కథా భారతి  - 1

సహానుభూతి

- రచన : డా.పి.కె. జయలక్ష్మి  


 

మధ్యాహ్నం జరిగిన సంఘటన తల్చుకొని మధనపడసాగాడు మాధవ్. ఆ శాలిని కి ప్రమోషన్ ఎలా వచ్చిందసలు? సీనియర్స్ ముగ్గుర్ని దాటుకొని ఎలా ముందుకెళ్ళిపోయింది? ఆఫ్త్రాల్ ఒక ఆడది, అందులో మొగుడు లేని ఆడది, ప్రతిరోజూ అందరితో హేళనలకి గురవుతూ , ఒక్కొక్కసారి కళ్ల నీళ్ళు పెట్టుకుంటూ... ఎలా నెగ్గుకొచ్చింది? అంతు పట్టడం లేదు. తమ మిత్రులకి కూడా కడుపు మంట గానే ఉంది. కానీ ఏం చేయగలరు? పై అధికారులు పని లో ఎఫిషియన్సీ కి మార్కులు వేసి శాలిని కి పట్టం కట్టారు. ఒప్పుకోక చేసేదేముంది? నిజాలు చేదుగానే ఉంటాయి మరి. తాబేలు, కుందేలు కథ లోలా సీనియర్స్ మి ప్రమోషన్ మాకు రాక ఇంకెవరికి వస్తుంది అని తాము ధీమాగా ఉండడమే కాకుండా శాలిని ని ఎంత చులకనగా మాట్లాడే వాళ్ళో? ఆమెకి భర్త లేడు. ఏదో కారణంగా విడిపోయారు. కొడుకు చిన్నవాడు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి కష్టపడి పని చేస్తుంది, తెలియనివి అడిగి నేర్చుకుంటుంది.కమిట్ మెంట్ ఉన్న అమ్మాయి. కానీ పురుషాహంకార సమాజ పౌరులు కదా ఆడవాళ్ళ ని ఎంత చులకన చేస్తే అంత గొప్ప..మిత్రులు జాన్, ఆచారి , గోపి ముగ్గురూ ఆమె మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు వార్త తెలిసిన వెంటనే. మాధవ్ మంచివాడే గాని సహవాస దోషం తో కలుషితమైపోయాడు. ఆమెని వాళ్ళేమైనా అంటుంటే నవ్వడం, లేదా కొన్నిసార్లు తాను కూడా డైలాగులు వేయడం చేస్తూ ఉంటాడు. శాలిని ఏ రకంగానూ స్పందించదు వాళ్ళ ప్రవర్తనకి. దేవుడే చూస్కుంటాడులే అన్నట్టుగా

******

ఈ మధ్య రెండు నెలల నించి శాలిని డల్ గా ఉంటోంది. సెలవులు పెట్టడం, కొన్నిసార్లు లేట్ గా రావడం చేస్తోంది. ప్రమోషన్ వచ్చినా తన మొహం లో సంతోషం లేదు. ఏదో పోగొట్టుకున్నట్టుగా నిస్తేజంగా,అన్య మనస్కంగా కూడా ఉంటోంది. సహృదయతతో అర్ధం చేసుకోకపోగా వెకిలి గా మాట్లాడ్డం మొదలెట్టారు గోపి, ఆచారి. “ఏంటో మేడం గారికి ఎటో వెళ్లిపోయింది మనసూ” అంటే గోపి “నాకు తెల్సు లే కనుక్కొని చెప్తా ఉండు భయ్యా” అని వంతపాడ్డం. ఆమె ఇవేవీ వినే పరిస్థితి లో లేదు. ఆ సెక్షన్ లో మొత్తం ఎనిమిది మంది లో ముగ్గురు ఆడవాళ్ళు. ఒకామే బాగా సీనియర్. ఇంకోకామే వేరే ఊరు ట్రాన్స్ఫర్ కోసం ఎక్కువగా లీవ్ పెట్టి తిరుగుతూ ఉంటుంది. ఆవిడ పని కూడా పాపం శాలిని మీదే పడ్తూ ఉంటుంది. ఎవరితోనూ షేర్ చేస్కోడానికి లేదామెకి ఏ బాధైనా, సంతోషమైనా. కానీ పని లో మాత్రం రాజీ పడకుండా సిన్సియర్ గా సమయానికి పూర్తి చేసేస్తోంది. మాధవ్ కి జాలన్పించేది అప్పుడప్పుడు. కానీ సాయం చేయమని ఆమె అడగకపోవడంతో అతని ఇగో దెబ్బతింటోంది.

*****

మాధవ్ ఇంటికి వెళ్ళేసరికి భార్య సుధ “బిందుకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండోయ్” అంటూ స్వీట్ తో ఎదురొచ్చింది. గొప్పగా ఫీలయ్యాడు. కాసేపు తన కి రాని ప్రమోషన్ విషయం మర్చిపోయి “ బంగారు తల్లీ ఇలా రా నీకేం గిఫ్ట్ కావాలి?" అని ఎనిమిదేళ్ళ కూతుర్ని దగ్గరకి తీస్కున్నాడు. నాకు బార్బి బొమ్మంటే ఇష్టం డాడీ! అంది సంతోషంగా. "ఓకే డన్” అని స్నానం చేయడానికి లోపలికి వెళ్ళాడు. వచ్చేసరికి బిందు దేనికో మారాం చేస్తోంది.
సుధ కోప్పడుతోంది “ఇలా అయితే మీ టీచర్ కి కంప్లైంట్ చేస్తా, ఏమనుకుంటున్నావో?" అంటూ. 'నాకొద్దు, ఇష్టం లేదంటే వినవేం?' అంతకంటే కోపంగా ఎదిరిస్తోంది బిందు.
'ఏంటి గోల?' విసుక్కున్నాడు మాధవ్.
'చూడండి, మరీ మొండికేస్తోంది అన్నం తినడానికి.'
'అన్నం తింటున్నాగా, పెరుగన్నం వద్దన్నా, అంతే!' అంది కూతురు.
'పెరుగన్నం తినక పోతే బలం రాదు కదా చిట్టితల్లీ. కొంచెం తిను!' అంటూ బుజ్జగించాడు మాధవ్.
'నాకిష్టం లేదు డాడీ. ప్లీజ్'
'రెండు ముద్దలు తిను, మనం బైటకి వెళ్తాం కదా ఇప్పుడు!' ఊరించాడు. 'తినక పోతే బొమ్మ కాన్సిల్”. 'మరి తింటే?' చిలిపిగా అడిగింది.
'ఇంకో స్పెషల్ గిఫ్ట్.నీకేం కావాలంటే అది.'
'నిజంగానా? ప్రామిస్?'
'యస్, డబుల్ ప్రామిస్. తినెయ్యలి మరి మూడు లెక్క పెట్టే లోగా….స్టార్ట్.. ఒకటి” అనేసరికి తల్లి చేతిలోంచి లాక్కొని తినేసింది.
'దట్స్ గుడ్.ఇప్పుడు మా బంగారు తల్లి కి ఏం కావాలో చెప్తే పేద్ధ సంచి పట్టుకెళ్లి అన్నీ కొనేస్కోని వచ్చేస్తామట. పద పద” అన్నాడు.
'డాడీ, మరేమో నాకు ఏం కావాలంటే....' ఆగింది సంశయంగా.
'చెప్పమ్మా ఏం కావాలో?' ప్రేమగా అడిగాడు మాధవ్.
'మరి మాట తప్పకూడదు.'
'లేదురా బుజ్జి తల్లీ , డాడీ ఎప్పుడైనా మాట తప్పారా? అడుగు, నీకేం కావల్సినా కొంటా సరేనా?' 'నాకుమీరు ప్రామిస్ చేశారు. ఏది కావాలంటే అదిస్తానని.'
'అవును, అందుకే చెప్పు త్వరగా, షాప్స్ మూసేస్తారింక” అన్నాడు వాచ్ చూస్కుంటూ.
'మరి….మరి అది కొనేది కాదు” అంది తండ్రిని గమనిస్తూ.
'కొనేది కాదా? అయితే డబ్బులు కావాలా?' అన్నాడు వెంటనే.
'కాదు డాడీ, మరేమో, మరేమో!' అంటూ తడబడసాగింది బిందు.
'ఏమిటే అంతలా నానుస్తున్నావ్? చెప్పేంటో?' విసుక్కుంది సుధ.
'మరేమో నాకు గుండు చేయించుకోవాలని ఉంది.”అప్పచెప్పినట్టు చెప్పితల దించుకుంది. అదిరిపోయారిద్దరూ. 'ఏమ్మాట్లాడుతున్నావే? బుద్ధుందా”? కోప్పడింది తల్లి.
'అవును నాకు గుండు కావాలి. డాడీ నాకు ప్రామిస్ చేశారు నేనేది కావాలంటే అది ఓకే అని. కదా డాడీ?' అంటూ తండ్రి వైపు చూసింది. మాధవ్ కి అర్ధం కావడం లేదు పిల్ల తీరు.
'ఏంటి బిందూ, నువ్వింకేదైనా కొనిపెట్టమంటావనుకుంటే గుండు కొట్టించమంటావేంటి? తప్పు” అన్నాడు. 'ఇంత చక్కటి ఒత్తు జుట్టు. రెండు జడలతో ఎంత ముద్దుగా ఉంటావో! మళ్ళీ ఎన్నాళ్ళకి వచ్చేను?అయినా ఇదేం కోరికే?' ఆశ్చర్యంగా అడిగింది సుధ.

'అవును బిందూ!మాకు నీ పొడుగు జుట్టంటే చాలా ఇష్టం. మీ స్కూల్లో కూడా అంతా నీ జడల్ని మెచ్చుకుంటారని చెప్తూ ఉంటావు కదా.ఇప్పుడేందుకే గుండు?నవ్వుతారు చూడు” బెదిరించబోయాడు. 'నాకదేమీ తెలియదు. మీరు ప్రామిస్ చేశారు నాకు గుండు కావాలి అంతే.' అని మారాం చేయడంతో
'సరే, రేపు ఆదివారం కదా! పొద్దున్నే సెలూన్ కి వెళ్దాం లే . ఇంక పడుకో” అనేసి తన రూమ్ లోకి వెళ్లిపోయాడు. మర్నాడు ఆరు గంటలకే లేచి తండ్రిని తొందరపెట్టింది బిందు సెలూన్ కి వెళ్దామని. తల్లి మళ్ళీ పరిపరి విధాలా చెప్పింది. అయినా బిందు వింటే కదా! చేసేది లేక మాధవ్ సెలూన్ కి తీసుకువెళ్లి గుండు చేయించాడు. చాలా సంతోష పడిపోయింది బిందు తన గుండు చూస్కొని. సుధా మాధవ్ లిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూస్కున్నారు.

మర్నాడు రిక్షా వాణ్ణి వద్దని తనే బిందు ని స్కూల్ కి బైక్ మీద దింపాడు. ఎందుకంటే దాని గుండు ని చూసి మిగిలిన పిల్లలు వెక్కిరిస్తే అది ఏడ్చుకుంటూ వెనక్కి వస్తే, ఓదార్చి, వాళ్ళ టీచర్స్ కి అప్పచెప్పి ఆఫీస్ కి వెళ్దామని ప్లాన్. బిందు బైక్ దిగి “డాడీ బాయ్” అని నవ్వుతూ ముందుకు వెళ్ళి అక్కడే ఉన్న ప్యూన్ ని ఏదో అడుగుతోంది. ఈలోగా మాధవ్ పక్కన స్కూటీ ఒకటి ఆగింది. గుండు తో వున్న బిందు ఈడు కుర్రాడు దిగుతోంటే వాళ్ళమ్మ బ్యాగ్ అందిస్తూ “జాగ్రత్త సిద్ధూ!' అంటోంది. తెలిసిన గొంతు లా ఉందని చూసేసరికి అదేవరో కాదు... శాలిని! అప్పటిదాకా అక్కడే నించున్న బిందు ఈ కుర్రాణ్ణి చూసి “హాయ్ సిద్ధూ” అని పలకరించి ఆప్యాయంగా వాడి చేయి పట్టుకొని, వెనక్కి తిరిగి తమకి “బాయ్” చెప్పి క్లాస్ కి వెళ్లిపోయింది.మాధవ్ కేమీ అర్ధం కావట్లేదు. డ్రస్ కోడ్ లాగా గుండు కోడ్ ఏమైనా పెట్టారా ఏంటి స్కూల్ వాళ్ళు? అనుకుంటూ పైకి అనేశాడు.
'బిందు మీ అమ్మాయా మాధవ్ గారూ? అంత మంచి కూతుర్ని కన్న మీరేంత అదృష్టవంతులో?' అంటున్న శాలిని కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి.
“ఏంటి మీరనేది?'ఆశ్చర్యపోతూ అడిగాడు.

'అవును. చూశారు కదా ? ఇందాక బిందుతో వెళ్ళిన పిల్లాడు సిద్ధార్థ్ నా ఒక్కగానొక్క కొడుకు. వాడికి నేను నాకు వాడు తప్ప ఈ లోకంలో మాకేవరూ లేరు. రెండు నెల్ల క్రితం వాడికి బ్లడ్ కేన్సర్ అని డాక్టర్లు కన్ఫర్మ్ చేసినప్పుడు తల్లడిల్లిపోయాను. కానీ ఆ భగవంతుడి దయ వల్ల నయమయ్యే స్టేజ్ లోనే ఉందని, కీమోథెరపీ మొదలెట్టారు. దాంతో జుట్టు ఊడిపోసాగింది. స్కూల్లో మిగిలిన పిల్లలు వెక్కిరిస్తున్నారని రోజూ ఇంటికొచ్చి ఏడ్చేవాడు. వచ్చే నెల నించి పరీక్షలు పెట్టుకొని ఈ మధ్య స్కూల్ కి వెళ్ళడం మానేశాడు. మూడ్రోజుల క్రితం బిందు విషయం కనుక్కుందామని మా ఇంటికొచ్చింది. వాడికెంతో నచ్చచెప్పి “సోమవారం నించి స్కూల్ కి రా, నేను నీకు సాయం ఉంటాను. ఎవరూ ఏమి అనకుండా చూస్కుంటా” అని ధైర్యం చెప్పివెళ్లిపోయింది. ఇదిగో మళ్ళీ ఇవాళ బిందు ని ఇలా చూశాను. మా వాడి కోసం తన అందమైన జుట్టుని కత్తిరించుకొని గుండు చేయించుకుందంటే? హేట్సాఫ్ టూ యువర్ డాటర్. నిజమైన మానవత్వం, సిసలైన సహానుభూతి అంటే అది. నిజంగా అవతలివాళ్ళ స్థానం లోనిలబడి ఎంత మంది ఆలోచిస్తున్నారు సర్ ఇవాళ రేపు? నాకిప్పుడు చాలా ధైర్యంగా ఉంది. సిద్ధూ గురించి ఇంక నాకు బెంగ లేదు. రియల్లీ యూ ఆర్ బ్లెస్డ్. బట్, ఇంత చిన్న వయసులోనే సాటివారి కష్టాల కి అంత బాగా స్పందించింది అంటే పెద్దయ్యాక ఇంకెంత మంచి పేరు తెచ్చుకుంటుందో! ఎనీవే థాంక్యూ సో మచ్ మాధవ్ గారూ. ఆఫీస్ టైమ్ అవుతోంది. కలుద్దాం” అంటూ శాలిని స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్లిపోయింది.

మాధవ్ కి కాసేపు బుర్రంతా బ్లాంక్ అయిపోయిన ఫీలింగ్. ఒక చిన్నపిల్లకి ఉన్నపాటి సంస్కారం తనకి లేనందుకు కుమిలిపోయాడు. బిందు తన క్లాస్ మేట్ కి సాయం చేయాలని ఆరాట పడుతుంటే ఆ పిల్ల తండ్రినైన తాను తోటి ఉద్యోగిని ని అవమానించాలని చూశాడు. ఆమె కి ప్రమోషన్ వస్తే భరించలేకపోయాడు. వయసులో పెద్దవాడయినా సంస్కారహీనంగా సహోద్యోగిని పట్ల కనీస మర్యాద , కనికరం లేకుండా మిత్రులతో కల్సి వెటకారాలాడుతూ ఆమెని మానసిక క్షోభ కి గురిచేసి పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తుంటే నిండా ఎనిమిదేళ్లయినా లేని తన కూతురు ఎంతో సహానుభూతి తో శాలిని కొడుకు మానసిక వేదన ని దూరం చేయడం కోసం తాను నవ్వులపాలవడానికి కూడా సిద్ధపడ్డం అతనికి కళ్ళు తెరిపిస్తోంది కళ్ళవెంట నీరు తెప్పిస్తోంది.
 

 
     
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)