ధారావాహికలు

మరీచికలు (సాంఘిక నవల) - 8

- రచన : వెంపటి హేమ. 


 

రామేశంగారి ఇంటినుండి వస్తూ, దారిలో పనుందని తను ఆగి, కూతుర్ని ఇంటికి పంపించేశాడు విశ్వనాధం. ఇంటికీ రాగానే కాళ్ళూ చేతులూ శుభ్రం గా కడుక్కుని, తిన్నగా దేవుడి గదిలోకి నడిచింది యామిని. గదిలో వారగా ఉన్న పెట్టెలో ఉంది సుశీల వీణ, తంజావూరి వీణ! చేవదేరిన పనసకర్రను దొలిచి, తంజావూరు ప్రాంతంలోని సంగీత శాస్త్రవేత్తలైన దారుశిల్పులు భక్తిశ్రద్ధలతో మలచిన వీణ అది! బ్రతికున్న కొద్దినాళ్ళూ  యామిని తల్లి, సుశీల ఆరాధించిన జగత్ప్రసిద్ధికెక్కిన వీణతంజావూరువీణ!

 

దేవుని మందిరంలో కొలువై ఉన్న వీణా పాణి ఐన సరస్వతీ దేవిని ప్రార్ధించి, వీణపెట్టెకు నమస్కరించి నెమ్మదిగా, సుతారంగా దాని మూత ఎత్తింది యామిని. తలకింద చెయ్యి ఉంచుకుని ప్రశాంతంగా నిద్రిస్తున్న వాణిలా ఉంది వీణ! దానిని చూడగానే గగుర్పాటు కలిగింది యామినికి. తన తల్లికి ప్రతిరూపమే వీణనీ, తన తల్లి తనను ఆశీర్వదిస్తోందనీ భావించింది ఆమె. నెమ్మదిగా వీణను పెట్టెలోంచి లేవనెత్తి, గుండెలకు హత్తుకుని హాల్లోకి తీసుకువచ్చి, అంతకు ముందే అక్కడ పరిచి ఉంచిన తివాసీ మీద దాన్ని నెమ్మదిగా ఉంచింది. మెత్తని బట్ట తెచ్చి భక్తి శ్రద్ధలతో దాన్ని తుడిచింది. ఆపై ఒడిలో ఉంచుకుని, నిన్న తాను నేర్చుకున్న పాఠం సాధన చెయ్యసాగింది...


"
రి | ని - ని | రి " అంటూ  పదే పదే వీణపై శ్రద్ధగా  వాయించ సాగింది యామిని.  !

 పని ముగించుకుని ఇంటికి వచ్చిన విశ్వనాధానికి మెట్లు  ఎక్కుతూండగా వీణా నిక్వాణం  విపించింది. లోపలకు వచ్చిన ఆయనకి, ఒడిలో వీణనుంచుకొని సంగీతంలో తొలి పాఠమైన సరళీ స్వరాన్ని సాధనచేస్తున్న యామిని కనిపించేసరికి ఆశ్చర్యంతో ఆమెనే చూస్తూ గుమ్మంలోనే  నిలబడి  పోయాడు. యామిని వీణ పక్కన ఉంచి వచ్చి తండ్రికి పాదాభివందనం చేస్తూ, " నాన్నా! నన్ను దీవించు" అంది.


ఆమెను ఆప్యాయంగా లేవదీసి, " చల్లగా ఉండు తల్లీ ! చాలా సంతోషంగా ఉందమ్మా నాకు. చక్కగా నేర్చుకో. నువ్వు వీణ వాయిస్తూంటే స్వర్గంలో ఉన్న మీ అమ్మ కూడా విని సంతోషిస్తుందిఅన్నాడు విశ్వనాధం


"
నేను రేపటినుండి ఒక్క రోజు కూడా మానకుండా వెళ్ళి, వకుళ దగ్గర సంగీతం నేర్చుకుంటా, నీకు ఇష్టమే కదూ" అని అడిగింది యామిని.
                         "
వకుళ గొప్ప వైణికురాలు! వీణను చక్కగా పలికించగల నేర్పరి. తప్పకుండా వెళ్ళి నేర్చుకో తల్లీ, అంతకన్న ఆనందం ఇంకేముందిట" అన్నాడు ఆయన.
                         
ఎప్పుడు వచ్చిందోగాని రమణమ్మ గుమ్మం పక్కన నిలబడి కళ్ళొత్తుకుంటోంది.. "నా తల్లి ఇలా వీణ ఒడిలో ఉంచుకుని వాయిస్తూంటే నాకు వదిన జ్ఞాపకం వచ్చింది.. ఇంట్లో మళ్ళీ వీణా వాదన మొదలౌతుందంటే చాలా అనందంగా ఉంది అన్నయ్యా " అంది, ఎలుగురాసిన కంఠంతో.
                         
కూతురంత పట్టుదలగా వీణ నేర్చుకోవాలనుకోవడం విశ్వనాధానికి ఊరట నిచ్చింది. ఏకాగ్రత ఆమె మనసుకైన గాయాన్ని పూర్తిగా మాన్పగలదని ఆశించాడు.

                           చాలా ఏళ్ళకి తరవాత ఇంట్లో మళ్ళీ వీణానాదం వినిపించ సాగింది . వకుళ టైపింగు, యామిని వీణ దీక్షగా, శ్రద్ధాసక్తులతో నేర్చుకోడం మొదలుపెట్టారు. అలసివున్న వారి హృదయాలకు ఏకాగ్రత నిజంగానే ఓదార్పు నిచ్చింది.

 
                                   *                             *                          *
                             
నిరంతర సాధనతో, వీణని శ్రావ్యంగా పలికించగలుగుతోంది యామిని. ఒక్క నెల గడిచేసరికి ప్రాధమికమైన పాఠాలన్నీ పూర్తిచేసి, గీతాల్లోకి వచ్చేసింది ఆమె.  సాంప్రదాయ బద్ధంగా గణపతి స్థవంతో పాఠం మొదలుపెట్టింది వకుళ, " శ్రీ గణనాధ సిందురవర్ణ" అంటూ.
                      
వీణ వాయించడంలో యామిని చూపిస్తున్న పట్టుదల, నేర్పు వకుళకు ఉత్సాహాన్నిస్తున్నాయి. యామినికి పాఠం చెప్పడంలో వకుళకు ఎంతో ఆనందం కలుగుతోంది. ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. సంగీతం నేర్చుకున్నాక కొంత సేపు వకుళతో సరదాగా గడిపి మరీ ఇంటికి వెళ్ళేది యామిని.
                          "
నువ్వు ఇంత వరకూ నేర్చుకున్నవి ప్రాధమిక సూత్రాలు మాత్రమే. నీకు 

ఆది తాళంతోపాటు మరికొన్ని  తాళాలు పరిచయమయ్యాయి అలంకారాల్లో. ఇక పిళ్ళారి గీతంతో మొదలై,  నీకు కొత్తకొత్త రాగాలు కూడా తెలుస్తాయి. ఇప్పటి నుండీ అన్నీ పాటలే. ఇప్పుడు చెపుతున్న పిళ్ళారి గీతం మలహరి రాగం, రూపకతాళంలో ఉంది  గీతం మొత్తం రాయమంటావా , ఒక్కొక్క చరణమే రాయమంటావా?"
                        "
ఏం మిగల్చొద్దు. మొత్తం రాసెయ్యండి గురూజీ ! నేను ప్రాక్టీస్ చేస్తా కదా...... అంతగా రాకపోతే అప్పుడే చూద్దాం" అంది యామిని ఉషారుగా
                       "
నువ్వు సాధించగలవు. నీ మీద నాకా నమ్మకం ఉంది . పైగా  అదేమంత కష్టం కాదు, మూడు చరణాలూ ఒకే స్వరాలతో పలుకుతాయి. ప్రాధమిక గీతాలే కదా. పిళ్ళారి - అంటే గణపతి. విఘ్నేశ్వర ప్రార్ధనతో మొదలయ్యే తేలికైన పాటల్ని పిళ్ళారి గీతాలు అంటారు. ఇవి చిన్నవిగా సులువుగా ఉంటాయి. ఆరోహణ అవరోహణా కూడా తేలికే. ఇదిగో ఇక్కడ వివరంగా రాస్తున్నాను. చూడు తరవాత మొదలయ్యేవి ఘనరాగ గీతాలు. ఆవి కొంచెం ఘనమైనవిగానే ఉంటాయి వాటిసంగతి ఇప్పటినుండీ వద్దు.  

                     ఇదిగో తొలి పాట రాశా, వాయించి చూపిస్తా. తరవాత నువ్వు వాయిద్దువుగాని. రాగాలు మారినప్పుడల్లా తీగల బిగువు కూడా సవరిస్తూoడాలి గుర్తొపెట్టుకో. లేకపోతే, రాగం   తప్పుతుంది "   అంటూ వకుళ తీగలు సవరించి గీతం వాయించి చూపించింది. తరవాత యామిని తీసుకుంది వీణ.

 

                  పాఠం ముగించి లేచారు ఇద్దరూ. యామిని బుజం మీద చెయ్యేసి అంది వకుళ, " నీ గొంతు శ్రావ్యంగా ఉంటుంది, చక్కగా ఒదుగులు పలుకుతుంది. నువ్వు గాత్రం కూడా ఎందుకు ప్రాక్టీస్ చెయ్యకూడదు?
                   
సంగీత  ప్రపంచంలో ఒక సామెత ఉంది, "నోరులేని వాడికే వేలు" అని! దాని భావం ఏమిటంటే - గాత్రం బాగుండని వారికి మాత్రమే వేరే వాయిద్యం అవసరమౌతుంది - అని. నువ్వు చాలా అదృష్టవంతురాలివి , నీది చాలా మధురమైన గాత్రం. వీణ, గాత్రం రెండూ ఉంటే బంగారానికి పరిమళం ఉన్నట్లే!"
                    "
గురు కృప వుంటే అసాధ్యమన్నది ఏదీ లేదు. నీ దయ ఉంటే చాలు, రెండూ సాధిస్తా" అంది యామిని నవ్వుతూ.                                                 

                       "ఔనా! మధ్యలో నేనెందుకు? నువ్వు తల్చుకుంటే చాలు ఏదైనా సాధించగలవులే. ఇక విందాం జనబాహుళ్యం ఏమంటారో" అంది వకుళ తల్లి రావడం  చూసి కొంటెగా.
                          
అప్పడే అటుగా వచ్చిన రాజేశ్వరి అది విని చటుక్కున మాటందుకుంది........
                            "
ఏమంటారూ... మా యామిని గాన సరస్వతి ! ఆమెకా విద్య నేర్పిన గురువెవరోగాని చాలా అదృష్టం చేసుకు.పుట్టి  ........"
                          
రాజేశ్వరిని మాట పూర్తిచెయ్యనివ్వలేదు యామిని. " వద్దు, వద్దు ఆంటీ, మీరు నన్ను మరీ ఇలా ములగచెట్టు ఎక్కించొద్దు. ములగకొమ్మలు చాలా పెళుసు. ఇట్టే విరిగిపోతాయి. అప్పుడింక నేను నేలమీద చతికిలబడాల్సి వస్తుంది " అంది భయం నటిస్తూ. గది నవ్వులతో నిండిపోయింది.
                         
యామిని రాజేశ్వరిని అడిగింది, " ఆంటే! మీరు నెలనుండి నా వీణా వాదన వింటున్నారు కదా, మీ కేమనిపిస్తోంది? చెప్పుకోదగ్గ "

ంప్రూవ్ మెంట్" ఉందంటారా? ఇంక హాస్యం చాలు, నిజం చెప్పండి. "
                           "
నిజం చెప్పనా యామినీ! ఒక్కనెలలో నువ్వు సాధించినది చూస్తూంటే నా కనిపిస్తుందీ, నీలో ఏదో విశేషం ఉందని ! బహుశ: మీ అమ్మగారి అంశ నీలో ఉండి ఉంటుంది . వీణ ఒక పట్టాన అందరికీ లొంగదు. దానికి చాలా కృషి కావాలి. లేకపోతే తీగలా కలిసి పలకవలసిన స్వరాలన్నీ "టువ్వు,టువ్వు" మంటూ విడి విడిగా పలుకుతాయి. పాట రక్తి కట్టదు. నువ్వీ కొద్దిరోజుల్లోనే ఎంతో సాధించి చూపించావు. అందుకే నీకు మీ అమ్మగారి అండ ఉందనిపిస్తోంది. మీ అమ్మగారు వీణ వాయీస్తూ పాడుతోంటే మీ అంకుల్ విన్నారుట! ఒకసారి నాతో అన్నరూ, " ఆమెను అలా చూస్తూంటే, వీణాధరియైన శారదాదేవే గుర్తొచ్చింది నాకు " అని సందర్భం వచ్చినప్పుడల్లా వదినగారిని ఎంతో  ఇదిగా తలుచుకుంటూంటారు ఆయన." అంది.రాజేశ్వరి ఎంతో ఇదిగా
                        
యామిని కళ్ళు చెమర్చాయి, గొంతు భారంగా మారింది. " ఔను ఆంటీ, నాన్నకూడా చెపుతూoటారు, అమ్మ గొప్పగా వీణ వాయించి, పాడేదని. అప్పుడప్పుడు ఆమె వీణ వాయిస్తూ తన్మయత్వంలోకి వెళ్ళిపోయి, బయటి ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయేదిట!
                       
వాళ్ళూ వీళ్ళూ చెప్పిన మాటలే తప్ప అమ్మ ఎలా ఉంటుందో నాకు గుర్తు లేదు. గోడ మీది ఫొటోని చూసి ఒక రూపాన్ని ఊహించుకుంటా. అమ్మపోయీ సరికి నాకింకా ఆరేళ్ళుకూడా లేవుట!. అమ్మవీణని  పైకి తీసి వాయించడం మొదలెట్టింది లగాయతు, వీణని ఒళ్ళోకి తీసుకుని వాయిస్తున్నప్పుడల్లా, నాకు మా అమ్మే నన్నుతన  ఒళ్ళోకి తీసుకున్న అనుభూతి కలుగుతోంది. నా అదృష్టం ఇంతే - అలా అనుకుని సరిపెట్టుకోక నేనింకేం చెయ్యగలను."  మాటలు ఆపీసరికి యామిని కళ్ళలో పుట్టిన కన్నీరు చెంపలమీదికి జారింది.
                    
యామినినే చూస్తున్న రాజేశ్వరి హృదయం జాలితో ద్రవించిపోయింది. గమ్మున యామినిని దగ్గరకు తీసుకుని తన కొంగుతో ఆమె కళ్ళు తుడిచింది.
                    "
దేవుడు అప్పుడప్పుడు ఇంత దయలేని వాడుగా ఉంటాడు ఎందుకనో ! ఇంటింటా ఒక కుంపటి పెట్టకపోతే ఆయనకి తోచదు కాబోలు" అనుకుంది బాధగా మనసులో 
                    
యామిని వెళ్ళడానికి లేచింది. వెనకాలేవచ్చింది వకుళ ఆమెను సాగనంపడానికి. వాళ్ళు బయటికి వచ్చేసరికి వీధి దీపాలు గుఫ్ఫున వెలిగా.                       

                       ఉలికిపడింది యామిని. "అమ్మో! అప్పుడే దీపాలుపెట్టే వేళైపోయిందా! మా అత్తయ్య నాకోసం గుమ్మాల్లో కూర్చుని, ఎదురుచూస్తూ ఉంటుంది పాటికి. దీపాలవేళయ్యేసరికి ఆడపిల్లలు ఇంట్లో ఉండితీరాలి - అంటుంది. నేను వెళ్ళాలి వకుళా, శలవ్" అంటూ కంగారుగా సైకిలెక్కి వెళ్ళిపోయింది.
                         
మెయిన్ రోడ్డుమీద కొంతదూరం వెళ్ళి, అడ్డదారికి మళ్ళింది యామిని, త్వరగా ఇల్లుచేరాలన్న ఆదుర్దాతో. దారికి అటూ ఇటూ ఉన్నవి తోటలు కావడంతో, సాధారణంగా అటు జనం మసలడం తక్కువ. తోటలకు కంచెలుగా వేయబడిన చెట్లవల్ల దారి ఎండ తగ్గీ సరికి చీకటిగా తయారౌతుంది. నిర్మానుష్యమైన వీధిలో భయమన్నది లేకుండా సైకిల్ తొక్కుకుంటూ ముందుకు సాగుతోంది యామిని అంతలో చిన్నప్పుడు విన్న కథల్లోని  ఒంటికన్ను రాక్షసుడి నుదుటిమీదున్న  ఒంటికన్నులా, దూరంగా ఒకే ఒక దీపం వెలుగుతూఇటువైపే  వస్తూ కనిపించింది. అంతకంతకూ అది దగ్గరౌతూండడంతో దాని కాంతికి యామినికి  ళ్ళు మిరి మిట్లు కావడం మొదలయ్యింది. వెలుగులో సైకిల్ నడపలేక, యామిని ఒకవారగా ఆగి సైకిల్ దిగి నిలబడింది. అంతలో ఖడ్గమృగం లాంటి రాయల్ ఎన్ఫీల్డు మోటారుసైకిలు  వచ్చి యామిని పక్కన ఆగింది.
                   
ఇంజన్ ఆఫ్ చేసి, కాలు నేలకాని బైక్ నిలబెట్టాడు సుధాకర్, గురుమూర్తిగారి గారాల కొడుకు, స్టైలుగా! యామిని తప్పించుకుని వెళ్ళిపోబోయింది.
                  "
హలో  యామినీ ! ఆగు " అన్నాడు సుధాకర్ దర్పంగా .
                   "
హాయ్ సుధా! నాతో నీకేం పని? దారికి అడ్డులే, నేను తొందరగా వెళ్ళాలి ఇంటికి. సరికే మా అత్తయ్య నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది.  బైక్ అడ్డుతియ్యి , ప్లీజ్ అని అడిగింది యామిని మృదువుగా.
                     
వాళ్ళిద్దరి మధ్యా స్నేహం లాంటిదేమీ లేకపోయినా తండ్రుల మధ్యనున్న స్నేహాన్ని బట్టి, మరీ అంత ఒకళ్ళనొకళ్ళు ఎరగనివాళ్ళు మాత్రం కారు. ఇద్దరి మధ్యా ఓమాదిరి పరిచయం ఉంది.

                      " అదేం కుదరదు" అంటూ సినిమాలో విలన్లా "హా హాహాహా " అంటూ వికటంగా నవ్వాడు సుధాకర్. " రోజు కోసం నేను ఎన్నాళ్ళనుండి ఎదురుచూస్తున్నానో నీకు తెలియదు. అయాచితంగా దొరికిన అవకాశాన్ని నేను ఒదులుకోలేను . నీతో చాలా మాటాడాలి, కాసేపు ఆగు" అన్నాడు

                      "చెప్పేది నీకే ! నేను వెంటనే వెళ్ళాలి." అంది యామిని కొంచెం గట్టిగానే.

                    " నీకూ తెలుసుకదా యామినీ, ఇటువంటి అవకాశం ఇంత వరకూ మనమధ్య ఎప్పుడూ రాలేదు. ఎప్పుడు మనం కలుసుకున్నా చుట్టూ జనం ఉండే వారు. అవకాశాన్ని మనం జారవిడుచుకో కూడదు . నే నడిగిన దానికి జవాబు చెప్పు, వదిలేస్తా, వెళ్లిపోదువుగాని "అన్నాడు బెల్లింపుగా సుధాకర్       .  .    

                        యామినికి కోపం వచ్చింది, కాని నిగ్రహించుకుంది. "సరే, అదేమిటో చెప్పు, తొందరగా " అంది .

                    " లవ్ యూ యామినీ ! లవ్ యూ స్సిన్సియర్లీ! "

                      " ఇది భారత దేశం బాబూ!. ఇక్కడ సత్సాంప్రదాయం ఉన్న ఇళ్ళలో పుట్టిన ఆడపిల్లా కూడా నీలాంటివాడు," లవ్ యూ" అని చెప్పగానే పడిపోతుం దనుకోకు. దాని పక్కన "విల్ యూ మేరీమీ"  అన్న పదం కూడా చేరినప్పుడే దానికి విలువ వస్తుంది . అర్ధం చేసుకో! "    ఆమె కంఠంస్వరంలో ద్వనించిన అవహేళనకి అతనికి కోపం వచ్చింది. కాని బలవంతంగా సరిపెట్టుకున్నాడు.
                       "
ఓశ్!అంతేకదా ! అలాగే పెళ్లి చేసుకుంటాను, సరేనా?"  సుధాకర్ గొప్పగా చూశాడు యామిని వైపు.
                        "
నీకు ఏదైనా సరే ఇష్టమై పోతుందేమో గాని, మీ పెద్దవాళ్ళు, ముఖ్యంగా మీ అమ్మగారు, ఒప్పుకుంటారా? ఆవిడకు మాలాంటి మధ్యతరగతి వాళ్ళంటే ఇష్టముండదు కదా! మరి  ఒక మిడిల్ క్లాసు అమ్మయిని కోడలిగా ఆమె ఒప్పుకుంటారనే అనుకుంటున్నావా?"
                        "
  ! అదో సమస్య ఉంది కదూ....! కాని ఒక సంగతి నువ్వు మర్చిపోయావు, నేనేది అడిగినా మా అమ్మ ఎప్పుడూ కాదనదు. కొండమీది కోతి కావాలన్నా తెచ్చి ఇస్తుంది. "
                    "
అలాగా ! కాని పెళ్ళాం కొండమీది కోతి కాదు. ఆమె జీవితంతో నువ్వు ఆడుకోడానికి ఆమె ఒక ఆటబొమ్మ అంతకన్నా కాదుకేవలం ఒక మనసున్న మనిషి! నీ కిది తెలుసా, ఏవేవో ఆశలూ, కోరికలూ నీకున్నట్లే  ఆమెకూ ఉంటాయి. అవికూడా తీరుస్తారా మీ అమ్మగారు?
                   
ఆలోచనలో పడ్డాడు సుధాకర్. అప్రయత్నంగా అతని చెయ్యి తల మీదికి వెళ్ళింది. ఒక్క వేవితో బుర్ర గోకున్నాడు. యామిని చిన్నగా నవ్వి అంది ....
                    "
ఒకవేళ ఆమె ఒప్పుకోకపోవచ్చు. భార్య కోరే చిన్నచిన్న కోరికలు తీర్చి, ఆమెను సంతోషపెట్టడం  భర్త ఐన నీ బాధ్యత కదా ! సంపాదనా లేని నువ్వు నీ భార్యని ఎలా సంతోషపెట్టగలవు? నేనిన్ని ప్రశ్నలు అడుగు తున్నానని ఏమీ అనుకోకు. అంత్యనిష్టూరం కన్న ఆది నిష్టూరం మేలు ఎప్పుడూ - అంటారుకదా! నీ ప్రశ్నకు జవాబు చెప్పేముందు నా సందేహాలన్నీ తీరిపోడం మంచిదనే అభిప్రాయంతో అడుగుతున్నాను." అంది యామిని చల్లగా.
                     "
చాలు ఇక ఆపు నీ వెటకారం! పెళ్ళాం కోరే ఇంతోటి కోరికలూ తీర్చలేనని నీకు ఎలా అనిపించింది? కోట్ల విలువ చేసే మా తాత ఆస్తికి నేనే వారసుణ్ణి. పైగా మా నాన్న ఇంకా సంపాదిస్తున్నాడు. నాకేం తక్కువ?"
                   
యామిని అతడు మాట పూర్తి చెయ్యకముందే, 'ఆగు" అన్నట్లు చెయ్యి అడ్డు పెట్టి అతని వాగ్ధోరణిని ఆపింది.
                       "
సంగతి ఊరందరికీ తెలిసినదే, నువ్వు మళ్ళీ చెప్పక్కరలేదు. కాని , అదంతా నీ తాత తండ్రుల నిర్వాకం గాని, అందులో రవ్వంత కూడా నీ ప్రజ్ఞ ఏమీ లేదు. నీకేం తక్కువ - అని అడిగావు కదూ? నిజం చెప్పాలంటే నీకు అన్నీ తక్కువే..... నిక్షేపంలాంటి చదువును మధ్యలోనే , గుంటను పెట్టి గంట వాయించేశావు! నీలా, స్వప్రయోజకత్వం లేని మొగాడు ఎందుకూ పనికి రాడు .ఈనాడు ఆడపిల్లలు కళ్ళు తెరిచారు. అప్రయోజకులై పెద్దవాళ్ళ మీద ఆధారపడి, బడనికల్లా  బ్రతికే వాళ్ళని పెళ్ళాడడానికి ఆడపిల్లా ఇష్టపడదు. అమ్మాయైనా తనకు తాళికట్టినవాడు  

ంతో అంతో ప్రయోజకుడై ఉండాలి - అనుకుంటుంది. ఇక నీలాంటి భజగోవిందం గాడిని, ఏపాటి తెలివి తేటలున్న ఆడపిల్లా ఇష్టపడదు. మీ వాళ్ళు బోలెడంత ఖర్చుపెట్టి నిన్ను పొరుగూరు పంపి చదివిస్తే, నువ్వు పరీక్ష తప్పి వచ్చి, మళ్ళీ అటువై పైనా తిరిగి చూడకుండా, నీకంటే శుంఠల సావాసంలో వాళ్ళ పొగడ్తలకు ఉబ్బి, తబ్బిబ్బైపోతూ, నీకంటే గొప్పవాడు మరెక్కడా లేడనుకుని విర్రవీగుతూ , డచ్చాలు కొడుతున్నావు గాని, నాకు తెలియదా ఏమిటి, స్నేహితులతో కలిసి రోడ్లు సర్వే చేస్తూ, అదే గొప్ప విద్యనుకుంటూ విర్రవీగే నువ్వెంత సున్నప్పిడతవో... !"

                      యామిని అలా తీసిపారేసినట్లు మాట్లాడేసరికి సుధాకర్ కి చాలా కోపం వచ్చింది . " హౌ డేర్ యూ" అంటూ, యామిని చెంప పగలకొట్టాలని చెయ్యి ఎత్తాడు.
                       
మహా వేగంతో తనవైపు వస్తున్న అతడి  చేతిని, తనచేత్తో ఒడిసిపట్టింది యామిని పట్టుకి అతని చేతి నరాలు జిల్లుమని లాగాయి. నిర్ఘాంతపోయాడు సుధాకర్. లేత తమలపాకులా, అంత సుకుమారంగా, నాజూగ్గా కనిపించే చేతిలో అంత శక్తి ఎలా దాగి ఉందో అతనికి అర్ఠం కాలేదు. తెల్ల మొహం వేసుకుని ఆమె వైపు బేలగా చూశాడు. చెయ్యి వదిలేసింది యామిని.
               
ఏమీ తొణక్కుండా, "డియర్ సుధాకర్! నీ అశక్త దుర్జనత్వం చూస్తే నాకు ఏడుపొస్తోంది. నువ్వెంత భాగ్యవంతుడివైనా, స్వశక్తి లేనిదే నీకు నిజమైన గౌరవం రాదు - అన్నది తెలుసుకో..... ముందది సంపాదించుకురా, అప్పుడు చెపుతా నీ ప్రశ్నకు నా జవాబు. అంతవరకు నాతో పెళ్ళిని గురించి మాటాడే అర్హత నీకు లేదు. బై బై సుధా" అంటూ, అతనింకా ఆశ్చర్యం నుండి తేరుకోకముందే   సైకిల్ని నేర్పుగా తప్పించి, తన దారిన తాను వెళ్లిపోయింది యామిని. ఆమె వెళ్ళుతున్నవైపే దృష్టి నిలిపి  చూస్తూ, స్థాణువులా నిలబడి ఉండిపోయాడు సుధాకర్
                
ఆమె చేతి స్పర్శ ఆమెలో అజ్ఞాతంగా ఉన్న శక్తిని తెలియజేసింది. కాని ఆమె మాటలు అతనికి ఎలట్రిక్ షాకులా తగిలి, అతనిలోని మాంద్యాన్ని, బుద్ధిహీనతని  ఛిన్నాభిన్నం చేశాయి. గాలి పోసుకున్న బెలూన్ లా, అతనిలో తెగపెరిగిన "నేను భాగ్యవంతుణ్ణి" అనే అహం భావాన్ని  తూట్లు పొడిచాయిరోజు రోజుకీ పెరిగిపోతున్న ప్రజ్ఞా ప్రకాశంతో వెలిగిపోతున్న ప్రపంచంలో; తానేమిటో తన విలువేమిటో అప్పుడు తెలిసింది సుధాకర్ కి . అప్పటికప్పుడుఇకనైనా సరైన దారి వెతుక్కోవాలనే తహతహ పుట్టింది అతనిలో. ఇంత వరకూ తనకు తెలిసిన ఆడపిల్లల్లో అతడు సిగ్గునో, భయాన్నో, లేదా అసూయా దురాశలనో చూశాడేగాని, ఇలా ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో, ఉన్నది ఉన్నట్లు నిర్భీతితో  కుండ పగలేసినట్లు, తెగేసి మొహమ్మీదే చెప్పగల ఆడపిల్లని అతడు ఎక్కడా చూడలేదు.
                  
ఇద్దరూ ఒకే ఊళ్ళో ఉన్నా, సుధాకర్ తల్లికి ఉన్న అంతస్థుల పట్టింపువల్ల, మిత్రులిద్దరి    కుటుంబాల మధ్య అంతగా సన్నిహితత్వం లేదు. అతని స్నేహితులు తరచూ యామినిని గురించి కథలు కథలుగా చెప్పుకునే మాటలు విని, సుధాకర్ యామిని వైపు ఆకర్షితుడయ్యాడు. తన అందం, తన భాగ్యం చూసి ఆమె తనంటే ఇష్టపడుతుందనీ , తనకెక్కడా తిరుగు ఉండదనీ అనుకున్నాడు. కాని రోజు యామిని అతని ఆశల్ని, అతిశయాన్నీ కూడా తెల్లక్రిందులు చేసి పారేసింది. అంతేకాదు, అతనిలోని లోపాల్ని ఎత్తి చూపించి, ముక్క చివాట్లుపెట్టి, సరైన దారేదో చెప్పి, సవాల్ చేసి మరీ వెళ్ళింది!
                       "
అయ్యబాబోయ్ ! ఇది ఉత్తుత్తి ఆడది కాదు, అమ్మవారు! మహాంకాళి అనుకున్నాడు సుధాకర్. తొలిసారిగా అతని మనసులో ఒక ఆడపిల్ల మీద గౌరవం మొలకెత్తింది. యామిని ఇచ్చిన "షాక్ ట్రీట్ మెంట్" తో, అతని మేధ సరైన దారిలోకి వచ్చి, తీరుగా ఆలోచించడం మొదలుపెట్టిందన్నమాట!


                     *                                *                                    *.
                  
కళ్ళనిండా ఆతృత నింపుకుని, బిక్కమొహంతో గుమ్మాల్లో కూర్చుని, యామిని వచ్చే దారి వైపుగా చూస్తూ, ఆమె రాకకోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తూ ఉంది రమణమ్మ. అల్లంత దూరంలో యామిని సైకిల్ కనిపించే సరికి సంతోషంతో ఆమె ముఖం వికశించింది. అప్రయత్నంగా లేచి నిలబడింది రమణమ్మ.
                   
సైకిల్ దిగి మేనత్తకు సంజాయిషీ ఇచ్చుకుంది యామిని, " వేళ పాఠం పెద్దది. అది అవ్వగానే ఆంటీ వచ్చి పలకరించి కబుర్లు చెప్పారు. ఆలస్యమయ్యిందని, అసలే నేను కంగారుగా దగ్గర దారినపడి వస్తూంటే, సుధాకర్ ఎదురుపడ్డాడు......"
                  "
వాడా! పిల్లి దుశ్శకునం - అన్నట్లు వాడెదురురావడమా! నిన్నేం ఇబ్బంది పెట్టలేదుకదా?"
                  
యామిని నవ్వింది. "లేదత్తయ్యా! నిజం చెప్పాలంటే నేనే వాణ్ణి ఇబ్బంది  పెట్టా. మొహం వాచీలా చివాట్లు పెట్టాను, తెలుసా! వాడొట్టి కాగితం పులి, నేనన్న మాటలకి బెదిరిపోయాడు."
                  
రవణమ్మ బెదురుతూ చూసింది యామినివైపు. " అలా తక్కువ అంచనా వెయ్యకూడదు దుర్మార్గుల్ని. "దుష్టుకి దూరంగా ఉండాలి" అని ఊరికే అన్నారా! నువ్వు . అలాంటి వాళ్ళని తప్పించుకు తిరగాలి! నువ్వసలా పుంతదారిని పడి ఇంటికి రావడమేమిటి చెప్పు!"
                    "
పో అత్తయ్యా! ఇలా పిరికిమందు పోసి పోసి, నీలాంటి వాళ్ళే ఆడవాళ్ళని అబలల్ని చేశారు!" గారాబంగా మేనత్త మెడచుట్టూ చేతులువేసి గారాలుపోయింది యామిని.
                  
రమణమ్మ సద్దుకుని, "సర్లే! క్షేమంగా ఇల్లుజేరుకున్నావు, అదిచాలు. ఇంకెప్పుడూ ఆదారినిరాకు. ఇంతకీ జులాయి వెధవ ఏమంటాడేమిటి?"
                     "
..! ఏముంది, నన్ను ప్రేమించాడుట! దానికేముందిలే, అది అందరు కుర్రాళ్ళూ చెప్పేదే. వీడు ఇంకో అడుగు ముందుకువేసి, నన్ను పెళ్ళాడతానన్నాడు!"
                     
చటుక్కున అడ్డుపడింది రవణమ్మ. "ఇంకా నయం, అంతా వాడిష్టమేనా ఏమిటి? చూస్తూ చూస్తూ ఇలాంటి పోకిరీకి పిల్లనిచ్చి దాని గొంతు కొయ్యడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. వీళ్ళకి ఎంత డబ్బుంటే ఏమిటి, కూతురు మేలుకోరీ తల్లితండ్రు లెవరూ వీడికి పిల్లనివ్వరు.

                   పైగా, వీళ్ళమ్మ సౌభాగ్య ఉంది చూశావూ ... , పరమ గయ్యాళి! ఆమెకు డబ్బుమదం కూడా చాలా ఎక్కువ! మనలాంటి మధ్యతరగతి వాళ్ళు అసలు ఆమె కంటికి మనుష్యుల్లా ఆనరు తెలుసా...
                   
పాపం! గురుమూర్తిని తల్చుకుంటేనే జాలిగా ఉంటుంది. ఏం ఆశించి ఇల్లరికం వచ్చాడో గాని, అతని ప్రాణానికి సుఖమన్నది లేదు. "

ంటికంటే గుడి పదిలం" అనుకుంటాడో ఏమో, ఎప్పుడూ బిజినెస్ బిజినెస్ అంటూ ఊళ్ళట్టుకు తిరుగుతూ, ఉంటాడు. మనిషిలో మంచిబుద్ధి లేకపోతే ఒక్క డబ్బు వల్లే సుఖం వస్తుందనుకోడం ఉట్టి భ్రమ!"
                   "
పోనీలే అత్తయ్యా! ఇంకొకళ్ళ ఇంటి సంగతులు మనకెందుకు చెఫ్ఫు! నాకు ఆకలి దంచేస్తోంది, తినడానికి ఏమైనా పెట్టు. అన్నట్లు, నాన్న షార్టుహాండు పేపర్లు పంపుతానన్నాడు, పంపాడా?"
                  "
, ఇందాకా రవి తెచ్చి, ఇచ్చివెళ్ళాడు. టేబులు మీద పెట్టి, వాటిమీద, గాలికవి ఎగిరిపోకుండా, మూడుకోతుల బొమ్మ ఎత్తుపెట్టా. చూడు" అంటూ రమణమ్మ  వంటింట్లోకి నడిచింది.
                   
యామిని హాల్లోకి వెళ్ళింది.  " మీరు కోతులే అయినా," చెడుని అనకు, కనకు, వినకు - అని మౌనంగానే ఎంత చక్కగా ధర్మాన్ని బోధిస్తున్నారు! అందుకే మీరంటె గాంధీ తాతకు అంత ఇష్టం" అంటూ వాటిని తీసి, పక్కనపెట్టి పేపర్లు  తీసి లెఖ్ఖపెట్టసాగింది యామిని.
                 
ఇంతలో రమణమ్మ దొడ్లో పండిన తెల్ల చెక్కెరకేళీ అరటిపండు తెఛ్ఛి యామిని కిచ్చింది.  "ఇది తిను, నీ ఆకలి తీరుతుంది. మీ నాన్న రాగానే భోజనం చేద్దువుగాని. వంట ఎప్పుడో పూర్తయ్యింది. నా ఆలస్యం ఏమీ లేదు" అంది.
                  
అరిటిపండు తిని రేడియో ఆన్ చేసి, టేబులు ముందు కూర్చుని, యామిని పేపర్లు దిద్దడం మొదలుపెట్టింది. అంతలో విశ్వనాధం ఇంటికి వచ్చాడు.
                   
భోజనాలు అయ్యాక, "ఏమిటి చిట్టితల్లీ! విశేషాలు ఏమైనా ఉన్నాయా?" అని అదిగాడు యధాలాపంగా.  
                    
సుధాకర్ విషయం టూకీగా తండ్రికి చెప్పింది యామిని. తరవాత ఇద్దరూ కొంతసేపు పేపర్లు దిద్దారు. తరవాత విశ్వనాధానికి ఆవలింతలు రావడంతో దిద్దిన పేపర్లు సద్దేసి, " నాన్నా! నువ్వింక పడుకో. మిగిలిన నాలుగూ నేను దిద్దేస్తాను" అంటూ, మిగిలి ఉన్న కొద్దిపాటి పేపర్లూ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది యామిని.
                    
పేపర్లు దిద్దడం ముగించి, యామిని పడుకునే సరికి పన్నెండు
అవ్వవచ్చింది. మంచినీళ్ళు తాగి పడుకుంది, కాని ఆమెకు వెంటనే నిద్ర రాలేదు. సుధాకర్ తోటి తన సంభాషణే గుర్తు వచ్చింది. ఆమె మనసులో అలజడి మొదలయ్యింది. ఆమె మనస్సాక్షి ఆమెను నిలదీసింది .....                                
                  "
ఔనుగాని బంగారూ, పాపం! దొరికిపోయాడు కదాని సుధాకర్ కి అన్ని ధర్మపన్నాలు చెప్పావు గాని, మురళీ విషయంలో నువ్వు చేసిందేమిటి" అంటూ.                                                                          ఖిన్నురాలయ్యింది యామిని. " నిజమే, మురళీ విషయంలో నేను చాలా అనుచితంగా ప్ర్ర్తవర్తించాను. తప్పంతా నాదే, మురళీది ఏమీ లేదు. ఒప్పుకుంటున్నా. కాని, గతజల సేతుబంధనం వల్ల ప్రయోజనమేముంది? ఇకముందెప్పుడూ మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడతాలే" అనుకుంటూ, మనసును సమాధానపరచుకునే ప్రయత్నం చేసింది యామిని.
                   
గురుమూర్తి గారి అబ్బయి సుధాకర్ ది తండ్రి పోలిక.   స్పురద్రూపం! ఆజానుబాహుడు. కోట్లకు వారసుడు. అతన్ని చూసి ఎందరో అమ్మాయిలు ఇష్టపడతారు, సందేహం లేదు. కాని తనకు అతడు నచ్చలేదు. తనకు కావలసిన విద్యా గంధం అతనిలో లోపించింది. వెంటనే తను అతనిని నిరసించింది. అలాగే కదా మురళీ కూడా చేశాడు. అందులో తప్పేముందని తానే తొందరపడి చెయ్యిచేసుకుంది
                 
అంతా గుర్తు చేసుకుంది యామిని. "ఎంత పెద్ద తప్పు చేశాను! మురళీ నన్ను క్షమించాడు కనక సరిపోయింది. లేకపోతే ఒక మంచి మిత్రుణ్ణి శాస్వతంగా  పోగొట్టుకుని ఉండేదాన్ని కదా! రోజు నాన్న మాట కాదనలేకే ననుకో కాని, వ్రతానికి వెళ్ళడం ఎంత మంచి పనయ్యింది. లేకపోతే మురళీ నన్ను క్షమించాడన్న విషయమే నాకు తెలిసీది కాదేమో!" అనుకుంది యామిని బాధగా


                           *                                   *                                 *

 

 

 
     
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)