బాలరంజని

గురువు చెప్పిన పాఠం

- రచన : డా. నీరజ అమరవాది


 

స్వరూప్, అనంత్ ఇద్దరూ ఎనిమిదో తరగతి చదువుతున్నారు. వారి తల్లిదండ్రులు పిల్లలు ఇంకా బాగా చదవాలని విశ్వనాధంగారి వద్దకు ట్యూషన్ కి పంపిస్తున్నారు. ఆయన పిల్లల అభిరుచిని బట్టి పాఠాలను చెబుతారని, ఆయన వద్ద చదువుకొన్న పిల్లలు ప్రయోజకులు అవుతారని చెప్పుకొంటారు.

స్వరూప్,అనంత్ లు విశ్వనాధంగారి దగ్గరకు ట్యూషన్ కు వెళ్లిన తరువాత బడిలో మొదటగా అర్ధసంవత్సర పరీక్షలు రాశారు. ఆ పరీక్షలలో అనంత్ మంచి మార్కులు వచ్చాయి. స్వరూప్ కి పాస్ మార్కులు కూడా రాలేదు. ఆ విషయం తెలుసుకొన్న స్వరూప్ తల్లిదండ్రులు విశ్వనాధంగారి దగ్గరకు వచ్చి మీరు అనంత్ బాగా చదువు చెప్పారు. మా వాడికి సరిగా చెప్పలేదు. కావాలంటే వాళ్ల మార్కులు చూడండి అంటూ తగవుకు వచ్చారు.

విశ్వనాధంగారు నేను ఇద్దరికీ ఒకే లాగ బోధించాను. వారి వారి ఆకళింపు మీద ఆధారపడి జ్ఞానం వస్తుంది . దానిని బట్టే పరీక్షలలో మార్కులు వస్తాయి అన్నారు.కాని స్వరూప్ తల్లిదండ్రులు విశ్వనాధంగారు తమ కుమారుడి పట్ల శ్రద్ద తీసుకోలేదని భావించారు.

విశ్వనాధంగారు అనంత్, స్వరూప్ లను పిలిచి మీకు దసరా సెలవులు ఇచ్చారు కదా. పక్కనే అమ్మవారి గుడి ఉంది. మీరిద్దరు ఈ దసరా నవరాత్రులలో రోజు గుడికి వెళ్లి ప్రసాదం తీసుకోండి. సెలవుల తరువాత నా దగ్గరికి రండి. మీలో మార్పు కనిపిస్తుంది అని చెప్పారు.

దసరా సెలవలు అయిపోయాయి. స్వరూప్, అనంత్ లు ట్యూషన్ కి వెళ్లారు. విశ్వనాధంగారు ఆ సమయానికే స్వరూప్ తల్లిదండ్రులను కూడా రమ్మన్నారు. అందరూ వచ్చిన తరువాత విశ్వనాధంగారు స్వరూప్ ని దసరా నవరాత్రులలో గుడికి వెళ్లి ప్రసాదం తీసుకున్నావా అని అడిగారు.

స్వరూప్ నేను రోజు రెండు పూటల గుడికి వెళ్లి ప్రసాదం తీసుకున్నాను. గుళ్లో ప్రసాదం చాలా రుచిగా ఉంది. ఒక్కోపూట ఒక్కోరకం ప్రసాదం పెట్టేవారు. ఇక ప్రతి దసరా నవరాత్రులలో నేను గుడికి వెళ్తాను సార్ అని చెప్పాడు.

అనంత్ ని కూడా గుడికి వెళ్లావా అని విశ్వనాధంగారు అడిగారు.అనంత్ గురువుగారు నేను ప్రసాదం కోసం గుడికి వెళ్లాను. అక్కడ రోజు హరి కథలు, సంగీత విభావరులు, నవరాత్రుల ప్రత్యేకత గురించిన ఉపన్యాసాలు ఇలా రకరకాల కార్యక్రమాలు జరిగేవి. నేను వాటినన్నిటిని చూశాను. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. అవన్నీ మా పాఠ్య పుస్తకాలలో లేవు . నేను ప్రసాదాన్ని ఇంటికి తీసికెళ్లి, గుడిలో జరిగిన కార్యక్రమాలను వివరిస్తూ మా తాతయ్యకి పెట్టేవాడిని. నా కబుర్లు వింటూ ప్రసాదాన్ని తిని నీకు బోలెడంత పుణ్యం వస్తుందని మా తాతయ్య ఆశీర్వదించే వాడని చెప్పాడు.

విశ్వనాధంగారు స్వరూప్ వాళ్ల అమ్మానాన్నలతో నేను పిల్లలిద్దరికీ గుడిలో ప్రసాదం తీసుకోమని చెప్పాను. స్వరూప్ ప్రసాదం తీసుకున్నాడు. అనంత్ ప్రసాదంతో పాటు అక్కడి విజ్ఞానాన్ని కూడా తీసుకున్నాడు. నేను పిల్లలిద్దరికీ ఒకే రకంగా బోధించాను. స్వరూప్ నేను ఏదైనా విషయాన్ని వివరించి చెప్పినా పాఠ్యపుస్తకాలలో ఉన్నాయి కద.ఎప్పుడైనా చదువుకోవచ్చు అన్నట్టు ఉండేవాడు. అనంత్ చెప్పిన వాటి గురించి ,ఎన్నో సందేహాలు అడిగేవాడు. పాఠ్యపుస్తకాలలో లేని అంశాలను కూడా అడిగి చెప్పించుకుంటాడు. అదే వాళ్లిద్దరి మార్కుల వ్యత్యాసాలకి కారణం అని చెప్పారు.

స్వరూప్ అమ్మావాళ్లు తమ పిల్లవాడి ఆలోచనా విధానంలోమార్పు వస్తేగాని చదువులో పైకి రాలేడని గ్రహించారు. విశ్వనాధంగారితో మా పిల్లవాడి గురించి మాకు తెలిసేట్లు చేసారు. అలాగే మా స్వరూప్ కి చదువు పట్ల శ్రధ్ధను కలిగించే బాధ్యత కూడా మీదే అని చెప్పి, సెలవు తీసుకున్నారు.

 

 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం   
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)