కథా విహారం

 

- రచన : విహారి     


 

వ్యవస్థకీ - మనిషికీ మధ్య సంఘర్షణే
అల్లం రాజయ్య కథాంశాలు

 
  సమాజంలోని ఒక వైఫల్యాన్నో, ఒక దుస్థితినో, ఒక సమస్యనో - వార్తగా, వ్యాఖ్యగా, వ్యాసంగా రాయగలగటం ఒక యెత్తు కాగా, సమాజ నేపథ్యంలో ఆ పరిస్థితిని చిత్రిస్తూ, ఆ స్థితికి గల కారణాన్ని అంతర్లయగా ధ్వనింపజేస్తూ కథలాంటి జీవితాన్నీ జీవితం లాంటి కథనీ రచంచటం ఒక యెత్తు, కథా రచనపట్ల చిత్తశుద్దీ, సమాజం పట్ల బాధ్యతా భావన కలిగిన రచయితలే ఇంతటి అసిధారా ప్రతానికి పూనుకోగలుగుతాను. అలాంటి రచయితల్లో అగ్రశ్రేణి కథకుడు అల్లం రాజయ్య.

మనిషి జీవితం, సమాజం పదఘట్టనల్లో పడి ఎలా నలిగిపోతోందో కధ వంటి సాహిత్య ప్రక్రియలో శక్తివంతంగా చెప్పుగలగడం కష్టమైన పని. రాజయ్య వంటి సమర్థుడైన కథకుడికి ఇది నల్లేరుపై బండి నడక.

విచ్చిన్నమైపోయిన గోండు గ్రామీణ జీవితం నేపథ్యంలో - గోండు స్త్ర్రీ రోడ్డుమీద కొచ్చి ఒళ్ళమ్ముకునీ, పసికందునమ్ముకునీ కుంగిపోయే దుర్భరమైన, దయనీయమైన జీవన పరిస్థితిని - ’బురద’లో గాథని చేసినా.

ఉద్యమ నేపథ్యంలో -భర్త దుర్మార్గాలకి విసిగి వేసారిన నీల చావుకు సిద్ధపడీ, ఆ ప్రయత్నం విరమించుకుని తన రెండేళ్ళ కొడుకునీ ఉద్యమకారుడు లక్ష్మీరాజంలా చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్ఫుటంగా ప్రకటించటాన్ని ’నీల’ కథగా రాసినా,

భూమి సంబంధాలు తెగిపోవటంతో - ప్రకృతీ’, పల్లెబతుకూ, మనిషి తనం ఎలా ద్వంసమయిపోతున్నయో - ’, మనిషి లోపలి విధ్వంసం’లో ప్రతీకాత్మకంగా కథనం చేసినా,’

రాజయ్య కథాంశాలన్నీ - విభిన్న శక్తుల మధ్య సంఘర్షణనీ, సాగుతున్న పోరాటల స్వరూప స్వభావాల్నీ, ఆ కారణంగా మానవ సంబంధాల్లో నెలకొంటున్న వైరుధ్యాల్నీ - రెపల్లెల ఛిద్రజీవన విషాదాన్నీ - కేంద్రం చేసుకుని సాగేయి.

రాజయ్య కథలకి మకుటాయనమైంది ’మహదేవుని కల’.

ఈ కథ ఇతివృత్తాన్ని సినీకవి పాటలో చెప్పాలంటే - ’కల చెదిరింది. కథ మారింది. కన్నీరే ఇక మిగిలింది’ అంటేచాలు. కానీ, కళా స్వరూపంగా ’మహదేవిని కల’ తెలుగు కథా సాహిత్య చరిత్రలో అజరామంగా నిలిచే ఒక తేజోరేఖ.

మహదేవ్ కి ఏది చేసినా ఫర్వాలేదు గానీ, భూమి దున్నవద్దు అంటే నరకయాతన అవుతుంది. నాగపూర్ లో ప్యూన్ ఉద్యోగం సరిపడదు. పారిపోయి వచ్చాడు. వెర్రి వచ్చిందని పిచ్చాసుపత్రిలో వేశారు. రెండేళ్ళు అక్కడ ఉన్నాడు. ’అద్భుతమైన, ఆరోగ్యవంతమైన సృష్టికర్త అయిన మనిషిని కొద్దికొద్దిగా ఎట్టా చంపవచ్చునో అట్లా చంపబడ్డాడు. మనిషి ఒంట్లో నెత్తురు ఇంకిపోయింది. ప్రతిఘటన, కోపం స్థానే ఇట్లా తచ్చాడే మహదేవ్ గా తయారయ్యాడు’. పూగోచితోట కనిపిస్తే పులకించిపోతాడు. లేని ఆవుదూడల్ని గుర్తు చేసుకుని వాటితో ఆడుకుంటాడు. తండ్రి కొట్టిన దెబ్బలు బాధించవు. దైహికంగా, మానసికంగా వ్యక్తం చేయలేని బాధ. వ్యవసాయం మీద ఆర్తి, కోల్పోయిన భూమి మీద మమకారం, చుట్టూ ప్రకృతిని చూసినా, కింద మట్టిని చూసినా ఒక వింత మైకం!

ఆయిదు మైళ్ళు నడిచి పల్లెకి వచ్చాడు. పొలాలకేసి వెళ్ళాడు. ’బావిలో దూకి దునికి ఈదులాడుతున్నాడు. ఇంతలోనే తుపాకు లెక్కుపెట్టిన నలుగురు జవానులు బాయికి నాలుగు పక్కలా నిలుచున్నారు. హిందీలో బయటకి రమ్మని అరుస్తున్నారు.

....ఆ తర్వాత బయటికి లాగి ఫఢేల్ మని మూతి మీద కొట్టారు. టెంటు దగ్గరికి లాక్కుపోయారు. వాళ్ళ మామూలు విద్యని ప్రదర్శించారు. మహదేవ్ శరీరం ఉబ్బి పోయింది. ’.........భూమి ....భూమి.....’అంటున్నాడు ఊళ్ళో మనుఘలు వచ్చారు.

’.....రాత్రి నిర్దయంగా ఊరిమీద పాకింది. మహదేవ్ అస్పష్టమైన కలలతో జమ్మిచెట్టు కింద దుమ్ములో పడి ఉన్నాడు".

’మహాద్భుతమైన మనిషి ఆరోగ్యవంతమైన మనిషి, మట్టి నుండి పచ్చటి మొక్కలు పంటలు - సర్వసంపదలు సృష్టించదలచుకున్న మనిషి - మహదేవ్ సర్వశక్తులను, సకల కలలను హరించినదెవరు’ అనే ప్రశ్నతో కథ ముగుస్తుంది! నిజానికి ఈ ప్రశ్న పాఠకుడి మెదడుని తొలుస్తుంది. ఆలోచనని రగులుస్తుంది. మట్టి సంబంధం తెలిసిన మనిషి మహదేవ్ తో తాదాత్య్మం చెందుతాడు. ఆ సంఘటనలన్నీ అతన్ని నిద్రపోనీయవు.

కథా వస్తువుకి నిఖార్సయిన జీవన వాస్తవైకత బంగారు గుణాన్ని ఆపాదిస్తే రచయిత కథాశిల్పం అంతకంత ఆర్ద్రంగా రచనని ఉత్తమోత్తమం చేసింది. ’పొయ్యి భగభగమండుతోంది’ అనేది కథ మొదటి వాక్యం. ’మహదేవ్ సకల కలలను, సర్వశక్తులనుహరించినదెవరు?’ అనేది చివరి వాక్యం. అది శతకోటి ప్రశ్నలకు ఏకైక బాణం. ఈ చివరివాక్యం శాశ్వతంగా చదువరి గుండెనీ భగభగ మండిస్తూనే ఉంటుంది మరి!

వర్తమానంలోని మహదేవ్ చర్యలు, ప్రవర్తన, పలుకు, ఉలుకు - వీటితో సమానాంతరంగా - అతని గతం సాగుతూ వుంటుంది. కథనంలో ఇది అద్భుతమైన విన్నాణం, ఇలియట్ చెప్పిన ’కేరెక్టర్ ఈజ్ ఎ ప్రాసెస్’ అన్న వాక్యానికి అర్థవంతమైన నిదర్శ్జనం.

ఒక ప్రాంతం సామాజిక నేపథ్యం, అచ్చమైన గ్రామీణ వాతావరణం, ప్రకృతీ పరిసరాలూ, మానూ మాకూ, మనిషీ పశువూ, మాటా మన్ననా - అన్నీ చిన్నచిన్న చిత్రపటాలుగా మనముందు నిలుస్తూ వుంటాయి. కొన్ని దృశ్య స్పృహనిస్తుంటే, కొన్ని పదచిత్రాలు భావస్ఫురణని కలిగిస్తూ ఆలోచనల్ని ప్రేరేపిస్తూ వుంటాయి. ఉదాహరణకి మహదేవ్ ని వర్ణిస్తూ ఇలా అంటాడు కథకుడు. "చింపిరి చింపిరిగా పెరిగిన గడ్డం, దవడ ఎముకలు పొడుచుకు వచ్చిన ముఖం, పీక్కుపోయిన కండ్లు, మాసిపోయిన అంగవస్త్రం, జంద్యం తప్ప వంటిమీద మరేమీ లేదు, చీరుకుపోయిన దుమ్మురేగిన పాదాలు, తోలు ఊగులాడే ఒళ్ళు........మొద్దుబారిన మెదడు......ఏదీ సరిగా నిలవని కలల ప్రపంచం!’ మాటలతో బొమ్మ కట్టటం అంటే ఇదే కదా!

దేశీయత, స్థానీయత, వాస్తవికత - త్రివేణిగా సాగిన కథావాహిని - రాజయ్య రచనలు. ఒక సామాజిక జీవన సంరంభంలో అంతర్జ్వాలగా రగులుతున్న సంఘర్షణకి కథాత్మక చిత్రాలు రాజయ్య రచనలు. విశ్వకథా ప్రపంచానికి తెలుగు ’వాడి’ కంట్రిబ్యూషన్!

 

 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)