సారస్వతం

సుందరకాండ (మొదటి భాగం)

సమగ్ర సంగ్రహ రామాయణము
(వాల్మీకి చెప్పిన రామకథ - మళ్ళీ చెపుతున్నది డా|| అక్కిరాజు రమాపతిరావు)

-  డా. ఆక్కిరాజు రమాపతిరావు    


 

వానరులందరి ప్రస్తుతికి పాత్రుడై, జాంబవంతుడి పొగడ్తలతో అమితమైన ఉత్సాహం పొంది, హనుమంతుడు సముద్రాన్ని లంఘించడానికి సముద్రతీరంలో ఉద్యుక్తుడైనాడు. ఆ మహా పరాక్రమవంతుడు, సాటిలేని బలశాలి, మేరునగదేహుడు, మహేంద్ర పర్వత శిఖరం పై నిలిచి కొంతసేపు ఆ కొండపై సంచరించాడు. ఆ తర్వాత నూరు యోజనాల సముద్రాన్ని ఎగిరి దాటడానికి తన శరీరాన్ని తగినట్లుగా రూపొందించుకున్నాడు. పాదాలను ఉన్నత శిఖరపు సానువులపై గట్టిగా దట్టించి, మోకాళ్ళను వంచి, తన మహాకాయాన్ని ముందుకు వంచి, తన దీర్ఘబాహువులను ముందుకు సాచి కుప్పించి, ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధమైనాడు. ఆయన తన పాదాలను కొండపై సర్వశక్తితో అదిమిపెట్టడం వల్ల ఆ కొండ అక్కడక్కడ చీలికలకు గురి అయింది. ఆ పగుళ్ళనుంచి చిత్రవిచిత్రవర్ణాలైన ధాతువులు బయటకు వచ్చాయి. అప్పుడు పుట్టిన పెను ఉష్ణతకు పొగలు లేచాయి. కలుగులలో నలిగిపోతున్న భయంకరసర్పాలు కోపంతో కొండరాళ్ళను కరిచాయి. అప్పుడు విషాగ్నులు బయలుదేరాయి. ఆ కొండమీద విహరిస్తున్న సిధ్దచారణలు చాలా భయపడిపోయి గగనమండలానికి ఎగిరిపోయారు. వారు తమ పానభక్ష్యభోజ్యాలను తమతో సంభ్రమంగా తీసుకుని పోతూ ఇదేమి ఉత్పాతం అని ఆకాశాన్నుంచి వీక్షించసాగారు. ఆయన కుప్పంచి ఎగసిన వేగానికి ఎన్నో మహావృక్షాలు వేళ్ళతో సహా పైకి లేచి ఆయన్ను కొండంత దూరం వెంబడించాయి. ఆయన నిండా పూలవాన కురిసింది. అప్పుడాయన ఒక పూలకొండలా భాసించాడు. హనుమంతుడి ఈ మహాద్భుతమైన వేగానికి హర్షపులకితులై ఆకాశం నుంచి సిద్ధచారణలు ఆయనను స్తుతించడం విద్యాధరులు విని ఎంతో ఆనందించారు. ఇష్టబంధువు ప్రయాణం చేస్తున్నప్పుడు వీడ్కోలు చెప్పటానికని కొంతదూరం వచ్చి మళ్ళీ వెనుతిరిగేటట్లు, మహావృక్షాలు ఆయనతో పెనువేగంతో కొంత దూరం సాగి వెంటనంటి, ఇక అప్పుడు సముద్రంలో కుప్పకూలాయి. పుష్పరాశులు కూడా ఆయన వెంట ఇంకా కొంతదూరం వెంబడించి సముద్రంలో పడిపోయాయి. అప్పుడు ఆ సముద్రం నక్షత్రాలతో ఉన్న ఆకాశంలో అందగించింది. హనుమంతుడు కొంతసేపు తన మహావాలాన్ని (పెద్దతోకను) గుండ్రంగా చుట్టి ప్రయాణిస్తున్నప్పుడు సూర్యుడి చుట్టూ ఉన్న గుండ్రని పరివేగం (వరదగుడి) గుడిలా ప్రకాశించాడు. మరికొంతసేపు నిటారుగా తన వాలాన్ని ఆకాశంలో నిలిపినప్పుడు ఆయన వాలం ఇంద్రధ్వజంలా శోభించింది. ఆయన ఛాయ కొంచెం నీటిలో దిగబడి సముద్రంలో వేగంగా ప్రయాణించే నౌకలా కనబడింది. ఆయన ఉజ్జ్వల కాంతి ప్రతిఫలించి గగనంలో మేఘాలు చిత్రవిచిత్రాకాంతులతో ప్రకాశించాయి. ఆయనకేమీ శ్రమ కలగకుండా సూర్యుడు చల్లని ఎండ కాశాడు. వాయుదేవుడు హాయిగా, చల్లగా వీచాడు.

ఆంజనేయుడు మాహాద్భుత వేగంతో దూసుకొని పోతుండగా సముద్రపు అలలు ఉవ్వెత్తుగా ఆకాశాన్ని అంటుతూ తమ నురుగుతరగలను వ్యాపింపచేశాయి. ఆకాశంలో అవి తెల్లటి మేఘాలుగా కనుపట్టాయి. సముద్రమంతా తన అలలతో ప్రచండంగా ఘోషిస్తూ ఆకాశంలో అప్పుడు ఆయన గమనవేగఘోషతో శ్రుతి కలిపింది.

సముద్ర జలాలు ఉవ్వెత్తుగా పైకెగయడంతో సముద్ర జలచరాలు నగ్నంగా ఉన్నట్లు కనిపించాయి.

అప్పుడు హనుమంతుడి మహాద్భుత పరాక్రమం చూసిన సముద్రుడికి ఉల్లాసం కలిగింది. ఆయనకేమన్న అలుపూసొలుపూ కలుగుతుందేమోనని భావించి, తాను ఇక్ష్వాకువంశానికి చెందిన సగరుడిచే ప్రవర్ధితుడైనాడు కాబట్టి ఆ వంశీయులతో తన విడదీయరాని బంధుత్వాన్ని పురస్కరించుకుని సాగరుడు తనలో దాగి, తనచే పరిరక్షితుడై, సుఖంగా ఉన్న మైనాకుణ్ణి, ‘ఏమయ్యా ఒకసారి పైకి వచ్చి, రామకార్యార్ధియై రివ్వున బాణంలాగా దూసుకుపోతున్న ఆంజనేయుడికి కాసేపు విశ్రాంతి కలగజేయ కూడదా? అతిథిసపర్యలు చేసి ఆయన తుష్టుడై ఇనుమడించిన పరాక్రమ శక్త్యుత్సాహాలతో ముందుకు సాగిపోయేటట్లు చూడకూడదా? లోకంలో ఇంటికి వచ్చిన సామాన్య అతిథికి కూడా మనం మర్యాద చేస్తాము కదా! అంటూ!

‘ఈ మహానుభావుడేమోరామకార్యమ్ మీద వెళుతున్నాడు. లోకంలో ఎప్పుడూ ఎవరూ కనీ వినీ ఎరుగని మహాద్భుత చర్యకు పూనుకున్నాడు. ఇటువంటి మహాత్ముడికి మనం తప్పక అతిథి సత్కారం చేయవలసిందే! మన్ననతో మర్యాద చూపవలసిందే. కాబట్టి నీవు ఇప్పుడు నాలోనుంచి బయటకు వచ్చి క్షణకాలం నీపై విశ్రాంతి తీసుకుని సాగిపొమ్మని మారుతిని అర్ధించు’ అని మైనాకపర్వతాన్ని ప్రోత్సహించాడు. మైనాకుడు అందుకు చాలా సంతోషించాడు. దివ్యోజ్జ్వలకాంచన విరాజిత శిఖరాలతో మైనాకపర్వతం పైకి వచ్చింది. ఆంజనేయుడు తనను సమీపించబోతుండగా ఆయనతో తన కోరిక తెలియచేయాలని వెళుతున్న ఆకాశపథంలో తాను వచ్చి ఎదుట కనబడింది. అప్పుడు హనుమంతుడు తన రొమ్ముతోఒక్క ఉదుటన దానిని తోసివేశాడు. ఆయన జవసత్వాలకు పరమాశ్చర్యంతో మైనాకుడు మానవాకారంతో తన గిరి శృంగంపై నిలిచితాను మైనాకుణ్ణి అని, తనమీద కొంచెంసేపు అయినా విశ్రాంతి తీసుకోవాలని, తన కందమూలాల ఆతిథ్యం స్వీకరించాల్సిందని ఆయనను ప్రార్ధ్జించాడు. అప్పుడు వాయునందనుడు మైనాకా! సంతోషం, నీ ఆతిథ్యం నేను స్వీకరించినట్లే భావించు. మధ్యలో నేను ఎంతమాత్రం ఆగటానికి వీల్లేదు. అని మైనాకుణ్ణి మన్ననగా స్పృశించి అదే వేగంతో సాగిపోయినాడు.

అప్పుడు ఆకాశచరులైన దేవతలంతా అమిత విస్మయం చెందారు. ఇప్పుడిది ఈయన సాధించిన పరమాద్భుతమైన కార్యఘట్టంలో రెండోది. ఇటువంటి అతి దుష్కరమైన పూనిక ఎక్కడా ఎప్పుడూ విన్నది కాదు, కన్నదీ కాదు అని హనుమంతుణ్ణి కొనియాడారు. ‘ఇదే చిత్తస్థైర్యం, ఇవే బలపరాక్రమాలు, లక్ష్య్త సిద్ధివరకు ఈయన నిలుపుకుంటాడా లేదా? ఒక పరీక్ష చేద్దాం’ అని దేవతలకు కోరిక కలిగింది. పరీక్షించవలసినదని నాగమాత అయిన సురసవాళ్ళను ప్రోత్సహించారు. అప్పుడు సురస మహాభయంకరమైన క్రూరరాక్షసి రూపంతో ఆకాశంలొ హనుమంతుడికి ఎదురై ‘నిన్ను నాకు దేవతలే ఆహారంగా నిర్దేశించారు. నా నోట్లో ప్రవేశించు. నిన్ను మింగేస్తాను.’ అని ఆకాశాన్ని కూడా మింగేంతగ తన కరాళవక్త్రం తెరిచింది. అప్పుడు ఆంజనేయుడు ఆ సురసనోటికన్నా తన దేహాన్ని పెద్దది చేశాడు. అప్పుడు సురస ఆంజనేయుడి దేహంకన్నా తన నోరు ఇంకా పెద్దది చేసింది. మారుతి తన కాయాన్ని ఎంత పెంచితే అంతకన్నా మించి సురస తన వక్త్రం విశాలంగా ఇంకా ఇంకా తెరుస్తూ వస్తోంది. అప్పుడు మారుతి ఒక్కత్రుటిలో అతి సూక్ష్మ దేహం ధరించి బొటనవ్రేలు ప్రమాణంతో సురస నోటిలో మెరుపువేగంతో ప్రవేశించి, మళ్ళీ అదే వేగంతో వెలువడి రాహువు విడిచిన పూర్ణచంద్రుడిలా ప్రకాశిస్తూ చేతులు జోడించి ‘అమ్మా! నీ కోరిక నెరవేర్చాను! నీ ప్రతిన సఫలం అయింది కదా! నాకు ఇక అవరోధం లేకుండా అనుగ్రహించు; నాదారిన నన్ను పోనీ!’ అని ప్రార్ధించాడు.
దేవతలంతా మారుతి సమయస్ఫూర్తికి జేజేలు పలికారు. హనుమంతుడు మళ్ళీ శరవేగంతో ముందుకు పోసాగాడు.

అప్పుడు సముద్రంలో ఉండే క్రూర భయంకర రాక్షసి ‘సింహిక’ తన అదృష్టం పండి ఇన్నాళ్ళకు తనివితీరే ఆహారం లభించిందని మహా సంతోషంతో సముద్రంలో కనబడుతున్న ఆశ్చర్యం కలిగించే వాయుసుతుని నీడని పట్టి లాగుతూ ఆయన వేగానికి అవరోధం కలిగిస్తూ వచ్చింది. మహావేగంతో పోతున్న నౌకను సముద్రంలో ఎదురు గాలి అడ్డగించినట్లు ఈ రాక్షసి నాకు ఆటంకం కలిగిస్తున్నదని తెలుసుకున్నాడు హనుమంతుడు. సుగ్రీవుడు చెప్పిన జలరాక్షసి ఇదే అయి ఉంటుందని గ్రహించాడు. తీవ్రంగా కోపించాడు. వెంటనే ఆయన దాని నోట్లో ప్రవేశించి, దాని ఆయువుపట్టును గోళ్ళతో చీల్చి సంహరించాడు. అప్పుడది సముద్రజలలో అచేతనమై పెద్ద మేర ఆక్రమించి భయంకరంగా కన్పట్టింది. హనుమంతుడి సాహసకృత్యానికి సంతోషించిన ఆకాశచరులైన సిద్ధగంధర్వాదులు ఆయన్ను ఇలా అభినందించారు.

‘యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ,
ధృతి ర్దృష్టి ర్మతి ర్దాక్ష్యం స కర్మసున సీదతి.’ (సుందర. 1. 200)


`వానరోత్తమా! నీవలె ధైర్యం, ముందుచూపు, సమయస్ఫూర్తి, సామర్ధ్యం - ఈ నాలుగూ కలవాడు ఏ పనులు చేపట్టినా సాధించుకుంటాడు. ’ నూరు యోజనాల సముద్రాన్ని లంఘించి హనుమ అవతలితీరం చేరాడు. తన సహజమైన రూపాన్ని ధరించాడు. సంతోషంతో ఆయన సమీపంలో ఉన్న లంబపర్వత శిఖరంపై నిలిచి త్రికూటపర్వతంపై మహైశ్వర్యంతో అతులిత సౌందర్యంతో అలరారుతున్న లంకానగరాన్ని చూశాడు. ఆ నగరం ఆయనకు ఇంద్రుడి అమరావతిలా కన్పట్టింది.

 

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు

ఇమెయిల్

ప్రదేశం 

సందేశం

 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)