తెలుగు తేజో మూర్తులు : నేత్ర ప్రధాత -
డాక్టర్ శివా రెడ్డి

-- ఈరంకి వెంకట కామేశ్వర్

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత పెంపొందించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు; అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన; కనపరచిన కౌశలం, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్న ఆర్యోక్తి వినే వుంటారు. అలాంటి ప్రధానమైన కంటి చూపుని ఇచ్చి, అంధకారం నుంచి వెలుగులోకి తీసుకురావడానికి తన జీవితాంతం కృషి చేసి, సాధించిన వారు అరుదు. ఇట్టి విశిష్ట శ్రేణికి చెందిన ఆ తెలుగు వాడు శ్రీ డాక్టర్ పెరుగు శివారెడ్డి గారు.

ప్రపంచంలో ఎవరూ చేయలేని కార్యాన్నే సాధించారు. నేత్ర వైద్య వృత్తిలోనే కాదు, మరి ఏ వైద్యంలో కూడా కనీ వినీ ఏరుగని రీతిలో ప్రపంచంలోనే అత్యధిక కంటి శస్త్ర చికిత్సలు చేసి రికార్డు సృస్టించారు. ఇది సాధ్యమా అనుకునేటట్టుగా ఏకంగా రెండున్నర లక్షల శస్త్ర చికిత్సలు చేసి చూపు తెప్పించారు, లేక చూపు కోల్పోకుండా సంరక్షించారు. నైపుణ్యంతో పాటు,తదేక దీక్ష, హస్తవాసి, కృషి, నేర్పు - ఓర్పు ఉంటే కాని ఇంతటి మహత్తర కార్యాన్ని సాధించటానికి వీలవదు.

అటు భారత ప్రప్రధమ పౌరుడు - రాష్ట్రపతి నుంచి ఇటు అతి సామాన్య పౌరుడి దాక ఏ తారతమ్యం లేకుండా తన వైద్య సేవలను యాబై యేళ్ళకు పైగా అందించారు శివారెడ్డి గారు.

1946లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులై, 1952లో ఆంద్ర విశ్వవిద్యాలయం నుంచి ప్రవీణులై, ఆ తరువాత వైద్య అచార్య పదవి చేపట్టి మూడు దశాబ్దాలకు పైగా పనిచేసారు. ఈ తరుణంలో ఐదు వందలకు పైగా వైద్య నిపుణులకు బోధించి, నేత్ర వైద్యంలో సిద్ధహస్తులగా తీర్చిదిద్దేరు.

కృషి - ఫలితాలు - ఆదర్శం

భారతదేశ ప్రప్రధమ నేత్ర నిధి (ఐ బ్యంక్) స్థాపన - భారత దేశంలో ప్రప్రధమ నేత్ర నిధిని (ఐ బ్యంక్) నెలకొల్పడంలో కీలక పాత్ర పొషించారు; అంధకారంలో కొట్టుకుంటున్న వారికి చూపు ప్రసాదించారు. ఒక్క పట్టణాలకే వైద్య సేవలు పరిమితం కాకుండా "కంటి శిబిరాల" (ఐ క్యాంప్) నిర్వహణ ద్వారా గ్రామీణులకు బాసటగా నిలిచేరు - విశిష్ట వైద్య సేవలు సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చారు. హైదరబాదులోనే కాక, విశాఖ, వరంగల్, కర్నూల్ జిల్లాలలో కూడా కంటి ఆసుపత్రులను నెలకొల్పించారు. ఎందరికో తన సేవలు అందించినందుకు రామకృష్ణ మఠం నుంచి "మానవతావాది" (హ్యుమానిటేరియన్) పురస్కారం గైకొన్నారు.

నిరంతర పరిశ్రమతో పాటు, తదేక దీక్షా భావం, మృదు సంభాషణా స్వభావం, చక్కటి వైద్య నైపుణ్యం కలవారు. ముఖ్యంగా వీరి హస్తవాసి మంచిది. ఆయన చేత్తుల్లో పడ్డాడా చూపు దక్కిందన్న మాటే!.

పదహారేళ్ళ పాటు సరోజిని కంటి ఆసుపత్రికి అదినేతగా వ్యవహరించి దాని అభివృద్ధికి తోడ్పడ్డారు. ఈ ఆసుపత్రి ప్రాంగణంలోనే టొకార్సిలాల్ కపాడియా నేత్ర నిధి - (ఐ బ్యంక్) స్థాపించి, అక్షీపటల ప్రస్థాపనలు (కార్నియా ట్రాంన్స్-ప్లాంట్), శుక్లపటలం శస్త్రచికిత్సల సేవలు అంధించారు. ఈ కేంద్రం యావత్ భారతానికి ఆదర్శప్రాయమయ్యింది.

ప్రపంచంలో మరే వైద్య నిపుణుడికి అనితర సాధ్యమైన కార్యం అనిపించ్చవచ్చు. ఈయన రెండున్నర లక్షలకు పైగా శుక్లపటల శస్త్ర చికిత్సలు నిర్వహించారు.

క్రీస్తు పూర్వం ఐదవ దశాబ్దంలో భారతదేశంలో సుశౄత అనే ప్రముఖ అచార్యుడూ, శస్త్రవైద్యుడు - "సుశృత సం-హిత" రచించి అందులో దాదాపు, డెబ్బై రెండు కంటి వ్యాదులకు, శస్త్ర చికిత్సా విధానాలను, పద్ధతులను రూపొందించాడు. నాటి నుంచి నేటి వరకు ఇలా మన పరంపరలో కొందరు మహానుభావులు పుట్టుకొస్తూ ఉన్నారు.

విభిన్న విద్యా, సాంకేతిక, విజ్ఞాన సంస్థలతో సన్నిహితంగా పని చేసారు. భారతీయ విద్యాభవన్ సంస్థతో బాగా అనుబంధం ఉండేది. ఈ సంస్థ అభివృద్దికి తోడ్పడ్డారు. పి వామన్ రావు గారు వీరి మంచి మిత్రులు.

తెలుగు సినీ రంగంలో ప్రముఖ నటుడు చిరంజీవి, శివారెడ్డి గారిని సంప్రదించి, ఆయన సూచనల అధారంగా చిరంజీవి నేత్ర నిధి (ఐ బ్యంక్) స్థాపించారు. ఇలా ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు.

అందుకున్న మన్ననలు

ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో సభ్యుడిగా ఉండి ఎన్నో పురస్కరాలను అందుకున్నారు. వీటిలో డాక్టర్ బి.సి.రాయ్ పురస్కారం, 1971లో భారత ప్రభుత్వ "పద్మశ్రీ", 1977లో "పద్మభూషణ్" పురస్కరాలు ఉన్నాయి.

శివారెడ్డి గారి విశిస్ట సేవలకు గుర్తింపుగా భారత ఆప్తాల్మొలాగికల్ మండలి (సొసైటి) శివారెడ్డి బంగారు పతకం నెలకొల్పి యేటా నేత్ర వైద్య రంగంలో విశిష్ట పరిసోదనలు చేసిన వ్యక్తికి అందిస్తున్నారు.

- 1964లో తన పరిశోధనతో అరుదైన - గొర్డియ క్రిమిని కనుగొన్నారు. శివారెడ్డి గారి సాధనకి గుర్తుగా గొర్డియ రెడ్డి - క్రిమి అని - మ్యునిచ్ నగరంలో గుర్తించారు. ఇంతటి గౌరవం, గుర్తింపు ఓ భారతీయుడికి లభించడం అరుదే.

- చైనా దేశంలోని శున్ యత్ శన్ విశ్వవిద్యాలయం గౌరవ అచార్యునిగా వ్యవహరించారు.

- భారతీయ ఆప్తాల్మొలాగికల్ మండలి అధ్యక్షుడిగా ఉన్నారు. భారతీయ వైద్య విజ్ఞాన పరిషత్తు (ఎకాడమి ఆఫ్ మెడికల్ సైన్సెస్) అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఐ ఏ పీ బి - ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.

- 1979లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది.

- 1983లో అమెరికా - అకాడమి ఆఫ్ ఆప్తాల్మొలోజి సభ్యుడిగా ఉన్నారు.

- 1992లో - మలేసియన్ సింగపూర్ వైద్య విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది.

- 1995లో విజ్ఞాన - సాంకేతిక క్షేత్రంలో విశిష్ట కృషికి గాను రాజీవ్ గాంధీ పురస్కారం ఇచ్చి గౌరవించారు.

- 1999లో వీరి సేవలను గౌరవిస్తూ, భారతీయ ఆప్థాల్మొలాగికల్ మండలి యావత్-జీవిత పురస్కారం ఇచ్చి గౌరవించారు.

చివరి దాకా

ఏకాంతవాసం (రిటైర్మెంట్) తీసుకోకుండా జీవితాంతం నేత్ర వైద్య సేవలో నిమగ్నమైపోయారు. తన యావత్ జీవితాన్ని తన వృత్తి ధర్మానికే వినుయోగించిన కర్మ యోగి ఆయన. 2005 లో తన ఎనబై ఐదవ యేట స్వర్గస్తులైనా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కంటిలోని వెలుగులా మెదులుతూ వుంటారు.