శీర్షికలు / సంగీత రంజని  

రచన  - డా. కుసుమ, హోమియోపతి వైద్యులు, హైదరాబాద్.


 

అమోఘ ప్రతిభాశాలి, అజ్ఞాత కళాకారుడు
శ్రీ పొన్నాడ రామనాథ శర్మ

పొన్నాడ రామనాథ శర్మ, ఆంధ్రదేశం, యావత్ భారతదేశం గర్వించదగ్గ ఒక గొప్ప కళాకారుడు. పండితుడు, మేథావి. వేద వేదాంగములు, అష్టాదశ పురాణాలు ఔపోసన పట్టిన ఒక గొప్ప కళాకారుడు. అయినప్పటికీ వెలుగులోకి రాలేకపోయిన ఒక దురదృష్ట కళాకారుడు. ఆయన్ని గురించిన కొన్ని ముఖ్యాంశాలు. కళా ప్రపంచంతో పంచుకోవవాలనే తపన యీ వ్యాసానికి మూల భావం.

పొన్నాడ రామనాథ శాస్త్రి స్వగ్రామం బాపట్ల. అగ్రహారంలో, భావ నారాయణ స్వామి ఆలయం దగ్గర చిన్న పెంకుటిల్లు వీరి చిరు ఆస్తిలోని ఒక భాగం. తల్లిదండ్రులు పొన్నాడ వెంకట సుబ్బమ్మ, వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి. తండ్రిపేరు చివర శాస్త్రి వుంటే వీరి పేరు చివర శర్మ వైరుధ్యాలన్నీ మనం కల్పించుకున్నవనే విశాల దృక్పథం వారిది. ప్రభుత్వంలో ‘ఓవర్ సీర్’ గా (సూపర్ వైజర్) పనిచేస్తూ ఉండేవారు. రామనాథం గారి తాతగారు వాసుదేవ రామచంద్ర జైనులు. ‘గరుడ చైనమనే’ యాగం వరు చేయడం వలన వారిని చైనులు అని పిలిచేవారట. తండ్రి వాసుదేవ పరబ్రహ్మ శాస్త్త్రి. వారి చరమకాలంలో సన్యాసాశ్రమం స్వీకరించి అటేడు తరాలు, ఇటేడు తరాలు వంశమంతటిని తరింప చేశారు. ముగ్గురు సోదరీమణులు, రాజ రాజేశ్వరి, అన్నపూర్ణమ్మ, బాలా త్రిపుర సుందరి తరువాత కలిగిన ఆఖరి సంతానం రామనాథశర్మ.

రామనాథం గారి చిన్నతనంలో వీరికి పోలియో వ్యాధిసోకి, శరీరంలోని క్రింద భాగం అంతా చచ్చుపడిపోయింది. తల్లిదండ్రులు ఎంతో శ్రమకోర్చి, ధనం వెచ్చించినా ఆయన అంగవైకల్యాన్ని బాగుచేసుకోలేకపోయారు. రామనథం గారు మంచి స్ఫురద్రూపి. అత్యంత మేథా సంపత్తి కలవాడు. తండ్రి ఉద్యోగరీత్యా చెన్నపట్నంలో ఉండగా యీయన ఎఫ్.ఎ. పూర్తిచేశారు. చిత్ర కళమీద రామనాథం గారు ఆసక్తి చూపడం గమనించిన తల్లిదండ్రులు వీరిని ‘మద్రాస్ ఆర్ట్స్ కాలేజ్’ లో చేర్పించారు. ఆ కోర్సుని ఆయన అవలీలగా పూర్తి చేశారు. అక్కడ కాలేజీలోనే పోస్టింగ్ కి ప్రయత్నించారు. అవిటి వాడని, వీరిని ఉద్యోగంలో తీసుకోవడానికి యాజమాన్యం ఒప్పుకోలేదు. తనే స్వంతంగ 2, 3 గదులున్న ఇల్లు అద్దెకు తీసుకుని ఒక ‘ఆర్ట్ స్టూడియో’ ని పెట్టుకున్నారు. ఆ రోజుల్లోనే యీయన ‘శిశుపాల వధ’, ‘శివతాండవం’ తైలవర్ణ చిత్రాలను దాదాపు 8 అడుగుల ఎత్తు 5 అడుగుల వెడల్పు నిడివి గలవి చిత్రీకరించడం, అవి అమెరికాలో జరిగిన అంతర్జాతీయ తైలవర్న చిత్ర పోటీలకి పంపబడగా, ఒక దానికి మొదటి ప్రైజు, ఇంకోదానికి మూడో ప్రైజు వచ్చింది. ఆ సందర్భంలోనే సాటి చిత్రకారులందరు రామనాథం గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఆ సమయాల్లోనే మద్రాసులో సినిమా రంగం పుంజుకోవడాం, దానికి సంబంధించిన రకరకాల బొమ్మలు యీయన వేస్తుండేవాడు. కానీ కమర్షియల్ ఆర్ట్ లో ఆయన అంత పైకిరాలేదు. అంగవైకల్యం వల్ల యీయన కదలలేకపోయేవారు. ఎవరినయినా వర్క్ అడిగి తెచ్చుకోవడం సాధ్యం కాదు. వాళ్ళు యీయన దగ్గరకొచ్చి వేయించుకోవాలి. తోటి కళాకరుల పోటీకి యీయన నిలబడలేకపోయారు.

రామనాథం గారి చిత్ర లేఖనంలోని విశేషం ఏమిటంటే ‘శ్రీరామపట్టాభిషేకం’ అంటే పురాణాల్లో వివరించిన శ్లోకార్ధ ప్రకారం వేయడం సకల శాస్త్రాల, పురాణాలను అవగతం చేసుకున్నవారికి అది పెద్ద సమస్యకాదు. ‘సారంగధర’ చిత్రపటం అయితే ఆ చరిత్ర క్షుణ్ణంగా అధ్యయనం చేసి చిత్రీకరించడం, గాయత్రి అమ్మవారి ఫోటో అయ్ ఇతే ‘ముక్తావిద్రుమ హేమనీల ధవళఛ్ఛాయై’ శ్లోకం భావానుగుణంగా వేయడం ఆ రకంగా ‘ఓరియంటల్ ఆర్ట్’ లో వారికి తిరుగు లేకుండా ఉండేది. తండ్రి ఉద్యోగ కాలపరిమితి కూడా అయిపోవడంతో వీరి కుటుంబం బాపట్లకు తిరిగి వచ్చింది. వీరి ప్రజ్ఞాపాటవాలు చిత్ర కళకు మాత్రమే పరిమితం కాలేదు. సంస్కృతంలో పండితులయిన వీరికి సాహిత్యమంటే ఎంతో మక్కువ. అమ్మవారి మీద ఎన్నో శ్లోకాలు, పద్యాలు రాశారు. సకల కళాకోవిదుడయిన వీరి చుట్టు, కళాకారుల బృందం తయారయ్యింది. కవులు పండితులు, సమావేశమయ్యారు. వీరి ఆధ్వర్యంలో ఆ రోజుల్లో భువన విజయం సభలు జరిగేవి. డైలాగులు రాయడం, దర్శకత్వం అంతా వీరే నిర్వహించేవారు. నిలువెత్తు భువన విజయం చిత్రపటం కూడా వీరు వేయడం జరిగింది. దురదృష్ట కరమయిన విషయమేమిటంటే, వాటిని భద్రపరుచుకోవడం, జాగ్రత్త చేయడం వారు కానీ, వారి వంశస్థులెవరూ కూడా చేయలేదు. అందరూ కలిసి ‘సరస్వతీ త్రివర్ణ చిత్రాలయ’ అనే సంస్థను ప్రారంభించారు. సింగరాజు నాగభూషణం గారు, ఆలూరు రామకృష్ణారావుగారు (లఘు గణితం రచించిన మేథావి) స్థానం నరసింహారావు (ప్రఖ్యాత నాటక కళాకారుడు) అందరూ ప్రతిరోజూ సమావేశం అయ్యేవారు. రిహార్సల్సు, కవితాగోష్టులు సంగీత సభలు నిత్యకళ్యాణం పచ్చతోరణం గా ఉండేది. ఆ సందర్భంలోనే వీరు ‘తాండ్రపాపారాయుడు మరెన్నో నాటకాలు సంస్కృతంలో రచించడం జరిగింది. కానీ అవన్నీ కూడ అముద్రితాలుగానే మిగిలిపోయాయి. కళ, కళకోసమే తన మానసికానందం కోసమనుకుని రామనాథం గారు, అటు నలుగురి దృష్టిని ఆకట్టుకోలేకపోయారు. ధనార్జన కూడా శూన్యమే. పేదరికం, నిరాడంబరత్వం, అంగవైకల్యం వీరికి శాపాలుగా మారాయి

రామనాథం గారు మంచి గాయకులు. వాగ్గేయకారులు. ఎన్నో కృతులు రచించి, స్వరపరచి నేర్పిస్తుండేవారు. అందులో ఒకటి ‘ఎన్నాళ్ళు కొలిచిన ఇసుమంత దయకలుగ
దన్నా ఇంతటి కోపమా! నా పాపమా!’

మరొక రచన: నన్ను బ్రోవ తామసమేలనమ్మ
కన్న బిడ్డపై కాఠిన్యమా!

అంతేగాదు. మంచి వైణికుడు. వీణ, ఫీడేలు, మృదంగం స్వయంగా తయారు చేసి వాయిస్తుండేవారట. ఇంట్లో వారిని, ఫిడేలు మీద స్వరాలతో పేర్లు పెట్టి పలకరిస్తుండేవారట. అంతేకాదు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం కాళ్ళు లేని ఈయన, పిల్లలకి భరతనాట్యం నేర్పిస్తుండేవారు. వీరి దగ్గర నేర్చుకున్న పిల్లలు ఇప్పుడు విదేశాల్లో స్థిరపడ్డవారు ఉన్నారు. నాట్య రూపకాలు ఎన్నో రచించి పిల్లలకి తర్ఫీదు ఇచ్చేవారట. ఆనాటి భారత దేశ మేటి నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ రామనాథం గారి మేనల్లుడిని (శ్రీ లక్కీరాజు రాజగోపాలకృష్ణమూర్తి) ‘కృష్ణమూర్తి గారు, మామయ్యగారు వ్రాసిన డాన్సు స్కిప్టులు కావాలండీ అని అడిగారట. ఆయన ప్రతిభను ఆనాటి సాటి కళాకారులు గుర్తించి గౌరవించారు.

మరొక విశేషం వీరికి హోమియో వైద్యంలోనూ ప్రావీణ్యం ఉంది. వారు ఏ రంగం ముట్టుకుంటే అందులో అత్యంత ప్రతిభాపాటవాలను ప్రదర్శించేవారు. ఎన్నో దీర్ఘవ్యాధులు నయం చెయ్యడమే కాకుండా హోమియోపతి వైద్యం మీద, మదరు టించర్లు ఎలా తయారు చెయ్యాలి పొటీన్సీల గురించి కొన్ని పుస్తకాలు కూడా వ్రాశారు. దురదృష్టవశాత్తు అవి ఏవీ ముద్రణకు నోచుకోలేదు. యూరోపియన్ కళాకారులు ‘లియోనారోడావిన్సి’, మైకెలేంజిలో’లను వారి కాలంలో ‘Jack of all trades' `master of all' అని బహుముఖ ప్రజ్ఞాశాలిగా వ్యవహరించేవాళ్ళు. మన్ దేశంలో నాకు తెలిసి రవీంద్రనాథ్ ఠాగూర్ మనదేశంలో ఆ కోవకు చెందిన వారు. నిరుపేద, అవిటివాడు అయిన శ్రీ పొన్నాడ రామనాథ శర్మ గారు తప్పకుండా వారి సరసన నిలబెట్టదగిన కళాకారుడు. నైపుణ్యం ఉండి, గుర్తింపు పొందగలిగే కళాకారులు కొద్దిమంది. మట్టిలో మాణిక్యాలు కోకొల్లలు. రామనాథ శర్మ గారు వారిలో ఒకడు. వారి దివ్యస్మృతికి కళా ప్రపంచం తరపున కళాంజలి ఘటిద్దాం.

 


(ఆంధ్ర మహిళా సభ కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ వారి  కిన్నెర త్రైమాసిక సంగీత పత్రిక,
శ్రీమతి వై.రమాప్రభ గారి సౌజన్యంతో..)

 

 
 
 
 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)