జరిగిన కథ:
వీరవాఘ రాజ్యంలో విరాట్ గొప్ప యోధుడు. అచంచల రాజభక్తి కలవాడు. అయితే రాజుగారి బావమరిది రాజ్యం మొత్తం ఆక్రమించాలన్న దురుద్దేశంతో వీరవాఘ సైనికుల్ని కొందర్ని లంచాలతో లోబర్చుకొని దండెత్తి వచ్చాడు. ఆ విపత్కర సమయంలో రాజుగారు విరాట్ ను సైన్యానికి నాయకత్వం వహించి శత్రువుని ఎదుర్కోమని కోరాడు. ఆనాటి రాత్రి జరిగిన సంగ్రామంలో విరాట్ తన శక్తియుక్తులతో శత్రువుల గుడారంపై దండెత్తి రాజవిద్రోహులను కడతేర్చాడు. మరుసటి రోజు ఉదయం విరాట్ చనిపోయిన విద్రోహులలో ఒకరిని తన అన్నగా గుర్తించాడు. తన చేతులతో స్వంత అన్ననే చంపుకొన్న సంఘటన విరాట్ ని ఎంతగానో కలచివేసింది. విజయకేతనంతో తిరిగి వచ్చిన విరాట్ కు రాజుగారు వజ్రాలతో పొదిగిన తమ పూర్వీకుల ఖడ్గాన్ని బహుకరిస్తూ సర్వ సైన్యాధ్యక్ష పదవిని అప్పగించబోయాడు. అయితే విరాట్, సొంత అన్ననే చేజేతులా చంపుకున్నానని, ఇక జీవితంలో ఖడ్గాన్ని ముట్టబోనని ప్రతిజ్ఞ చేశాడు. ఇలా చెడు జోలికి పోని, ధర్మబద్దుడైన విరాట్ కు రాజుగారు ప్రధాన న్యాయాధికారి పదవీ బాధ్యతలను అప్పగించాడు. ధర్మకాటాతో సమంగా తూచినట్లు విరాట్ ప్రతి నేరాన్ని లోతుగా పరిశీలించి మరణశిక్ష తప్ప వేరే తగిన శిక్షలను విధిస్తూ త్వరలోనే రాజ్యంలోని ప్రజల మెప్పును పొంది గొప్ప న్యాయాధికారిగా పేరొందాడు. అయితే ఒకరోజున కొందరు కొండ జాతీయులు ఒక యువకుణ్ణి పదకొండు మంది ప్రాణాలు అపహరించాడంటూ బంధించి తీసుకువచ్చారు. అయితే ఆ యువకుడు విరాట్ ను న్యాయాన్ని చెప్పడానికి నీకేం అధికారముందంటూ, ఇతరులు చెప్పేది విని నీవేం తీర్పు చెబుతావంటూ నిగ్గదీస్తాడు. పదకొండుమందిని చంపిన ఆ కొండజాతీయ యువకుణ్ణి పదకొండు సంవత్సరాల పాటు భూగర్భంలోని చీకటి గదిలో నిర్భందించి ప్రతీ సవత్సరం పదకొండు కొరడా దెబ్బలు తినేలే తీర్పు ఇస్తాడు విరాట్. తీర్పు విన్న ఆ ఖైదీ 'నేను ఆవేశ పిశాచం ఆవహించి ఆ క్షణంలో హత్యలు చేస్తే నీవేమో ప్రశాంతంగా నీ తీర్పుతో నా జీవితాన్ను హరిస్తున్నావు ' అంటూ విరాట్ ను నిందిస్తాడు. ఆ యువకుని కన్నుల్లో తనచే చంపబడ్డ అన్న కన్నులు చూచాడు విరాట్. ఆ మాటలకు చలించి సత్యమార్గాన్ని అన్వేషించటానికి ఒక నెలరోజులు సెలవు తీసుకొంటాడు. నల్లని దుస్తులు ధరించి అట్టడుగున గాఢాంధాకారంలో నున్న చెరసాలకు చేరుకుంటాడు. తను తీర్పు ఇచ్చే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అనుభవం ద్వారా నేర్చుకుంటానని, ఆ అనుభవం ముందు ముందు సరైన తీర్పులు ఇవ్వటానికి దోహదపడతాయని కొండజాతి యువకునితో చెబుతాడు. అందుగ్గాను విరాట్ ఖైదీ దుస్తులు ఆ యువకుణ్ణి ఎవరికి తెలియకుండా ఓ నెలరోజులు బయటికి పంపిస్తాడు. మరుసటిరోజునుంచి కొండజాతి యువకునికి శిక్షగా విధించిన కొరడాదెబ్బలను తనకే అమలుపరచారు. భరించలేనంత నొప్పిగా ఉండేది. ఒంట్లో నిస్సత్తువతో నేలపై అలాగే పడిపోయేవాడు. కాని, ఆ చీకటి గుహలో, ఏకాంతంలో రాగద్వేషాలకి అతీతంగా, స్వార్థచింతనలేని కాలాన్ని గడపసాగాడు. ఆత్మావలోకనంలో అలౌకిక ఆనందం పొందాడు. ఇంతలో ఆయన మనసులో భయంగొలిపే ఆలోచన ఒకటి వచ్చింది. ఒకవేళ మాటైచ్చిన ప్రకారం ఆ కొండజాతి యువకుడు తిరిగి రాకపోతే? తనను విడిపించకపోటే? తను ఈ చీకటిగుహలో శేషజీవితాన్ని గడపాల్సిందేనా? ఇలాంటి ఆలోచనలతో పిరికివాడయ్యడు విరాట్.
పౌర్ణమి రోజున బయటనుంచి పెద్ద శబ్దాలు వినిపించి కొద్దిదేపటీకి సద్దుమణిగాయి. ఆ తరువాత పెట్లమీద అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో వచ్చి తలుపు తెరిచారు. గదిలోకి కొద్దిగా వెలుగు వచ్చింది. విరాట్ లేచి చూశాడు. ఆయన ముందు మహారాజుగారు నిలబడిఉన్నారు. రాజుగారు విరాట్ ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
"మీరు చేసిన పని నాకు తెలిసింది. మా పూర్వీకుల కాలం నాటి చరిత్రలో పేర్కొన్న గొప్ప విషయాలకంటే మీరు చేసిన ఈ పని మహత్తరమైంది. ఈ మహత్కార్యం మా జీవితాల్లొ ఒక ధృవతారగా వెలుగు చూపుతుంది.
బయటకు రండి. సూర్యభగవానుడు మిమ్మల్ని తేజోమయుణ్ణి చేస్తాడు. మహోన్నతులైన మిమ్మల్ని దర్శించుకోవడానికి ప్రజలు బయట ఆనందోత్సాహాలతో ఎదురుచూస్తున్నారు" అన్నాడు మహఆరాజు.
మహారాజుతో కలిసి ముందుకు నడిచాడు విరాట్. నెలరోజులుగా వెలుతురు చూడనందువల్ల ఒక్కసారిగా సూర్యకాంతి ముఖం మీద పడేసరికి తట్టుకోలేకపోయాడు. కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకున్నాడు. సరిగ్గా నడవలేకపోయాడు. తాగినవాడిలాగా తూలుతూ నడిచాడు. నౌకర్లు ఆసరా ఇచ్చారు.
ప్రజల ముందుకు పోకముందే విరాట్ రాజుతో "మహారాజా! మీరు నన్ను గొప్ప న్యాయమూర్తి అన్నారు. కాని, ఒకరి జీవితంలో మంచిచెడ్డల్ని మరొకరు బేరీజు వేయడం, ఇతరుల గురించి న్యాయనిర్ణయం చేయడం అన్యాయమని, భయంకరమైన పొరపాటని నాకిప్పుడు అర్థమయింది. నా తీర్పుల వల్ల అనేకమంది దురదృష్టవంతులు ఇంకా ఈ పాతాళగృహంలో మగ్గుతున్నారు. వాళ్ళెంత బాధలు పడుతున్నారో మొదటిసారిగా నేనిప్పుడు గ్రహించాను. ఈ ఖైదీలను విడిచిపెట్టండి. ఆ ప్రజల్ని వెళ్ళిపొమ్మని చెప్పండి. నన్ను కీర్తిసూ వాళ్ళు చేసే జయజయ ధ్వానాలు నన్ను సిగ్గుపడేలా చేస్తున్నాయి. దోషినైన నన్ను వాళ్ళు కీర్తించడం చాలా బాధాకరంగా ఉంది" అన్నాడు.
మహారాజుగారు సైగ చేయడంతో సేవకులు ప్రజల్ని దూరంగా పంపేశారు. మళ్ళీ అంతా నిశ్శాబ్దం. అప్పుడు మహారాజుగారు విరాట్ నుద్ధేశించి "ఇంతవరకు నీవు అధిష్టించిన న్యాయపీఠం రాజప్రసాదపు మెట్లచెంత ఉంది. కాని బాధల అనుభవంతో, సత్యాన్వేషణలో నువ్వు పొందిన జ్ఞానంతో పూర్వంకన్నా నువ్విప్పుడు గొప్ప న్యాయమూర్తివి. కాబట్టి ఇకనుంచి నీ స్థానం నా సిం హాసనం పక్కనే. నీ చెంత కూర్చున్నందువల్ల నీ మాటలు విని, నీ తీర్పులు గమనించి మరింత జ్ఞానం పొందుతాను" అన్నాడు.
మహారాజుగారిని ఏదో అభ్యర్థించబోతున్నందుకు గుర్తుగా రాజుగారి మోకాళ్ళను తాకాడు విరాట్.
"మహారాజా! దయచేసి ఆ ప్రధానా న్యాయాధికారి పదవినుంచి నాకు ముక్తి ప్రసాదించండి. ఒకళ్ళ గురించి న్యాయనిర్ణయం చేసే అధికారం మరొకరికి లేదని తెలుసుకున్న తర్వాత ఇక తీర్పులు చెప్పలేను. శిక్షించే అధికారం భగవంతుడిది, మనుషులది కాదు. విధి చేయాల్సిన పనిలో జోక్యం చేసుకునే వాళ్ళెవరైనా నేరం చేస్తున్నట్టే. ఈ పాపాలకు దూరంగా నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను" అన్నాడు.
"సరే అలాగే చేద్దాం. ప్రధానన్యాయాధికారి బదులుగా నాకు ప్రధాన సలహాదారుగా ఉండు. యుద్ధం, శాంతిభద్రతలు, పన్నులు మొదలైన విషయాల్లో సలహాలివ్వు. నీ తెలివితేటలతో, జ్ఞానంతో నాకు మార్గనిర్దేశం చెయ్యి"
విరాట్ మళ్ళీ మహారాజుగారి మోకాళ్ళను తాకాడు.
"దయచేసి మళ్ళీ నాకు అధికారం ఇవ్వొద్దు. అధికారం క్రియను కోరుతుంది. ఏ క్రియ న్యాయమైంది. విధి నిర్ణయిచిన దాన్ని ఏ క్రియ ఎదుర్కొంటుంది? నేను యుద్ధమంత్రాంగం చేయడమంటే మృత్యుబీజాలను నాటడమే. నేను ఏది పలికితే అది కార్యరూపం దాలుస్తుంది. నేను చేసే ప్రతిపనికి ఒక ప్రాముఖ్యం ఉంటుంది. దాని పరిణామం ఏమిటో నాకే తెలియక పోవచ్చు. అన్ని కర్మలనుంచి విముక్తుడై, ఒంటరిగా ఉండేవాడే న్యాయబద్ధంగాను, జ్ఞానిగాను ఉండగలడు.
ఈ ఏకాంతవాసంలో ఒంటరిగా ఉన్నప్పుడే పాపాలకు దూరంగాను, జ్ఞానానికి చేరువగాను ఉన్నాను. నేను ఆనందంగా, నా ఇంటిలోనే ఉండిపోయేందుకు అనుమతినివ్వండి. భగవంతుడికి సేవలు చేయడం తప్ప ఇతరులకు సేవలు చెయ్యాల్సిన అవసరం లేకుండా, పాపవిముక్తుడిగా బ్రతకనివ్వండి" అన్నాడు వినయంగా.
"మీ సేవలను వదులుకోవడం నాకు బాధాకరమే. కాని జ్ఞానులతో వాదించే సాహసం ఎవరు చేస్తారు? ఉన్నత వ్యక్తుల అభీష్టాలకు విరుద్ధంగా ఎవరేం చెయ్యగలరు? మీ ఇష్టప్రకారం బ్రతకడం అత్యుత్తమం. మీవంటి పాపవిముక్తుడైన ఒక వ్యక్తి నా రాజ్యంలో ఉంటున్నాడనే విషయమే నాకు గర్వకారణం" అన్నారు మహారాజు.
కారాగార ముఖద్వారం వద్ద వాళ్ళిద్దరూ సెలవు తీసుకున్నారు. సూర్యకాంతి సోకిన గాలి పరిమళాన్ని ఆస్వాదిస్తూ విరాట్ ఒంటరిగా ఇంటివైపు నడిచాడు. అన్ని బాధ్యతలనుంచి విముక్తుడు కావడంతో మనసు ఎప్పుడూ లేనంత తేలికగా ఉంది. తను నడుస్తూ ఉంటే వెనుక ఎవరిదో పాదాల చప్పుడు వినిపించింది. వెనుదిరిగి చూశాడు. ఆ కొండజాతి యువకుడే. అతని శిక్షే తను అనుభవించింది. ఆ యువకుడు విరాట్ పాదముద్రలు పడినచోట భూమిని ముద్దు పెట్టుకొని భయం భయంగా వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయాడు. విరాట్ చిరునవ్వు నవ్వాడు. చనిపోయిన తన సోదరుడి కళ్ళను చూసినప్పటి నుంచి విరాట్ నవ్వడం ఇదే మొదటిసారి. ప్రసన్నహృదయంతో ఇంట్లోకి ప్రవేశించాడు.
ఇంటికి తిరిగి వచ్చినప్పటినుంచి విరాట్ జీవితం సంతోషంగా గడిచిపోతూ ఉంది. ఎప్పుడూ భగవధ్యానంలో గడిపేవాడు. "ఓ భగవంతుడా! నాకు స్వర్గఛాయలను గాక స్వర్గపు వెలుగును ప్రసాదించు. నాకీ ప్రపంచంలోని ఆనందకర విషయాలను చూపించు. ప్రకృతి తాలూకు మధురమైన అనుభవాల్ని, మధుర జీవనసంగీతాన్ని వినిపించు" అని ప్రార్థించేవాడు.
పవిత్రప్రేమతో తన శరీరాన్ని తానే తడుముకునేవాడు. తన భార్య మృదువైన దేహాన్ని, తన పిల్లల బలిష్ఠమైన చేతుల్ని నిమిరేవాడు. భగవంతుని ప్రతిరూపం ఆయనకు అందరిలో కనిపించేది.
తన హద్దులు దాటి ఇతరుల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం రానందుకు ఎంతో ఆనందించేవాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా విజ్ఞానగ్రంథాల్ని పఠించేవాడు. ధ్యానం, ఆత్మతో ఐక్యంకావడం, దీనులపట్ల దయ, త్యాగదీక్ష మొదలైన పలురకాల భక్తిమార్గాల్ని ఆచరించేవాడు. ఎప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. నౌకర్లతో కూడా చాలా సౌమ్యంగా, ఆత్మీయంగా మాట్లాడేవాడు. ఇంట్లో ఉండేవాళ్ళంతా విరాట్ తో ఇప్పుడు ముందుకన్నా ఎక్కువ వినయంగా ఉండసాగారు. ఆయన కష్టాల్లో ఉన్నవాళ్ళకి సాయపడి ఆదుకునేవాడు. బాధల్లో ఉన్నవాళ్ళని ఓదార్చేవాడు. ప్రజలుకూడా ఆయన శుభాన్ని కోరుకునేవాళ్ళు.
ఇప్పుడు ఆయనిని ఎవరూ మహాయోధుడని అనుకోవడం లేదు. గొప్ప న్యాయమూర్తి అని భావించడం లేదు. ఇప్పుడాయన అందరికి ఉత్తమ సలహాదారుడు. ఇరుగుపొరుగు వాళ్ళే కాకుండా ఇతరులు ఎంతోమంది ఆయన సలహాకోసం వచ్చేవాళ్ళు. ఆ రాజ్యపు న్యాయాధికారి కాకపోయినా అపరిచుతులెందరో తమ మధ్య వివాదాల్ని పరిష్కరించుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు. నిస్సంకోచంగా ఆయన సలహాలు పాటించేవాళ్ళు. అలా చేయడం ఆయనకు సంతృప్తికరంగా ఉంది. ఆదేశించడంకన్నా సలహాలివ్వడం, తీర్పు చెప్పడం, శిక్షను వేయడంకన్నా సమస్యను సామరస్యంగా పరిష్కరించడం, రాజీ చేయడం చాలా గొప్పవని ఆయన ఉద్దేశం. పైగా ఒకరి జీవితం మీద పెత్తనం చేయడంగాని, అనేకమంది జీవితాల్ని ప్రభావితం చేసే నిర్ణయాలని తీసుకోవడంగాని ఆయన పనికాదు. జీవితంలోని అమూల్యక్షణాలను సంతోషంగా గడుపుతున్నాడు.
అలా కొన్ని సంవత్సరాలు ఆనందంగా గడిచాయి. ఏ ఒడుదుడుకులు లేకుండా సంతోషంగా గడవడం వల్ల త్వరగా కాలం గడిచినట్టనిపించింది.
జీవిత సంకుచితత్వాలనుండి పూర్తిగా బయటపడ్డాడు విరాట్. కొందరు తగడాపడి తీర్పు కోసం వచ్చినఫ్ఫుడు ఆయన ఆశ్చర్యపోతుంటాడు. జీవనావకాశాలు ఈ ప్రపంచంలో ఇంత విస్తృతంగా ఉండగా మనుషుల మధ్య ఇన్ని తగడాలెందుకో! అధికారం, పెత్తనం కోసం మనుషులు ఎందుకు ఒకరినొకరు హతమార్చుకుంటున్నారో ఆయనకు అంతుబట్టేది కాదు. ఆయన జీవితం సాగరం మధ్యన ఒక ప్రశాంతమైన దీవిలా ఉంది. కోర్కెల అలలుగాని, తృష్ణ ప్రవాహాలుగాని దానిని తాకడంలేదు.
(సశేషం)

























