శీర్షికలు

ఎందరో మహానుభావులు

 కామాక్షీ కరుణా కటాక్ష వీక్షణం
శ్యామశాస్త్రి(1763-1827)

- రచన : తనికెళ్ళ భరణి   


 

 సంగీత త్రిమూర్తుల్లో శ్వామశాస్త్రి ఒకరు....
త్యాగరాజస్వామి శ్రీరాముడి మీదా....
ముత్తుస్వామి దీక్షితులు...సర్వదేవతల మీద రాస్తే
శ్యామశాస్త్రి ప్రధానంగా.....కామాక్షి మీద ఎక్కువగా కీర్తనలు రాశాడు...

శ్యామశాస్త్రి పూర్వులు ఆంధ్ర దేశంలోని కర్నూలు జిల్లా కంబంలో ఉండేవారట.... ఆదిశంకరాచార్యుల కాలం నాటికే వారు కంచి కొచ్చీ శంకరుల వారు ప్రసాందించిన ’బంగారు కామాక్షి’ విగ్రహానికి అర్చకత్వం ఆరంభించారట...
విజయనగర సామ్రాజ్యం ఉన్నంత వరకూ అత్యంత వైభవంగా వెలిగిన ఆంధ్ర దేశం తర్వాతర్వాత తురుష్కుల పాలనలో సాంస్కృతిక పతనం ఆరంభం అవ్వగానే శ్యామశాస్త్రి పూర్వీకులు తెలుగు గడ్డని వదిలి తమిళ దేశం వెళ్ళి స్థిరపడ్డారట...
తంజావూరు పాలకుడైన తులజాజీ మహారాజు శ్యామశాస్త్రి తండ్రిగారైన విశ్వనాథశాస్త్రిగారిని బాగా అదరించడం....తంజావూరులోనే ’బంగారు కామాక్షి’ దేవికి ఆలయం కట్టించి ఆ వంశానికే అర్చకత్వం అప్పగించడంతో పునర్వైభవం కొనసాగింది...ఒకసారి శ్రీ వేంకటేశ్వర స్వామి సమారాధాన సమయంలో ఎవరో వృద్ధ బ్రాహ్మణుడొచ్చి....విశ్వనాథ దంపతులతో "వచ్చే యేట చైత్ర మాసంలో కృత్తికా నక్షత్రం రోజున మీకు అబ్బాయి పుడతాడు" అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడట.
ఆ ప్రకారమే కృత్తికా నక్షత్రంలో పిల్లాడు పుట్టగానే వెంకట సుబ్రహ్మణ్యం అని పేరుపేట్టీ....పిలవడం మాత్రం ’శ్యామక్రిష్ణా’ అని ముద్దుగా పిల్చుకునేవారట.
- దైవంశ సంభూతుడు...అపారమైన మేధ ఉండడం వల్ల...శ్యామ శాస్త్రి చిన్ననాడే సంస్కృత - ఆంధ్ర - తమిళ భాషల్లో పాండిత్యం సంపాదించటంతో పాటు...జ్యోతిష్య శాస్త్రంలో కూడా నైపుణ్యం సంపాందించాడు.
ఈలోగా ’సంగీత స్వామిగా’ పేరు పొందిన ఒక యోగీశ్వరుడు శ్యామశాస్త్రి ముఖవర్చస్సూ, పాండిత్యమూ చూసి భవిష్యత్తులో ఈ పిల్లాడు సంగీతంలో పెద్దవిద్వాంసుడు కాగలడని గ్రహించి....శ్యామశాస్త్రిని తన శిఘ్యడిగా గ్రహించి తన విద్యనంతా ధారపోశాడు.
అలాగే తులజాకీ ఆస్థాన విద్వాంసుడిగా ఉంటున్న ’విరిబోణి’ వర్ణకర్త పచ్చిమిరియం ఆరి అప్పయ్యగారీ సంగీతాన్ని కూడా బాగా విని...మెళుకువలు తెలుసుకున్నాడు...
పచ్చిమిరియం గారు ’శ్యామశాస్త్రి’ ని ముద్దుగా ’కామాక్షీ’ అని పిలిచేవారట...
-తండ్రి తర్వాత కామాక్షీ దేవిని అర్చించే అధికారం శ్యామశాస్త్రికి వచ్చింది - పులకించి పోయాదు....వెంటనే తన మొదటి కృతి "జనని నతజన పరిపాలినీ పాహిమాం భవానీ" అంటూ భక్త్యావేశంతో అద్భుతంగా గానం చేసాడు.....
ఆయన ప్రతీ శుక్రవారం అమ్మవారికి పూజ చేసేటప్పుడూ... తను పిల్లాడైపోయి....తల్లితో మాట్లాడుతున్నట్టు ఉండేవాడట! గారాలుపోయేవాడట....బతిమాలే వాడట.....అప్పుడప్పుడు అలిగే వాడట కూడా!....అదొక అధ్యాత్మిక దివ్యానుబంధం...
అలాగే ’బంగారు కామాక్షీ’ దేవిని వాళ్ళు ఇంటి అడపడుచుగా భావించడం వల్ల...దేవిమీద చేసిన అన్ని కీర్తనల్లోనూ ’శ్యామ క్రిష్ణ సహోదరీ’ అనే ముద్ర ఉండేది....
సంగీతత్రయంలో శ్యామశాస్త్రి పెద్దవాడు...పైగా ముగ్గురిదీ ఒకే ఊరు...తరచూ శ్యామశాస్త్రుల వారు, త్యాగరాజస్వామి వారింటికి వొస్తూ ఉండేవారట....అంతే!...సంగీతం గురించీ....సాహిత్యం గురించీ...భక్తి గురించీ, ముక్తీ గురించీ గంటల తరబడి మాట్లాడుకునేవారట...ఇహ శిష్యగణం భక్తీ - ముక్తీ సరే....భుక్తి మాటేమిటి....అనుకుంటుడగానే రెండు ఝూములు దాటేదట...
ముత్తుస్వామి దీక్షితులు మల్లే శ్యామశాస్త్రి దేశాటన చేసిన వాడేం కాదు....అయితే తంజావూరు లేకపోతే మధుర అంతే!....
ఒకసారి శ్యామశాస్త్రి తన శిఘ్యడైన అలసూరు క్రిష్ణయ్యతో కలిసి మధుర వెళ్ళారు....మీనాక్షీ అమ్మవారి దర్శనం అయింది!...
భక్తుల మీద కరుణాకటాక్షాలను కురిపించే అక్షులేవైతేనేం వెంటనే పారవశ్యంతో పాట మొదలైంది!...ఉన్న నాలుగు రోజుల్లోనూ అంబ మీద తొమ్మిది పాటలు రాశాడు. ఈ కృతులనే ’నరరత్న మాలిక’ అంటారు...అయితే ఈ రత్నలో రెండు మనకి లభించలేదు. దొరికిన ఏడూ ఏవిటంటే....!
సరోజ దళ నేత్రీ - శంకరాభరణం
దేవీ మీన నేత్రీ - శంకరాభరణం
మరి వేరే గతి ఎవరమ్మా - ఆనందభైరవి
నన్ను బ్రోవు లలితా - లలిత
మాయమ్మా అని నే పిలిచితే - అహిరి
దేవీ నీ పద సారములే - కాంభోజి
మీనలోచన - బ్రోవయోచన - ధన్యాసి

శ్యామశాస్త్రి ఎక్కువగా ఆనందభైరవి రాగం అంటే ప్రీతి. అంచేత ఆ రాగంలో ఎక్కువ కృతులు రచించాడు....ఈయన రచనలు దాదాపు ఒక మూడు వందల వరకూ ఉండొచ్చు....
సంగీత ప్రపంచంలో అతి తక్కువ మంది శిఘ్యలున్నది ఈయనకే....త్యాగరాజస్వామికి ఇరవై మంది కన్నా ఎక్కువ ఉంటే....ముత్తుస్వామి దీక్షితులకు పదిహేను మంది శిఘ్యలూ, ఇద్దరు సోదరులూ ఉంటే....శ్యామశాస్త్రి గారికి ఏ ఒక్కరో ఇద్దరో ఉండే వారట....
ఈయన రచనలు...త్యాగరాజస్వామి వారంత సరళమూ...ముత్తు స్వామిదీక్షితులంత క్లిష్టమూ కాకుండా మధ్యే మార్గంలో ఉండేవి....ఎంతసేపు తనూ...తన కామక్షి...తన సంగీతం ప్రపంచంగా ఉంటున్న శ్యామశాస్త్రుల వారికి ఒకసారి తన తంజావూరు ప్రభువుల ప్రతిష్ఠ కాపాడాల్సి వచ్చింది...
ఆంధ్ర దేశం నుంచి ’బొబ్బిలి కేశయ్య’ మీ తమిళనాడులో నా అంత మొనగాడెవడైనా ఉన్నాడా?’అని సవాలు విసిరితే...వినయ సంపన్నుడూ...కామాక్షీ కటాక్ష వరప్రసాదం అయిన శ్యామశాస్త్రి చింతామణి రాగంలో ’దేవీ బ్రోవ సమయ మిదే’ అనే కీర్తన రాసీ....తంజావూరు సంస్థాననీకొచ్చీ...
’భూలోక చాపచుట్టి’ అనే...బొబ్బిలి కేశవయ్యను ఢీ కొన్నాడు...కేశవయ్య....’సింహనందన’ తాళంలో పల్లవిని పాడితే...
శ్యామశాస్త్రి ’శరభనందనం’ అనే నూతన తాళంలో పల్లవి పాడీ....’భూలోక చాప చుట్టని’ నీరు కార్చాడట!!
గెల్చినా అహంకరించక.. "ఇది అమ్మ కటాక్షం అంతే" అన్నాట్ట....తన కన్నా చిన్నవాడైన ముత్తుస్వామి దీక్షితులకి ’శ్రీవిద్య’ ఉపదేశం చేసిన శ్యామశాస్త్రి - తన కుమారుడైన సుబ్బరామశాస్త్రిని సంగీతంలో మెళకువలు నేర్చుకొని తను గౌరవించే త్యాగరాజస్వామి వారి దగ్గరకు పంపడం....ఆయన వ్యక్తిత్వంలోని ఔన్నత్యం మనకు తెలుస్తోంది!...
భక్త్యావేశాలతో కామాక్షీదేవిని నిరంతరం కొలిచి....అనేక కృతులు రచించిన శ్యామశాస్త్రి అరవై అయిదు సంవత్సరాల జీవితాన్ని తృప్తిగా గడిపి...1827 ఫిబ్రవరి ఆరవతేదీ, శుక్ల దశమి నాడు....ప్రశాంతంగా అమ్మ బడికి చేరాడు...కర్ణాటక సంగీతంలో శ్యామశాస్త్రి గారి స్థానం అజరామరం.
 

 
     
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)