సారస్వతం

అన్నమాచార్య కీర్తనలు

- రచన : జి.బి.శంకర్ రావు    


 

కొమ్మలాలా ఎంతవాడే

కొమ్మలాలా ఎంతవాడే గోవిందరాజు
కుమ్మరించీ రాజసమే గోవిందరాజు

ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవ్వళించి
కొలువు సేయించుకొనీ గోవిందరాజు
జలజాక్షు లిద్దరును సరిపాదా లొత్తగాను
కొలదిమీర మెచ్చినీ గోవిందరాజు

అదె నాభికమలాన అజుని పుట్టించి తాను
కొదలేక వున్నవాడు గోవిందరాజు
చెదరక తన వద్ద సేవ సేసే సతులకు
గుదిగుచ్చీ వలపులు గోవిందరాజు

ఒప్పుగా వామకరము ఒగిచాచి పలకేల
కొప్పు కడునెత్తినాడు గోవిందరాజు
ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంఖుచక్రాలు
కుప్పె కటారము పట్టె గోవిందరాజు

గోవిందరాజ స్వామి సంకీర్తన ఇది. (గోవిందరాజస్వామి కూడా విష్ణు అవతారమే) ఓ భామలారా! ఈ గోవిందరాజు రాజసాన్ని చూడండే! ఎంతటి రాజసవంతుడే! ఠీవిగా శయనించి జలజాక్షు లిద్దరితోనూ పాదాలు ఒత్తించుకుంటూ, కొలువు సేయించుకుంటున్నాడే! అట్టి వేంకటాద్రిపై శంఖచక్రాలతో కఠారులతో వేంకటేశ్వరునిగా శోభిల్లుతున్నాడే! అట్టి రాజసమూర్తిని దర్శించండే ఓ కొమ్మలారా! అంటూ అన్నమయ్య చెలికతెయై పాడుతున్న పాట ఇది.

కొమ్మలు = స్త్రీలు;
వపుజు = సేన;
ఉలిపచ్చి నవ్వులు = మందహాసం, లేత నవ్వు;
వామకరము = ఎడమచేయి;
ఇరవు = స్థానము;
కుమ్మరించు = దిగబోసి, ఉట్టిపడి


కొలనిదోపరికి గొబ్బిళ్ళో
 

కొలనిదోపరికి గొబ్బిళ్ళో యదు
కులస్వామికి గొబ్బిళ్ళో

కొండ గొడుగుగా గోవులగాచిన
కొండుక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపుదైత్యుల కెల్లను తల
గుండు గండనికి గొబ్బిళ్ళో

పాప విధుల శిశుపాలుని తిట్టుల
కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన
గోపబాలునికి గొబ్బిళ్ళో

దండి వైరులను తఱమిన దనుజుల
గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడియగు వేంకటగిరిపై
కొండలయ్యకును గొబ్బిళ్ళో


సంక్రాంతి సంకీర్తన! ధనుర్మాసంలో తెల్లవారుఝామునే లేచి ఆవుపేడతో గొబ్బిళ్ళు చేసి ఇంటి ముంగిట తీర్చిదిద్దిన రంగవల్లికలపై గొబ్బెమ్మలను అలంకరించి, ఆ ముగ్గులచుట్టూ వలయకారంలో నృత్యం చేస్తూ గొబ్బిళ్ళో, గొబ్బిళ్ళో అంటూ కన్నెపిల్లలు పాడుకుంటారు. ఆ సంప్రదాయాలశైలిలో అన్నమయ్య రాసినపాట యిది! కృష్ణావతారం ఇతివృత్తంగా గల ఈ గొబ్బిపాటను ధనుర్మాసమంతా స్త్రీలు ఆనందోత్సాహాలతో పాడుకుంటారు.
 

కొలనిదోపరి = కొలనిదొంగ(కృష్ణుడు)
యిడుములు = కష్టాలు
కొండుక = లేత;దండి
యేపు = మిక్కిలి
దైత్యులు = రాక్షసులు;
గండడు = పరక్రమవంతుడు;
గుండెదిగులు = గుండెలదర చేయగలిగేవాడు;
కొండుక శిశువు = చిన్న శిశువు
తలగుండు గండడౌ = తలకోయు శూరుడు;
కొండలయ్య = కొండలలో నెలకొన్న వేంకటేశ్వరుడు

 
     
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)