24. అలుకలు చెల్లవు హరిపురుషోత్తమ

 అలుకలు చెల్లవు హరిపురుషోత్తమ
నలి నిందిర నీతో నవ్వినది ||

ఆదిలక్ష్మి మోహన కమలంబున
వేదమాత నిను వేసినది
ఆదెస నీపై నభయహస్తమును
సాదరమున గడు చాచినది||

సిరి తన కన్నుల చింతామణులను
పొరి నీపై దిగబోసినది
వరద హస్తమున వలచెయి పట్టుక
అరుదుగ నిను మాటాడించినది||

జలధికన్య తన సర్వాంగంబుల
పిలిచి నిన్ని నిటు పెనగినది
అలముక శ్రీ వేంకటాధిప నిను రతి-
నెలమి నీవురం బెక్కినది||


మధుర ప్రణయ సంకీర్తన! అద్భుత భావ సౌందర్యానికి ప్రతీక! ఈ పాటలో అన్నమాచార్యుల వారు అచ్చ తెలుగు పదాల రాశులని దిగబోశారు. ఇక్కడి ఇతివృత్తమేమనగా స్వామి వారు అమ్మవారిపై అలక వహించారట! కారణమేమిటో? కాని అన్నమయ్య అమ్మవారి పక్షం వహించి, స్వామితో ఇంకా నీ అలుక సాగదయ్యా! ఇక చాలించు నీ అలుక! ఎందుకంటే ఆమె నీ వైపు ప్రేమగా నవ్వుతున్నది! ఆదిలక్ష్మీ, వేదమాత అయిన అమ్మ జగన్మోహనుడివైన నీపై మోహన కమలాన్ని విసిరినది! అంతేనా, కాదు! ఆ తరువాత నీపై అభయహస్తాన్ని కడు ఆనందంగా చాచినది! కాబట్టి నీ అలుకలు చెల్లవు! ప్రేమ పారవశ్యంతో తన కన్నులనే చింతామణుల రాశులను నీపై మురిపెంగ దిగబోసినది! అలక వహించిన నీ చెయ్యి పట్టుకుని మరీ మరీ నీతో మాట్లాడినది! తన దేహంలోని ప్రతి అణువులోనూ నీపై అపేక్షను పెంచుకుని నీతో సరసమాడినది! ఆ పైనీ వక్షస్థలంపై ఆ జగన్మత కొలువైనదయ్యా అని అందంగా అంటున్నారు అన్నమాచార్యుల వారు.

పెనగి = పెనవేసి, కలగలిపి
ఎలమి = ప్రేమ
పొరి = క్రమముగా, మాటికి

25. ఆకటివేళల

ఆకటి వేళల నలపైన వేళలను
తేకువ హరినమమే దిక్కుమఱి లేదు||

కొఱమాలి ఉన్న వేళ కులము చెడినవేళ
చెఱపడి వొరులచేజిక్కినవేళ
వొఱపైన హరినామమొక్కటే గతికాక
మఱచి తప్పిననైన మఱిలేదు తెరగు||

ఆపద వచ్చిన వేళ ఆరడిబడిన వేళ
పాపపు వేళల భయపడినవేళ
వోపినంత హరినామమొక్కటే గతికాక
మాపుదాకా పొరలిన మరిలేదు తెఱగు||

సంకెల బెట్టిన వేళ చంపబిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వెంకటేశు నామమే విడిపించగతికాక
మంకులబుద్ధి పొరలిన మరిలేదు తెఱగు||


సర్వకాల, సర్వావస్థల లోనూ శ్రీహరి నామమొక్కటే మనకు దిక్కుయని, రక్షయని అన్నమాచార్యుల వారు చాటి చెబుతున్నారు. అన్నమయ్య పాటలలో ఈ పాటకొక ప్రత్యేకత ఉంది. ‘ఏమొకొ చిగురుటధరమున’ అన్న అన్నమాచార్య పాటకు పరవశించిన రాజు శాళ్వనరసింగరాయలు, అదే రీతిన తనపై పాటను రచించమనగా, శ్రీ వేంకటేశ్వరాంకిత రచనలు చేసే అన్నమయ్య నిర్మొహమాటంగా, ఆత్మాభిమానంతో రాజు కోరికను తిరస్కరిస్తాడు. ఆ సందర్భంలో రాజు అన్నమయ్యను చెఱసాలలో బంధించి, ‘మూరురాయరగండర’ అనే సంకెలను వేయిస్తాడు. అప్పుడు అన్నమయ్య ఆర్తితో ఈ పాటను పాడగా భళ్ళున సంకెళ్ళు తెగిపడతాయి. భటులు రాజుకు ఈ విషయం తెలుపగా రాజు ఇది కనికట్టు అని, నమ్మక మరలా సంకెళ్ళను వేయిస్తాడు. అప్పుడు మరలా అన్నమయ్య ఇదే రీతిలో ‘నీ దాసుల భంగములు నీవు జూతురా’ అంటూ స్వామికి హెచ్చరిక సంకీర్తన పాడగా రాజు కళ్ళెదుటే సంకెళ్ళు తెగి పడతాయి. పశ్చాత్తప్తుడైన రాజు అన్నమయ్య పాదాలపై పడతాడు! ఇదీ ఈ సంకీర్తనకున్న నేపథ్యం. శాశ్వతుడైన దైవాన్ని తప్ప ఇతరులను కీర్తించరాదని, దైవాన్ని మాత్రమే ఆశ్రయించాలని ఇందున్న సందేశం! మనందరికీ శిరోధార్యం.

తేకువ = ధైర్యము
ఒఱపైన = అందమైన, ధృడమైన, ప్రకాశమానమైన
అఱడి = నింద
అంకిలి = అడ్డగింత
ఆగిన = నిలబెట్టిన
మంకుబుద్ధిన్ = మూర్ఖత్వముతో..

 
 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agna