సారస్వతం

ఈ తరం చేసేది అంతా అతే

- రచన :  జగ్గీ వాసుదేవ్, ISHA Foundation


 

 

 
 

ఈనాటి ప్రపంచంలో, మనం ప్రతిదాన్ని అతిగా చేయడం అలవాటు చేసుకున్నాం. మనమేది చేసినా, అతిగా చేస్తాం. ఉదాహరణకు, మనం తినడం లాంటి మామూలు ప్రక్రియలను కూడా ఎక్కడ ఆపాలో తెలియడం లేదు. ఏదైనా ఒకటి మంచి చేస్తుందని మనం అనుకుంటే, మనకు అదే ఎక్కువగా ఉంటే ఇంకా బాగుంటుందనే మూర్ఖత్వంలోకి వెళతాం. మనం పీల్చే ఆక్సిజన్ కూడా మనలోకి మరీ ఎక్కువగా వెళితే అపాయమేనన్నది సాధారణ శాస్త్రీయ జ్ఞానం. కానీ ఈరోజు, ఆధునిక ప్రపంచానికి అతిని తగ్గించుకోమని నిరంతరం భోధించాల్సి వస్తోంది. మనం అన్నీ అతిగా చేసే తరంగా తయారయ్యాం.

ఒకసారి ఏం జరిగిందంటే, శంకరన్ పిళ్ళైగారి ఒక్కగానొక్క కొడుకు ఐటీ ప్రొఫెషనల్ గా ఆఫ్రికా వెళ్ళాడు. అక్కడ అతను అవీ, ఇవీ శోధిస్తూ ఒక భూత వైద్యుణ్ణి కలిసాడు. ఈ భూతవైద్యుడు ఎన్నో అద్భుతాలని చేస్తాడని అతని స్నేహితుడు చెప్పాడు. దాంతో ఇండియాలో ఉన్న తన తల్లితండ్రులకు మంచి జరిగే విధంగా ఈ భూత వైద్యుడి దగ్గరి నుంచి ఏదైనా అతను తీసుకోవాలనుకున్నాడు. తన తండ్రి శంకరన్ పిళ్ళై ఎప్పుడూ యవ్వనంతో ఉండాలని కోరుకుంటుంటాడని ఇతనికి తెలుసు. అందుకే భూత వైద్యుడితో నా తల్లితండ్రుల వయసు తగ్గించడానికి ఏదైనా ఉందా? అని అడిగాడు. భూత వైద్యుడు ఉంది అని కొన్ని మాత్రలను ఇచ్చి మీ నాన్నని ఒక మాత్రని తీసుకొమ్మని చెప్పు, దాంతో అతని వయసులో ఎన్నో ఏళ్ళు తగ్గిపోతాయి అన్నాడు. ఆ మాత్రలని కొడుకు ఇండియాకు పంపాడు. ఆరు నెలల తరువాత, ప్రాజెక్ట్ అయిపోవడంతో అతను ఇండియాకు తిరిగొచ్చాడు.

అతను ఇంటి కొచ్చేసరికి చేతుల్లో చిన్నబిడ్డతో మంచి యవ్వనంలో ఉన్న ఓ యువకుడు అతనికి కనిపించాడు. నా తల్లితండ్రులు ఎక్కడ? అని అతనడిగాడు. యువకునిగా మారిన శంకరన్ పిళ్ళై నేనే నీ తండ్రిని, నువ్వు పంపిన మాత్ర ఒకటి తీసుకోగానే నేను యువకునిగా మారాను. ఆ మాత్ర నా వయసు ఎన్నో ఏళ్లు తగ్గించింది అన్నాడు, కానీ అమ్మెక్కడ? అని అతనడిగాడు. శంకరన్ పిళ్ళై తన చేతుల్లో ఉన్న చంటి బిడ్డను చూపెడుతూ తను మూడు మాత్రలు తీసుకుంది అన్నాడు.

ఇప్పుడు జరుగుతోంది ఇదే. మనం ఏది మొదలుపెట్టినా దానిని వినాశనానికి తీసుకెళుతున్నాం. భౌతిక శాస్త్రం మనకు అందించిన ఎన్నో అద్భుతమైన విషయాలను మానవాళి వినాశనానికి, దుఃఖానికి కారణమయ్యే పరికరాలుగా మార్చుకుంటున్నాం. మానవకళ్యాణం చేకూరుస్తుందన్న నమ్మకంతో మనం భౌతికశాస్త్రాలనీ, సాంకేతిక విషయాలనీ అంతగా శోధించాం. అవి మనకు ఎన్నో సౌకర్యాలను అందించాయి, మునుపెన్నడూ మానవులు భౌతికంగా ఇంతటి సౌఖ్యంతో లేరు. అయినా, మానవులు బాగున్నారని మనం చెప్పలేం, ఎందుకంటే వారు ఎన్నోఏళ్ల క్రితం జీవించిన వారికన్నా మరింత శాంతి, ఆనందం, ప్రేమలతో లేరు. మనం అంతర్గతంగానూ, బాహ్యంగానూ అదే బాధలనూ, అదే కష్టాలనూ అనుభవిస్తున్నాం.

బాహ్యమైన శాస్త్రసాంకేతికతలకి భారీ మూల్యం చెల్లించాలనేది మనమందరమూ అర్థం చేసుకోవాల్సిన విషయం. తయారు చేసేది ఒక గుండుసూది అయినా లేదా గొప్ప యంత్రం అయినా, మీరు చేసేది ఏదైనా అది మీరీ భూమి నుండే తవ్వి తీయాలని మనమందరమూ అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఆపాలో మనకు తెలియకపోతే, ఈ శాస్త్ర, సాంకేతికతలు ఖచ్చితంగా మానవాళికి మహా విపత్తుగా మారబోతున్నాయి; ఆవైపుగా మనం అతివేగంగా వెళుతున్నాం. పూర్తిగా మానసిక పరిపక్వతలేని మానవుల చేతికి ఏదిచ్చినా ప్రమాదమే. తాము వాడే పరికరాలు శక్తివంతంగా, సమర్థంగా అయ్యేకొద్దీ వారు మరింత ప్రమాదకరంగా మారతారు. శాస్త్రమో లేదా సాంకేతికతో ప్రమాదకరమైనవి కాదు. ఎల్లప్పుడూ మానవ మూర్ఖత్వమే భూమి మీద అతి ప్రమాదకరమైనదిగా ఉంటోంది.

 

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)