సారస్వతం
(ర)సాలూరు (స్వ)రాజేశ్వరరావు
- టీవీయస్.శాస్త్రి

అది లలితగీతం కావచ్చు, లేక సినీగీతం కావచ్చు -- కర్ణపేయంగా ఉందంటే దానికి స్వరాలు కూర్చింది నిస్సందేహంగా​రాజేశ్వరరావు గారే అని చెప్పటంలో​ ​ఏమాత్రం అతిశయోక్తి లేదు. పూవు పుట్టగానే పరిమళిస్తుందని చెప్పటం, బహుశ కొంతమంది విషయంలో నిజమేమో! అలాంటి కోవకు చెందిన బాలమేధావి శ్రీ రాజేశ్వరరావు గారు.​ తెలుగు సినీ సంగీత ప్రపంచంలో, నౌషాద్‌ వంటి హిందీ సంగీత దర్శకులచే, గౌరవింపబడ్డ ఒకే ఒక తెలుగు సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావుగారు.

రాజేశ్వరరావుగారు 11-10-1922న విజయనగరం జిల్లలోని ఒక కుగ్రామంలో పుట్టారు. ఆయన తండ్రి సాలూరు సన్యాసిరాజు గారు. ఆ రోజుల్లో ఎన్నో మంచి పాటలు రాసి, వాటికి స్వరాలు కూర్చిన సంగీత పిపాసి ఆయన. అంతే కాకుండా ఆయన ప్రముఖ మృదంగ విద్వాంసుడు. ఆ రోజుల్లో ఆయన శ్రీ ద్వారం వెంకటస్వామినాయుడు గారి వయోలిన్ వాద్యకచేరీలలో మృదంగాన్ని వాయించేవారు. రాజేశ్వరరావు గారు బాల్యంలో తండ్రి వద్దనే సంగీతంలోని మెళుకువలు నేర్చుకున్నారు. సన్యాసిరాజు గారు అప్పటి మూకీ సినిమాలకు తెరముందు సంగీతం వినిపించేవారు.

రాజేశ్వరరావు గారు పుట్టినప్పటినుండీ సంగీత వాతావరణలో పెరిగాడు. 7 ఏళ్ల వయస్సులోనే ‘భగవద్గీత’ మీద రికార్డింగ్‌ ఇచ్చి ఒక సంచలనాన్ని సృష్టించారు. కేవలం ఆయన స్వయం ప్రతిభవల్లనే మొదటి సినిమాకి 1935 లోనే అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు ‘శ్రీకృష్ణ లీలలు’. ఆ సినిమాలో బాల కృష్ణుడిగా నటించి పాడిన పాటలు, పద్యాలు, ఆయన చూపించిన నటన, మధురమైన గానం, గమనించిన సంగీత ప్రియులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.

అప్పటినుండే ఎదురులేని గాయకుడుగా, సంగీత దర్శకుడిగా నిలదొక్కుకున్నాడు. ఆ తరువాత, 1936 లో విదులైన మాయాబజార్ సినిమాలో అభిమన్యుడిగా నటించి ప్రశంసలను పొందారు. తరువాత, 'కీచక వధ' అనే సినిమాలో నటించటానికి కలకత్తాకు వెళ్ళిన సమయంలో, ఆనాటి ప్రముఖ నటగాయకుడు శ్రీ కె. యల్. సైగల్ గారితో, పంకజ్ మల్లిక్ గార్లతో వీరికి పరిచయం కలిగింది. వారి ప్రభావంచేత హిందుస్తానీ సంగీతాన్నికూడా నేర్చుకున్నారు. సితార్, డోలక్, తబలా, మృదంగం, పియానో, మాండోలిన్, హార్మోనియం, గిటార్ లాంటి ఎన్నో వాయిద్యాలను మధురంగా పలికించటంలో మెళుకువలు నేర్చుకున్నారు.

1938 లో మద్రాసుకు తిరిగివచ్చి తన స్వంత వాద్యబృందాన్ని ఏర్పరుచుకున్నారు. మొదట్లో జయరామయ్యర్ అనే ఒక తమిళ సంగీత దర్శకుడికి సహాయకుడిగా 'విష్ణులీల' అనే సినిమాకు పనిచేసారు. ఆ సినిమాలో బలరాముడి పాత్రను కూడా పోషించారు. తన పాటలను తానే పాడుకున్నారు. స్వతంత్రంగా సినీ సంగీత దర్శకుడిగా ఆయన పనిచేసిన మొదటి చిత్రం 'జయప్రద'. అలా సంగీత దర్శకుడిగా ఒక పక్క పనిచేస్తూ, మరొక పక్క నటిస్తూ ఉన్నారు.

రాజేశ్వరరావు గారిలోని సంగీతదర్శక ప్రతిభను కూడా గుర్తించిన గూడవల్లి​రామబ్రహ్మం ​గారు ​“ఇల్లాలు” లో కొన్ని పాటలు చేసే అవకాశం కల్పించాడు. బాలనాగమ్మ, ఇల్లాలు లాంటి సినిమాలలో ఆయన, మరో మధుర గాయని, నటి అయిన శ్రీమతి రావు బాలసరస్వతితో కలసి నటించారు. ఆ తరువాత, సినిమాలలో నేపధ్య సంగీతం వచ్చింది. అప్పటినుండి రాజేశ్వరరావు గారి గొంతు సినిమా పాటలలో అతి తక్కువగా వినిపించేది. ఆ సమయంలో, లలితగీతాలెన్నిటికో స్వరాలను కూర్చి శ్రావ్యంగా పాడారు. లలిత సంగీతంలో ఒక నూతన వరవడిని తీసుకొని వచ్చారు. తానే బాణీలు కట్టుకొని, మధురంగా, సున్నితంగా ఆలపించిన “చల్లగాలిలో యమునాతటిపై”, “పాట పాడుమా కృష్ణా”, “గాలివానలో ఎటకే వొంటిగ”, “ఓహో విభావరి”, “ఓహో యాత్రికుడా”, “ఎదలో నిను కోరితినోయి”, “షికారు పోయిచూదమా”, “హాయిగ పాడుదునా చెలీ” వంటి పాటలు ఈనాటికీ సంగీతప్రియుల గుండెల్ని పులకరింపజేస్తున్నాయి.

తరువాత చాలా కాలం జెమినీ వారి సంస్థలో పనిచేసారు. సాలూరి ప్రతిభను యావద్భారత దేశానికి తెలియ జెప్పిన చిత్రం చంద్రలేఖ (1948). కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాలని, లాటిన్‌ అమెరికన్‌, పోర్చుగీస్‌, స్పానిష్‌ జానపద సంగీత రీతులను సమ్మిళితం చేసి, ​ఊహించలేనటువంటి పెద్ద వాద్యబృందంతో సృష్టించిన చిత్రమది. “చంద్రలేఖ” తరువాత ఆయన మరి వెనుతిరిగి చూడలేదు. 1950వ దశకంలో విడుదలైన మల్లీశ్వరి సినిమాకు స్వరాలను కూర్చి పండిత పామరుల ప్రశంసలను పొందారు. “మల్లీశ్వరి” తరువాత ముఖ్యంగా చెప్పుకోవలసిన చిత్రం విప్రనారాయణ (1954). ఈ చిత్రంలోని ప్రతి పాటా గొప్పదే. పాలించర రంగా (హేమవతి), చూడుమదే చెలియా (హిందోళం), రారా నా సామి రారా (కల్యాణి), సావిరహే (యమునాకల్యాణి), మేలుకో శ్రీరంగ (బౌళి, మలయమారుతం), …శ్రీ ఏ. యమ్. రాజా గారి చేత అద్భుతమైన పాటలను పాడించారు. మిస్సమ్మ సినిమాకు ​కూడా​మంచి సంగీతాన్ని అందించారు.

సినిమా పాటలలో కూడా శాస్త్రీయ సంగీతానికే వీరు ఎక్కువ ప్రా​ధాన్యమిచ్చేవారు. రావు బాలసరస్వతి, సాలూరు రాజేశ్వరరావుల యుగళగీతాలు 1940 దశకంలో తెలుగునాట ఒక పెద్ద సంచలనం. లలిత సంగీత ప్రియుల అందరి ఇళ్ళలోనూ వీరు పాడిన రికార్డులు ఉండేవి. 1970లో వచ్చిన ‘‘చిట్టిచెల్లెలు’’ సినిమా కోసం స్వరపరిచిన ‘‘ ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది’’ బాణి ఒక పాశ్చాత్య బాణీకి కాపీ, కానీ, ఈ పాటలోని వైవిధ్యాన్ని గమనిస్తే, దీన్ని పూర్తిగా ఒక తెలుగు పాటగా మార్చిన రాజేశ్వరావుని అభినందించకుండా ఉండలేము. సినిమాల్లో వీణ, సితార్‌ వంటి వాయిద్యాలకు పాటల ద్వారా మంచి గుర్తింపు తెచ్చింది సాలూరివారే. ‘‘నీవు లేక వీణ పలుకలేనన్నది’’ (డాక్టర్‌ చక్రవర్తి), ‘‘పాడెద నీ నామమే గోపాలా’’(అమాయకురాలు) వంటి పాటల్లో చరణానికి, చరణానికి మధ్య స్వరకల్పనలో వీణను చక్కగా వినియోగించారు రాజేశ్వరరావుగారు.

రాజేశ్వరరావుగారికి వయస్సు మీద పడ్డా ప్రతిభ ఏమాత్రం తగ్గలేదు. వీరికి సహాయకులైన రాజగోపాల్, కృష్ణన్ లకు కూడా శాస్త్రీయ సంగీతంలో మంచి ప్రవేశం ఉంది. వీరి కుటుంబంలోని వారంతా దాదాపుగా సంగీతానికే అంకితమయ్యారు. రాజేశ్వరరావు గారి పెద్ద అన్నయ్య అయిన శ్రీ హనుమంతరావు గారు తెలుగు, కన్నడ భాషలలో మంచి పేరు ప్రఖ్యాతులున్న సంగీత దర్శకులు. కొన్ని సినిమాలకు వీరు తన తమ్ముడైన రాజేశ్వరరావు గారితో కలసి సంగీతాన్ని అందించారు. శ్రీ రాజేశ్వరరావు గారికి అయిదుగురు కుమారులు. అందరూ సంగీతంలో నిష్ణాతులే. వీరి పెద్ద కుమారుడైన రామలింగేశ్వరరావు గారు పియానో, ఎలెక్ట్రిక్ ఆర్గాన్ వాద్య నిపుణుడు. రెండవ కుమారుడు అయిన శ్రీ పూర్ణచంద్రరావు గారు ప్రఖ్యాత గిటార్ వాద్య నిపుణుడు. మూడవ, నాల్గవ కుమారులైన వాసూరావు, కోటేశ్వరరావు(కోటి) గార్లు ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు. ఆఖరి కుమారుడైన దుర్గాప్రసాద్ గారు మాత్రం సినీ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. శ్రీ రాజేశ్వర రావు గారికి నలుగురు కుమార్తెలు. అందరూ బాగానే స్థిరపడ్డారు. వీరు అన్నపూర్ణ, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ లాంటిప్రఖ్యాత సంస్థలకు ఆస్థాన సంగీత విద్వాంసుడు. తెలుగు వారికి సుస్వరాలు అందించిన ఈ (స్వ)రాజేశ్వరరావు, అక్టోబర్‌ 25, 1999న కన్నుమూసారు. ఎన్నో ప్రయోగాలు చేసి, మరెన్నో అద్భుత స్వరకల్పనలు చేసిన ఈ'స్వరరాజు' మధురమైన తెలుగు పాట ఉన్నంత కాలం సజీవుడే!

ఆమధ్య కాలంలో సింగీతం శ్రీనివాసరావుగారు​ రాజేశ్వరరావు గారు పాడిన ​కొన్ని లలిత గీతాల పల్లవులను తీసుకొని ​వివిధ గాయకులచేత ​​పాడించి​చక్కని రికార్డింగ్ క్లారిటీతో ఒక ఆ​డియోCD ని విడుదల చేసారు! అది సంగీత ప్రియుల మనసులను దోచుకుంది!

ఆ సుస్వరరాజుకు ఘనమైన నివాళిని సమర్పించుకుందాం!

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)