సుజననీయం

-- ప్రఖ్య వంశీ కృష్ణ


అమ్మ ముద్దు... అమ్మమ్మ.. వద్దు?!?!

చాలా కాలం తర్వాత ఇద్దరు మిత్రులు ఒక వీధిలో తారసపడ్డారు. అందులో ఒకడు దిగాలుగా ఉన్నాడు. రెండోవాడు పలకరించి సంగతేమిటని అడిగాడు. "నాలుగు నెలల క్రితం మా బామ్మగారు చనిపోయారు. పోతూ పోతూ ఓ పదెకరాలు నా పేర రాసి పోయారు. మూణ్ణెల్ల క్రితం మా మేనత్త పోతూ పోతూ ఐదెకరాల కొబ్బరితోట రాసి పోయింది. రెణ్ణెల్ల క్రితం మా దూరపు చుట్టం ఒకాయన పోతూ పోతూ ఒక పదెకరాల మాగాణి నా పేర పెట్టి పోయారు... " ఇలా చెప్పుకుపోతూ తెగ బాధపడుతున్న వాడిని రెండోవాడు జాలిగా చూస్తూ "పాపం ఇంతమందిని ఒకేసారి పోగొట్టుకున్నావా" అని జాలిపడ్డాడు. అందుకు మొదటి వాడు, "గత నెల రోజులుగా ఎవరూ పోలేదు.. కొత్తగా ఈ నెలలోనే ఆస్తి కలవలేదు అని నేను బాధపడుతోంటే నీ పరామర్శల గోల కూడానా.. " అని గట్టిగా బావురుమన్నాడు.

*****

పాఠకులలో చాలామందికి తెలిసినదే అయిన ఈ వ్యంగ్య గల్పిక, మనలో చాలా మందికి అయాచితంగా వచ్చే వారసత్వపు ఆస్తుల మీద ఉన్న యావ కళ్ళకు కట్టినట్లుగా చూపెడుతుంది. పెద్దలు ఆస్తులు సంపాదిస్తేగాని గౌరవమర్యాదలు ఇవ్వని కాలంలో అడక్కుండా వచ్చిన ఆస్తిని కాదనాలంటే హృదయ వైశాల్యం చాలా ఉండాలి. లేదా యే స్థితప్రజ్ఞులో కానీ లేక సర్వసంగ పరిత్యాగులన్నా అయి ఉండాలి.

ఆస్తులు సంపాదించి పిల్లలకు వారసత్వంగా ఇవ్వడం అన్నది ఎప్పుడు ఎవరి నుండి ప్రారంభమైందో చెప్పలేం గానీ ఇవాళ మంచికీ చెడుకీ రెంటికీ మూలమై నిలుస్తోంది. టాటాలు, బిర్లాలు చేసిన కృషి వారసత్వంగా అందించడం వల్లనే కదా తరువాతి తరాల వారు ఇంకా పెంపొందించడానికి అవకాశం లభించింది! అదే వాళ్ళ పిల్లలకే గాక ఇంకా ప్రతిభావంతులెవరికైనా ఇస్తే ఇంకా బాగా అభివృధ్ధి చేసి ఉండేవారు అన్న వాదన కూడా లేకపోలేదు. కానీ అలా చేసి మన కష్టార్జితాన్ని మన కడుపున పుట్టిన వాళ్ళకు కాక దారేపోయేవాడు ఎంత ప్రతిభావంతుడైనా ఇవ్వలేము. కన్న మమకారం అటువంటిది. అయితే తాతలు ఇచ్చిన దానిని మెరుగుపఱచి పెంపొందిచేవాడే నిజమైన వారసుడు అని కొనియాడబడతాడు.

ఆర్ధిక సంబంధమైన విషయాల నుంచి మన ఆలోచనా విస్తృతి పెంచి చూస్తే అసలు మానవ జాతి మొత్తం అభివృధ్ధి కేవలం వారసత్వం అందిపుచ్చుకునే గుణం మనిషికి ఉండటం వల్లే సాధ్యమయింది. ఆది మానవుడు నిప్పు కనుక్కుని వాడుకోవడమే కాక ఆ జ్ఞానాన్ని తన తరువాతి తరాలకు అందించాడు వారసత్వంగా. అలా అందిపుచ్చుకోగలిగే గుణము, బుధ్ధి పెంపొందించుకోగలిగితే అనేక ఇతర జీవులూ మానవులంత ప్రతిభా సంపదలు పెంపొందించుకోగలిగేవే. సరికొత్త నాగరికతా నిర్మాణంలో మనిషితో పోటీపడేవే. ఒక్కమాటలో చెప్పాలంటే ఇవేళ మనం ఇలా ఒక భాషలో ప్రపంచంలో ఏదో మూల కూర్చుని వ్రాస్తే విశ్వమంతా ఒక్కసారిగా చదవుకోగలిగిన అభివృధ్ధి అంతా వారసత్వ ఫలితమే! లేకుంటే ప్రతి మనిషీ మళ్ళీ నిప్పు, మళ్ళీ చక్రం కనుగొంటూ ఎప్పటికీ ఆది స్థితిలో ఉండేవాళ్ళమే! మన విజ్ఞానం, మన భాష, మన ఆలోచన, మన అభివృధ్ధి అంతా వారసత్వ ఫలితమే.

ఐతే, ఈ విషయం మనకు తెలియనిదేమీ కాదు, వింతా కాదు. కానీ ఇందుకు భిన్నంగా జరిగితేనే ఆశ్చర్యం. అందివచ్చిన పునాదులను కూలదోసుకుని కొత్తగా మళ్ళీ గోతులు తవ్వుకుంటే "అయ్యో! పాపం" అనిపిస్తుంది. మనం నమ్మినా నమ్మకపోయినా ఇవేళ తెలుగుసీమలోని కొంతమంది మేధావుల వల్ల జరుగుతున్నదిదే అంటే దిగ్భ్రమ కలుగకుండా ఉండదు. మన వారసత్వంగా వచ్చిన మన భాష పునాదులను ప్రశ్నించటమే కాక ఆ పునాదులను కూలదోసి వేరే భవంతులేవో కట్టాలని యోచిస్తూ ఒక కొత్త సందిగ్ధతకు ప్రజానీకాన్ని గురి చేస్తూన్నారు కొంతమంది ఆధునిక మేధావులు. తెలుగు భాషలో సంస్కృత పదాల వాడుకని ఈసడిస్తూ ఈ మధ్య వస్తున్న వాదాలు సామాన్య ప్రజను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆ ముచ్చటేమిటో పరిశీలిద్దాం.

తెలుగు భాష తీరు తెన్నులు, పదజాలం, భావ వ్యక్తీకరణ, నిర్మాణం ఇత్యాది అంశాల అధారంగా తెలుగు,సంస్కృతాలకు దగ్గరి పోలిక ఉందని శతాబ్దాలుగా అందరూ భావిస్తూన్నాం. ఆ పోలిక ఎంత దగ్గరిది అంటే సంస్కృతం "మాతృ భాష" అనగలిగినంత అని ఘంటాపధంగా తీర్మానించారు పెద్దలు. అయితే ఈనాడు తెలుగు భాషకు పాశ్చాత్య భాషల ప్రభావం వల్ల జరుగుతున్న నష్టాలనుంచి రక్షించడానికి, తెలుగు భాష పరిరక్షించడం కోసమని, భాషను పది కాలాలు నిలపటం కోసమని పరాయి భాషా పదాల వాడుక తగ్గించి తెలుగు పదాలను విరివిగా వాడాలన్న ఉద్యమం ప్రారంభమయింది. ఈ ఉద్యమం వల్ల తెలుగు భవిత గురించి పట్టించుకునే వారు బయలుదేరారన్న ఆనందం కలుగుతున్నా, ఆ ఉత్సాహం కొద్దిగా మితి మీరి, సంస్కృత పదాలను వెలివేయాలనేంతగా పెరిగిపోవడం చూస్తే విస్మయం కలుగుతుంది. భారతీయమైనది కాబట్టి సంస్కృత పదాలను నిలుపుకోవాలని, పాశ్చాత్యమైనవి కాబట్టి పదాలను వాడకూడదని, భౌగోళిక సరిహద్దులు ఏర్పాటు చేయటం ఉద్దేశ్యం కాదని గ్రహించవలసినది.

యే భాషకైన మూలం ఇది అని నిర్దిష్టంగా చెప్పలేం. యే భాషా ఒక్క రోజులో పుట్టేది కాదు. ఒక్క సారిగా అవతరించేది కాదు. భాష, జనసామాన్యంలోంచి కొన్ని యుగాల బాటు క్రమేపి పెరుగుతూ వస్తుంది. క్రమంగా కట్టుబాట్లు - అనగా వ్యాకరణము, పదబంధాలు ఏర్పడతాయి. అలా పరివర్తనం చెందుతూ పరిపూర్ణమయ్యేలా పెంపొందడానికి వ్యక్తులు, పరిస్థితులు, ఇంకా వేరే భాషలూ కారణం అవుతుంటాయి. ఏవైనా మంచి లక్షణాలు ఇతర భాషల్లో కనిపించినపుడు వాటిని మన భాషలో కూడుకుని భాషను మరింత సుశోభితం చేయవచ్చు. అలా "సంస్కరింపబడిన" భాష అయిన "సంస్కృతం" నుండీ తెలుగుకు అనేక ధాతువులు,వ్యాకరణ నియమాలు దిగుమతి అయి ఉంటాయి. మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చు కదా. అవి వచ్చి చేరాక మన మెరుగులు మనం పెట్టుకుని (పద్యాలలో యతి నియమాలు చేర్చినట్లు) మరింతగా మన భాషను ఉద్దీపింపజేసుకోవడం ముదావహం. అలా చేసుకున్నందుకు గర్వపడాలి. మన భాష విస్తృతి పెరిగిందని, మనం చేర్చుకున్న అంశాలకు మెరుగు పెట్టుకున్నామని సంబరపడాలి.

మరి ఈనాడు మనలో కొద్దిమంది ఎందుకు అన్యధా భావిస్తూ సంస్కృత పదాల వాడకాన్ని తక్కువగా చేసి చూపుతున్నారో అర్ధం కావడంలేదు. మన తాతగారి కన్నా రెండు అంతస్తులు ఎక్కువ కట్టామని సంతోషించాలి కదా.. ఇంకా వీలయితే మరో రెండు అంతస్తులు కట్టటం భావ్యం. అంబానీ గారు ఎంతో శ్రమకోర్చి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మిస్తే వారి పుత్రులు ఈనాడు దాన్ని ఇంకెంతగా వృధ్ధి చేస్తున్నారో మనకు తెలియనిది కాదు. అది వారు గర్వపడే అంశం అని మనం అందరమూ అంగీకరించినపుడు మన భాష పట్ల అదే ఎందుకు వర్తించదు?

ఈనాడు "సాఫ్ట్ వేర్" గురించి తెలియనివారుండరు. అందులో ఇప్పుడున్న కొత్త సాంప్రదాయం, "Object Oriented Programming(ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్)". ఈ పధ్ధతిలో ముఖ్య విషయం, "Inheritence" అనగా వారసత్వం. ఈ పధ్ధతిలో కలనయంత్రం (Computer), కార్యక్రమం (Program)ని అనుసరించి ఒక సమస్య సాధనకు కావల్సిన వస్తువులను తయారుచేసుకుంటుంది. ఆ తయారీలో ప్రతి వస్తువూ దాని పూర్వీకులనుండి ఎంతొ కొంత మొత్తంలో కొన్ని వారసత్వ లక్షణాలను తెచ్చుకుంటుంది, మనుషులలాగా. ఉదాహరణకు, విమానం బస్సు నుండి, బస్సు బండి నుండి వచ్చిందనుకొందాము. విమానం కదిలే లక్షణాన్ని దాని తాత అయిన బండి నుండి పొందుతుంది. అలా సమస్య సాధన సులువౌతుంది. మూలం (Base Class) అయిన బండి లేకుండా విమానం తయారుచేయలేం. అనగా బండి, విమానానికి ఉపసమితి (sub-set). ఇదే కోణంలో ఆలోచిస్తే భాషలనూ వీటితో పోల్చవచ్చు. తెలుగు భాష మూలం సంస్కృతం కన్నా ఒక మెట్టు ఎదిగింది. అలా సంస్కృత మూలాలపై తెలుగు వృధ్ధి చెందడం తెలుగుకు గర్వకారణం.

సంస్కృత పదాల వాడుక వల్ల అత్యంత ముఖ్య ప్రయోజనం, కొత్త పదాలను తయారుచేసుకోవడనికి ఉన్న వెసులుబాటు. సాధ్యమయినంత వరకు ప్రతి అంశానికి ధాతువులు, వాటికి తగిన ప్రత్యయాలు, సంయోగ నియమాలు ఇవన్నీ కలిగి ఉండే భాషను "సంస్కరింపబడిన భాష" అనగా సంస్కృతం అంటారు. మనకి జన సామాన్యంలో వాడుకలో లేకపోయినా అవసరమైన పదజాలం సృష్టించడానికి ఇన్ని పరికరాలు అవసరమవుతాయి. తెలుగు సంస్కృతం నుండి వారసత్వంగా ఈ పరికరాలను పొందింది. హాయిగా వాటిని వాడుకోక మధ్యలో అనవసరపు శషభిషలేల? internet అన్న పదానికి వేమూరి వారు ప్రతిపాదించిన "అంతర్జాలం" అన్న పదం ఎంత చక్కగా ఇమిడిపోయింది! దీనికి మూలం సంస్కృతం అని బాధపడి మానెయ్యాలా? మన భాషా కుటుంబం నుండి వచ్చిందే అని మురిసి వాడుకుంటే ఎంత చక్కగా ఒదిగిపోతుంది?

అసలు సంస్కృతం తెలుగుకు తల్లి కాదు పొమ్మని వాదించే వారూ కొంతమంది బయల్దేరారు. తెలుగు ఎక్కడ పుట్టిందో సరిగ్గా కనిపెట్టేసినట్లు, ఇకా తామే తెలుగుకు పురుడు పోసి పేరు పెట్టినట్లు మాట్లాడుతుండటం కూడా జరుగుతోంది. యే భాష అయినా ఎక్కడ పుట్టిందో చెప్పటం కష్టమని శాస్త్రజ్ఞులు చెప్పుతున్నారు. రూపాంతరం గురించిన పలు వాదాలు మాత్రమే చేయగలిగి పుట్టుపూర్వోత్తరాలను అంచనా వేస్తున్నారు. అలా పోలికల బట్టి ప్రబంధ కాలం నుండి తెలుగుకు మాతృక సంస్కృతం అని భావిస్తూ వచ్చారు.

అలా అని తెలుగు పదాల వాడుక మానేసి అన్నీ సంస్కృత పదాలే వాడాలి అని ఉద్దేశ్యం కాదు. ఎక్కడా యే పదం భావ్యంగా ఉంటే ఆ పదం అప్పుడు అక్కడ వాడుకుంటూ ఉంటే చాలు, అనవసర నిర్బంధాలు లేకుండా. ఉదహరణకి "వెతకటం" ఒక సందర్భంలో సరిపోతుంది. "శోధించడం" అన్న పదం మరో సందర్భానికి సరిపోతుంది. శోధించే చోట వెతకటం అన్న పదం ఉపయోగిస్తే వెలితిగానే ఉంటుంది. వెతకడం ఉపయోగించాల్సిన చోట "శోధించడం" అన్న వాడుకా ఎబ్బెట్టుగానే ఉంటుంది. ఈ తేడా గుర్తిస్తూ పదాలు వాడితే భాషా సౌందర్యం ఇనుమడిస్తుంది.

వాదాలు మాని వాస్తవిక ప్రపంచాన్ని పరిశీలిస్తే, సంస్కృతం తెలుగుకు ఎన్నటికీ పరాయి భాష కానేరదు. ఎంత కాలం మారినా మన అమ్మ మనింటికి వస్తే చుట్టమవదు, అమ్మే అవుతుంది, మన కుటుంబంలో భాగమే. తెలుగు భాషలో సంస్కృత పదాలు చక్కని ఆవకాయ అన్నంలో వెన్నపూసలా కలసిపోయి మరింత రుచి పెంచుతుంది. ఆంగ్ల పదాలుంటే అదే ఆవకాయ పిజ్జా మీదా రాసుకు తిన్నట్టుంటుంది. పిజ్జా రుచి అమోఘమే అయినా ఆవకాయతో సరిపోదు. ఆ రెండూ కలిపిన రుచి ఎందుకో గిట్టదు. ఒకే కుటుంబానికి చెందినవి కాకపోవడం వల్లనేమో మరి!

"జనని సంస్కృతంబు ఎల్ల భాషలకును... దేశభాషలందు తెలుగు లెస్స." అని పెద్దల వాక్యముండగా మళ్ళి అనవసరపు అనుమానాలేల? మన మాతృభాష మనకు అమ్మ లాంటిది. ఆవిడ జనని, మన అమ్మమ్మ. అమ్మ కలిపి పెట్టిన ముద్దకన్నా అమ్మమ్మ గోరుముద్దలు ఇంకా రుచిగా ఉంటాయి. వద్దంటే పోగొట్టుకునేది మనమే! అమ్మమ్మ పోలికలో మన ముక్కు ఉంటే ఆనందించాలి గానీ మన అమ్మ పోలికలో లేదని కోసేసుకుంటే ఊడేది మనముక్కే!

వారసత్వంగా పొందిన సంస్కృతం మా మూలం అని గర్వంగా చెప్పుకుని తెలుగును మరింత మెరుగు పెట్టుకుందాం.

మీ

ప్రఖ్య వంశీ కృష్ణ


సుజనరంజని భిన్న అభిప్రాయాలకు వేదిక మాత్రమే. ఇందలి రచయిత(త్రు)ల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాము.