సారస్వతం

కన్నడ ఆస్తి మాస్తి చిన్నకథల్లో స్త్రీ

రచన :  డా. సాకిగారి చంద్రకిరణ్ 


 

 

 
 

భారతదేశ జనాభాలో సగంమంది స్త్రీలున్నా సాంఘికంగా స్త్రీ సమాజంలోమోసగింపబడుతోంది. కేవలం ఒక పనిముట్టుగా చూడబడుతున్నది. వారికి ఆర్థిక స్వేచ్చఉండటం లేదు. మత గ్రంథాలలోను, సాహిత్యంలో కూడా స్త్రీ నీచంగాచిత్రించబడింది. వ్యాపార ప్రకటనలలో, సినిమాలలో స్త్రీని ఒక ఆటబొమ్మగాసెక్స్ సింబల్ గా మాత్రమే చూపిస్తున్నారు. అన్ని చోట్లా పురుషాధిక్యతతాండవిస్తోంది. స్త్రీలు వివక్షకు గురికావడం పోవాలి, పురుషాధిక్యత నశించాలి, పితృస్వామ్యం పెట్టుబడిదారీ వ్యవస్థకి మరోపేరుకాబట్టి పితృస్వామ్య వ్యవస్థ పోవాలి, మగవాళ్ళు ఉన్నతులు - స్త్రీలు అల్పులు అనే భేదభావం ఉండకూడదు, స్త్రీలు కేవలం ఇంటి చాకిరీ కోసం, సెక్సు సుఖాల కోసం, పిల్లల్ని కనటం కోసం అనే భావన తొలగిపోవాలి, విద్య, ఉద్యోగాలలో సమాన ప్రతిపత్తితో పాటు ఆర్థిక స్వాతంత్ర్యం కలిగివుండాలికాబట్టి స్త్రీకి సాంఘిక న్యాయం చేకూరాలని స్త్రీవాదంబయలుదేరింది.

 

అమ్మానాన్నలు, అత్తామామలు, బంధువులు, స్నేహితులు, సాంస్కృతిక వారసత్వం, అధికారం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మహిళల జీవితం మీద ప్రభావం చూపుతుందిమతం, కట్నం, అందచందాలు, హోదాలు, వినియోగదారీసంస్కృతి,వ్యక్తిత్వాలనుతారుమారు చేస్తున్నాయి. మానవసంబంధాల మధ్య అసహనం, అలజడి, ఆందోళనపెరిగిపోయాయి. సమాజంలో స్త్రీ నైతిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో మౌలికమైన మార్పులను ఆశించడం, వ్యక్తిగత అనుభవాలతో కలిగిన అవగాహనతో పరిష్కారాలని సాధించడం, జీవితాన్నిఅర్థం చేసుకోవడానికి అనేక కోణాలను సూచించడం స్త్రీవాద ఉద్యమంలో కనిపించేకొన్ని ప్రధాన లక్ష్యాలు. పురుషులతో పాటు స్త్రీలకు సమానహక్కులు కోరుకోవటంవీటిలోనూ మరింత స్పష్టంగా చెప్పుకోవాలంటే స్త్రీ చదువు, స్వతంత్ర ఆలోచన, గర్భనియంత్రణ నిర్ణయాధికారం, వివాహం, కుటుంబం, పిల్లలు, పురుషాధిపత్యం, ఇంటి చాకిరీ స్వభావం, పితృస్వామ్యం, మాతృస్వామ్యం పట్ల అవగాహన, శ్రమకువిలువకట్టడం, లైంగికత్వంలో విచక్షణ, మాతృత్వానికీ, పిల్లలను కనడానికీ మధ్యతేడాని గుర్తించడం, స్త్రీలు సున్నితంగా లలితమైన పదాలతో, మర్యాదా రేఖలనుఅతిక్రమించకుండా రాయాలనడంలోకనిపించే జెండర్ విధానాన్ని గుర్తించడం, ఆలోచనలతో పాటు తిరుగుబాటు తత్త్వాన్ని పెంపొందించడం, తద్వారా స్వేచ్ఛాజీవితాన్ని స్త్రీ అనుభవించగలిగే అవగాహనను కలిగించడం వంటివన్నీ తెలిసివిమర్శించమనడం కూడా స్త్రీవాద దృక్పథంలో కనిపిస్తుంది. ఇలాంటి స్త్రీవాదధృక్పథాన్ని సమర్థవంతంగా తన చిన్న కథలలో చిత్రించిన కథామాంత్రికుడు మాస్తి వెంకటేశ అయ్యంగారు.

 

ఆధునిక కన్నడ సాహిత్యంలో తమదైన సంప్రదాయానికి నాంది పలికి కన్నడ కథాపితామహునిగా, కన్నడిగుల ఆస్తిగా కీర్తింపబడ్డ మాస్తి వెంకటేశ అయ్యంగారు కన్నడ కథాజగత్తులో ఒక నూతన ఒరవడిని సృష్టించారు. సామాజిక అసమానతలను నిర్మూలించి సకల జనుల హితాన్ని కోరే అభ్యుదయ రచయితల్లో మాస్తిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. స్తబ్ధమైఉన్న ప్రాచీన జగత్తుకు, ఉత్తేజితమైన నూతన జగత్తుకు నడుమ సేతువు కట్టడానికి యత్నించిన మహోన్నత వ్యక్తి మాస్తి. ఈయన కన్నడ సాహిత్యంలో ఎన్నో నూతన దృక్పథాలతో కథలను రాశారు. వీరు రాసిన నూరు కథలలోనూతాత్విక సామాజిక చింతన, సంస్కరణాభిలాష కనిపిస్తాయి. 1984లో వీరి చిక్క వీర రాజేంద్ర అనే నవలకు ప్రతిష్టాకరమైన జ్ఞానపీఠ పురస్కారం లభించడం వారి ప్రతిభకు నిదర్శనం. కవిగా, కథకునిగా, నవలాకారునిగా, నాటకకర్తగా ఉత్తమ విమర్శకునిగా స్వీయ చరిత్ర, జీవిత చరిత్రల రచయితగా, మంచివక్తగా, అనువాదకునిగా ప్రఖ్యాతి గడించిన మాస్తి తన బహుముఖ సాహితీ వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. మాస్తి శ్రీనివాస అనే కలంపేరుతో ప్రసిద్ధులు.మాస్తి కన్నడ సాహితీక్షేత్రంలో అడుగిడింది చిన్నకథలతోనే. 1910లో ఆయన బి.ఏలో చదివేటప్పుడు రంగనమధువె అనే కథను రాశారు. మధురవాణి పత్రికలో ఈకథ ప్రచురింపబడింది. కన్నడిగుల జీవనవిధానాన్ని కన్నులకు కట్టినట్లు వర్ణించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మాస్తికంటే ముందు పంజె ముంగేశరాయ, కరూరు వాసుదేవాచార్యులు వంటి విద్వాంసులు కథలను రాశారు. కాని మాస్తి కథలలోని వినూత్నత ప్రజల్ని బాగా ఆకట్టుకున్నది. ఈయన అంతకుముందు ఎవరూ అనుసరించని నూతన కథాకథనపద్ధతులతో కథలను రచించి విమర్శకుల ప్రశంశలందుకున్నారు. మాస్తి ఉపయోగించే భాష, వివరణ, శైలి ఎంతగానో కీర్తింపబడ్డాయి.

మాస్తి కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని మాస్తి అనే గ్రామంలో 1891 జూన్ 6వ తేదీన మాస్తి రామస్వామి అయ్యంగారు, తిరుమలమ్మ దంపతులకు జన్మించారు.మాస్తి ప్రభుత్వోద్యోగిగా ఉన్నప్పుడు అనేక మందిని కలిపే ఆవకాశం ఉండేది మనిషిని  చూసిన వెంటనే అతని వ్యక్తిత్వాన్ని పసిగట్టే తత్వం ఉన్న మాస్తి ప్రజలలోని మానసిక ప్రవృత్తులను ప్రతిబింబించే కథలను రాయడం అలవాటయింది. ఇంగ్లీషు ఎం. ఏ. చేయడం వల్ల మాస్తికి ఆంగ్లంపై మక్కువ ఎక్కువగా ఉండేది. చిన్న కథలు రాయడానికి ప్రథమ స్పూర్తి స్ట్రాండ్ పత్రికలో వచ్చే చిన్న కథలను చదవడమే. మాస్తి తన చిన్న కథలను పదిహేను సంపుటాలుగా వెలువరించారు. ఆయన రాసిన మొత్తం కథలు నూరు. అన్ని కథలలోనూ సామాజిక జీవనం ప్రతిఫలిస్తుంది. వీరి ప్రతి కథలోనూ మధ్యతరగతి ప్రజల జీవన విధానం, సామాజిక సంఘర్షణ కనిపిస్తాయి. ముఖ్యంగా స్త్రీ పాత్రల మనస్తత్వ విశ్లేషణ మానసిక పరిపక్వత ఈయన కథలలో మనకు కనిపిస్తుంది. వీరి కథల్లో సంప్రదాయాన్ని గౌరవించే స్త్రీలతోపాటు విశృంఖలత్వం ప్రదర్శించే  స్త్రీలుకూడా ఉన్నారు. ఇతిహసాలోలని పాత్రలను కథావస్తువుగా తీసుకున్నారు.తల్లీకూతుళ్ళ అనుబంధం, తండ్రీకూతుళ్ళ స్నేహం, అత్తాకోడళ్ళ సంఘర్షణ, దంపతుల అనురాగం అన్యోన్యత, సంఘర్షణ, అన్నాచెళ్ళెళ్ళ అనుబంధం వీరి కథల్లో కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు, ఋషులు, కవులు, పండితులు, పామరులు, మాండలికులు, పల్లె జీవనం, పట్నపు జీవనం, పతివ్రతలు, వేశ్యలు, హంతకులు చివరికి కాకులు, చీమలు కూడా మాస్తి కథలలో కథావస్తువులయ్యాయి. తన పదిహేను కథాసంకలనాలలో నూరు కథలను మనోరంజకముగా రచించి కన్నడ ఆస్థి మాస్తిగా కీర్తింపబడ్డారు. నిరాడంబరమూ, సహజము అయిన మనోహర శైలితో మాస్తి కథలు చారిత్రకంగానేగాక కళాత్మకంగా కూడా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. సాహిత్య సేవతోపాటు అనేక ప్రజాహిత కార్యకలాపాలలో పాల్గొని మానవతా ధృక్పథంతో జీవన పత్రిక నడిపి కన్నడనాడులో మహామనీషిగా పేరుగాంచిన మాస్తి 6.6.1986 నాడు దివంగతులైనారు

స్త్రీ విద్య:నాటి సమాజంలో స్త్రీ చదువుకోవడమే తప్పుగా భావించేవారు.  సమాజంలో నియమాలకు కట్టుబడేవారు. సంఘంలో సగమైన స్త్రీలు నిరక్షరాక్ష్యలై అంధకారంలో మునిగి ఉన్నారు. స్త్రీ విద్య సమాజానికి కీడుతెస్తుందని నాటి సమాజం భయపడేది. ఈ విధంగా విద్య స్త్రీలకు  చేరువలో ఉండేది కాదు. దీని కారణంగా 19-20 శతాబ్దాల్లో చదువుకున్న పురుషుల్లో కలిగిన చైతన్యం నాటి స్త్రీలలో కనిపించదు. స్త్రీలకు విద్యావకాశాలు లేకపోవడానికి బాల్యవివాహలే కారణమని, స్త్రీలను విద్యావంతులను చేయడం ద్వారా సమాజ పురోగతి సాధించవచ్చని మాస్తి తమ రచనల ద్వారా స్త్రీ విద్యా వ్యాప్తికి కృషి చేశారు.       మాస్తి కథల్లో అంతర్గతంగా స్త్రీకి విద్య అవసరమనే భావం కనిపిస్తుంది. నళినియ తందె కథలో లక్ష్మి  శ్రీమంతురాలే కాక విద్యావంతురాలు కూడా. విద్యావంతురాలు కాబట్టే చెడునడతలు నడిచే తన భర్త విశ్వనాథలో మార్పు తెచ్చి మంచి మార్గంలో నడిచేటట్లు చేసింది. మాస్తి కథలోని స్త్రీలు ముఖ్యంగా పాశ్చాత్య స్త్రీలు విద్యావంతులై ఉంటారు. పురుషులతో పాటు చర్చా కార్యక్రమాలలో పాల్గొని తమ పాండిత్యాన్ని ప్రదర్శించగల సత్తా ఉన్నవాళ్ళు నర్తకి పరాభవ కథలో ఇసడోరా నర్తకి. ఈమే  స్త్రీ స్వేచ్ఛ ఆవశ్యకత, ఆవిర్భావ వికాసాలను, వివాహ వ్యవస్థలోని లోటుపాట్లను పండితుల సభలో అనర్గలంగా ఉపన్యసిస్తుంది. స్త్రీకి విద్య ఉన్నట్లయితే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని మాస్తి ఈ కథ ద్వారా తెలియజేశారు.దాంపత్యద హోసపరి కథలో జయమ్మ చదువుకున్న యువతి, ఈమె కథా రచయిత్రి కూడా. ఈమె సాహిత్యం మీద అభిరుచి కలిగిన రామస్వామిని పెళ్ళి చేసుకొని ఆదర్శ జీవితం జీవిస్తుంది. విద్య లేకపోవటంవల్ల మూఢ నమ్మకాలు పెరుగుతాయని, కాయకష్టం చేసుకుని జీవించవలసి వస్తుందని చెన్నమ్మ, నాయిబాళు వంటి కథల ద్వారా మాస్తి ప్రబోధించారు.

బాల్య వివాహలు: మాస్తి బాల్య వివాహలు, వాటివల్ల స్త్రీ ఎదుర్కొనే సమస్యలను కృష్ణమూర్తియ హెండితి, చిక్కవ్వవంటి కథల్లో చూపించారు. నలభై ఐదేళ్ల వ్యక్తి  ఒక చిన్నపిల్లని పెళ్ళి చేసుకోవటమనేది ఎప్పటికైనా సిగ్గుపడ వలసిన విషయమే. ఈ కథలో తనకంటే  నాలుగేళ్ళు పెద్దవాడైన కొడుకు ఉండగా నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి చిక్కవ్వను నాలుగో పెళ్ళి చేసుకుంటాడు. ఇంటికి వచ్చిన ఆమె చిన్నపిల్ల అయితే సంసారభారం వయసుకు మించి  ఉండేది. ఇంటిపనికి ఆడ మనిషి కావాలనే ఉద్దేశంతో ఇలాంటి బాల్య వివాహాలు జరిగేవి. భార్యగా చూడకుండా ఒక పనిమనిషిగా చూచేవారు. ఈ కథలో తన భర్త పెద్దకొడుకు చిక్కవ్వను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. అది భరించలేక చిక్కవ్వ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. వయసులో భార్యా భర్తలకు ఎక్కువ తేడా ఉండరాదు. ఉంటే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని మాస్తి ఈ కథ ద్వారా నిరూపించారు.కృష్ణమూర్తియహెండితి కథలో కూడా బాల్య వివాహాలు వల్ల కలగే ఆనర్థాలను మాస్తి చర్చించారు. పుత్రకామేష్టి కథలో మాధవరం ధనికుడు శామన్న భార్య చనిపోయిన ఇరవై సంవత్సరాల తర్వాత బాల్య ఛాయలు వీడని ఒక చిన్న బాలికను మగ సంతతి కోసం రెండవ పెళ్ళి చేసుకుంటాడు. మొదటి భార్య కూతురుకి పెళ్ళయింది కాని భర్త  చనిపోతాడు. మగ సంతతి  కోసం తన కూతురుకంటే తక్కువయసున్న బాలికలను ఆనాటి సమాజంలో వివాహామాడేవారని ఈ కథ ద్వారా మాస్తి తెలెయజేశారు.

 

        పురుషులు సన్యాసం స్వీకరించి కాశీ వెళ్ళిపోయినప్పుడు ఆ స్త్రీలు పడే కష్టాలు, కడగండ్లు, వారి జీవితంలోని మానసిక సంఘర్షణ సారెపుత్రన కడయ దినగళు ఆచార్యతపత్ని, మునీశ్వరసమర, కామన హబ్బద ఒందుకలే,సన్యాస అల్లదసన్యాసి వంటి కథలలో చూపించారు.బారత సమాజంలో స్త్రీ కుటుంబాన్ని విడిచి ఒంటరిగా జీవించడం కష్టం అని మాస్తి అభిప్రాయం. అందుకే ముసరిన మంగమ్మ, నళినియ తందె, చెన్నమ్మ, ఆచార్యరపత్ని వంటి కథల్లో ఇల్లు విడిచి దూరంగా వెళ్ళిన స్త్రీ ఎదుర్కొనే ఇబ్బందులను సజీవంగా చిత్రించారు.

 

          మాస్తి కథలలో ఉన్నత వర్గపు స్త్రీలు శీలానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇల్లు వదలిన గుడ్డి లక్ష్మమ్మగానీ (మేలూరిన లక్ష్మమ్మ), చీకటిలో దారి తప్పిన స్త్రీగాని (ఒందు హళియ కతె),  సవతికొడుకు కామతృష్ణకి చిక్కిన పినతల్లిగాని (చిక్కవ్వ), ఏ సందర్భములోను వంచకుల చేతికి దొరికినా ఏదో ఒక ఆదర్శమో, దైవానుగ్రహమో వారిని కాపాడుతుంది. వీరికి ఎక్కడో ఒక చోట ఆశ్రయము దొరుకుతుంది. కాని కింది వర్గాల స్త్రీలలో శీలంపై అంత పట్టింపు ఉండదు. భర్తను విడిచి సుఖభోగాలపై ఆసక్తితో రెడ్డితో వెళ్ళిన వెంకటేశుని పెళ్ళాం రెడ్డితో విసిగిపోయి మళ్ళీ తన భర్త వెంకటేశుని చేరుతుంది. (వెంకటిన హెండితి). తన అన్నతో ఉన్న అక్రమ సంబంధానికి రోసిపోయి దూరాన ఉన్న తన భర్తను తిరిగి చేరిన పక్షిజాతి చెల్లెలు (పక్షిజాతి) మొదలైన కథలే దీనికి ఉదాహరణ. ఆంగ్ల నౌకా కాప్టన్ కథలో కేప్టన్ తన భార్య నిల్ తనులేనప్పుడు తప్పు చేసినా క్షమించి తన భార్యగా స్వీకరిస్తాడు. మాస్తి కథల్లో స్త్రీలు తప్పు చేసినా చివరికి పశ్చాత్తాపంతో భర్తను తిరిగి చేరుకుంటారు. భర్తలు అధికశాతం ఉదార స్వభావం కలిగి తమ భార్యలను ఆదరిస్తారు. ఆంగ్లనౌకా కెప్టన్ భార్య నిల్ ఒంటిరిగా ఉండలేక చెడింది. వెంకటిన భార్య ఆడంబరాలకు, అత్యాశకు లోనై చెడింది. మగవాడికి ఒంటరితనం ఎంత కష్టమో  స్త్రీకి కూడా అంతే కష్టం.

          ఎంతటి వ్యభిచారి అయినా, పాపినయినా క్షమించాలని క్రీస్తు గురువు బోధించాడు. ఆ ఉపదేశం మనకు ఆచరణయోగ్యం అని ఆంగ్ల నౌకా కెప్టన్ తో అతని భార్యను క్షమించమని రచయిత సూచిస్తాడు.స్త్రీ విషయంలో  మాస్తికి కనికరం మాతమే కాక అపార గౌరవం కూడా ఉంది. స్త్రీ లోకమాత, ఆదిశక్తి, దేవి అవతారం అనే మాటలు మాస్తి కథల్లో అనేక చోట్ల కనబడతాయి.          చివరకు ఆమె (లలిత) తనను మార్చడానికి వచ్చిన దేవి అవతారమేనని అతను (సుబ్బన్న) భావించకొంటాడు. (సుబ్బన్న కథలో). మునీశ్వర మర; కథలో సన్యాసి రామయ్య తన వద్దకు వచ్చిన భార్య రాజమ్మకు చెప్పిన మాటల్లో          స్త్రీలందరూలోకమాతలు..నువ్వులోకమాతవని గుర్తుంచుకో. ఏం చేసినా లోకమాతగానే చేశానని భావించుకో.. అని భార్యతో అంటాడు. ఈ మాటల వల్ల స్త్రీ లోకమాత అని గౌరవించడం మన బాధ్యత అని ఈ కథల ద్వారా మాస్తి నిరూపించారు.

శీలవతులు: మాస్తి చిత్రించిన స్త్రీ పాత్రలలో ఉన్నత వర్గపు స్త్రీలు శీలవంతులై ఉంటారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఈ స్త్రీలు తమ శీల సంరక్షణకు ఎక్కువ విలువనిస్తారు.  మొసరిన మంగమ్మ  కథలో మంగమ్మ మధ్య తరగతి స్త్రీ. ఆమె కొడుకు, కోడలితో విభేదించి పెరుగు వ్యాపారం చేసుకుంటూ  ఒంటరిగా జీవనం సాగిస్తుంటుంది. మనమడి మీద అనురాగంతో తిరిగి కొడుకు ఇంటికి చేరుతుంది. మంగమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు చేయ్యి పట్టుకున్న రంగప్పను చీదరించుకుంటుంది. రంగసామియ అవివేక కథలో తనపై కామదృష్టితో ఉన్న స్నేహితురాలి భర్త రంగసామికి బుద్దిచెప్పి అతని భార్యకు తెలియకుండా వారి సంసారాన్ని చక్కదిద్దిన ఇందిర కూడా శీలానికి విలువనిచ్చింది. పుత్ర కామేష్టి కథలో పిల్లలు కనుటకు భర్తలు బలవంతాన దొంగ సన్యాసి నుండి వ్రతం స్వీకరించి శీలం చేడుపు కొనక జాగ్రత్త వహించిన సాధ్వి సీతప్ప భార్య, కృష్ణమూర్తియ హెండితి కథలో భర్త చనిపోయిన సంగతిని చెవిన పడగానే బావిలో పడి చనిపోయిన కృష్ణమూర్తి భార్య శీలానికి విలువనిచ్చిన స్త్రీ, సన్యాస  అల్లద సన్యాస; కథలో బెండకాయ పులుసు చేయనందుకు కోపంతో సన్యాసం స్వీకరించిన భర్తను తిరిగి అదే పులుసు చేసి సంసారిని చేసిన నరసమ్మ శీలవతి. కామన హబ్బ ఒందు కతె కథలో కామునిపండుగ రోజు బూడిద పూసుకుని వితంతువుల విశిష్టవ్రతమాచరించిన ఈ జన్మలోనే భర్తను పొందగలిగిన సుమంగి సరస్వతమ్మ ఒదు హళియ కతె కథలో చీకటిలో దారితప్పిన సన్యాసి ఆశ్రమానికి చేరుకుంటుంది. ఆ రాత్రి సన్యాసి తలుపు తట్టినపుడు తన భర్తకు తప్ప మరెవరికీ తలుపు తీయనని శీలం కాపాడుకున్న స్త్రీ మహీసాధ్వి మాలూరిన లక్ష్మమ్మ కథలో లక్ష్మమ్మ భర్తే దేవుడని వెదుకుతూ ఒంటరిగా ఇల్లు వదిలిన సాధ్వి.చిక్కవ్వ కథలో సవితి కొడుకు కామతృష్ణతో  విసిగిపోయి  శీలాన్ని కాపాడు కోవడానికి బావిలో దూకి మరణించిన శీలవతి పిన్నమ్మ.

ఆచార్యర పత్ని కథలో రామానుజాచార్యుల  పత్ని 40 సంవత్సరాల క్రితం తనను వదిలి సన్యాసం స్వీకరించిన భర్త తిరిగి వచ్చాడని తెలిసి  అక్కడికి వెళ్తుంది. పతికి మరణాంతక వ్యాది వచ్చిందని తెలుసుకొని ఈ వ్యాధిని తాను స్వీకరించి పతికి జీవితాన్ని దానం చేసిన సాధ్వి ఆమె.నిజగల్గిన రాణి కథలో తన శీలాన్ని పరిరక్షించుకోవడానికి చివరిలో ఆత్మహత్యకు పాల్పడుతుంది. సుశీలా రజాకార కథలో కూడా సుశీల రజాకార్ల దురాగతానికి బలి కాకూడదని శీలానికి ప్రాధాన్యతనిచ్చి ఆత్మహత్యకు పాల్పడుతుంది.  చెన్నమ్మ కథలో ప్రాణం పోతే పోవచ్చు చెడ్డ పేరు రావడం భరించరానిది అనుకొని  శిలానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన వారిగా చెన్నమ్మను చూస్తాం.

ఈ విధంగా ఉన్నత వర్గపు స్త్రీలు వంచకుల చేతికి దొరికినా తమ నడతను పోగొట్టుకోడానికి ఇష్టపడక  శీలానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. వారి ఆదర్శము, దైవానుగ్రహము వారికి తోడు నిలిచి వారికి రక్షణగా ఉంటుందని మాస్తి తన కథలలో నిరూపించారు.

శీలానికి ప్రాధాన్యతనివ్వని స్త్రీలు: మాస్తి కథలలో కింది వర్గపు స్త్రీలు శీలానికి అంత ప్రాముఖ్యతనివ్వరు.  పరిస్థితుల ప్రభావం వల్ల శీలం కోల్పోతారు. అయినా తిరిగి పశ్చాత్తపపడి తమ సంసారాలను నిలబెట్టుకుంటారు. (నాగరాజప్ప. కె.జి. 1986:71). స్త్రీలు దారి తప్పిన తక్కువ శిక్షతో తిరిగి మంచి దారిలో వస్తారు.వెంకటిగన హెండితి కథలో రంగి వెంకటేశుని పెళ్ళాం. నగలకు, వస్త్రాలకు ఆశపడి భర్తను వదిలి భాగ్యవంతుడైన రెడ్డిని చేరుతుంది. వెంకటేశు అమె మిద కోపగించుకోలేదు. తిరిగి ఎప్పుడైనా రావాలనిపిస్తే సంకోచించకుండా రమ్మని రంగితో చెప్తాడు. రంగి రెడ్డితో కాపురం చేసి ఒక బిడ్డకు తల్లవుతుంది. రెడ్డి అయోగ్యతను గుర్తెరిగి విసుగు చెంది చేసిన తప్పు తెలుసుకుని తిరిగి తన బిడ్డతో కలిసి వెంకటేశుని కాళ్ళపై పడి క్షమాపణ వేడుకుంటుంది. ఆదర్శవంతుడైన వెంకటేశు సమాజం గురించి పట్టించుకోక ఆమెను ఆదరిస్తాడు.సంయమికేటో కథలో కేటో ఆదర్శవంతుడైన రాజు.  అతని భార్య మార్పియా, కేటో స్నేహితుడు హోర్జెన్సియస్ వచ్చి మార్పియాను తనుకు  భార్యగా ఇమ్మని కేటోను కోరతాడు. కేటో దీనికి సమ్మతించి మార్పియాను తన స్నేహితునికి అప్పగిస్తాడు. హోర్జెన్సియస్ చనిపోయిన తర్వాత  మార్పియా తిరిగి తన భర్త దగ్గరికే వస్తుంది. ఈ కథలో కేటో లోని స్థితిప్రజ్ఞత్వం మనకి కనిపిస్తుంది.దోరణ కంబళ కథలొ సన్యాసి రామయ్య భార్య రాజమ్మ.  రామయ్య రాజమ్మను వదలి సన్యాసం స్వీకరించి వెళ్ళినప్పుడు శీలం చెడుపుకుంటుంది. కాని పశ్చాత్తాపంతో భర్తను బ్రతిమాలినా అతడు ఆమెను తిరిగి స్వీకరించక పారిపోతాడు. రాజమ్మ పిచ్చిదై చనిపోతుంది.

పాశ్చాత్య దేశపు స్త్రీలు: మాస్తి కథల్లో పాశ్చాత్య దేశపు స్త్రీలు స్వేచ్ఛాపిపాసులు. లైంగిక విషయంలో గాని, ఆర్థికంగా గాని, వారు స్వేచ్ఛను కోరుకుంటారు. వారికి నచ్చిన వారితో కలిపి కాపురం చేయడం. నచ్చకపోతే వదలి వేరే సంబంధం కోసం అన్వేషించడం ఈ స్త్రీలలో మనం చూస్తాం. సంయమి కేటో కథలో కేటో భార్య మారియా కేటో స్నేహితుడైన హోర్జెన్సియస్ కు భార్యగా ఉండడానికి ఇష్టపడి అతను చనిపోయే వరకూ అతనితో సంసారం చేస్తుంది. అతను చనిపోయిన తర్వాత పూర్వపు భర్త కేటొ దగ్గరికి చేరుతుంది.  కేటో కూడా ఇష్టపూర్వకంగానే తన భార్యను స్నేహితునికి  అప్పగిస్తాడు. తన స్నేహితుడు మరణించిన తరువాత ఆమెని మళ్ళీ  పెళ్ళాడి ఇంటికి తెచ్చుకుంటాడు.నర్తకి పరాభవ కథ మాస్కో నగరానికి సంబంధించినది. ఇందులో నర్తకి ఇసదోరా డంకనం స్వేచ్ఛాపిసాసి, ఈమెకు అనేకమంది ప్రియులుంటారు. నచ్చిన వాన్ని ఇంటికి పిలిపించుకుని అతనితో సంసారం చేయడం ఈమె వృత్తి.

యాన్ షేక్స్ పియర్ కథలో షేక్స్ పియర్ భార్య యాన్, భర్తకంటే ఆమె ఏడు సంవత్సరాలు పెద్దది. కాని ఆమె భార్య మరో పురుషుణ్ణి  తాకకూడదన్నట్లుగానే, భర్త మరో స్త్రీని తాకకూడదని నమ్మి ఆ విధంగా జీవించిన ఆదర్శమూర్తి. భర్త మరో స్త్రీతో కలిసి పరుపుపై  ఉండడం చూసి ఆ కొత్త పరుపు మీద తాను పడుకోవడానికి ఇష్టపడలేదు. దానిని ముట్టకూడదని తలంచి ఆ ప్రకారమే యాన్ ఆ పరుపును తాకలేదు. ఈ కథ ద్వారా పాశ్చాత్య స్త్రీలలో కూడా శీలవతులుంటారని తెలుస్తుంది.

విచిత్ర ప్రేమ కథలో చాటలైట్ రాణి  ముగ్గురితో కాపురం చేసింది. ఫ్రాన్స్ దేశపు ప్రసిద్ధ సాహితీవేత్తగా పేరుపొందిన వాల్టేర్ ను ప్రాణప్రదంగా  ప్రేమించింది. వారిద్దరి మధ్య జీవితం కేవలం శారీరక ఆకర్షణ మాత్రం కాక రెండు దేహాల్లో ఉన్న ఒక్క చైతన్యంలా కలిపి జీవించారు. కాని రాణి ఆ దేశపు ప్రభువును వివాహమాడింది. ఇతను ఉదార మనస్కుడు. నీవు భార్యగా వచ్చావని నేను అనుకోలేదు. భార్య భర్తల సంబంధంలో భర్త తనకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే  భార్య కూడా అలాగే ప్రవర్తించవచ్చు  అనేది అతని అభిప్రాయం. ఈ విషయాన్నే పెళ్ళైన మొదటి రోజే రాణితో ప్రస్తావిస్తాడు. రాణి ఇష్టపడిన వాల్టేరును పిలిపించి నెలరోజులు ఆతిథ్యమిచ్చాడు. తర్వాత సెయింట్ ల్యాంబర్ట్ ముగ్ధ మనస్కుడు.  నిస్వార్థపరత్వం కల అందగాడు. అందమైన సంతానం కోసం రాణి ల్యాంబర్ట్ ను మోహించింది. కాని బిడ్డ పుట్టిన వెంటనే చనిపోయింది. గొడ్రాలుగా ఉండడం ఇష్టంలేక  మళ్ళీ సంతానం కోరుకుంది.కాని మృత్యువు ఆమెను ఆహ్వానించింది. చివరిరోజుల్లో ఆమె ముగ్గురినీ తన దగ్గరకు పిలిపించుకుంది. చనిపోతూ ఆమె నేను తొందరగా కన్ను మూస్తున్నానని వ్యథగాలేదు నాకు స్త్రీ ఆశించే సుఖాలన్నింటిని నేను అనుభవించిన దాన్ని. నా ప్రభువు నాకు పదవి ఇచ్చాడు, నీవు ప్రేమను పంచావు. ఆ తర్వాత సెయింట్ వాల్టేరు అందించిన ప్రేమను ఆస్వాదిస్తూ కన్నుమూసింది.

పాశ్చాత్య దేశాలలో స్త్రీకి ప్రణయ స్వేచ్ఛ ఉందని ఈ కథ ద్వారా తెలుస్తున్నది. ఆంగ్ల నౌకా కాప్టెన్ కథలో  కెప్టెన్ భార్య నిల్ కెప్టెన్ యుద్ధానికి వెళ్ళినపుడు వేరే వ్యక్తితో గర్భం ధరిస్తుంది. కాని పశ్చాతాపపడి తన భర్తను క్షమాపణ వేడుకుంటుంది. కెప్టెన్ ఆమెను క్షమించి ఆదరిస్తాడు. అర్వాచీన ఆంగ్ల శకుంతల కథలో పెళ్ళికాకుండానే బిడ్దను కనడం చూస్తాం. ఈ కథలో పాశ్చాత్య దేశాలలో పెళ్ళికాకుండానే కలిసి జీవించడం వంటి స్వేచ్ఛను మాస్తి చూపించారు.

స్త్రీకి స్వాతంత్ర్యం ఉండాలని మాస్తి కాంక్షించి తన కథలలో స్త్రీ స్వేచ్ఛ గురించి ప్రబోధించారు. దాంపత్యద హోసపరి, నర్తకి పరాభవ వంటి  కథలలో ఈ విషయం చర్చించారు. సామాజికంగా, ఆర్థికంగా స్త్రీకి స్వేచ్ఛ ఉంటేనే సమాజం పురోభివృద్ధి సాధిస్తుంది. అయితే అధిక స్వేచ్ఛ అనర్తదాయకం అని ఈ కథలలో మాస్తి నిరూపించారు. దాంపత్రద హోసపరి కథలో మాస్తి పై ప్రఖ్యాత ఆంగ్ల రచయిత బసామర్సెట్ మామ్ ప్రభావం కనిపిస్తుంది. ఈ కథలో మామ్ తన స్నేహితుని జీవితంలో జరిగిన సంఘటనను రచయితకు వివరిస్తూ స్త్రీ స్వేచ్ఛను గురించి తన అభిప్రాయాలు ఇలా తెలియజేశారు.

ఇంతకు ముందు పురుషుడు తప్పుదార్లో నడుస్తున్నప్పుడు స్త్రీ సహించుకొని ఉండాలన్న సూత్రంగా ఉండేది. ఇది హద్దు మీరి స్త్రీ సహించుకోవాల్సిన అవసరం లేదన్నంత వరకు వచ్చింది. ఆ తర్వాత పురుషుడితో పాటు స్త్రీకి కూడా సమానంగా స్వాతంత్రం కావాలన్న నినాదం బయల్ధేరింది. ఈ నినాదం ప్రస్తుత స్త్రీ ఎదైనా తప్పు చేస్తే మగవాడు సానిభూతితో వర్తించాలన్న సూత్రంగా రూపుదిద్దుకుంది. ఈ సూత్రం వరకూ తప్పుకాదు. నా భార్య అన్నంతమాత్రానికీ ఆ స్త్రీ మనస్సుకు సంకెళ్ళు బిగించడం వీలుకాదు. అయితే సంకెళ్ళు లేవన్నంత  మాత్రచేత , స్త్రీ నా మనస్సు పయనించే మార్గంలోనే వెళ్తాను అని అంటే భర్త ఎంతటి పెద్ద గుణం ఉన్నవాడైనా ధుఃఖానికి లోను కావాల్సివస్తుంది. మన విజ్ఞసమాజం ఇలా ఈ విషయంలో దారి తప్పిందని నాకనిపిస్తుంది.  ఈ మాటలను బట్టి స్త్రీకి స్వేచ్ఛ అవసరం కాని అది పరిధులు దాటితే అనర్థం తప్పదని సంఘాన్ని హెచ్చరించినట్లు చూస్తాం.

నర్తకి పరాభవ కథలో ఇసడోరా అనే పాత్ర, స్త్రీ స్వేచ్ఛను గురించి చర్చస్తూ ఇలా అంటుంది. స్వేచ్ఛ అనే విషయంలో మన అవగాహన సరియైనది కాదు. స్త్రీ  పురుష సంబంధ విషయాలలో ప్రస్తుత సమాజాలు నియమించిన కొన్ని నిర్భంధాలు తొలగిపోవాలన్నది నా అభిప్రాయం. ప్రజలు స్చేచ్ఛ అంటున్నా ఈ ప్రణయ పద్ధతి స్త్రీకి స్వాతంత్రం ఉండాలన్న మూల ఉద్దేశం నుండి పుట్టి పెరిగింది. ఈ పరిస్థితిలో స్వాతంత్రం మొత్తం మగవాడికే పరిమితమైంది. స్త్రీకి స్వాతంత్రం ఏ కోశానా లేదు. ఈ స్థితి స్త్రీజాతిని బాలారిష్టాలకు గురిచేసింది.  పై మాటల్లో స్త్రీకి స్వాతంత్ర్యం ఉండడం క్షేమమన్న రచయిత అభిప్రాయం గోచరిస్తుంది.

ఇసడోరా చెప్పినా కథనం ప్రకారం ఫ్రెంచి రచయిత్రి జార్జ్ సాన్ స్త్రీ స్వేచ్ఛ అనేభావానికి మూల ప్రతిపాదకురాలు. జార్జ్ పాన్ భర్త  పెడదోవ పడతాడు. సహించినంత కాలం సహించి, అతన్ని వదిలించుకోకపోతే జీవితమే లేదని అభిప్రాయపడుతుంది. ఆమె అతని నుండి దూరం కావాలనుకుంటుంది. కాని చట్టం ఒప్పుకోదు, అయితే ఆమె భర్తనుండి పడిపోయే అవకాశం ఉండాలని వాదిస్తుంది. అంతటితో ఆగక ఇతర విషయాలలో కూడా స్త్రీకి స్వాతంత్ర్యం ఉండాలంటుంది.  స్త్రీ స్వేచ్ఛకు అనుగుణంగా ప్రజల మనసును దిద్దాడానికి ప్రయత్నస్తుంది. ఈ కథలో స్త్రీకి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వేచ్ఛ ఉండాలని మాస్తి ఉద్ఘాటించారు. కాని వివాహ వ్యవస్థలో భార్యభర్తలు కలసి ఉంటేనే  కుటుంబానికి సార్థకత సమాజానికి శ్రేయస్కరం.  అనేది రచయిత దృకథం, తనకు నచ్చిన వారికి విందుకు ఆహ్వానించి వారితో లైంగికంగా తృప్తి చెందటం ఈ కథలోని నర్తకి ఇసడోరా వృత్తి. అదే విధంగా తనకు నచ్చిన స్టెనిన్ లాప్ స్కీని విందుకు అహ్వానిస్తుంది. కలిసి జీవిద్దామనే అతనితో అంటుంది. కాని లాప్ స్కీ ఆమె ఆహ్వానాన్ని తిరస్కరిస్తాడు. నేను కలిసి ఉండాలనుకొనే స్త్రీ జీవితాంతం నాతోనే ఉండాలి, నా బిడ్డకు తల్లి ప్రేమ, పోషణ కావాలి. వీటిన్నిటికీ ఒప్పుకుంటేనే నీ సలహా గురించి ఆలోచిస్తాను. అభిప్రాయన్ని నర్తకితో చెప్పాడు. దీని ద్వారా ఈ కథలో భారతీయ వివాహ వ్యవస్థే గొప్పదని మాస్తి నిరూపించారు.

ప్రణయ స్వేచ్ఛ, లైగింక స్వేచ్ఛ:పాశ్చాత్య దేశ స్త్రీల ప్రణయ స్వేచ్ఛ, వారి జీవిత ఆశయాలను మాస్తి కథల్లో చూస్తాం. వీరి కథల్లో స్త్రీ తనకు నచ్చిన పురుషునితో తనకు ఇష్టమున్నంత వరకూ స్వేచ్ఛగా కలిసి ఉండవచ్చు. నచ్చకపోతే వదిలివేసి నచ్చిన మరో వ్యక్తితో కలిసి జీవించే స్వాతంత్ర్యం స్త్రీలకు ఉంది. అయితే ఒక స్త్రీ అలా నచ్చిన వ్యక్తితో వెళ్ళిపోయేటప్పుడు, భర్త ఎంతటి ఔదార్యవంతుడైనా దుఃఖానికి లోనువుతాడు. ఆ భార్య అనేక మందితో చెడు నడతలు నడిచి చివరికి మొదటి భర్త దగ్గరికి వచ్చినపుడు భర్త పెద్ద మనసుతో ఆదరిస్తాడు. దాంపత్యద హోసపరి వెంకటిగన హెండతి, సంయమి  కెటో విచిత్ర ప్రేమ వంటి కథల్లో అలాంటి స్వేచ్ఛ గల స్త్రీలు కనిపిస్తారు.

          స్త్రీకి ప్రయణం స్వేచ్ఛ వల్ల అనర్థాలేగాని, జీవితం సాఫీగా ఉండదని ఈ కథల్లో నిగూఢంగా తెలిపారు. కొన్ని సమాజాల్లో స్త్రీలు లైంగిక ప్రణయ స్వేచ్ఛ కలిగి ఉంటే మరికొన్ని సమాజాల్లో పురుషులు అలాంటి స్వేచ్ఛను కలిగి ఉంటారు. అయితే పతి ముఖ్యమనే సమాజంలో  పత్ని, పత్ని  ముఖ్యమనే సమాజంలో పతి ఇలాంటి లైంగిక స్వేచ్ఛని సహించుకుంటారు. ఈ రెండిటికి మనసే కారణం మని దాంపత్యద హోసపరి కథలో రచయిత చెబుతారు.

          విచిత్ర ప్రేమ కథలో చాటెలైట్ రాణి భర్తతో పాటు మరో ఇద్దరితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటుంది. జ్ఞానవంతుడిని వాల్టెర్ ను, అందమైన సంతానం కోసం సెయింట్ ల్యాంబర్ట్ ను ప్రేమించింది.  ఈ స్వేచ్ఛను చాటెలైట్ ప్రభువు సమర్థించి రాణిని ఆదరించాడు. అయినప్పటికీ చాటెలైట్ రాణి ఆత్మక్షోభననుభవిస్తుంది. సంయమి కెటో, వెంకటిగన హెండితి వంటి కథల్లో కూడా ఇలాగే భర్తను కాదని, వేరొకరితో వెళ్ళిన స్త్రీ, చివరికి పశ్చాత్తాపపడి తిరిగి భర్తను చేరుకుంటుంది.

          పై చర్చలవల్ల వివాహేతర సంబంధాలలోని అనిశ్చితిని గుర్తించవచ్చు. పై కథల వల్ల స్త్రీలు భర్తల్ని వదిలి బయటికి వెళ్ళి ప్రియులతో సుఖజీవనం చేయాలనుకుంటారు. కాని అలాంటి జీవితం అభద్రమైనది. మూన్నాళ్ళముచ్చట  లాంటిది. తమ జీవితాల్ని పాడుచేసుకొన్నట్లు చివరికి గ్రహిస్తారు.

పెళ్ళంటే స్త్రీ పురుషులు తమతమ సుఖాలను తీర్చుకోవడానికి ఏర్పాటైన వ్యవస్థ కాదు. దాని ఉద్దేశం సంసారాల్ని ఏర్పాటు చేయడం అందులో భార్యభర్తల సుఖం లాగానే వాళ్ళ సంతానం సుఖ సంతోషాలు కూడా ముఖ్యమైన విషయం (నరకి పరాభవ) అని పెళ్ళి కేవలం భార్యభరల కోసమే కాదు పిల్లల భవిష్యత్తు కోసం కూడా అని మాస్తి చెప్పారు. స్వేచ్ఛా ప్రణయం వల్ల కుటుంబ జీవనం చెదిరిపోయి భవిష్యత్తు అంధకారం అవుతుందని సమాజాన్ని హెచ్చరించారు.

మాస్తి కథల్లో సమాజంలో ఉన్న అసహజమైన లైంగిక వాంఛలు, అన్నా చెల్లెళ్ళ మధ్య లైంగిక సంబంధాలు కూడా చోటుచేసుకున్నాయి. పక్షిజాతి కథలో అన్నా చెల్లెళ్ళు ముద్దస్వామి, ఈరమ్మలు లైంగిక సంబంధం కలిగి ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న భర్త మంచణ్ణ తన ఊరు నంజనగూడ నుండి  బెంగళూరు చేరుకుని కట్టెల కొట్టు సుబ్బయ్య దగ్గర కట్టెలు చీల్చే  కూలీగా చేరుతాడు. నంజనగూడ ఊరి పెద్దలు అన్నా చెల్లెళ్ళ సంబంధం తెలుసుకొని వారిద్దరికీ దండన విధించి ఇకనుండి అన్నా చెల్లెళ్ళుగా జీవించాలని తీర్పు ఇస్తారు. తమ తప్పును గ్రహించి పశ్చాత్తాపపడిన అన్నా చెల్లెళ్ళు మంచణ్ణ అడ్రస్ తెలుసుకుని అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటారు. సుబ్బయ్య మంచణ్ణకు ఆదరణ మాటలు చెప్పినప్పుడు మంచణ్ణ తన భార్యను క్షమించి చేర్చుకుంటాడు. అందరూ కలిసి తమ పల్లెటూరికి చేరుకుంటారు.

ఈ కథలో అసహజమైన లైంగిక వాంఛ చూపబడింది. మాస్తి కథల్లోని భర్తలు విశాల హృదయమ గలవారు కాబట్టి మంచణ్ణ తన భార్యను ఆదరించి ఆదర్శప్రాయడయ్యాడు.

రాణిహాట్ షేష్ సిటొ కథలో అక్కా, తమ్ముడు, భార్యా భర్తలు. ఈజిప్ట్ దేశపు సంప్రదాయం ప్రకారం రాజసంతతి తమకు సమానమైన రాజసంతతితోనే వివాహం చేసుకోవాలి.  ఈజిప్ట్ రాజసంతతికి సమానంగా తూగే రాజసంతతి లభించరు. ఈ కారణంవల్ల ప్రతి తరంలోనూ రాజదంపతుల కొడుకు కూతురు యువరాజు, యువరాణి అయ్యేవారు. పతి, పత్ని రాజసంతతివారే అయి ఉండాలన్న కఠిన సంప్రదాయం వల్ల అన్నా చెల్లెళ్ళు రాజు రాణి అయ్యేవారు. అన్నా చెల్లెళ్ళ వయసులో ఎంత తెడాఉన్నా అడ్డులేదు. భర్త అయ్యేవాడు ఎంత చిన్నచాడైనా పరవాలేదు. అక్క, తమ్ముడు పెళ్ళి చేసుకొని కాబోయే రాజు, రాణి అయ్యేవారు. హోట్ షేష్ సిటో, టేహు టేమీస్  ఈ విధంగా రాణి, రాజు అయిన అక్క తమ్ముడు. సిటో తమ్ముని కంటే పదిహేను సంవత్సరాలు పెద్దది. వీళ్ళు ఒక తండ్రి బిడ్డలు. కాని నీళ్ళ తల్లులు మాత్రం ఒక్కరు కాదు. వీరి పిల్లలు కూడా వీరిలాగే పెళ్ళి  చేసుకుని రాజు రాణి  అయ్యారు. వీరి తండ్రి ఒక్కడే అయినా తల్లులు వేరు.ఈ కథలో మాస్తి ఈజిప్ట్ దేశపు సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలుచూపించారు.

ఆర్థిక స్వేచ్ఛ: స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ అవసరమని మాస్తి తన కథల ద్వారా సూచించారు. ఆర్థికంగా స్వేచ్ఛ  ఉన్నప్పుడే స్త్రీలు తమ జీవితాలను తామే సరిదిద్దుకోగలరని నళినియతందె, దురదృష్టద హెణ్ణు, మొసరిన మంగమ్మ, చెన్నమ్మ, ఎమ్మెకలవి వంటి కథల ద్వారా తెలియజేశారు.

          నళినియ తందె కథలో నళిని తల్లి లక్ష్మి తన భర్త  విశ్వనాథ చెడుమార్గంలో ఉన్నప్పుడు అతన్ని సరైనమార్గంలోకి తీసుకురావడానికి కొంతకాలం అతన్ని విడిచి దూరంగా ఉంటుంది. ఈమె ఆస్తిపరురాలు. పైగా విద్యావంతురాలు కూడా. ఆర్థికంగా స్వేచ్ఛ ఉంది. కాబట్టి అయోగ్యుడైన తన భర్తను విడిచి ఉండగలిగింది. విశ్వనాథ చివరికి లక్ష్మి చెప్పిన మాటలు విని తన కూతురు క్షేమంకోరి మంచి నడవడిక అలవర్చుకుంటాడు.

          ఈ కథలో లక్ష్మికి ఆర్థికంగా స్వేచ్ఛ ఉంది. కాబట్టి తన భర్తను మార్చుకుని తన సంసారాన్ని సరిదిద్దుకోగలిగింది. చెన్నమ్మ కథలో చెన్నమ్మకు ఆర్థిక స్వేచ్ఛ లేదు. ఉంటే తన భర్త, మేస్త్రీల చేతిలో ఆమె మోసపోయి ఉండేదికాదు. స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ ఉంటే వారి  జీవితాలను వారే సరిదిద్దుకోగలరు. అందుకే స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ అవసరమని మాస్తి తన కథల ద్వారా చెప్పారు.

వితంతువులు: మాస్తి కథల్లో వితంతువులు ఆధికంగా కనిపించరు. కొంతవరకు వితంతువుల నమ్మకాలు, వ్రతాలు, వారి జీవన విధానాలను కామన హబ్బద ఒందుకతె అనే కథలో సూచించారు. తల్లిదండ్రులకు సావిత్రమ్మ ఒక్కటే కూతురు. చాలా పేద కుటుంబం. సావిత్రమ్మను శ్రీనివాస శాస్త్రి అనే యువకునికిచ్చి పెళ్ళి చేశారు. తను పనీ పాట లేకుండా అల్లరి చిల్లరగా తిరిగేవాడు. సావిత్రమ్మకు పెళ్ళైన రెండు సంవత్సరాలలో తల్లి తండ్రి చనిపోయారు.  అప్పటి నుండి మామగారింట్లోనే ఉంటుంది. అక్కడే ఆమె పెద్దమనిషి  అయ్యింది. శోభన కార్యానికి మంచి ముహూర్తం నిర్ణించాలనే  తలంపులతో ఉండగా పాత నరసాపురానికి శివలింగ స్వామి వచ్చారని తెలిసింది. శ్రీనివాస శాస్త్రి మఠంలోకి వెళ్లి స్వామిజీ చెప్పిన బోధలు విని ఆకర్షితుడై అతనితో కలిసి వెళ్ళిపోతాడు.

సావిత్రమ్మకు భర్త అంటే పంచప్రాణాలు. కానీ ఆమెకిప్పుడు ఎవరూలేరు. భర్త రాకకోసం గౌరివ్రతం చేసింది.  శ్రీని పెద్దన్న వాకబు చేయగా స్వామి వచ్చారు.  కాని శ్రీని రాలేదని తెలిసింది. నాలుగు సంవత్సరాలు అయినా శ్రీని రాలేదు. కొద్దిరోజులకు శ్రీని స్వేహితుడొకడు వచ్చి కలకత్తా దగ్గర చనిపోయాడని చెబుతాడు. సావిత్రమ్మ విధవరాలుగా మారుతుంది. ఎవరు చెప్పినా వినదు. నా వెంట్రుకలు పెట్టుకొని నా భర్తను నరకంలో ఎందుకుంచాలి అని తన వెంట్రుకలను తీయించుకుంది. వచ్చే జన్మకైనా సేవ చేయాలని కాముని పండగలో కాల్చిన అగ్నిగుండంలోని బూడిదను తలపై పోసుకునే వ్రతం చేపట్టింది. ఈ వ్రతం చేస్తే ఆమెకు వచ్చే జన్మలో భర్తతో సంసారసుఖం లభించి సుమంగళిగా చావు వస్తుందనే నమ్మకం సావిత్రమ్మది. పది సంవత్సరాలు సావిత్రమ్మ ఈ వ్రతాన్ని ఆచరించింది. ఆమె ఊరిలో ఎందరు వాదించినా వినక క్రమం తప్పకుండా వ్రతం చేసేది. జీవశ్చవంలా బ్రతుకుతున్నానని వాపోయేది. వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు పిల్లలు ఆమె చుట్టూ చేరి నోరు కొట్టుకుంటూ అధిక మొత్తంలో బూడిద పోసేవారు. భర్త కోసం ఇవన్నీ భరించింది. ఆనాడు వితంతువులను వెంట్రుకలు తీయించేవారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఒకసారి సావిత్రమ్మ వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు శ్రీని కనిపించాడు. సావిత్రమ్మ మూర్చపోయింది. తెరుకొని సంతోషంతో భర్తను కలుసుకుని  సుఖజీవనం సాగించింది. వచ్చే జన్మకోసం ఆచరించిన వ్రతం ఈ జన్మలోనే ఆమెకు భర్తను ప్రసాదించింది. మాస్తి ఈ కథలో పల్లెటూళ్లలో కాముని పండుగ జరుపుకునేతీరు, వితంతువుల ఆగచాట్లు, పిల్లల కోలాహలం కళ్లకు కట్టినట్లు వర్ణించారు.

వేశ్యలు:మాస్తి కథల్లో వేశ్యలు అతి తక్కువగా కనిపిస్తారు. నర్తకి పరాభవ కథలో నర్తకి అయిన ఇసడోరా డంకన్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడింది. నర్తకే కాకుండా శృంగార జీవనాన్ని నడిపే వ్యక్తి కూడా. కంటికి కనబడ్డ ఏ మగాడు నచ్చినా తన కోరికను వెల్లడి చేసేది. అతని మానసిక స్థితిగతుల్ని  పరిస్థితుల్ని ఖాతరు చేయక అతనితో సహవాసం చేసేది. పదిరోజులు, నెలరోజులు తనకు కావలసినన్ని రోజులు అతనితో గడిపి నిస్సంకోచంగా అతన్ని వదిలివేసేది. ఆ పురుషుడు మరికొన్ని రోజులు నీతో గడుపుతానని చేప్పడానికి వీలులేదు. ఈమె స్వేచ్ఛా ప్రణయాన్ని సమర్థించే స్త్రీ, ఈమెకు ఆ కాలంలో అధిక గౌరవం ఉండేది. ఇసడోరా మంచి నర్తకే కాక ఆధునిక భావాలు కలిగిన స్త్రీగా కథలో చూస్తాం. స్త్రీ స్వేచ్ఛ గురించి మంచి అవగాహన ఉన్న స్త్రీ.  ఈమె ఒకసారి మంచి పేరున్న రచయితగాను, తత్వజ్ఞాని గాను పేరు గడించిన లావస్కిని విందుకు ఆహ్వానించి తన కోరికను తెలియజేస్తుంది. కాని వివాహ వ్యవస్థపై కచ్చితమైన నిర్ణయాలు గల లావస్కి ఆమె ప్రతిపాదన తిరస్కరిస్తాడు. ఆమె తన ఆత్మ చరిత్రలో తనికి ప్రీతిపాత్రులై తనతో గడిపిన కళాకారుల పేర్లు పేర్కొని వాటి మధ్య లావస్కి తన ఆహ్వానాన్నిఅంగీకరించలేదన్న విషయాన్ని దానికి అతడిచ్చిన కారణాలను ఉల్లేఖించింది. ఆ వివరణలో ఆరోజు ఆమె పొందిన అవమానపు విచారం మాత్రం లేదు. ఒకడు తన పొందును కోరకపోయినా పదిమంది తనను వలచారన్న తృప్తి మాత్రం ఆ రాతలో ఉంది. నర్తకి వేశ్య అయినా చివరికి వివాహ వ్యవస్థ పై నమ్మకం గల వ్యక్తిగా చూపబడింది.

ముగింపు:జీవితాన్ని కల్పించి రాయడం కన్నా ఉన్న జీవితాన్ని కళాత్మకంగా చిత్రించడం మాస్తి కథలలోని విశేషగుణం. బ్రతుకుదారి తెలపడం కన్నా బ్రతుకు దారి తెలుసుకొనే ఆత్మవిశ్వాసం కలిగించడం వీరి కథలో ఎక్కవగా కనిపిస్తుంది. మాస్తి స్త్రీ జీవితాన్ని, వారి మానిసిక సంఘర్షణను, స్వేచ్ఛా స్వాతంత్ర్య కాంక్షను, అనేక కథల ద్వారా మన కళ్ళముందుంచారు. దాదాపు అన్ని కథల్లోనూ స్త్రీ ప్రధానపాత్ర వహించింది. జీవన యాత్రలో ఎన్ని ఆటంకాలెదురైనా శీలానికి విలువ నిచ్చిన స్త్రీలు, జీవితంలో దురాశలకు లోనై దారి తప్పి తిరిగి తన తప్పును గ్రహించి పశ్చాత్తాపంతో తమ బ్రతుకులను సరిదిద్దుకున్న స్త్రీలు మాస్తి కథలలో కనిపిస్తారు. బాల్య వివాహాల వల్ల స్త్రీలు పడే వేదనలు వీరి కథల్లో దర్శనమిస్తాయి. మాస్తి అన్ని కథలలోనూ భారతీయ సంప్రదాయం, విలువలు ఉన్నతమైనవిగా చిత్రితమయ్యాయి. ముఖ్యంగా స్త్రీపాత్రల ద్వారా భారతీయతను, సంస్కృతీ సంప్రదాయాలను మాస్తి చూపించారు.


డా. సాకిగారి చంద్ర కిరణ్సీనియర్లింగ్విస్ట్, తెలుగువర్డ్నెట్ప్రాజెక్ట్,డిపార్ట్ మెంట్  ఆఫ్ ద్రవిడియన్ అండ్ కంపుటేషనల్ లింగ్విస్టిక్స్,  ద్రావిడవిశ్వవిద్యాలయం, కుప్పం

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)