కవితా స్రవంతి
జీవన గమనం
- మంగళగిరి నాగసుధ

చింతపిక్కలు, తొక్కుడుబిళ్ళ, అష్టాచెమ్మ,బొమ్మలపెళ్ళి

పట్టుపరికిణి-పొట్టిజాకెట్లు, మామిడికాయ-ఉప్పూ-కారం

గిరగిర తిరిగే ఒప్పులకుప్పలు, జడకుప్పెలతో చక్కని చుక్కలు

గోటీబిళ్ళ, గోళీకాయలు, ఆకాశాన గాలిపటాలు

జారిపోతున్న చెడ్డీలు, పెట్టుకుంటున్న జెట్టీలు

చింతతోపులో పందాలు, ఏట్లో ఈతల పంతాలు

అమ్మచేతి బువ్వలాటి కమ్మనైన బాల్యం అందలాలెక్కినా దాని విలువ అమూల్యం

నిను తాకితే నాకు నూటొక్క డిగ్రీల జ్వరం

నీ పలుకు శృతి చేసి మీటిన స్వరం అని అబ్బాయి

మీరు నాకు దేముడిచ్చిన వరం

మీతో జీవితం అంబరాన్నంటే సంబరం అని అమ్మాయి

కలిపికూడితే మధుపర్కాలతో మనుగడలో మధురపర్వం మొదలు

మురిపాలు, మూర పూలతో ఒకరో ఇద్దరో పిల్లలు

వాళ్ళు పాలూ నీళ్ళూ దాటి బడిలొ చేసే ఆగడాలు

మూడు దెబ్బలాటలు ఆరు సర్దుబాట్లతో

వయసు ఊయలలో అటూ ఇటూ ఊగే యవ్వనం

పిల్లల పైచదువుల చర్చలు, జమాఖర్చు రచ్చలు

ఆదాయాలు, వ్యయాలు, రాజపూజ్యాలు, అవమానాలు

పెళ్ళిళ్ళు పేరంటాలు, పురుళ్ళు పుణ్యాల పెట్టుపోతలు

అడుగంటిన ఆశలతో ఆటుపోట్ల నడివయసు

సంసార సాగరాన కష్టాల తీరాల కొట్టుమిట్టాడే ఓడ

ముగ్గుబుట్ట తల, మూడుకాళ్ళ నడక, నాలుగు కళ్ళ చూపు

అయినదానికీ కానిదానికీ ఆయాసపడి వెళ్ళొచ్చి కాసేపు

వాలుకుర్చీలో చేరబడి గుమ్మానికి తోరణంలా ఆయన

గోరంత పసుపు, చిటికెడు కుంకుమ, ముచ్చటగా ముడిలో పువ్వు

వోపికున్నా లేకున్నా చేసిన వంటతోపాటు వడ్డించే చిరునవ్వు

తులసికోటకానుకుని ఒత్తులు చేస్తూ గడపకాడ ముగ్గులా ఆవిడ

పార్వతీపరమేశ్వరుల్లా, పండుతమలపాకుల్లా రాలిపోవడానికి సిద్ధమైన వార్ధక్యం

ఒకరికొకరు తోడుగా నీడగా ఈదిన జీవనం చాలు

ఒక్కొక్కరిగా బతకాలంటేనే గుండెల్లో గుబులు

అక్కరతీరిన దంపతులొక్కసారే కన్నుమూస్తే మేలు

కనికరించి భగవంతుడు పెట్టాలి ఈ రూలు


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)