సారస్వతం
నరసింహ సుభాషితం
- ఓరుగంటి వేఙ్కట లక్ష్మీ నరసింహ మూర్తి

దుర్జనుడు - 1

శ్లోకం:

दुर्जनः प्रियवादीति नैतद्विश्वासकारणं ।
मधु तिष्टति जिह्वाग्रे ह्रुदये तु हलाहलम् ।।

దుర్జనః ప్రియవాదీతి నైతద్విశ్వాసకారణం ।
మధు తిష్టతి జిహ్వాగ్రే హృదయేతు హాలాహలమ్ ।।

సంధి విగ్రహం

దుర్జనః, ప్రియవాది, ఇతి, న, ఏతత్, విశ్వాస, కారణం
మధు, తిష్టతి, జిహ్వా, అగ్రే, హృదయే, తు, హాలాహలమ్

శబ్దార్థం

దుర్జనః = చెడ్డ వాడు , ప్రియవాది = మథురమైన సంభాషణలు చేసే వ్యక్తి , ఇతి = అని, న = కాదు , ఏతత్ = ఇది , విశ్వాసః = నమ్మకం , కారణం = లెక్కింపదగిన విషయం , మధు = తేనె , తిష్టతి = కూర్చుని ఉంటుంది, జిహ్వా = నాలుక , అగ్రే = చివరన , హృదయే = మనస్సునందు , తు = కానీ, హాలాహలమ్ = భయంకరమైన విషం.

Meaning

A wicked person may be an impressive and sweet talker. This is not a reason to trust him. For him, sweetness stays at the tip his tongue. But, in the heart, he has vicious attitude akin to dangerous poison.

భావార్థం

ప్రియ సంభాషణము చేసే వారందరూ మంచివారు కానవసరం లేదు. ప్రియ సంభాషణము చేసే వారిలో దుర్జనులూ ఉంటారు. వారు మన చుట్టూ ఉన్నవారిలోనే ఉంటారు. ప్రియ సంభాషణము చేసే వారిలో సజ్జనులైన వారిని దుర్జనులనుండి అనగా చెడ్డవారినుండి వేరు చేసి గ్రహించుటలోనే మనిషియొక్క తెలివితేటలు, విజ్ఞత ప్రదర్శితమౌతాయి. ప్రియ సంభాషణం మాత్రమే మనిషిని నమ్ముటకు కారణం కాకూడదు.

దుర్జనునికి నాలుక చివరన తేనెలొలుకు తీయటి మృదు సంభాషణలు ఎల్లప్పుడు ఉంటాయి, కానీ హృదయములో భయంకరమైన హాలాహలము లాంటి విషపు ఆలోచనలు కలిగి ఉంటాడు. దుర్జనుడు తన చుట్టూ ఉన్నవారితో సఖ్యత నటిస్తూ, వారిని బుట్టలో వేసుకోవడానికై చాలా చక్కటి ప్రియమైన సంభాషణలు చేస్తాడు. అవి చాలా మధురం గానూ మనస్సుకి ఆహ్లాదంగానూ ఉంటూ ఎంతో నమ్మకంగా ఉంటాయి. ఆ విధంగా ప్రజలని నమ్మించడంలో సాధారణంగా విజయం సాధిస్తూ ఉంటాడు, ఎందుకంటే మిగిలిన వారందరూ మంచి వారు, ఎదుటి వ్యక్తిలోని విషపు ఆలోచనలని పసిగట్టలేని అమాయకులు. ఎదుటి వ్యక్తి యొక్క తీయటి సంభాషణలని విని త్వరగా నమ్మకానికి లోనవుతారు. చెడ్డవాని లక్ష్యం మీయొక్క క్షేమం కాదు. వాని స్వలాభం మాత్రమే. తన తీయటి మాటలతో నమ్మించడమే వాని ప్రధాన ధ్యేయం.

జనం, ఎవరినైనా నమ్మాలంటే ఆ వ్యక్తిని నమ్మడానికి, వాని యొక్క ప్రియ సంభాషణం మాత్రమే కారణం కాకూడదు.

ప్రియ సంభాషణా చాతుర్యంతో ఎదుటి వ్యక్తిని సునాయాసంగా ప్రలోభపరచుకోవడానికి ఆ దుర్జనునికి తీయటి తేనెలొలికే పలుకులు ఎల్లప్పుడూ నాలుక చివరన ఉంటాయి. తన స్వలాభమునకై ఎదుటి వ్యక్తి యొక్క నాశనానికై ఎంతటి నీచానికైనా సిద్ధపడే హాలాహలం లాంటి భయంకరమైన విషపు ఆలోచనలు వాని మనస్సులో ఎప్పుడు ఉంటూ ఉంటాయి.

అటువంటి వారిని గుర్తించడంలో తగిన జాగ్రత్తలతో మసలుకుంటూ ఉండాలి. సరియైన విజ్ఞతతో వ్యవహరిస్తూ మసలాలి.

ఇటువంటి దుర్జనులని మనం వర్తమాన ప్రపంచములో, ప్రత్యేకించి భారత దేశములోనూ మనం చాలా మందినే చూస్తున్నాము. అమాయకులు బలి అయిపోతూనే ఉన్నారు.

ఈ కోవకి చెందిన దుర్జనులను ముఖ్యంగా మూడు రకాలుగా మనం గమనిస్తున్నాము.

స్త్రీలని చెరచడంలోనూ, మానభంగాలు చేయడంలో నేర్పరులు ఒక తరగతి వారు. అనునిత్యమూ కోకొల్లలుగా అటువంటి వార్తలను మనం చూస్తున్నాము, అమాయకులు బలి అయిపోతున్నారు.

మనిషులలో ఉండే చిన్న చిన్న ప్రలోభాలని ఆసరా చేసుకుని, వారికి, వివిధ రకాలైన ఆర్ధిక ప్రయోజనాలని ఎరజూపి వారి ధనాన్ని, ఆస్తులని కైంకర్యం చేసే వారు రెండో రకానికి చెందిన వారు. చిరు సంపాదనలతో జీవనాన్ని వెళ్ళదీసే ఎంతోమంది అమాయకులు ఈ విధంగా మోసపోయి వీధిన పడి ప్రాణాలు తీసుకోవడం మనం గమనిస్తున్నాము.

ఈర్ష్య అసూయాద్వేషాలతో, స్వలాభప్రాప్తి చేకూరలేదనే అక్కసుతో క్రౌర్యానికి దిగి kidnap లూ, హత్యలూ, మాన భంగాలూ వంటి సంఘటనలని చూస్తున్నాము. వీరు మూడవ రకానికి చెందిన వారు.
ఇదేవిధంగా ఇతరమైన చిన్న చిన్న మోసాలు చేసే దుర్జనులూ ఉన్నారు.

అందరిలోనూ ఒకటే గుణం చక్కగా మాట్లాడుతూ ఎదుటి వ్యక్తికి భయంకరమైన హాని తలపెట్టడం.
వీరందరినీ ఇక కంట కనిపెడుతూ తగు జాగ్రత్తలతో మసలుకుంటు ఉండాలి.

తస్మాత్ జాగ్రత్త!!

-------------- ॐ ॐ ॐ --------------

దుర్జనుడు - 2


శ్లోకం:

परोक्षे कार्यहन्तारं प्रत्यक्षे प्रियवादिनं ।
वर्जयेत्तादृशं मित्रं विषकुम्भं पयोमुखं ।।

పరోక్షే కార్య హంతారం ప్రత్యక్షే ప్రియవాదినం ।
వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖమ్ ।।

సంధి విగ్రహం

పరోక్షే, కార్యం, హంతారం, ప్రత్యక్షే, ప్రియం, వాదినం
వర్జయేత్, తాదృశం, మిత్రం, విషం, కుంభం, పయః, ముఖమ్.

శబ్దార్థం

పరోక్షే = విముఖమునందు, కార్యం = పనిని, హంతారం = పాడుచేయు వానిని, ప్రత్యక్షే = సముఖమునందు, ప్రియం = మెచ్చుకోలు, వాదినం = మాటలు లేదా సంభాషణలు, వర్జయేత్ = విడచిపెట్ట వలయును, తాదృశం = అటువంటి వానిని, విషకుంభం = విషముతో నిండిన కుండని, పయః = పాలు, ముఖమ్ = ఉపరి భాగము.

Meaning

The one who is around you may pretend to be a friend and may talk very sweetly in front of you. But, does harm to you at your back by spoiling your works or activities.

Such friend must be discarded at once because he is like pot, full of poison but on the top contains pure milk.

భావార్థం

మన చుట్టు ఉండే వ్యక్తులలో చాలా మంది స్నేహితుల్లా మసలుతూ ఉంటారు. వాళ్ళు ముఖప్రీతి కోసం చాలా మధురమైన సంభాషణలు చేస్తూ ఉంటారు, మిమ్ములని ఆకట్టుకుంటారు. కానీ వాళ్ళు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకోసం మీ వెనుక మీకు గోతులు తీస్తూ ఉంటారు, మీ పనులని అన్నిటినీ చెడగొడుతూ ఉంటారు. మీ సముఖములో మిమ్ములని ప్రియ సంభాషణలతో మెప్పించి, మీ వెనుక మీ పనులకి హాని తలపెట్టే అటువంటి మిత్రుని వెంటనే వర్జించవలయును. అటువంటి మిత్రుడు ఎటువంటి వాడు అంటే, పూర్తిగా విషముతో నింపబడి పైభాగములో మాత్రము శుధ్ధమైన పాలతో నింపిన కుండవంటి వాడు. పై భాగంలో ఉన్న పాలను చూసి కుండలోనివన్నియూ పాలే అని భ్రమపడ రాదు. అటువంటి వాడు మిత్రుడు కాడు. అతడు చాలా హానికారి. విషకుంభము లాంటి వాడు. అటువంటి వారిని దృష్టిలో ఉంచుకునే, "పయోముఖ విష కుంభం" అనే ఈ ప్రసిధ్ధమైన నానుడి విస్త్రుత ప్రచారములో ఉంది.

అటువంటి వారిని గమనించగలగడం, వారిని తగు జాగ్రత్తలతో దూరంగా ఉంచడం, అటువంటి వారిని పూర్తిగా వర్జించగలగడం అనేది ఒక నేర్పరితనముతో కూడుకున్నది. అటువంటి వారిని కనిపెట్టడములో తగు విజ్ఞతని పాటింపవలసి యుంటుంది.

తస్మాత్ జాగ్రత్త!!

-------------- ॐ ॐ ॐ --------------


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)