ఢమరుక మూర్తి
హిమశిఖర మెలికాంతులు నూతన శోభ కురుస్తుంటే
నీ ధనువు వంకను నీవు దాల్చి
మూలాధారమునుండి సహస్రారంవరకు కైలాసంలానిల్చిన
ఈ థీక్షకు కారణం మేమి||
ఆ అరమోడ్పుకనుల వెనుకదాగిన
ధ్యానయోగ మర్మమేమి
ఈ హఠము,ఈ పద్మాసన స్థితమయము యెందులకు
నీకుతోడుగా డమరుక,శూలమ్ముల నిశ్శబ్దమర్మమేమి
గళమందు నిలిపిన గరళమును
దిగనీయకుండ చేయు యత్నమా---కాదు|
జగద్లయమును సమయము మించకుండ చేయు
ఆలోచనమా-----అసలుకాదు
నీపై-----
మా అనుమానములు కేవలము,చర్మచక్షువులకు,ఇంద్రియములకు
మా మానవమనసులకు
పరిమితులకుమించిన ఆలోచనలకుచెందినవి
అంతే కాని---మరేమి||
జనని పార్వతిగాని,శిరస్సున గంగమ్మ మీద మమతలేని
ఈ ఏకాంత,నిశ్చల తన్మయత్వమేమి
శమదమ నిగ్రహములను రూపుగ నిల్పి
కొలువైనావని-శుభంకరుడవని భావించి
కొలువ వలెనని యున్నది
ప్రణవనాదము-ప్రళయనిశ్శబ్దము దాల్చిన
సామ వేదము సద్దుమణిగినా
నీవు మా కాల ప్రణాళికవే ||
మా మనసులకు శాంతినిచ్చు పశుపతివై
ఆదిమధ్యాంతరహితుడవైన నిన్ను
నిరాకారముగా-నిరామయముగా-నిరంజనముగా
చూచిన తృప్తి కలిగినది
ఈ జన్మమునకు కైవల్యము అబ్బినది ||

























