సారస్వతం

సాహిత్యంలో చాటువులు-8

-  ‘విద్వాన్’తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు   


 

“ చింకి చొక్కా అయినా తొడుక్కొని మంచి పుస్తకం దొరికితే కొనడం మానకు” అన్నది
గ్రంథాలయ సూక్తి. మానవుని మహోన్నతునిగా మార్చేది గ్రంథ పఠనమే. వేదాలు, పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు, కథలు, కథానికలు, నవలలు, గేయాలు, ఇలా సాహిత్యం అనేకరూపాలలో వెలుగొందుతూ, ప్రాచీన కవిత్వం,భావ కవిత్వం, అభ్యుదయకవిత్వం, విప్లవకవిత్వం, దిగంబరకవిత్వం వంటి నామాలతో పిలవబడుతూ, ప్రాచీన కాలం నుండి ఇప్పటివరకు ఒక మహానదిలా ప్రవహిస్తూనే ఉంది.

వాల్మీకి,వ్యాసుడు, కాళిదాసు, భాసుడు, భవభూతి, శ్రీహర్షుడు, దండి,బాణుడు, మాఘుడు,
భారవి, అలాగె నన్నయ, తిక్కన, ఎర్రన,నన్నెచోడుడు, పోతన, శ్రీనాధుడు, మంచెనసోమన మొదలగు మహాకవుల కలాలనుండి, గళాలనుండి జాలువారిన కవిత్వం నదులు,పర్వతాలు, సూర్య చంద్రులు, నక్షత్రాలు ఉన్నంతకాలం లోకంలో ఉంటూనే ఉంటుంది.

అట్టి ప్రాచీన సాహిత్యపు పునాదుల మీదే నేటి ఆధునిక సాహిత్యమనే భవంతులు వెలిశాయి; అనుటలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. వివిధ రూపాలలో ఉన్న సాహిత్యంనుండి చాటుసాహిత్య ప్రక్రియని కొంచెం రుచి చూపించడమే ఈ వ్యాసాల ముఖ్యోద్దేశం.రండి, కొన్ని చాటువులని చదివి ఆనందిద్దాం.
“ కక్షే కింతవ? పుస్తకం! కి ముదకం? కావ్యార్థసారోదకం!
గంధః కిం? ఘన రామ రావణ మహాసంగ్రామ రంగోద్భవం!
పుచ్చః కిం? ఘన తాళపత్ర లిఖితం! కిం పుస్తకం హే కవే?
రాజన్! భూసుర దేవతైశ్చ పఠితం రామాయణం పుస్తకం!”

పై చాటు శ్లోకం ప్రశ్నలు జవాబులతో కూడివుంది. ఆ ప్రత్యేకతని వివరణలో చూద్దాం.
ఈ చాటువు కూడ కాళిదాసుకి సంబంధించినదే ( ఇదే భావంతో ఉన్న చాటువు తెలుగులో
తెనాలి రామకృష్ణుని పరంగా చెప్పబడింది.) ఇది కేవలం హాస్యం కోసం కల్పించబడిన చాటువు.

“ కాళిదాసు చేపలు భుజిస్తున్నాడని, కాళిదాసు అంటే గిట్టని కొంతమంది కవులు భోజమహారాజుతో
ఫిర్యాదు చేశారట. అంతేగాక ఒకరోజు కాళిదాసు చేపలు చంకలో పెట్టుకొని వెళ్తుండగా, రాజసభకు పిలుచుకొని వచ్చి చూపేరట, అపుడు భోజుడు కాళిదాసుని ప్రశ్నించిన ప్రశ్నలు, కాళిదాసు చెప్పిన చక్కని సమాధానాలే పై చాటువు. ప్రశ్న, సమాధాన రూపంలో వివరిస్తాను.

రాజు;- కక్షే కిం తవ? = నీ చంకలో ఏముంది?
కాళిదాసు;- పుస్తకం!= అది ఒక చక్కని గ్రంథం!
రాజు ;- కిముదకం? = క్రిందకు కారే ఆ నీరు ఏమిటి?
కాళిదాసు;- కావ్యార్థ సారోదకం!= కావ్యార్థ సారము!
రాజు;- గంధః కిం?= ఆ వాసన ఏమి? ( చేపలు వాసన వేస్తాయికదా )
కాళిదాసు;- ఘన రామ రావణ= మహా వీరులైన రామ, రావణుల
మహా సంగ్రామ= మహా యుద్ధ. రంగోద్భవం=రంగంలో పుట్టిన వాసన.
రాజు;- పుచ్చఃకిం? = ( ఓహో) మరి ఆ తోక ఏమిటి?
కాళిదాసు;- ఘన తాళపత్ర లిఖితం!= తాటాకుల మీద వ్రాసినదికదా! వాటికొసలు.
రాజు;- హే కవే! కిం పుస్తకం?= ఓ కవి ( ఇంతకీ) అది ఏ పుస్తకం?
కాళిదాసు;- హే రాజన్!= ఓ రాజా! (అది)
భూసుర దేవతైశ్చ= దేవతలు,బ్రాహ్మణులు
పఠితం = చదివే,( ఆ కాలంలో)
రామాయణం= రామాయణమనే, పుస్తకం= పుస్తకము.
భావంసుగమం కనుక వివరించటం లేదు. (ఆగండి అప్పుడే అయిపోలేదు!) సరస్వతీ వరపుత్రుడు కనుక ఆ అమ్మ దయవల్ల కాళిదాసు అది పుస్తకం అని చెప్పగానే చంకలో ఉన్న చేపకాస్తా ‘రామాయణ గ్రంథంగా’ మారిపోయింది.

అది కాళిదాసు మహిమ!” చూశారా! సంస్కృత సాహిత్యంలో ఎంత చక్కని చాటువులు ఉన్నాయో!
ఇంకో చాటువు.----
“భారతం, ఇక్షుఖండంచ/ సముద్రమపి వర్ణయ /
పాదే నైకేన వక్ష్యామి / ప్రతిపర్వ రాసోదయం//”
ఓ కవిని రాజుగారు ఇలా అడిగారట? “ ఓ కవీ! భారతాన్ని, చెరుకుగడని, సముద్రాన్ని ఒకే విధంగా వర్ణించు” అని. అప్పుడు ఆ కవి “ఓ రాజా! ఒకే పాదంలో మూడింటిని వర్ణిస్తాను” అని చెప్పి (పై శ్లోకంలో నాల్గవ పాదం) “ ప్రతి పర్వ రసోదయం” అని వర్ణించాడు. వివరణ చూడండి -----
“ భారతంలో భాగాలని ‘పర్వాలు’అంటారు ( భారతం పదునెనిమిది పర్వాలని తెలుసుకదా!) ఆది పర్వం,సభాపర్వం మొదలైనవి. ఇక ఇక్షు ఖండం అంటే చెరుకుగడ. చెరుకు గడకి మధ్య, మధ్య గుండ్రంగా ఉండే కణుపులకి (సంస్కృతంలో) కూడ పర్వములని పేరు. అలాగే పర్వము అంటే పండుగ అని కూడ అర్థముంది. ( పర్వదినాలు అని అంటారు కదా!) ఇప్పుడు పర్వంతో రసోదయం ఎట్లాగో చూద్దాం--- భారతంలో ఏ పర్వం చదివినా రససిద్ధి కలుగుతుంది. అలాగె చెరుకుగడ ప్రతి కణు పులోను చక్కని రసం ఊరుతుంది. (చెరుకు రసం చాల తియ్యగా ఉంటుంది కదా!) అట్లే సముద్రుడు ప్రతి పర్వదినానికి ( పౌర్ణమి వంటి పండగ రోజులలో) రసోదయం చెంది కెరటాలతో ఎగిసి ఎగిసి పడి ఆనందిస్తాడు” అని ఎంత గొప్పగా వర్ణించాడో చూశారా! అది కవి చమత్కారం.

( వచ్చేనెల మరి కొన్ని)
 

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు

ఇమెయిల్

ప్రదేశం 

సందేశం

 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)