అనగనగా ఒకకథ 

- రచన :  డా. కేతు విశ్వనాథరెడ్డి  


 

 
సానుభూతి

 
 

కష్టాలంటే ఏమిటో, కష్టాలు ఎంత కౄరమైనవో నాకు తెలుసు. మా కుటుంబానికి తెలుసు. ఆస్తిపాస్తులున్న వాళ్ళకు తెలుసు. అవి పోతున్నవాళ్ళకు తెలుసు. ఒఠ్ఠి కసిగాళ్ళకేం తెలుసు?

నా చిన్నతనంలో మాకు రెండువందల ఎకరాలకు పైగా భూమి ఉండేది. తోటలు, దొడ్లూ, ఇళ్లూ నాలుగైదు ఊర్లలో ఉండేవి. మా చుట్టుపట్ల పల్లెల్లో ఇది నలుగురికీ తెలిసిన సంగతే! ఓ అరమణుగు బంగారం మా ఇంట్లో ఉండేదట! మా జేజి చెప్పేది. మాకు దస్త్రం కూడా పెద్దగా వుందనీ, ఆ రోజుల్లోనే సుమారు రెండు మూడు లక్షల నగదు ఉంటుందనీ వాళ్లూ వీళ్లూ అనుకుంటూ వుండేవాళ్ళు. ఊరి పెత్తనమంతా ఆ రోజుల్లో మాదే. మా అబ్బదే! పెరిగిపోతున్న ఆస్తీ, పరువు ప్రతిష్టలు చూచి విధికి మొదటిసారిగా కన్ను కుట్టింది. నాకు తెలిసి నా కుటూంబం మీదికి మొదటి పెద్ద కష్టం వచ్చి పడింది.

మా ఊర్లో ప్రతి యేడాది దేవర జరుగుతుంది. దేవరలో మొదటి బోనం మాదే. ఆ యేడాది ఏం పోయేకాలం వచ్చిందో మా వూరి మరో పెద్ద రైతు చెంచిరెడ్డి ఆ బోనం తమ కుటూంబానికి చెంది తీరాలన్నాడు. మా అబ్బ గాజులు తొడుక్కునే బాపతు కాదు. గ్రామపార్టీ మొదలయ్యింది. మా అబ్బ నాలుగు ఖూనీలు చేయించి, సుప్రీంకోర్టు దాకా వెళ్లి అంత పెద్ద మర్డరుకేసులు గెలుచుకొచ్చినాడు. కానీ మా దురదృష్టం! ఆఖరుకు ఆయన చెంచిరెడ్డి పార్టీ వడ్డెవాళ్ళ చేతుల్లో ఖూనీ అయిపోయినాడు. చనిపోయినాక కూడా ఆయన్ని ప్రజలు మరచిపోలేదు. మాటకోసం నిలబడిన మనిషి అనిపించుకున్నాడు. మా పరువు ప్రతిష్టలు పెరిగినాయి. కానీ ఆయన చనిపోయానాటికి మాకు నూరు ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. మిగతా ఆస్తి గ్రామపార్టీ కోసమే ఖర్చు కాలేదనే వాళ్ళు ఉన్నారనుకోండి. ఇంట్లో బంగారమంతా అబ్బ తిరుగుళ్లకే పోయిందని మా జేజి కూడ నాతో అనుకునేదనుకోండి. ఏమైనా మా అబ్బా, కొంత ఆస్తీ పోవడం సామాన్యం కాదు.

మా అబ్బ ఖూనీకేసు మా నాన్న నడిపించలేక తప్పలేదు. ఆయన చెంచిరెడ్డినీ, వాళ్ల కొడుకులందరినీ గల్లుకు పంపించినాడు. అబ్బని మించిన కొడుకు అనిపించుకున్నాడు. కొంతకాలం మాకేం కష్టాలు లేవు. నేను, మా అన్నా చదువుల్లో పడినాం. రాజాగా టౌను చేరి నేను ఫస్టు ఫారమూ, మా అన్న ఫోర్తు ఫారమూ చదువుకుంటున్నాం. సరిగ్గా ఆ రోజుల్లోనే మా నాయనకు మళ్ళీ ఒక గ్రామపార్టీ తప్పలేదు. ఈసారి మా దాయదులతోనే పార్టీ.

మా దాయాది పాపిరెడ్డిదీ, మావి పక్కపక్క చేన్లే. గట్టు కూడా లేదు. పాపిరెడ్డి సేద్యగాదు తంటా తెచ్చిపెట్టినాడు. సేద్యం చేస్తూ చేస్తూ మా చేలో నాలుగు సాళ్ళు యెక్కువ పోసినాడు. మా సేద్యగాడు ఎందుకు ఊరుకుంటాడు? పాపిరెడ్డి సేద్యగాన్ని చేలోనే వేసి చావ మోదినాడు. మా దాయాదులకు, మాకు కురుక్షేత్ర సంగ్రామం మొదలయ్యింది. ఇంకా మా దాయాదులు, మేము పంచుకోకుండా ఉన్న ఒకప్పటి అవిభక్త కుటుంబం తాలూకా తోటలు, దొడ్లూ, బంజర్లు, వనాలు వీటి పంపకాల గొడవ పైకి వచ్చింది. ఆస్తి గొడవలు సామాన్యమైనవి కావు. ప్రాణాంతకమైనవి. ఆ దాయాదులు మా నాయనను ఖూనీకేసులో ఇరికించినారు. వాళ్ళవైపు మనినిషిని వాళ్ళే చంపి మా నాయనపై ఖూనీకేసు పెట్టినారు. ద్వీపాంతరం వెళ్ళేటట్టు చేసినారు. ఇంకా పసిపిల్లలం. ఇంత పెద్ద కష్టానికి తట్టూకోలేకపోయినాం.

నా చదువుకేం దెబ్బ తగల్లేదు. కానీ, అన్న చదువు ఫిఫ్త్ ఫారంతో ఆగిపోయింది. ఇంటి పెత్తనం అన్నమీద పడింది. ఇంట్లో ఇంకెవళ్ళు లేకపోవటం వల్లా, అమ్మ వెర్రిబాగుల్ది కావటం వల్లా, నిన్న మొన్నటి దాకా ఏ అవష్తలూ లేవు. మా అన్న ఆశయం నెరవేర్చటానికీ, డి.వై.ఎస్.పి. కావటానికి చదువుతున్నాను నేను. ఈ యేడాది ఎం.ఏ. పూర్తవుతుంది.

కాని అదేమో మేము కష్టాలు పడటానికే పుట్టినట్టుంది. ఈ మధ్య కొత్త శని పట్టుకుంది. నలమహారాజును కలిపురుషుడు చుట్టుకున్నట్టు మా వూరి మాదిగలు చుట్టుకున్నారు. ఏటిగడ్డను ఇరవై యేండ్లనుంచి సాగుచేసుకుంటే చేసుకోవచ్చు గాక, పట్టా మాది అయినప్పుడు మా భూమి మాకు దఖలు పరచడం న్యాయం. మా అన్న న్యాయంగా అడిగి చూశాడు. వాళ్ళెందుకు వింటారు? తెలివిమీరిన జనం. బరి తెగించిన జనం. వాళ్ళంటారట గదా! 'ఇంతకాలం భూమిని సాగుచేస్తుంటే యెందుకూరుకున్నారు? భూమి పక్వానికొచ్చిందని గోసులు విప్పుకొని వచ్చారు. మేమియ్యం. యెందుకియ్యాల? యేమైతే అదవుతుంది '.

ఇంత పొగరు వాళ్ళకే ఉంటే ఆస్తిపరులకెంత ఉండాలి? రైతులందరు కలిసి 'చిల్లర జనం పొగరు అణచాల్సిందే' అన్నారు. ఇష్టం లేకపోయిన మా అన్న పార్టీ లీడరయ్యాడు.

ఇప్పుడు మా వూళ్ళో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మాదిగలొకవైపూ, రైతులొకవైపూ.

ఏంజరుగుతుందో! నెత్తిమాసిన మాసిన వాళ్ళకు ఏ పార్టీ పెత్తుకున్న వూడేది లేదు. పైగా వాళ్ళను సమర్థించే వాళ్ళు నన్ను కూడా ఏ కేసులోనన్నా ఇరికిస్తారామోనని మా వూరిఛాయల వైపుకైనా రావద్దని మా అన్న ఆదేశించాడు. ఈ కలిపురుషులనుండి మా కుటుంబం ఎప్పుడు బయటపడుతుందో!

నా బుద్ది గడ్డితిని ఈ కథ అంతా మా క్లాసుమేటు రామకృష్ణతో చెప్పితే 'మీరు కాబట్టి ఇన్ని కష్టాలకు తట్టుకున్నారు. మరొకరైతేనా?' అంటాడనుకున్నాను. కాని, వాడంటాదు కదా - 'మీ ఇంటి కథ తెలుగు సినిమాకి సరిపోతుంది. సినిమాలో కన్నీళ్ళు, సినిమా తీసినవాళ్ళకు డబ్బులూ. బుద్ధి, జ్ఞానం ఉన్నవాడెవడు మీ యేడ్పులకు బాధపడడు. మీవేం కష్టాలు? తెచ్చిపెట్టుకున్న కష్టాలు. నిజమైన అవస్థలంటే మీ వూళ్ళో హరిజను పడే అవస్థల్లాంటివి. వాళ్ళ గోడుకు వాళ్ళు కారణం కాదు. మీరు, కావల్సినంత సొంత ఆస్తులున్న మీలాంటి వాళ్లూ' .

దక్కిన ఆస్తిని నిలబెట్టుకోడానికి మామీద తిరగబడిన మా ఊరి మాదిగలే నయం వీడికంటే. వీడి ప్రేమ, సానుభూతి లేకపోతే పోయే! ఆస్తుల్లేకుండా చేయాలనే పిచ్చి కర్కోటకుల రకం. వీళ్ళతో ఏం మాట్లాడగలం?
 

 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)