వీరతాళ్ళు వేస్తాం, వస్తారా?! - 4

--వేమూరి వేంకటేశ్వరరావు

ముందుమాట: తెలుగులో రాయటమన్నా, మాట్లాడటమన్నా చాల కష్టం అనే భావం మనలో చాలమందిలో ఉంది. అందుకనే ఎందుకొచ్చిన గొడవనీ, తేలిగ్గా ఉంటుందనీ శుభ్రంగా ఇంగ్లీషులో మాట్లేడేసుకుంటాం. ఏ భాషైనా సరే వాడుతూన్నకొద్దీ వాడిగా తయారవుతుంది; వాడకపోతే వాడిపోతుంది. కనుక మన భాష కుంటుతూనో, మెక్కుతూనో మాట్లాడుతూ ఉంటే వాడితేరి వాడుకలోకి వస్తుంది. ఇంగ్లీషులో ఉన్నంత పదజాలం తెలుగులో లేదు. ఇంగ్లీషులో వాడుకలో ఉన్న మాటలు దరిదాపు 50,000 ఉంటాయని అంచనా. ఇదే రకం అంచనా వేస్తే తెలుగులో వాడుకలో ఉన్న మాటలు ఓ 15,000 ఉంటాయేమో. మన భాష పెరగటం మానేసింది. మన భాష విస్తృతిని పెంచాలంటే వాడుకని పెంచాలి. వాడుక పెరగాలంటే క్లిష్టమైన భావాలని, సరికొత్త విషయాలని తెలుగులో వ్యక్తపరచటానికి సదుపాయంగా మన పదజాలం పెరగాలి. మన సంప్రదాయాలకి, మన వ్యాకరణానికి అనుకూలపడేలా ఈ పదజాలాన్ని సమకూర్చుకోవాలి. ఈ పని మనమే ప్రయోగాత్మకంగా చేసి చూడాలి. మాయాబజారు సినిమాలో చెప్పినట్లు మాటలు మనం పుట్టించకపోతే మరెక్కడనుండి పుట్టుకొస్తాయి?

ఒక భావానికి సరిపడే మాట సృష్టించే బధ్యత మనదే. తెలుగులో ఆధునిక అవసరాలకి పనికివచ్చే కొత్త మాటలు సృష్టించి వాటిని వాక్యాలలో ప్రయోగించి చూస్తే ఎలాగుంటుందో చూడాలని ఒక కోరిక పుట్టింది. ఈ ప్రయోగంలో పాఠకులని కూడా పాల్గొనమని ఇదే మా ఆహ్వానం. ప్రతినెలా మేము ఐదో-పదో మాటలు తయారు చేసి వాటి ప్రవర, పుట్టుపూర్వోత్తరాలు కొంతవరకు చెప్పి, అవసరం వెంబడి వాటి వాడకం ఎలాగో మీకు సోదాహరణంగా చూపిస్తూ ఉంటాము. ఆ తరువాత కొన్ని ఇంగ్లీషు మాటలు ఇచ్చి వాటితో సరితూగగల తెలుగు మాటలని ప్రతిపాదించమని పాఠకులని ఆహ్వానిస్తూ ఉంటాం. మేమడిగిన మాటలని తెలుగులో ఏమంటే బాగుంటుందో మీరు సూచించాలి. మీ సూచనని బలపరచటానికి ఆ తెలుగు మాటని ఒక వాక్యంలో ప్రయోగించి చూపండి. మా స్వకపోల కల్పితాలైన మాటలతో పాటు పాఠకులు సూచించిన వాటిలో కొన్ని ఎంపిక చేసి ప్రచురిస్తూ ఉంటాము. ఈ దిగువ చూపిన విధం మీకు నచ్చితే దాన్ని ఒక మూసగా తీసుకుని మీరూ ప్రయత్నించి చూడండి. లేదా కొత్త పంధాని సూచించండి. పాఠకులు పంపిన అంశాలని ప్రచురణ సౌకర్యానికి సవరించే హక్కు మాకు ఉంది. ఇదొక ‘విక్కీ’ నిఘంటువుని తయారుచేసే ప్రయత్నంలా ఊహించుకొండి. విక్కీ విజ్ఞానసర్వస్వంలో అందరూ పాల్గొన్నట్లే ఇదీను.

వీరతాళ్ళు శీర్షిక మొదలుపెట్టి మూడు నెలలు అవుతోంది. సిన్‌సినాటి నుండి మాజేటి విమల పిలచి, “మీరు సుజనరంజనిలో వీరతాళ్ళు అనే శీర్షిక నడుపుతున్నారని విన్నాను. ఈ వీరతాళ్ళు ఏమిటండీ?” అని అడిగేరు. ఈమె మన మొదటి సంచిక చూడలేదనేకదా దీని తాత్పర్యం! మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి ఆశ్రమంలో ఉన్న రాక్షసులు భాష బాగా రాకపోవటం వల్ల భాషలో లేని మాటలు కొన్ని వాడతారు. అప్పుడు ఘటోత్కచుడు వారిని మందలించటానికి బదులు, “మనం పుట్టిస్తేనే కదా కొత్త మాటలు పుట్టేది” అనే అర్ధం స్పురించేలా సంభాషణ చెప్పి, “వెయ్యండిరా వీడికో వీరతాడు!” అంటాడు. “ప్రయోగం పేరిట భాషని అపవిత్రం చేస్తావా, దాసూ!” అని శంకరాభరణం గారిలా మందలించకుండా ప్రయోగం చేసినందుకు ఘటోత్కచుడు అభినందించి వీరతాడు వేస్తాడు. కనుక కొత్త కొత్త మాటలు పుట్టించిన వాళ్ళకి “వీరతాడు వెయ్యండి” అనటం ఒక సంప్రదాయంగా రూపుదిద్దుకుంటోంది. అదీ టూకీగా వీరతాళ్ళ వెనుక కథ.

ఈ నెల కొడవటిగంటి రోహిణీప్రసాద్ వీరతాడు గె .. లు .. చు .... లేదు. ఇంకా గెలుచుకోలేదు. ఈయన వీరమోకు వేయించుకోగల ఘనాపాటీ. కనుక ప్రస్తుతానికి మరొక వీరపోగు మాత్రమే ఇస్తున్నాం. తల్లాప్రగడ రావు గారు చాలా సాహసంగా ప్రయోగం చేసేరు. శంకరాభరణం శంకరశాస్త్రి అయితే ఈయనని ఛెడా మడా తిట్టి ఉండేవాడు; నిజానికి ఈ ప్రయోగం చేసినందుకు ఈయనకి మరో వీరతాడు వెయ్యొచ్చు. కాని ఈయన ప్రయోగం పండలేదు. కనుక ఈయనకీ ఒక వీరపోగు ఇస్తున్నాం. ‘వీరమానం’ ప్రకారం మూడు పోగులు ఒక తాడు, మూడు తాళ్ళు ఒక మోకు.

గత సంచికలో dredger కి తెలుగు కావాలని అడిగేను“ Dredger కి ఈ రోజు కొత్త మాట చెప్ప వలసిన పని లేదు. జన బాహుళ్యం లో చాలా కాలం నుంచే ఓ మాట ఉంది – అది తవ్వోడ” అని మందలిస్తూ తాడేపల్లి వేణుగోపాల్ రాసేరు. వీరు ఏ ఊరు నుండి రాసేరో తెలియ లేదు కనుక వీరతాడు ఇచ్చినా ఎక్కడికి వెళ్ళి వేస్తాను? అందుకని ఈ సారి కి ఏమీ ఇవ్వటం లేదు. మరొక సారి ప్రయత్నిస్తే అప్పుడు ఇవ్వొచ్చు కదా! అంతేకాదు. ఈ మాట వేణుగోపాల్ అనుకుంటూన్నట్లు అందరికీ అందుబాటులో ఉన్న మాట కాదని నేను అభిప్రాయపడుతున్నాను. ఇంతలో అట్లాంటా నుండి రోహిణీప్రసాద్ “dredger కి శ్రీశ్రీ గారు ఏనాడో ఉదహరించిన పదం ‘త్రవ్వోడ’ ” అంటూ రాసేరు. తవ్వోడ, త్రవ్వోడ – ఈ రెండింటిలో ఏదో ఒకటి dredger కి సరిపోతుంది. కాని ఈ మాట ఎంతమందికి తెలుసు? తర్జనభర్జనలతో కాలయాపన చెయ్యటం ఎందుకని టెలిఫోను తీసి సురేంద్ర దారా ని పిలిచేను. ఇతను ఇంకా తరుణ వయస్కుడు. మాటని బట్టి మా ప్రాంతం వాడు కాదని పసిగట్టేసి, dredger ని ఏమంటారు?” అని అడిగేను. తనకి తెలీదన్నాడు. తవ్వోడ గురించి చెప్పేను. ఎప్పుడూ వినలేదన్నాడు. నా స్వకపోలకల్పితమైన మాటేమో అని అనుమానం కూడా పడ్డాడు. అప్పుడు చెప్పేను. విశాఖపట్నం రేవులో కూలీ, నాలీ చేసుకుని బతికే పాటకజనం dredgerకి పెట్టిన పేరు ‘తవ్వోడ’ – అంటే తవ్వే ఓడ. ఇటువంటి మాటని ఇంగ్లీషు చదువులు నేర్చిన మనలాంటి వాళ్ళు ఛస్తే తయారు చెయ్యలేరని నేను ఢంకా బజాయించి చెప్పగలను. అంతకీ మనని ఇరుకున పెడితే మనం ‘త్రవ్వుడు యంత్రము’ అనొచ్చు – మన తల్లాప్రగడ వారు సూచించినట్లు.

Dredger కి తెలుగు మాట కావాలని అడగటం వెనుక ఒక కారణం ఉంది. మనకి కొత్త కొత్త తెలుగు మాటలు కావాలంటే ఇంగ్లీషు నేర్వని పల్లెటూరి వాళ్ళని అడిగి చూడాలి. వాళ్ళకి ఇంగ్లీషు రాదు. సంస్కృతం రాదు. జరుగుతూన్న పనిని చూసి దానిని ఏమనాలో వాళ్ళకి స్పురించినంత బాగా మనకి స్పురించదు. ఇటువంటి మాటలు ఇంకా కావాలంటే మన వృత్తిపదకోశాలు చూడాలి. నా చిన్నతనంలో వడ్రంగులు, కమ్మరులు, కుమ్మరులు, జాలరులు, సాలె వారు, అద్దకం పని వారు మాట్లాడే మాటలు ఎన్నో ఇప్పుడు వాడుకలోంచి తప్పిపోతున్నాయి. వాటికి ఆధునిక అవసరాలకి సరిపోయే అర్ధాలని ఆపాదించి తిరిగి వాడుకోవచ్చు. ఇటువంటి వృత్తి పద కోశాలు మన తెలుగు అకాడమీ వారు ప్రచురించేరు.

పక్కదారి పడుతూన్నందుకు క్షమించండి, కాని పైన ఉదహరించిన ‘అకాడమీ’ అన్న మాటని తెలుగు మాటగానే పరిగణిస్తున్నారు కాబోలు తెలుగు అకాడమీ వారు. నిఘంటువు ప్రకారం academy అంటే పాఠశాల, బడి. ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే ప్రత్యేకమైన పాఠాలు లేదా ప్రత్యేకమైన విద్యలు నేర్పే పాఠశాల. ఉదా. dance academy, music academy. లేదా, పాఠశాలల సంఘం. లేదా, పండితుల సంఘం. ఉదా. Natinal Academy of Sciences. మన తెలుగు అకాడమీ ఇవేమీ కాదు. ఎవ్వరో, ఎందుకో ఆ పేరు పెట్టేరు. పైపెచ్చు ఇంగ్లీషులో దాని స్పెల్లింగు మార్చి Akademi అన్నారు. అదే అలా స్థిరపడిపోయింది. ఇలా సందర్భానికి అతకని పేర్లు స్థిరపడిపోవటం భాషలో సర్వసాధారణం. ఉదాహరణకి polarization.

Polarization అన్న మాటకి తల్లాప్రగడ ‘కేంద్రాభిముఖ్యత’ అని సూచించేరు. సూచించి, “recognizing the poles is polarization. Hence కేంద్ర అభిముఖ్యత or కేంద్రాభిముఖ్యత sounds apt to me” అంటూ సమర్ధించుకున్నారు. నా చిన్నతనంలో ‘ధృవీకరణ’ అని ఎక్కడో చూసేను. ఈ రెండు ప్రయత్నాలూ మెచ్చుకోదగ్గవే కాని వచ్చిన చిక్కేమిటంటే ఇంగ్లీషులో polarization అన్నది misnomer - అనగా అతకని పేరు. ఈ తప్పుడు పేరుని తెలుగులోకి తర్జుమా చెయ్యటం దండగ. కాంతి లక్షణాలు పరిపూర్ణంగా అర్ధం కాని రోజులలో కాంతి పుంజం అంతా కొన్ని రేణువుల సముదాయం అని అనుకునేవారు. నూటన్ మహాశయుడే అనుకున్నాడు! క్రమేపీ ఈ రేణువులకి అయస్కాంత తత్వం అంటగట్టేరు. అయస్కాంతాలకి రెండు ధృవాలు ఉంటాయి కదా. వీటినే ఇంగ్లీషులో poles అంటారు. ఇప్పుడు ఈ బుల్లి బుల్లి అయస్కాంతాలకి ఒక అక్షం (axis) ఉంటుంది కదా. మాములు కాంతిలో ఈ అక్షాలు యాధృచ్ఛిక దిశలలో అమరి ఉంటాయి (oriented in random directions). ఇప్పుడు ఈ కాంతిని ఒక రకం గాజు పలక ద్వారా పంపినప్పుడు అన్ని దిశలలోనూ యాధృచ్ఛికంగా అమరి ఉన్న ఈ అయస్కాంతాలు – కవాతు చేసే సిపాయిలలా – ఒకే దిశ వైపు మొగ్గుతాయి. అలాంటి ప్రక్రియని ‘కేంద్రాభిముఖ్యత’ అని కాని ‘ధృవీకరణ’ అని కాని అనటం మొదలుపెట్టేరు. ఈ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని కాబోలు కొంతమంది పప్పులో కాలేశారు.

ఇప్పుడు కాంతి కిరణాలలో బుల్లి అయస్కాంత రేణువులు లేవని మనందరకీ తెలుసు. కాంతి నిజ స్వరూపం రేణువులూ కాదు, కిరణాలూ (rays) కాదు అన్నారు. కాంతి తరంగాల మాదిరి ఉంటుందని అందరూ ఒప్పుకున్నారు. ఇవి మామూలు తరంగాలు కూడా కాదు; ఇవి జంట తరంగాలు. ఒక జాతి కెరటాలు పైకీ కిందికీ ఆడుతూ ఉంటే మరొక జాతి కెరటాలు ఎడా, పెడా స్పందిస్తూ ఉంటాయి. ఇటువంటి జంట తరంగాలని ఒక రకం గాజు పలక ద్వారా పంపినప్పుడు ఆ పలక ఒక తలం (plane) లో కంపించే కెరటాలని తన ద్వారా సాగనంపి, మరొక తలంలో చలించే కెరటాలని అడ్డెస్తుంది. ఈ ప్రక్రియని ఇంగ్లీషులో - తెలిసీతెలియని రోజులలో - polarization అన్నారు. అది కాస్తా బంకనక్కిరికాయలా మనని అంటుకుని ఒదలనంటోంది. కనుక polarization అనేది జల్లించటం లాంటి ప్రక్రియ, లేదా వడపోత లాంటి పని. కొంచెం పారిభాషికంలో చెప్పాలంటే, రెండు తలాలలో కంపించే కెరటాలని ఒకే తలంలో చలించే కెరటాలలా కనిపించేటట్లు చెయ్యటం. కనుక దీనిని ‘తలీకరణ’ అని అనమని నేను ఒకానొకప్పుడు ప్రతిపాదించేను. మీరేమంటారు? ఇప్పుడు polarized sun glasses అన్న పద బంధాన్ని “తలీకరణ చలవ కళ్ళజోళ్ళు” అనొచ్చు.

Irrational Numbers ఇది గణితంలో వచ్చే మాట. అంకెలలో 0, 1, 2, 3, వంటివి పూర్ణాంకాలు. వీటినే ఇంగ్లీషులో integers అంటారు. ఇవి కాక భిన్నాలు ఉన్నాయి. పావు (1/4), అర (1/2), ముప్పాతిక (3/4), మొదలైనవి భిన్నాలు. పూర్ణాంకాలు, భిన్నాలు కాని అంకెలు కూడా ఉన్నాయి. మనందరికి బాగా తెలుసున్న ‘పై’ ’ఈ జాతిది. ఈ ‘పై’ పూర్నాంకమూ కాదు, భిన్నమూ కాదు. దీనిని దశాంశ భిన్న రూపంలో రాయటానికి ప్రయత్నిస్తే అది ఇలా ఉంటుంది. పై = 3.14159 26535 89793 23846 26433 83279 50288 41971 69399 3751……మనం మన అవసరాలకి పై = 3.1416 అని కాని, పై = 22/7 అని కాని రాస్తాం కాని అవి ‘పై’ విలువని ఉరమరగా తెలుపుతాయి కాని నిక్కచ్చిగా కాదు. కథని టూకీగా తేల్చెయ్యాలంటే ‘పై’ విలువని భిన్నం రూపంలో రాయలేము. భిన్నం అన్నా నిష్పత్తి అన్నా దరిదాపుగా ఒకటే. భిన్నం అన్న మాటని ఇంగ్లీషులో fraction అనీ, నిష్పత్తిని ratio అనీ అంటారు. నిష్పత్తి (ratio) రూపంలో రాయగలిగే సంఖ్యలు నిష్ప సంఖ్యలు లేదా rational numbers. నిష్పత్తి రూపంలో రాయగలగలేనివి అనిష్ప సంఖ్యలు, లేదా irrational numbers. కనుక rational numbers ని నిష్ప సంఖ్యలు, irrational numbers ని అనిష్ప సంఖ్యలు అనమని నేను ప్రతిపాదిస్తున్నాను.

ఈ సందర్భంలో చాల మంది సర్వ సాధారణంగా చేసే పొరపాటు ఈ దిగువ ధోరణిలో వెళుతుంది. ఇంగ్లీషులో rational అంటే సాధారణార్ధం ‘తర్క బద్ధమైన’ అని కాని ‘వివేకవంతమైన’ అని కాని చెప్పుకోవచ్చు. కనుక irrational అంటే ‘తర్కాభాసమైన’ అని కాని ‘అవివేకమైన’ అని కాని అర్ధం. గణిత శాస్త్రంతో లోతుగా పరిచయం లేనప్పుడు స్పురించే అర్ధాలు ఇవే. కాని గణితంలో, కొన్ని ప్రత్యేక సందర్భాలలో, rational అంటే ‘భిన్నానికి సంబంధించిన’ అనే అర్ధం ఉంది. ఈ కోణంలో ఆలోచించకపోవటం వల్ల మన తల్లాప్రగడవారు irratinal number కి ‘అవివేకవిశిష్ట సంఖ్య’ అని ప్రతిపాదించేరు.

Transcendental Numbers గణితంలో పూర్ణ సంఖ్యలు, నిష్ప సంఖ్యలు, అనిష్ప సంఖ్యలు ఉన్నట్లే మరొక రకం సంఖ్యలు కూడ ఉన్నాయి. వీటి గురించి ఇక్కడ చెప్పటానికి చోటు సరిపోదు. “Transcendental means beyond common experience or supernatural, which is a property of these numbers. Hence let me call them “సర్వోత్కృష్ట సంఖ్యలు” అని తల్లాప్రగడ అన్నారు. నేను నా నిఘంటువులో transcendental అన్న విశేషణానికి మూడు అర్ధాలు ఇచ్చేను: (1) లోకోత్తర, అత్యుత్తమ, ఉత్తమోత్తమ, (2) తారక, (3) బీజాతీత. తల్లాప్రగడ సూచన ఈ జాబితాలోని మొదటి అర్ధంతో సరితూగుతుంది. తారక మంత్రం అనే మాటని transcendental meditation తో పోల్చి ‘ తారక’ అన్నది ఇక్కడ సరిపోతుందని ఊహించేను. ఇహ ‘బీజాతీత’ ఎక్కడనుండి వచ్చింది? గణితంలో బీజం అంటే root అని కాని symbol అని కాని అర్ధం చెప్పుకోవచ్చు. ఇంత హడావుడి చేసేను కాని transcendental number అంటే ఏమిటో చెప్పలేదు. ఆ పని మరొక చోట చేస్తాను కాని, మనకి ఇందాకా తారసపడ్డ ‘పై’ అనిష్ప సంఖ్యే కాకుండా లోకోత్తర (లేక, సర్వోత్కృష్ట) సంఖ్య కూడా! ఇంత శ్రమ పడినందుకు తల్లాప్రగడ వారికి ఒక వీర పోగు!

Musical Terms ఇక సంగీతంలో వచ్చే మాటల గురించి చూద్దాం. సంగీతం లో నాకు ప్రవేశం పెద్ద బండి సున్న. అయినా తెగించి ఈ ఉపోద్ఘాతం రాస్తున్నాను. మన భాషలో జటిలమైన సాంకేతిక విషయాలని చెప్పగలిగే సత్తా లేదని వాదించేవారికి మన సంగీత శాస్త్రం ఒకసారి పరికించమని నా మనవి. మన కర్ణాటక సంగీతంలో కాని, హిందుస్తానీ సంగీతంలో కాని ఉన్న భావ సంపదని, ఇంగ్లీషు ప్రమేయం లేకుండా అంతా భారతీయ భాషలలోనే వ్యక్త పరచవచ్చు. ఎందువల్ల? మన సంగీతం మన దేశంలో తనంత తాను గానే ఆవిర్భవించి, వృద్ధి పొందింది. కనుక మనకి అవసరమైన భావాలన్నిటిని వ్యక్తపరచటానికి మనం మన మాటలనే తయారు చేసుకున్నాం. అందుకనే సంగీత పరిభాషలోని మాటలని ఇంగ్లీషులోకి అనువదించటం కష్టం. రాగం, గమకం, సంగతి వంటి మాటలని ఇంగ్లీషులో చెప్పాలంటే ఇంగ్లీషులో కొత్త మాటలు సృష్టించుకోవాలి, లేదా మన మాటలని యధాతధంగా వాడుకోవాలి.

Harmony రోహిణీప్రసాద్ చెప్పిన ప్రకారం “మనదేశపు సంగీతంలో harmony కి ప్రాధాన్యత తక్కువే. ఒకే సారి అనేక స్వరాలు (notes) మోగితే అది harmony కి దారి తీస్తుంది. మధ్య యుగంలో చర్చి సంగీతంలో మొదలైన ఈ పోకడ తరువాతి కాలంలో అద్భుతమైన symphony సంగీతానికి ఆధారమైంది.” అని చెప్పి, “harmony ని స్వరాత్మకం అనీ ఏకస్వరం అనీ అంటున్నారు. Symphony ని స్వర సమ్మేళనం అంటున్నారు.” అంటూ చాల జాగ్రత్తగా వాక్యం నిర్మించేరు. ఈ ఉపోద్ఘాతం అయిన తరువాత, “ఒకటి కంటె ఎక్కువ స్వరాలు (notes) ని కలిపి మోగించిన సందర్భంలో అవన్నీ చెవికి ఇంపుగా వినిపిస్తే harmony ఉందని అర్ధం. Harmony అంటే different instruments working at the same time in a same rhythm కనుక ‘సమతాళం’ అన్న మాట సరిపోతుందని తల్లాప్రగడ సూచించేరు. కనుక harmony అంటే స్వరాత్మకమా? ఏకస్వరమా? సమతాళమా? మీలో సంగీతం వచ్చిన వారు చెప్పాలి.

Melody అంటే శ్రావ్యత అనేది సాధారణ అర్ధం. ఈ శ్రావ్యతలో స్వరాలు ఏ క్రమంలో వస్తున్నాయో చెప్పాలంటే స్వరక్రమం అనాలి అని రావు అంటున్నారు. Melody ని శ్రావ్యగీతి అని కూడా అనొచ్చని కొడవటిగంటి అంటున్నారు. స్వరక్రమం, శ్రావ్యగీతి - ఈ రెండింటిలో ఏది బాగుందంటారు?

Tone అంటే శబ్దం యొక్క నాణ్యత ట. కనుక దీనిని ‘నాదనాణ్యత’ అని అనమని తల్లాప్రగడ రావు అంటున్నారు.

కోడవటిగంటి్ వారి కీ తల్లాప్రగడ వారికీ సంగీతంలో బాగా ప్రవేశం ఉందని మనందరికీ స్పష్టంగా తెలియటం లేదూ? వారిని సవాలు చేసే చేవ నాలో లేదు కనుక మరెవ్వరైనా పూనుకుని ఈ పై మాటలలోని నాణ్యతని పడికట్టి చెప్పగలరని ఆశిస్తున్నాను.

వచ్చేనెలకి ప్రయత్నించవలసిన మాటలు

  • hardware
  • software
  • program (as in computer program, cultural program)
  • public (public domain, public sector, etc.)
  • private
  • carbohydrate
  • hydrocarbon
  • amino acid
  • matrix
  • boundary condition
మీ ఊహలు veerataallu@siliconandhra.org కి పంపండి.

డా. వేమూరి: నవీన తెలుగు సాహితీ జగత్తులో పరిశోధకులుగా, విజ్ఞానిగా వేమూరి వెంకటేశ్వర రావు గారు సుపరిచితులు. తెలుగులో నవీన విజ్ఞాన శాస్త్ర సంబంధ వ్యాసాలు విరివిగా వ్రాయటంలో ప్రసిధ్ధులు. విద్యార్ధులకు, అనువాదకులకు, విలేకరులకు పనికొచ్చే విధంగా శాస్రీయ ఆంగ్ల పదాలకు తెలుగు నిఘంటువును తయారు చేయడం వీరి పరిశ్రమ ఫలితమే. సరికొత్త పదాలను ఆవిష్కరించడంలో వీరు అందెవేసిన చేయి. కలనయంత్ర శాస్రజ్ఞుడిగా వృత్తిలోను, తెలుగు సాహిత్యంపైన లెక్కించలేనన్ని వ్యాసాలు వ్రాస్తూ, ఉపన్యాసాలు ఇస్తున్నారు.