అమెరికాలో పిల్లలకు తెలుగు పద్య నాటక శిక్షణా శిబిరం
'కావ్యేషు నాటకం రమ్యం' అన్నాడు మహాకవి కాళిదాసు. కావ్యాలన్నింటిలోనికి నాటకానికి అత్యంతంగా ఆహ్లాదపరిచే గుణముంది. అలాగే లఘు గురువుల గణాలతో, యతి ప్రాసలతో విశిష్టమైన లయ కలిగిన 'పద్యం' తెలుగుభాష సొత్తు. మరి అలాంటి ప్రాశస్త్యం కలిగిన నాటకానికి లయబద్ధమైన పద్యరీతి తోడైతే బంగారానికి సువాసన అబ్బినట్టుంటుంది. ఆ దిశలోనే తిరుపరి వేంకట జంట కవులు రాసిన 'పాండవోద్యోగ విజయం' పౌరాణిక పద్య నాటకానికి బాగా జనాదరణ లభించింది. 'చెల్లియో చెల్లకో...', 'జెండాపై కపిరాజు...' లాంటి పద్యాలు ఆ రోజుల్లో అందరి నోళ్ళలో కూడా నలిగాయి.
అమెరికాలో ఉన్న తెలుగు వారికి కూచిపూడి, భరత నాట్యాలు నేర్చుకోవాలన్నా, అన్నమయ్య పదాల్లో, త్యాగరాజ కృతుల్లో శిక్షణ పొందాలన్నా వాటికి సంబంధించిన సంస్థలు, బోధించే గురువులు విరివిగా అందుబాటులో ఉన్నారు. కాని తెలుగు పద్య నాటకంలో శిక్షణ పొందాలనుకోవడం గగన కుసుమంతో సమానమే. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు పదివేళ్ళ మైళ్ళ దూరంలోనున్న అమెరికాలో సిలికానాంధ్ర సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
'గాన గంధర్వ ' బిరుదాంకితుడైన గుమ్మడి గోపాలకృష్ణగారు తెలుగువారందరికి 'ఆభినవ కృష్ణుడు 'గా సుపరిచితులే. ఒకటిన్నర దశాబ్దలుగా తెలుగు పద్య నాటకానికి ప్రపంచ నలుమూల కీర్తిని ఇనుమడింప చేస్తున్న 'నంది అవార్డు ' గ్రహీత అయిన గుమ్మడిగారు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అలా అందివవచ్చిన ఈ సదవకాశాన్ని పుచ్చుకొని ఎప్పటికప్పుడూ సరిక్రొత్త ప్రయోగాలు చేసే సిలికానాంధ్ర వేసవి సెలవుల్లో అమెరికాలోని భావి తెలుగు తరానికి 'పద్యనాటక శిక్షణ శిబిరం' ప్రారంభించింది. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడైన కూచిభొట్ల ఆనంద్ వినూత్నంగా ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసారు.
రెండువారాలుగా సాగిన ఈ శిక్షణా శిబిరంలో నాలుగేళ్ళ ప్రాయం కలిగిన చిన్నారి నుండి పాతికమందికి పైగా పిల్లలు పాల్గొన్నారు. ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలనుండి మొదలయ్యే ఈ కార్యక్రమంలో రోజుకో పద్యాన్ని రాగయుక్తంగా నేర్చుకొన్నారు. అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు సంప్రదాయ తెలుగు దుస్తులు ధరించి ఉత్సాహం ఉరకలు వేస్తుంటే వివిధ పద్య నాటకాల్లోని పద్యాలను అత్యంత శ్రద్ధతో నేర్చుకున్నారు.
ఈ సమయంలో గుమ్మడి గోపాలకృష్ణగారు ఎంతో ఓర్పు వహించి పిల్లలకు శిక్షణ ఇచ్చారు. ప్రతి ఒక్కరిని పక్కన కూర్చోపెట్టుకొని శృతి ఎక్కడా తగ్గకుండా రాగంపై పట్టువీడకుండా పౌరాణిక పద్యాలు పాడే విధానంలోని మెళకువలని నేర్పారు. పిల్లలు కూడా ఆసక్తిని కనబరుస్తూ వినయంగా స్వచ్ఛమైన ఉచ్ఛారణతో తేనెలూరు తెలుగు పద్యాలను నేర్చుకొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేర్చుకొన్న పద్యాలివి.
"తెలుగుగదేలయన్న దేశంబు తెలుగు..." (శ్రీకృష్ణదేవరాయ విరచిత ఆముక్తమాల్యద, హిందోళరాగం), "సిరిగలవానికి చెల్లును తరుణుల పదియారువేలు..." (శ్రీనాథుడు, షణ్ముఖప్రియ), "ఇటులెంతైన ధనంబు వచ్చినను రానీ..."
(బలిజేపల్లి లక్ష్మికాంతం గారి సత్యహరిశ్చంద్ర, మోహనరాగం), "ప్రాయము వచ్చినంత, గృహభారము మూపున దాల్చి తండ్రికిన్..." (కాళ్ళకూటి నారయణరావు రచించిన చింతామణి, భీంపలాస్ రాగం), "ఎక్కడనుండి రాక ఇటకు, ఎల్లరున్ సుఖులే కదా...", "జెండాపై కపిరాజు, ముందు శ్రితవాని శ్రేణియున్ గూర్చి..." (తిరుపతి వేంకట కవుల పాండవోద్యోగ విజయం, కల్యాణ మోహన రాగాలు)
ఈ కార్యక్రమంలో ఆఖరి రోజున జరిగిన హైద్రాబాద్ దూరదర్శన్ సంచాలకులు, డా.పాలకుర్తి మధుసూదన్ రావుగారు ముఖ్య అతిధిగా విచ్చేసారు. విద్యార్థులందరు ఒక్కొక్కరు రెండేసి చొప్పున వారు నేర్చుకొన్న పద్యాలను ఎంతో చక్కగా అలాపించారు. ఈ సందర్భంగా సిలికానాంద్ర అధ్యక్షుడు శ్రీఫణి విస్సం రాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయం వెనకాల పిల్లల తల్లితండ్రుల సహకారం మరవలేనిది అన్నారు. గురువు గుమ్మడిగారు మాట్లాడుతూ పద్యం తెలుగుభాషకు ఆస్తిలాంటిది అన్నారు. తను సాధించిన ఈ ఫలితం చూస్తుంటే నంది అవార్డు పొందిన అనుభూతికంటే గొప్పగా ఉందన్నారు.
కూచిభొట్ల ఆనంద్ కార్యక్రమ విశేషాలను వివరిస్తూ రెండు వేల సంవత్సరాలున్న తెలుగు పద్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిది అని అన్నారు. ముఖ్య అతిధి మధుసూధనరావు గారు మాట్లాడుతూ సంగీత స్వరాలతో ముచ్చటగా స్వచ్ఛంగా పద్యాలను చదువుతున్న పిల్లలను చూస్తుంటే ఇంట్లో పండగ రోజులా ఉందన్నారు. సౄజనాత్మక ప్రయోగాలు చేస్తున్న సిలికానాంధ్ర - దూరదర్శన్ అనుబంధం రెండేళ్ళ క్రితం మొదలైందని గుర్తు చేశారు. తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని చాటుతున్న సిలికానాంధ్రకు దూరదర్శన్ సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని హామీ ఇచ్చారు.
నీహారిక, మానస, శ్రుతి, మహిత, ప్రియాంక, స్రుజన, కౌశిక్, మీన, ప్రణతి, స్ఫూర్తి, జాహ్నవి, అంజలి, కావ్య, సుహాసిని, అరుణ్, మైత్రి, అనూష మంగళంపల్లి, లలిత, మైథిలి, హరిమూర్తి, శాంతి, వల్లీరావు, అనూష కూచిభొట్ల శిక్షణ తీసుకొన్నారు.
|