తెలుసుకోలేనిది

-- శ్రీమతి శ్రీపతి బాలసరస్వతి

రెండు సంవత్సరాల పైగా తన మొహం చూడకుండా ఇప్పుడు షష్టిపూర్తి పెళ్ళికూతురిలా అలంకరిస్తున్నందుకు ఆశ్చర్యపోయి ఆనందపడిపోతుంది మా నాలుగ్గదుల పాత ఇల్లు. మా ఇంటి పక్కనే తయారయిన కొత్త ఇల్లు, కొత్త పెళ్ళికూతురిలా అలంకరింపబడింది. రంగురంగుల పెయింట్ల మేకప్. రకరకాల తోరణాలహారాలు, కొత్తకొత్త డిజైన్ల కర్టెన్ల వస్త్రాలంకరణ, చుట్టూ పూలమొక్కలు, పళ్ళచెట్ల చుట్టాలు, రంగురంగుల రంగవల్లుల ఆహ్వానాలు, పెళ్ళి కొడుకుల కోసం వేచివున్నట్టున్నాయి.

"సొంతంగా కారువుంటే బాగుండునురా, విష్ణుని ఆ కారులో ఇంటికి తీసుకుని వచ్చేవాళ్ళం కదా" ఆశగా అన్నారు నాన్న. "సొంతంగా నాలుగ్గదుల ఇల్లు వుంటే బాగుండును, వాణ్ణి ఆ ఇంటికే తీసుకొనివెళ్ళే వాళ్ళం కదా" అన్నారు విష్ణు తండ్రి వీరస్వామి అంకుల్ ఆశగా. ఆ రెండూ వాళ్ళ చిరకాల వాంఛలు. ఇన్నేళ్ళూ నా చదువు, చెల్లాయి రేఖ చదువు, తర్వాత చెల్లాయి పెళ్ళి, ఆతర్వాత అల్లుడు విష్ణుని తృప్తి పరచాలి ' అంటూ చెప్తూ వచ్చారు నాన్న. ఇంక ఇప్పుడు సొంతంగా కారు కొనగలరేమో తలుచుకొంటే. కానీ అంకుల్ అయితే ఇల్లు కట్టలేరు, ఎందుకంటే తమ పల్లెలో వున్న కాస్త పొలం అమ్మేసి ఒక్కగానొక్క కొడుకు విష్ణు చదువుకోసం పట్నంవచ్చి చాలా పొదుపుగా కాలం గడుపుతున్నారు.ఇప్పుడు విష్ణు డబ్బు మనిషైపోయాడు. ప్రాజెక్టు కోసం రెండు సంవత్సరాలకని అమెరికా వెళ్ళాడు. అక్కడ నుంచి డబ్బు పంపడు. ఇక్కడ తనకి వచ్చే జీతాన్ని ఖర్చు చేయనివ్వడు.అదే వాడుకోనివ్వడు. ఇంక ఇల్లేం కడతారు? అంకుల్ ఆశ గగనకుసుమమే!

"ఒరేయ్! విశ్వాసం లేని కుక్కా! ఏమనుకుంటున్నవురా నీ గురించి?...పరువుగా నువ్వు బతికి, మమ్మల్ని బతకనివ్వవా?, అక్కడ కొత్తకొత్త స్నేహాల్లో పడ్డవా ఏమిటి? చెప్పు. నిన్ను చంపి నేను చస్తాను" అని ఒకరోజు అంకుల్ విష్ణుకి ఫోన్ చేసి మరీ సహస్రనామాలు చదివసాగారు. "అంకుల్! అలా నోరు పారేసుకోకండి" అన్నాను వస్తున్న కోపాన్ని కప్పిపుచ్చుకుంటూ.

"కందకు లేని దురద కత్తిపీటకెందుకో" వెటకారం ఆయన గొంతులో తొంగిచూసింది ఎప్పుడూలేనిది. "విష్ణు మంచివాడే, కాని చెల్లాయి సంగతి ఆలోచించాలి కదరా?. తాను ఫోన్ చెయ్యడు విష్ణు. మనం చేస్తే ఏవేవో కథలు, కారణాలు చెప్పుకుంటూ వస్తున్నాడు" అన్నారు నాన్న. "పెళ్ళి కాకుండా దేశాలుపోవడం వేరు, పెళ్ళయి కాపురం చేసుకుంటున్న పిల్లాడు ఇలా వెళ్ళటం వేరు. స్నేహితులు మంచి వాళ్ళయితే బాగానే వుంటుంది...అయినా తొందరపడి ఏమి అడగద్దు, పిల్లనిచ్చుకున్నవాళ్ళం" అంది అమ్మ.

అనగనగరాగమతిశయించు అన్నట్టు వీళ్ళ మాటలు వింటూండగా ఈ మధ్యన నాక్కూడా విష్ణుమీద అనుమానం కలుగుతున్నట్టే వుంది. లేకపోతే ఎప్పుడూ కుశల ప్రశ్నలు, టైమైపోతోంది ఆఫీసుకి వెళ్ళాలి, చాలా పనివుంది, ఇలాంటి మాటలు తప్ప వేరే మాటేలేదు. ఆఫీసుకి ఫోన్ చేస్తే "ఇక్కడెలా మాట్లాడనురా?" అనడుగుతాడు నన్నే. "రోజంతా అఫీసులోనే వుంటావు ఇంక ఎలా మరి?" అని అడిగితే "వీలుచూసుకొని నేనే ఫోన్ చేస్తాను" అంటాడు. ఆ "వీలు" అనేది అంత తొందరగా రాదు. ఈ లోపుగా అందరి ఆదుర్దా బి.పి. పెరిగినట్టు పెరిగిపోతూవుంటుంది ఏంచేయాలా అని?

చెల్లాయిమటుకు నిమ్మకు నీరెత్తినట్టే వుంటుంది. సంతోషంగానే వుందన్నమాట. అది చాలు. అందుకే మేము విష్ణు గురించి ఏం మట్లాడాలన్నా చెల్లాయి, అమ్మ, ఆంటీ గుడికి వెళ్ళినప్పుడో, చెల్లాయి వంటింట్లో వున్నప్పుడో మాట్లాడుకుంటాము.

విష్ణు,నేను పదవతరగతి అయిపొగానే ఇంటర్మీడియట్ లో ఒకే కాలేజీలో, ఒకే రోజున చేరాము. ఏ ముహుర్తాన కలుసుకున్నమో, ఇద్దరం మంచి స్నేహితులమైనాము. ఒక గది అద్దెకు ఇప్పించమంటే నాన్నగారితో చెప్పాను. ఆయన, మా నాలుగ్గదుల ఇంట్లో ఒక గదిని చాలా తక్కువ అద్దెకు ఇచ్చారు విష్ణు కుటుంబానికి. కొద్ది రోజుల్లోనే రెండు కుటుంబాల వాళ్ళం ఒకే కుటుంబంలా కలసిపోయాము.

నేను,విష్ణు ఇంజనీరింగు పూర్తి చేశాము.చెల్లయి డిగ్రీలో వుంది.క్యాంపస్ సెలెక్షన్లో మా ఇద్దరికి మంచి ఉద్యోగాలు ఉన్న వూళ్ళోనే వచ్చాయి. విష్ణు మంచి నడవడి నచ్చి వాణ్ణి మా ఇంటి అల్లుడిని చేసేసుకున్నాము.

అంతా బాగానేవుంది. కానీ కొన్నాళ్ళకి మా ఆఫీసునుంచి పదిమందిని ప్రాజెక్టు విషయమై అమెరికా పంపిస్తున్నారు. అప్పుడు మొదలయింది, నిజస్వరూపం బయటపడటం. మా ఇద్దరిలో ఒకరికే అమెరికా ఛాన్స్! విష్ణు, చెల్లాయి ఏకాంతంగా కొన్నాళ్ళుడవచ్చు, చెల్లాయి కొత్త ప్రదేశాలు చూడవచ్చు అని విష్ణుని అమెరికా వెళ్ళమన్నాము. "నారెండు కోర్కెలు తీర్చుకొనే తరుణం ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. థాంక్యూ" అన్నాడు విష్ణు. "ఏమిట్రా ఆ రెండు కొర్కెలు? అని అడిగాను. "నాకిప్పుడున్న బట్టలు చాలు, ఒక్క ఓవర్ కోటు ఏర్పాటుచేసుకుంటే చాలు" అంటూ మాట మార్చేశాడు. నాకు కొంచెం బాధనిపించింది. అదే అన్నాను అమ్మతో, "నీకు వయసు పరిగింది కాని, మనసు పెరగలేదురా. పెళ్ళయిన వాళ్ళకి లక్ష రహస్యాలుంటాయి. అవన్నీ నీకు చెప్పాలంటే ఎలా?....రేపు పెళ్ళయ్యాక నువ్వూ అలానే అంటావు" అంది అమ్మ. "ఆలానేనేం వుండను" గారాబాలు పొయాను. "చూద్దాంగా" అంది అమ్మ నా తల నిమురుతూ.

విష్ణు ఒక్కడే బయలుదేరటం చూసి "ఇల్లు చూసుకొని అమ్మయిని తీసుకునివెళ్తారా?" అనడిగింది అమ్మ. "ఇద్దరికీ టిక్కెట్లు ఏర్పాటుచేశారనుకున్న...ఇవేం అమెరికా ప్రయాణాలురా...మొగుడుపెళ్ళాల్నివిడతీసే ప్రయాణాలు! నువ్వేం వెళ్ళక్కర్లేదులే...అని అంకుల్ విష్ణుకి చెప్పి "నువ్వు వెళ్ళరాదా" అంటూ నన్నడిగారు. "నేను వెళ్ళగానే రేఖని తీసుకెళ్ళే ఏర్పాట్లు చూస్తాను నాన్న...." అని కంగారుగా చెప్పాడు విష్ణు, ఎక్కడ తన అమెరికా ప్రయాణం ఆగిపోతుందనే భయంతో. "ఇప్పుడింక అలా వీలుకాదండీ...ఆ విషయం గురించి నేను చూస్తానుగా" అన్నాను నేను ఏదో మాటవరసకి..అది అంత వెంటనే జరిగే పని కాదని తెలిసినా.

విష్ణు అమెరికా వెళ్ళే రొజునే, చెల్లాయి నాకు మేనల్లుణ్ణి ఇవ్వబోతుందని తెలిసి అందరి హృదయాలు ఆనందంతో దూదిపింజాలయిపోయాయి. "నేను నీ దగ్గర లేననే దిగులు లేకుండా బుజ్జిగాడితో మంచి కాలక్షేపం నీకు...థాంక్యూ రేఖా" అన్నాడు విష్ణు. సిగ్గుతో ముద్దమందారమై పోయింది రేఖ. "డిగ్రీ పూర్తి చెయ్యి" అన్నాడు విష్ణు నిదానంగా మళ్ళీ. సరే అని తలూపింది రేఖ. అప్పుడర్థంకాలేదు ఆ గూడార్థం. వెర్రివెంగళప్పల్ని చేశాడు అందరినీ విష్ణు.

విష్ణు అమెరికా వెళ్ళాక "క్షేమంగా చేరాను" అని ఫోన్ చేశాడు. అంతే మళ్ళీ నెల దాటుతున్నా ఉలుకూ పలుకూ లేదు.

ఆఫీసులో ఫోన్ నంబరు తీసుకొని ఫోన్ చేశాను. "రాగానే కొత్త చోటు, కొత్త పని, అంతా అడ్జస్టు అవాలికదరా?" అనడిగాడు నన్నే. "ఎప్పుడూచూడు అందరూ బాగున్నారా? అందరినీ అడిగానని చెప్పు" ఇవే మాటలు ఆ తర్వాత మేము విన్నది. అరిగిపోయిన రికార్డులా! "రోజూ ఏం మాటలుంటాయిరా? వూరికే డబ్బు దండగ తప్ప" అంటాడు. "మా సంగతి సరే, చెల్లాయితో మాట్లాడవా?" అనడిగితే "పరీక్షలప్పుడు డిస్టర్బ్ చెయ్యను. తర్వాత మాట్లాడతాను" అంటాడు. పరీక్షలయ్యాక ఫోన్ చేస్తే "మనం వి.వి.వి.ఐ.పి లమా పాస్ పోర్ట్, వీసాలు మనముందు వచ్చేయటానికి! నీకు తెలియదా? టైం పడుతుంది అంటాడు.

చివరికి అమ్మ ఫోన్ చేసి మాట్లాడింది. "ఆంటీ మీరా? బాగున్నరా? నెలలు నిండుతున్నవాళ్ళని విమానం ఎక్కనివ్వరు ఆంటీ. డెలివరీ అయిపోనివ్వండి" అని చెప్పాడు. "అమ్మా! అక్కడ డెలివరీ అంటే నువ్వు, ఆంటీ రావాలి.ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది.అవన్నీ ఎందుకు చెప్పు" అంది చెల్లాయి. అది ధైర్యంగా వుంటే మాకింకేంకావాలి?

"రెండేళ్ళ తరువాత విష్ణు ఇక్కడికి రాక తప్పదు. రానివ్వు. పెళ్ళిలో మనం వాళ్ళకేం ఇవ్వలేదు, వాళ్ళూ అడగలేదు.పక్క స్థలం అమ్మకానికి పెట్టాము కదా. ఆ వచ్చిన డబ్బు విష్ణుకి ఇద్దాము" అన్నారు నాన్న ఒకరోజు.

"అదేమిటండీ అది అమ్మాయికి నాలుగ్గదుల ఇల్లు కట్టించి ఇద్దామనుకున్నాం కదా?" అనడగింది అమ్మ. "అమ్మాయికిచ్చినా, అల్లుడికిచ్చినా ఒకటే కదా?" అన్నారు నాన్న. నాక్కూడా విష్ణు డబ్బు మనిషై పోయాడేమోననిపిస్తోంది. ఎప్పుడూ డాలర్లు, లెఖ్ఖలు. ఫోన్ కి డబ్బులు దండగ అంటాడు. నడమంత్రపుసిరి! ఈ మార్పు ఎటుకి దారి తీస్తుందో!

ఆరోజు చెల్లాయి నాకు మేనల్లుడిని ఇచ్చింది. మా సంతోషానికి అవధుల్లేవు.వెంటనే విష్ణుకి ఫోన్ చేశాము. "విష్ణూ!" రెసీవరు ముందు అందరం అరిచాము. 'ఏమిటో ఆ హడావిడి?' విష్ణు అడిగాడు. "నేను తాతనయ్యానురా" నాన్న, అంకుల్ ఒకేసారి చెప్పారు."నేను అమ్మమ్మని అని అమ్మ చెప్పింది. "నువ్వు తండ్రివి అయ్యావురా, నేను నాయనమ్మని అయ్యాను" అని ఆంటీ చెప్పింది."ఒరేయ్ డాడీ! కంగ్రాట్స్" అన్నాను నేను. "థాంక్యూ...థాంక్యూ వెరీమచ్, రేఖకి కూడా థాంక్స్ చెప్పు" అన్నాడు విష్ణు.'రేఖ చేత ఫోన్ చేయిస్తానుండు అనబోతుండగా "బాగా అలసిపోయుంటుంది.రెస్ట్ తీసుకోనివ్వు" అని ఫోన్ కట్ చేసాడు. ఒక్క ఫోనేనా మమ్మల్ని కూడా కట్ చేసేసుకుంటున్నాడా వీడు?

మాపక్క స్థలం ఒకరు కొనుక్కోవటం, ఇల్లుకడతం కూడా జరిగిపోయింది. ఓనరు అమెరికా నుంచి రావాలి.ఫ్యామిలీతో వచ్చి రిజిస్ట్రేషన్ పనులు పూర్తిచేస్తారట.

ఆ ఇల్లు కట్టిస్తున్నయన నాకు ఒక మూవీ కెమెరా కొత్తది అందిస్తూ, "మాఇల్లు దింపవయ్యా. పసివాడి ఆటలు, పాటలు, మాటలు కూడా దీనిలో దింపు. వాళ్ళ నాన్నవచ్చినప్పుడు చూసుకుంటాడు" అన్నాడు. ఈయనకి వున్నపాటి ఆలోచన లేదు విష్ణుకి, ఏంచేస్తాం. రోజూ ఆయన వచ్చినప్పుడు ఫొటోలు తీయటమే ఒక పనిగా అయిపోయింది నాకు, ఆయనకు. లేకపోతే బుజ్జిగాడి పసివయసు ఆటలు, మాటలు మిస్ అయిపొయేవాడు విష్ణు.

బుజ్జిగాణ్ణి తొట్టెలో వేయటం, అన్నప్రాసన, బోర్ల పడితే బొబ్బట్లు, పాకితే పరమాన్నం, అడుగులేస్తే అరిశలు, పలికితే పంచదార చిలకలు అంతా మా రెండు కుటుంబాలకే పరిమితం.అయితే మొత్తం కెమెరాలో బంధించి వుంచాము. "సి.డి. అమెరికా పంపిస్తానురా" అని చెప్పాను ఒకసారి విష్ణుకి. "ఇంక నేను పనిచేసినట్టే" అన్నాడువాడు. దాంతో నా అనుమానం బలపడింది.కానీ ఏం చేయగలను!, దగ్గర దాపుల వున్నాడా?

ఆరోజు విష్ణు వచ్చే రోజు.అందరం ఎయిర్ పోర్టుకి వెళ్ళాం. మమ్మల్నిచూడగనే విష్ణు అమాంతం అందరినీ ఒక్క కౌగిలిలోకి లాగేసుకున్నాడు. భయం, అనుమానంతో బరువెక్కిన మా హృదయాలు తేలికపడ్డాయి.మా ఎదురుగా ముదురు నీలం కలరు కారు ఆగింది.ఆ రంగు నాన్నకి ఎంతో ఇష్టం. "మామయ్యా! వచ్చే నెలలో మీ షష్టిపూర్తి కదా? ఇది మీకు నా బహుమతి" అన్నాడు బుజ్జిగాడి మీద ముద్దుల వర్షం కురిపిస్తూ. అందరం అవాక్కయిపోయాము."ముందుగా మీరు ఎక్కండి మామయ్య...." అంటూ మూడు ప్రీపయిడ్ టాక్సీలు మట్లాడాడు.విష్ణు,మా ఆఫీసు నుంచి వెళ్ళిన గ్రూప్, వాళ్ళని కలుసుకోవటానికి వచ్చిన ఫామిలీస్ అంతా బయలుదేరాము."వీళ్ళంతా మనతో వస్తారు. నా మాట కాదనలేక వస్తున్నారు.పది నిముషాలుండి వెళ్ళిపోతారు" చెప్పాడు విష్ణు.

అన్నికార్లు కొత్త ఇంటి ముందు ఆగాయి. మేస్త్రి నేంప్లేట్ బిగిస్తున్నాడు. దానిమీద పేర్లు చూశాక మా కళ్ళు చెమ్మగిల్లాయి. అది ఏమి భావమో వర్ణించ మాతరం కాలేదు. "వీరాస్వామి, అన్నామ్మ, రేఖ" అన్న పేర్లు చెక్కబడివున్నాయి. "నాన్నా! నువ్వు, అమ్మ లోపలికి పదండి. రేఖా! అమ్మ, ఆంటీ, నువ్వు పాలు పొంగించి పాయసం చేసి వీళ్ళందరికి ఇవ్వు, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపొదామా అన్నట్టున్నారు. సహజం కదా! థాంక్స్ మీఅందరికి...చాలా చాలా కృతజ్ఞతలు" అన్నాడు.విష్ణు స్నేహితుల వైపు తిరిగి "ఈ ఇల్లు మా నాన్నకి వచ్చేవారం తన షష్ఠిపూర్తికి బహుమతి" అని చెప్పాడు.

"ఒరేయ్! ఈ మూవీకెమెరా నీకు!ఈ తతంగం అంతా ఇందులోకి దింపేసేయ్" అన్నాడు విష్ణు, కొత్త ఇల్లు కట్టిస్తున్నాయనకిచ్చిన కెమెరాని చేతుల్లో పెడుతూ.నేను అలా చూస్తుండిపోయాను. "చూపులతో మింగాల్సింది నన్ను కాదు, నీ శ్రీమతిని. ఇంక నీచేత ఆ పని చేయించే ఏర్పాట్లు చేయాలి" అన్నాడు చిలిపిగా. అమాంతం వాడిని కౌగిలించేసుకున్నాను.

"ఒరేయ్! కొంచెం వాళ్ళకి పాయసం ఇచ్చే ఏర్పాట్లు చూడరా" అన్నాడు విష్ణు మెల్లగా, నేను అటుగా వెళ్ళాను.మేమందరం ఏమి చేస్తున్నమో మాకే తెలియటంలేదు. అంత హాయిగా వున్నాము.

ఎప్పుడు ఇక్కడ నుంచి ఫోన్ వచ్చినా "నేను వాళ్ళ దగ్గర లేకపోయానే" అని వాపోయేవాడు విష్ణు. "ఎక్కువగా మాట్లాడితే థ్యాస వాళ్ళవైపే వెళ్ళిపోతుందని కష్టం మీద మాటలు తగ్గించేశాడు". "వీళ్ళ బర్త్ డేకి మాకు కేకు తినిపించేవాడు". "ఇండియాకి వెళ్ళాక రేఖతో, మా వాళ్ళతో కలిసే తీపి తింటానని తీపి మానేశాడు". "మామయ్య కోరిక, నాన్న కోరిక తీర్చటమే థ్యేయంగా పెట్టుకొని, ఒక్కోసారి కడుపు కట్టుకుని డాలర్లు దాచాడు". "ఇంట్లో అందరం వండుకున్నప్పుడే భోజనం చేసేవాడు"."అక్కడున్నడన్న మాటేగాని మనసెప్పుడూ ఇక్కడే వుండేది" అని మాఆఫీసు వాళ్ళు, వాళ్ళవాళ్ళకి చెపుతున్న మాటలు నా చెవినపడ్డాయి.

"విష్ణూ! ఇది నాబహుమతి" అంటూ నాన్నగారు స్థలం అమ్మిన డబ్బు విష్ణుకిచ్చారు. "ఈ ఇల్లు ఎవరు కట్టించారో తెలిసిపోయింది కదా!...ఈ డబ్బు ఆంటీ కోసం అని ఆ స్థలం కొన్నప్పుడే నిశ్చయించేసుకున్నాను" అన్నాడు విష్ణు డబ్బు అమ్మ చేతిలో పెడుతూ. "నేనెప్పుడూ మిమ్మల్ని ఏమి అడగలేదు. ఈ నా కోరిక తీర్చండి" అంటూ విష్ణు తన తల్లి అన్నమ్మ వైపుకు నడిచాడు.

ఇన్నాళ్ళు ఎవరెవరు ఏమన్నా "నా కొడుకు బంగారం కంటే ఎక్కువ. వాడు ఏ పని చేసినా అందరి మంచికే చేస్తాడు" అంటుండేది ఆంటీ ఎప్పుడూ. తల్లికి ఒక్కతే పిల్లల మనస్సు తెలుసుకోగల శక్తి ఉందేమో!!! అంటూ ఆంటీని దగ్గరకు తీసుకున్నాడు విష్ణు. ఆ దృశ్యం చూడటానికి ఎన్ని కళ్ళు వున్నా చాలవు.

"రేఖ చాలా అదృష్టవంతురాలు" అనుకుంటున్నారు ఫ్రెండ్స్.రేఖే కాదు మేమంతా కూడా అదృష్టవంతులమే. ఇంత మంచి స్నేహం వుండి నేను, ఇన్నాళ్ళుగా ఒకే ఇంట్లో వుండి విష్ణుని చూస్తున్న ఇంతమందిమీ వాడి మనస్సుని ఎవరమూ అర్థం చేసుకోలేక పొయాము, ఆంటీ, చెల్లాయి తప్ప. సృష్టిలో దేనినైనా తలకిందులుగా తపస్సు చేసినా అర్థం చేసుకోగలమేమోగాని మనిషి మనస్సుని అర్థం చేసుకోలేమేమో aమరి!!!

"తెలుసుకోలేనిది" కథకు విశ్లేషణ

ఈ కథలో తెలుసుకోలేనిది విష్ణు మనసు. కథా వస్తువు బాగుంది.కథ చెప్పే తీరు, సంభాషణల పట్ల రచయిత్రి మరికొంచెం శ్రద్ధ వహించవలసి వుంది. ఒకరు మాట్లాడినది పూర్తి అయిన తర్వాత మరొకరు చప్పేది అదే లైన్లో రచయిత్రి రాసుకుంటూ వెళ్ళిపోవటం పాఠకులకి చదివేటప్పుడు ఇబ్బందికరంగా ఉంటుందని గ్రహించాలి.ఎవరిదివారిది ఒక్కొక్క లైనుగా ఒక్కొక్క పేరాగా రాయవలసి ఉంటుంది. అప్పుడే కథ చదివిన అనుభూతి కలుగుతుంది, లేకపోతే వ్యాసంలా ఉంటుంది.

- తమిరిశ జానకి