కబుర్లు

సత్యమేవ జయతే! అమెరికాలమ్ – 34

- రచన : సత్యం మందపాటి   


 

నన్ను గుర్తుపట్టావుటోయ్!

 
 

“ఏమోయ్! సుబ్బారావ్! నన్ను గుర్తుపట్టావా!” అనడిగాడు పెద్దాయన.

 “లేదుసార్! గుర్తుపట్టలేదు. అదీకాక మీరు అనుకుంటునట్టు నేను సుబ్బారావుని కాదు. అప్పారావుని” అన్నాడు అప్పారావు కొంచెం సిగ్గుపడుతూ.

                             ౦                           ౦                           ౦     

          “బాబూ! ఈమధ్య నువ్వో, మీ తమ్ముడో చనిపోయాడన్నారు, ఇంతకీ ఎవరు చనిపోయింది?” ఆ పెద్దాయన అడిగాడు, కళ్ళజోడు సర్దుకుంటూ.

          “నేనేనండీ చనిపోయింది. మా తమ్ముడు బాగానే వున్నాడు!” అని అతను మాయమయిపోయాడు.

                             ౦                           ౦                           ౦  

          మనుష్యులందరికీ ఫలానా అని గుర్తింపు అవసరం. ఈ గుర్తింపులు పరిశీలిస్తే, భలే తమాషాగా వుంటుంది.

ఒకరోజు కృష్ణుడు, రుక్మిణి విశ్రమిస్తున్న మందిరానికి వచ్చి తలుపు కొట్టాడుట.

తెలుపు తెరవకుండా, “ఎవరు?” అని అడిగింది రుక్మిణి.

“నేనే!” అన్నాడు కృష్ణుడు.

“నేనే అంటే?..” అడిగింది రుక్మిణి.

“అది తెలుసుకోవాలనే కదా నా ప్రయత్నం!” అన్నాడు తర్వాత భగవత్గీతకి భాష్యం చెప్పిన శ్రీకృష్ణుడు!

                   ౦                           ౦                           ౦

పైన చెప్పిన మూడు జోకులూ మన ముళ్ళపూడి వెంకటరమణగారివే, నావి కాదు. గుర్తించండి!

                             ౦                           ౦                           ౦  

మనమేదో విష్ణుమూర్తి ఒక్కడికే దశావతారాలు వున్నాయనుకుంటాం కానీ, మనందరికీ కూడా రకరకాల అవతారాలు (గుర్తింపులు) ఎన్నో వున్నాయి. ఎప్పుడూ వుంటూనే వుంటాయి.

ఎప్పటినించో నేను సామాన్యులలో కూడా అతిసామాన్యుడిని అనుకుంటూ వుండేవాడిని. దానికి కారణం చిన్నదే. నాకు కూడా ‘నేను’ అనే గుర్తింపు చాల తక్కువగా వుండేది.  

ఆడపిల్లల తర్వాత నేను పుట్టినప్పుడు మందపాటివారి వంశాంకురాన్ని. కొంచెం కొంచెం పెద్దవాడిని అవుతున్నప్పుడు మగవాళ్ళకి మా నాన్నగారి అబ్బాయిని. ఆడవాళ్ళకి కమలమ్మగారి కొడుకుని. ఆరోజుల్లో మా అక్కయ్యలకి ఎంతమందో స్నేహితులు – అందమైన ఆడపిల్లలు – వుండేవారు. అదేమిటో కానీ పాపం, వాళ్ళు కూడా మా అక్కయ్యలతో పాటు నన్ను కూడా ఒక తమ్ముడిగానే చూసేవాళ్ళు!

గుంటూరు హిందూకాలేజీలో చదువుతున్న రోజుల్లో, మాకు బ్రహ్మానందరావుగారని – మా నాన్నగారి పేరే కాక, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కూడాను – ఒక లెఖ్కల గురువుగారు వుండేవారు. ఆయన క్లాసుకి రాగానే, నన్ను ఉద్దేశించి, “ఒరేయ్! మందపాటివారి సంస్థానం. హోంవర్క్ చేశావా.. లేకపోతే మీ నాన్నతో చెప్పమంటావా..” అనేవారు.

గుంటూరు హిందూ కాలేజీలో చదువుకునేటప్పుడు నేను ఇరవైమూడుని.

కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు నేను నైన్టీనుని.

తర్వాత నేను త్రివేండ్రంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్లో పనిచేసేటప్పుడు, నన్నుOutstanding Engineer అనేవారు. ఎందుకంటే మా డివిజనల్ డైరెక్టర్ డాక్టర్ వసంత్ గవారికర్ రష్యావాళ్ళు, అమెరికన్లు,  కేంద్రమంత్రులు మొదలైన పెద్దవాళ్ళతో మీటింగుల్లో వున్నప్పుడు, నేను కావలసిని సమాచారం వున్న ఫైలు పట్టుకుని, మీటింగ్ గది బయట కొంచెం దూరంగా ఒంటరిగా నిలబడేవాడిని. ఆయనకి ఏది అవసరమైనా వెంటనే బయటికి వచ్చేవాడు. ఆయన అడిగినదానికి కావలసిన సమాచారం నేనందిస్తే, అది తీసుకుని లోపలికి వెళ్ళేవాడు. నేనేప్పుడూ అలా బయట నుంచుని వుండేవాడిని కనుక, నన్ను ‘Out Standing Engineer అనేవారు. 

పెళ్ళయిన తర్వాత మా అత్తగారి వేపు వాళ్ళందరూ, నన్ను విమల మొగుడు అనేవాళ్ళు. మా అబ్బాయి పుట్టాక స్కూలు పిల్లలందరికీ నేను మా అబ్బాయి నాన్ననయాను. మా అమ్మాయి పుట్టాక అందరికీ మా అమ్మాయి డాడ్ నయాను.

నేను ఎన్నడూ నేనుగా లేను మరి!

                   ౦                                     ౦                           ౦

గురువుగారు ముళ్ళపూడి వెంకటరమణ అంటారూ...

“ఏమయ్యా! మీ ఊళ్లో పేరున్న వాళ్ళెవరైనా పుట్టారా?”

“లేదండీ! అందరికీ పుట్టాకనే పేర్లు పెడుతున్నాం!”

అదీ గుర్తింపు వ్యవహారం!

                   ౦                                     ౦                           ౦

ఇలా చేతి వేళ్ళు లెఖ్క పెట్టుకునే కాలంలో పుట్టి, కాల్క్యులేటర్ల కాలంలో పెరిగి, కంప్యూటర్ల కాలంలోకి వచ్చి, గూగులమ్మ, అంతర్జాలయ్యలతో స్నేహంకట్టి, చివరికి ముఖపుస్తకంలో మన జీవితాలు బార్లా తెరిచి పెట్టాం.  దాంతో గుడివాడ విజయవాడలతో ఆగక మన పేర్లు వాడవాడలా పాకిపోయాయి. ఒక్కసారిగా బందరు నించీ బ్రెజిల్ దాకా, నంద్యాల నించీ నైజీరియా దాకా, సంతనూతలపాడు నించీ సైబీరియా దాకా మనకి ‘గుర్తింపు’ వచ్చేసింది. ఇదీ బాగానే వుంది అనుకుంటుండగానే, కొత్త సమస్యలూ వచ్చి కూర్చున్నాయి. 

గూగులమ్మగారిని మీ గురించి అడిగితే, అంతర్జాలయ్యగారి తాళపత్రాల్లో మీరు వ్రాయని మీ ఆత్మకథని, మీ పేరూ, వూరూ, పెళ్ళాం (ప్లస్ ‘ఇంకెవరైనా’ వుంటే వాళ్ళ పేరుతో సహా), మీ పిల్లలూ, పిల్లులూ, మీ వయస్సూ, జాతకం, ముఖచిత్రం, చదువుకునేటప్పుడు ఏ సందులు గొందులకి వెళ్లారు, మీ బాంక్ ఎకౌంట్ నెంబర్లు, ఏటిఎం నెంబర్లు.. మీరు ఎవరెవరికి అప్పులిచ్చారు, ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎవరికి ఇవ్వకుండా ఎగ్గొట్టారు, ఒకటేమిటి సమస్తం.. పేజీలకు పేజీలు వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే దొంగతనంగా తెప్పిస్తారు. వాళ్ళు దొంగతనం చేసేది, మీ గుర్తింపు దొంగతనం. అంటే ‘అ’ప్రాచ్య భాషలో Identity Theft. అలా మన గుర్తింపుని దొంగతనం చేసేవారిని గుర్తింపు దొంగలు అంటారు. మన దగ్గర నగలు వున్నప్పుడు నగల దొంగలు వున్నట్టే, కారున్నప్పుడు కారు దొంగలు వున్నట్టే, మనకిలా ‘గుర్తింపు’ వున్నప్పుడు మరి గుర్తింపు దొంగలు కూడా వుంటారు కదా! కాకపొతే ఈ ‘గుర్తింపు’ దొంగతనాలు రకరకాలుగా జరుగుతున్నాయి. ఈ దొంగలు దొంగతనాలకి వచ్చినప్పుడే కాక, రానప్పుడు కూడా చాలాసార్లు తలుపులు తెరిచేది మనమే!

                   ౦                            ౦                           ౦

చాలామంది తమ బాంక్ ఎకౌంట్లకీ, ఈమైలు మొదలైన వాటికీ పాస్వర్డ్ పెట్టేటప్పుడు నిర్లక్ష్యంగా వుంటారు. ఏ దొంగ అయినా, నూటికి కనీసం అరవై శాతం పైన మీ పాస్వర్డ్ సులభంగా చెప్పేయగలడు. జోగారావుగారి పాస్వర్డ్ ఆయన భార్య పేరు, అమ్మాయి పేరు, అబ్బాయి పేరు, కుక్క పేరు, ఊరి పేరు వుండే అవకాశం చాల ఎక్కువ. కొండొకచో వీటిలో ఒకటి రెండు పేర్లు కలిపి పెట్టటం కూడా చేస్తుంటాడు సన్యాసిరావు. మన్మధరావు కొంచెం తెలివిగా, తన భార్య పేరు కాకుండా ఇటు పక్కింటి సైరాబాను పేరో, అటు పక్కింటి జయసుధ పేరో పెట్టేస్తాడు. ఇహ శివరావయితే ఏటియం పిన్ నెంబరు తన పుట్టిన సంవత్సరమో, భార్య పుట్టిన సంవత్సరమో, పిల్లల పుట్టిన సంవత్సరమో, తను పుట్టిన నెలా, రోజు కలిపి పెట్టటమో చేస్తుంటాడు. కొంతమంది తమ ఫోన్ నెంబరులోని చివరి నాలుగు నెంబర్లు పెట్టేస్తారు. కొంతమంది వాళ్ళ ఇంటి నెంబర్లలో చివరి నాలుగు నెంబర్లు పెట్టేస్తారు.

మీ పక్కింటి పార్వతికి ఒక ఈ-ఉత్తరం వస్తుంది. నైజీరియాలోని ఒక మీసాల జమీందారుగారు చనిపోతూ ఆయన ఆస్తి అరవై మిలియన్ల డాలర్లు పార్వతి పేరున వ్రాసేసి, పాపం, బక్కెట్ తన్నేస్తాడు. ఆయన కొడుకుకి,  పాపం, పార్వతి బాంక్ నెంబర్ తెలియకపోవటం వల్ల ఈవిడ కోసం దేశదేశాలూ వెదుకుతూ, చివరికి సైబరాసురుడి వరం వల్ల ఆవిడ ఈమైల్ అడ్రసు పట్టుకుని, మీ బాంక్ సమాచారం ఇస్తే చాలు, ఆ డబ్బు మీ ఎకౌంటులో జమకట్టి, మా నాన్న ఆత్మకి శాంతి చేస్తాను అని సారాంశం. పార్వతి కూడా అతనెవరో తెలియకపోయినా, అతని ఆత్మశాంతి కోసం (డబ్బుల కోసం మాత్రం కాదు అని మీరు గమనించాలి), అడిగింది అడిగినట్టు ఇచ్చేస్తుంది. తర్వాత పది రోజులకి ఆవిడ రిటైర్మెంట్ డబ్బులు అన్నీ తుడిచిపెట్టుకు పోయాయనీ, బాంక్ బాలన్సులు కొండెక్కి పోయాయనీ, తెలిసాక కానీ పార్వతమ్మగారికి నిద్ర మెళుకువ రాదు.

          వెనకింట్లో వున్న వెనిస్సాది వేరే కథ. ఆవిడ కొడుకు పేరుతో వచ్చింది ఈమైల్. ‘అమ్మా నేను పారిస్ వెళ్లి, అక్కడ నా పర్స్ పారేసుకున్నాను. క్రెడిట్ కార్డులు, డబ్బూ అన్నీ పోయాయి. కనీసం ఐదు వేల డాలర్లయినా  లేకపోతే మళ్ళీ అమెరికాకి తిరిగిరావటం కష్టం. ఫలానా చోటుకి డబ్బులు పంపించు అని. ఎంతైనా మాతృ హృదయం కదా! వెనిస్సా వెంటనే ఆ డబ్బు పంపించేస్తుంది. ‘మీరు భలేవాళ్ళు సార్! ఇలాటి కాకమ్మ కబుర్లకి ఎవరు మోసపోయేది’ అనుకుంటే మనం దాల్లో లెగ్గేసినట్టే! అలాటివారు.. నిజంగా వున్నారు స్వామీ.. మీ మీద ఒట్టు! లక్షకి ఒక్కరు వున్నా చాలు, ఆ మోసగాళ్ళ కడుపులు నిండటానికి!

          కాకపొతే ‘మీరూ, నేనూ ఇంకా బాగా ఎంతో గొప్ప తెలివైన వాళ్ళం కదా, ఇలాటి చౌకబారు ట్రిక్కులకి మనం అంత తొందరగా దొరకం!’ అని అనుకుందామనుకుంటుంటే, అలా అనుకోనీకుండా ఒక సంఘటన జరిగింది. 

          ఈమధ్య అమెరికాలో కలిసి విడిపోయిన తెలుగు సంఘాలు నాలాటి జీవిత సభ్యులకి కొన్ని ఈమైళ్ళు పంపించాయి. గమ్మత్తేమిటంటే అవి చదువుతున్న శుభ సమయంలోనే, మా ఇంట్లో ఫోను మ్రోగింది.

          “ఇంటాయనగారు వున్నారా” అని అడిగాడు మలయాళింగ్లీషులో ఆ పిలిచినవాడు, ఫల్గుణ్ నాయర్.

          నేను కేరళలో పదేళ్ళు వున్నాను కనుకా, అమెరికా వచ్చి ఎన్నో దశాబ్దాలయినా మలయాళం భాష అంటే ఇంకా ఎంతో ఇష్టం కనుకా, ఇంగ్లీషులో ఆ మలయాళం యాస వినగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది.

అందుకనే అదేదో సేల్స్ కాల్ అని తెలిసినా, తెలీనట్టు ‘అవును. నేనే మా ఇంటికి ఆయన్ని’ అన్నాను.

          “ఇంటాయనగారూ.. ఇంటాయనగారూ.. నేను ఇన్కంటాక్సు ఆఫీసునించీ పిలుస్తున్నాను. మీరు ఇన్కం టాక్స్ ఎగ్గొట్టారని మా నమ్మకం. అందుకని ఆ సంగతి ఎఫ్బీఐవారికి చెప్పాం. వాళ్ళు మిమ్మల్ని పట్టుకోవటానికి సపరివార సమేతంగా వస్తున్నారని తాజా వార్త. మిమ్మల్ని రక్షించటమే మా లక్ష్యం. అందుకని మీ పూర్తి పేరూ, బాంక్ ఎకౌంట్ నెంబరూ, సోషల్ సెక్యూరిటీ నెంబరూ ఇస్తారా! మిమ్మల్ని రక్షిస్తాం!” అని మర్యాదగా అడిగాడు. 

          నాకు వచ్చిన తెలుగు సంఘంవారి ఈమైల్లో సరిగ్గా ఇలాగే వ్రాసారు.

“సరిగ్గా ఇదే డైలాగు తెలుగు సినిమాలోలాగా మళ్ళీ మళ్ళీ చెబుతారు. మోసపోయి, మీ ‘గుర్తింపు’ సమాచారం ఇవ్వకండి. ఇస్తే ఇంతే సంగతులు. అదీకాక ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసుకి (అమెరికాలో ఇన్కంటాక్స్ ఆఫీసు) ఫలానా ఫోన్ నెంబరుకి ఫోన్ చేసి రిపోర్టు చేయండి” అని. 

          అది అప్పుడే చదివాను కనుక, ఇంకేమీ మాట్లాడకుండా వెంటనే ఫోన్ పెట్టేసాను.

          ఒక వారం గడిచాక మళ్ళీ అలాటి ఫోనే వచ్చింది. ఈసారి నాయరుగారు కాదు. గుజరాతీ పటేల్ గారు. వీళ్ళందరూ, అదే బట్టీ పట్టినట్టున్నారు. మక్కికి మక్కి అవే డైలాగులు.

          ఈసారి కొంచెం ఆట పట్టిద్దామని, “గుజరాతీ పటేలుగారూ! కొంచెంసేపు అలా ఫోనులో హోల్డ్ చేసి వుంటారా, నేను ఇంకో ఫోన్ కాల్ చేసి మీతో కాన్ఫరెన్స్ కాల్ చేయాలి” అన్నాను, నిదానమే ప్రధానం అనే సామెత నెమరు వేసుకుంటూ.

          “ఇప్పుడు హోల్డేమిటి? ఎఫ్బీఐవాళ్ళు మిమ్మల్ని పట్టుకోవటానికి ఆఘమేఘాలమీద వస్తుంటే?” అన్నాడు పటేల్, ఆలస్యం అమృతం విషం అనే సామెత గుర్తు చేస్తూ.

          “అందుకే.. పోలీసులని రెండో లైన్లో పిలిచి, వాళ్ళని మీతో మాట్లాడమందామని..” అంటుండగానే, భోజన సమయం అయిందో ఏమో పటేల్ గారు చటుక్కున ఫోన్ పెట్టేసారు.

          తర్వాత ఆ ఫోన్ నెంబర్ గూగులమ్మ గూడులో పెట్టి, “ఇదేమిటో చెప్పమ్మా?” అని అడిగాను.

          ‘ఇది పవిత్ర భారతీయులు చేస్తున్న స్కాములు స్కీము, నమ్మి మోసపోకండి. పటేల్, నాయర్, రాయ్ అని ఇలా ఎన్నో పేర్లతో ఫోన్ చేస్తారు. ఏ రాయయయితేనేం మీ బ్యాంకులో డబ్బులు పోగొట్టుకోవటానికి. జాగ్రత్త!” అని పదిపేజీల సమాచారం వచ్చింది.

          మీరూ.. జాగ్రత్తగా వుండండి. ఇలాటి స్కాములు, మన స్వాముల స్కాముల లాగానే, చాల రకాలుగా వున్నాయి. మీ గుర్తింపు పోయిందా... మీ ఆస్తులు గోవిందా.. గోవింద!

మళ్ళీ ఇంకోక్కసారి..

          ‘మీరూ, నేనూ ఇంకా తెలివైన వాళ్ళం కదా, ఇలాటి చౌకబారు ట్రిక్కులకి అంత తొందరగా దొరకం’, అని మరోసారి అనుకుంటూ, శ్రీమతి సరుకులు తెమ్మంటే సూపర్ టార్గెట్ డిపార్ట్మెంటల్ స్టోరుకి వెళ్లాను. గత ముఫై రెండేళ్లుగా మేము వెడుతున్న షాపే అది!       

          నేను టార్గెట్ డిపార్ట్మెంటల్ స్టోరులో, ఎప్పటిలాగానే పాలూ, పంచదారా, కాఫీ పొడి కొనుక్కొచ్చాను.

నాలుగు రోజుల తర్వాత ఇంట్లో సోఫాలో కూర్చుని, కాలు మీద కాలు వేసుకుని, కొత్తగా తెచ్చిన కాఫీ పౌడరుతో మా ఆవిడ చేసిన వేడివేడి ఫిల్టర్ కాఫీ ఆనందంగా త్రాగుతుంటే, టీవీలో వార్తలు వస్తున్నాయి.

‘పోయిన రెండు మూడు వారాలుగా టార్గెట్ షాపులో క్రెడిట్ కార్డు పెట్టి మీరు ఏదయినా కొన్నారా? ఒకవేళ కొని వుంటే, మీరు గుర్తింపు దొంగల చేతుల్లో చిక్కారహో’ అని చెబుతున్నది ఆ టీవీ అమ్మాయి.

కొన్ని వేల మంది క్రెడిట్ కార్డుల జాతకాలు ఆ దొంగల చేతుల్లో వున్నాయనీ, మీ క్రెడిట్ కార్డు కంపెనీని పిలిచి ‘బాగా విచారించండి’ అని టీవీలో చెబుతున్నది అందమైన ఒక బ్లాండు జుట్టు తెల్ల సుందరి.

నేను కూడా మీలాగా తెలివైన వాడిని కదా, అందుకని అలాటివి నన్ను అంటుకోవు అని నా నమ్మకం. అందుకే వేడివేడి కాఫీ చప్పరిస్తూ నిమ్మకు నీరెత్తినట్టు అలాగే కూర్చున్నాను.

“ఒకసారి నీ ఎకౌంటులోకి లాగిన్ అయి చూడరాదూ.. ఎందుకైనా మంచిది..” అంది శ్రీమతి.

‘సరే! కానీ’ అని కంప్యూటర్ ముందు కూర్చుని, నా ఎకౌంట్ తెరిచాను.

టార్గెట్లో కాఫీపొడి కొన్నట్టు వుంది. పాలూ, పంచదారా, కాఫీపొడి కలిపి పదిహేను డాలర్లకి తక్కువే!

కానీ దానిక్రింద, ఇంకో షాపులో రెండు వేల ఐదు వందల డాలర్లకి అరవై ఐదు అంగుళాల శామ్సంగ్ ఎల్లీడీ త్రీడీ టీవీ, సరికొత్త మోడల్, కొన్నట్టుగా వుంది. అదేమిటి? అంత డబ్బు పెట్టి నేనెప్పుడు కొన్నాను అనుకుని, ఆ క్రెడిట్ కార్డు కంపెనీకి ఫోన్ చేద్దామనుకున్నాను.

వాడికి వెయ్యేళ్ళ ఆయుష్షు. నేను పిలవబోతుంటే వాడే పిలిచాడు.

వాడు అంటే క్రెడిట్ కార్డు కంపెనీ. పిలిచింది మాత్రం ఒక అమ్మాయి.

“అయ్యా/అమ్మా! మీరు నిన్న టార్గెట్లో కాఫీ పౌడరు కొన్నాక, రెండు వేల ఐదు వందలు పోసి టీవి కొన్నారు. బాగుంది. మరి ఆ కాఫీ త్రాగుతూ, కొత్త టీవీలో కార్యక్రమాలు చూడటానికి, మీకు వజ్రాల ఉంగరాలు ఎందుకు? మీ గుర్తింపుని దొంగిలించారని మాకేదో అనుమానంగా వుంది. నిజంగా అవన్నీ మీకేనా?” అని అడిగింది. 

“లేదు అమ్మడూ! నేను కాఫీ పౌడరు కొన్నది నిజమే కానీ, టీవీ కొనలేదు. మా ఆవిడ కూడా అసలు వజ్రాల ఉంగరాలు పెట్టుకోదు. సత్తె ప్రమాణం” అన్నాను.

“అదికాదు సత్తెంగారూ.. టార్గెట్ షాపుతో పాటు, ఇంకో రెండు షాపులు ఈ రెండు మూడు వారాల్లో గుర్తింపు దొంగల బారినపడ్డాయి. కొన్ని వేల ఎకౌంట్లు వాళ్ళు దొంగిలించారు. మీరు కూడా వారికి దొరికిపోయుంటారు. . నిజంగా మీరు టీవీ కొనలేదా? వజ్రాల ఉంగరాలు కొనలేదా” అడిగింది అమ్మడు. 

“లేదమ్మడూ లేదు!” అని గట్టిగా నొక్కి వక్కాణించాను.

“లెమ్మి సీ వాట్ ఐ కెన్ డూ!” అంది అమ్మడు.

                             ౦                           ౦                           ౦   

అందుకని...

‘జాగ్రత్తగా వుండండి బాబూ.. జాగ్రత్తగా వుండండి!

ఇలాటి ‘గుర్తింపులు’, వాటితో పాటూ ‘గుర్తింపు దొంగతనాలూ’ మనకి వద్దు!!

జాగ్రత్త!

౦                           ౦                           ౦  

 

   

      

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)