంధమేమిటన్న అనుమానము రావచ్చును. లక్షా ఎనభైవేల మైళ్లు ప్రతి సెకనుకు ప్రయాణిస్తూ సూర్యుని కాంతి భూమిని 8 నిమిషములలో చేరుతోంది. అదే సూర్యునికన్నా లక్షలరెట్లు పెద్దదైన జ్యేష్ఠానక్షత్రము యొక్క ప్రకాశము భూమిని ఎంత సమయములో తాకుతుంది? మన కంటికి స్పష్టముగా కనిపించని ఆ నక్షత్రము మన నుండి ఎంత దూరములో ఉంది? దగ్గరగా ఉన్న సూర్యకాంతి చేరడానికి ఎనిమిది నిమిషములు అవసరమైతై సూర్యునికన్న లక్షల రెట్లు ఉన్న ఆ జ్యేష్ఠా నక్షత్రము కాంతి ఎన్ని రోజలలో లేక ఎన్ని సంవత్సరాలలో మనను చేరుతోంది? మనను చేరుతున్న ఆ నక్షత్రపు కాంతి ఎన్ని సంవత్సరముల ముందు ఆ నక్షత్రమునుండి వెలువడింది? నిమిషానికి రెండు వందలకోట్ల టన్నుల సూర్యుని భాగము ఆవిరవుతోంది. ఆ విధముగా ఆవిరవుతూ సూర్యుడు కొన్ని వేల కోట్ల సంవత్సరములకు మాయమయిపోయే అవకాశములున్నాయి. మరి మనని ప్రభావితము చేస్తున్నవిగా మనము భావిస్తున్న నక్షత్రముల స్థితి ఏమిటి?
ఈ విశ్వములో కాంతి (శక్తి) ప్రసరిస్తున్న విధానము, ఒక ఖగోళ పిండమునుండి వెలువడిన ప్రకాశము మరియు మరియొక గ్రహమునుండి వెలువడిన ప్రకాశముల మధ్య సంబంధము, వాని కలయికచే ఏర్పడబోవు మార్పులు, ఇలా అనేక విషయములను సమిష్టిగా అధ్యయనము చేసినపుడు మాత్రమే జాతకము చూసి ఫలితమును చెప్పడానికి ఉపయోగించే సూత్రాల అంతు తెలిసేది.
జ్యోతిషములో , ముఖ్యముగా ఫలితమునకు ఉపయోగించే సూత్రములలో స్వచ్ఛమైన గణితము (pure mathematics) యొక్క ప్రయోగమే కనిపిస్తుంది. ప్రయోగ గణితము యొక్క (applied mathematics) ప్రయోగము ఇందులో ఎక్కడా కనిపించదు. గణితము యొక్క ఆవశ్యకత మరియు ఆవిర్భావము కూడ నభోమండలములోని గ్రహ నక్షత్రాది పిండముల స్థితి గతి ప్రభావాది ఫలములను తెలుసుకొనుటకే అన్నది కూడ నిర్వివాదాంశమే.
సంస్కృత జ్ఞానములేని పాశ్చాత్య వైజ్ఞానికులు ఖగోళాధ్యయనములో పరిశ్రమించి వక్కాణించిన విషయములు అంతకన్నా ప్రాచీనమైన మన సాహిత్యములో ఉన్నాయంటే మనకు నేడు ఆశ్చర్యముగా కనిపించవచ్చు. Anicent calendars and Constellations అను గ్రంధమును రచించిన ప్లంకెట్ అను మహనీయుడు సంస్కృతమునెరిగి భారతీయ సాహిత్యమును పరికించిన మనకు ఎన్నో విశ్వ రహస్యములు తెలియగలవని తేల్చినాడు. కావున మన విజ్ఞానము పరిపూర్ణము కానీ నేడు మనము దానిని ఆస్వాదించలేని స్థితిలో నున్నాము. క్రీ.శ 17, 18, 19, 20 శతాబ్దములలో అవిశ్రాంత కృషిచేసి ఖగోళమును అధ్యయనము చేసిన పాశ్చాత్యవైజ్ఞానికుల ఉద్గ్రంధములను నెమరువేస్తూ మన విజ్ఞానమును అధ్యయనము చేస్తే విశ్వశ్రేయస్సుకు తావునిచ్చే అనేకాంశములను బహిర్గతము చేయవచ్చు.
“As above so below, the drama on the Earth runs parallel to the Drama of the Sky” ??
 

సశేషము.......

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
 
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech