రాతివనం - 7వ భాగం

-- సలీం

జరిగిన కథ: అనూష ఒక సాధారణ మధ్య తరగతి టీనేజ్ పిల్ల. అనూష తల్లిదండ్రుల ప్రోద్బలంతో రెసిడెన్షియల్ కాలేజిలో చేరుతుంది. అనూష భయాలకు తగ్గట్టుగా అక్కడి వాతావరణం ఉండటం ఇంకాస్త అయిష్టతను పెంచుతుంది. ఆమె రూమ్మేటు, కల్పన, చదువు వత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి హాస్టలు పైకెక్కుతుంది. మరోపక్క అనూష తండ్రి, రమణారావు, తన కొడుకుకు ఎనిమిదో తరగతి నుంచే ఐ.ఐ.టి. ఎంట్రన్సు కు కోచింగు ఇప్పించేందుక్కు సన్నాహాలు చేస్తుంటాడు. తమ కొడుకు భవిష్యత్తు ఊహించుకుంటూండగా అర్ధరాత్రి ఫోన్ మోగుతుంది. మరో వైపు సూర్యకుమార్ అనే ప్రతిభావంతుడైన హిస్టరీ లెక్చరర్ ఆర్ట్స్ కోర్సులలో విద్యార్థులు తగ్గిపోతుండటం చూసి మధనపడుతూ అటువైపు ఆసక్తి కలిగించేలా పోటీలు నిర్వహిస్తుంటాడు. అందరికంటే భిన్నంగా ఓ జర్నలిస్టు కూతురు, మధుమిత హిస్టరీ గురించి మంచిగా చెప్పి మొదటి బహుమతి గెల్చుకుంటుంది, సూర్య కుమార్ ఆమెను చూసి ఆనందిస్తాడు. తనకు పోటీగా అనూష లేనందుకు బాధపడుతుంది మధుమిత. అనూషకు ఒంట్లో బాగోలేదని తెలిసి తండ్రి విజయవాడ వెళ్ళి ఇంటికి తీసుకువస్తాడు. ఇక అనూషను వెనక్కి పంపకూడదని నిర్ణయించుకుంటాడు తండ్రి.. హిమవర్ష, అనూష లానే తల్లిదండ్రుల ప్రోద్బలం మీద తనకు ఇష్టం లేని చదువుచదువుకుంటూంటుంది. ఇంటికొచ్చిన అనూషను స్నేహితురాళ్ళు హిమవర్ష, మధుమిత కలుస్తారు. మాటల్లో మధుమిత వాళ్ళిద్దరినీ సాంత్వన పరుస్తూ తమ కష్టాల్లోనే జీవితపు విలువలు నేర్చుకోవడమెలాగో చెబుతుంది.

రామ్మూర్తి కారు నడుపుతూనే ఆలోచిస్తున్నాడు. అతని మనసంతా అలజడిగా ఉంది. నెల్రోజుల్నించీ ఏదో తెలియని భయం అతన్ని నీడలా వెంటాడుతోంది. మేథమెటిక్స్ పాఠాలు చెప్పటంలో అతను దిట్ట. విజయవాడ మొత్తంలో అతనే నంబర్ వన్ అని ప్రతీతి. ఐ ఐ టి ఎంట్రన్స్ కి ఇతను కోచింగ్ ఇస్తే గన్ షాట్ గా సీటొస్తుందని కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాల నమ్మకమే కాదు, చాలామంది తల్లితండ్రుల నమ్మకం కూడా.

పదేళ్ళకు పైగా శ్రీచరిత కాలేజిలో పని చేసి, ఆ కాలేజీకి పేరు ప్రతిష్టలు రావటంలో ముఖ్యభూమిక పోషించిన రామ్మూర్తి రెణ్ణెల్ల క్రితం సునందా కాలేజీలో చేరిపోయాడు. ఈశ్వరరావు చాలాసార్లు కబురు పెట్టినా వెళ్లలేదు. మధ్యవర్తుల ద్వారా కోరినంత జీతం ఇస్తానని ప్రలోభపెట్టినా లొంగలేదు. ఓ నెల్రోజుల్నించి బెదిరింపులు మొదలయ్యాయి.

ఈశ్వరరావు గురించి రామ్మూర్తికి బాగా తెలుసు. తన కాలేజీకి యంసెట్లో మొదటి పది ర్యాంకులు రావడంకోసం, ఐ ఐ టి లో అత్యధికంగా సీట్లు రావడంకోసం, తద్వారా మీడియాలో విపరీతమైన ప్రచారం కోసం, దేనికైనా తెగించే మనిషి. అవసరమైతే మంత్రుల కాళ్ళు కడుగుతాడు. అధికారుల కనుసన్నల్లో మెలుగుతాడు. మరీ అవసరమైతే తన ప్రత్యర్థులను మట్టి కరిపించడం కోసం ఎంత నీచానికైనా దిగజార్తాడు.

అనూహ్యంగా రోడ్డు మధ్యలోకి ఎవరో మనిషి వచ్చాడు. రామ్మూర్తి సడన్ బ్రేక్ వేసి కారాపాడు.

"తాగి నడుపుతున్నావా? కళ్ళు కనిపించడం లేదా , లేక నెత్తికెక్కాయా?" ఆ మనిషి తిట్ట్లు లంకించుకున్నాడు.

సారీ చెప్పి కారుని ముందుకి పోనిచ్చాడు. గుండె వేగంగా కొట్టుకోవటం తగ్గలేదు. షాక్ తగిలినట్లు విభ్రమం... తనెంత ఆలోచనల్లో ఉన్నా దృష్టి మాత్రం రోడ్డుమీదే ఉంది. తను చాలా జాగ్రత్తగా కారు నడుపుతాడు. మరి ఇందాకటి సంఘటన ఎలా జరిగింది? ఇదేమైనా ఈశ్వరరావు పన్నిన పన్నాగమా... తనని అప్రదిష్టపాలు చేయడానికి జరిగిన కుట్రా.. ఆలోచించేకొద్దీ అదే నిజమనిపిస్తోంది. లేకపోతే అంత అకస్మాత్తుగా కారుపైకి దూసుకొచ్చినట్ట్లు ఆ మనిషి ఎక్కడినుంచి ఊడిపడ్డాడు/ ఇంకా నయం.. తను అప్రమత్తంగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. లెకపోతే పోలీసు కేసయ్యేది. కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. శిక్షకూడా పడేదేమో.. అతని వళ్ళు క్షణకాలంలో భయంతో జలదరించింది.

యం యస్సీ మేధమెటిక్సులో ఆంధ్రా యూనివర్సిటీ నుండీ గోల్డ్ మెడల్ అందుకున్న మూడోనాడు ఈశ్వరరావు తమ ఇంటికొచ్చి శ్రీచరిత కాలేజిలో ఉద్యోగం ఇస్తానని ఆహ్వానించాడు. అప్పుడు కేవలం వందకు కొద్దిగా అటూ ఇటుగా విద్యార్ధులుండేవారు. మరుసటి సంవత్సరం ఆ కాలేజీ సాధించిన రిజల్ట్స్ చూసాక విద్యార్థులు నాలుగు వందలకు పెరిగారు. ఈ పదేళ్ళలో కాలేజీ అభివృద్ధికోసం ఈశ్వరరావుతో సమానంగా తనూ శ్రమపడ్డాడు. ఫలితంగా ఇప్పుడు విజయవాడలోనే నాలుగు బ్రాంచీలు ఉన్నాయి. కానీ చివరికి తనకు దక్కిన ప్రతిఫలం ... అత్యల్పం.

తన మేధస్సుకి, శ్రమకి తగిన గుర్తింపు లేనప్పుడు, ఆ సంస్థలో కొనసాగడం అనవసరమనిపించి, తనకు రెట్టింపు జీతం ఇస్తామన్న సునందా కాలేజిలో చేరిపోయాడు. ఇందులో తప్పేమిటీ? ఈశ్వరరావు అంతగా గింజుకోవాల్సిన అవసరమేమిటో అతనికి అర్థంకాలేదు. తన భవిష్యత్తు గురించి ప్లాన్ వేసుకునే అధికారం తనకు లేదా... శాసించడానికి ఈశ్వరరావు ఎవరు?

కారుకి అడ్డంగా ముగ్గురు వ్యక్తులు నిలబడ్డారు. వాళ్ళ మొహాలలో క్రూరత్వం.. కళ్ళలో దేనిమీదో కసి..ఒక్కోక్కడు బలంగా, మొరటుగా ఉన్నారు. రామ్మూర్తి మనసు కీడుని శంకించింది. కారుని రోడ్డు పక్కగా ఆపి

"ఎవరు మీరు" అని అడిగేలోపలే బ్యాక్ డోర్ తెరిచి ముగ్గురూ కార్లోకి ఎక్కి కూర్చున్నారు.

" ఏమిటీ దౌర్జన్యం ...మీకెం కావాలి" కోపంగా అడిగాడు రామ్మూర్తి.

" మాకు నువ్వు కావాలి. మేమింకా దౌర్జన్యంలోకి దిగలేదు. బుద్దిగా కారు వెనక్కి తిప్పి పోనీ. ఈశ్వరరావు సార్ నిన్ను పిల్చుకు రమ్మన్నారు. మా మాట వినలేదనుకో అప్పుడు నీ కాళ్ళూ చేతులూ విరిచి తాళ్ళతో కట్టేసి లాక్కెళతాం" అన్నాడందులో ఒకడు.

రామ్మూర్తి సెల్ ఫోన్ తీసాడు.

వాళ్ళలో మరొకడు వికటంగా నవ్వాడు. "ఏంటి పంతులూ... పోలీసులకి ఫోన్ చేస్తావా? చేయ్. వాళ్ళు రావడానికి పది నిమిషాలైనా పడ్తుంది. మాకా సమయం చాలు నీ గుండెల్లో కత్తితో నాలుగు పోట్లు పొడవటానికి. మేం పట్టు పడినా పర్లేదు. మాకు జైళ్ళు కొత్త కాదు. ఎటొచ్చీ నువ్వే ఈ లోకంలో ఉండవు. ఆలోచించుకో" అన్నాడు.

రామ్మూర్తికి భయం వేసింది. వాడు అన్నంత పనీ చేసేలా ఉన్నాడు. వాళ్ళు చెప్పినట్లు వినటమే ప్రస్తుతానికి తెలివైన పని అనిపించింది. కారుని వెనక్కి తిప్పాడు.

కారు ఆగిన శబ్దం విని ఈశ్వరరావు బైటికొచ్చాడు. "రండిరామ్మూర్తిగారూ.... బావున్నారా... మీ కోసమే ఎదురుచూస్తున్నా" అన్నాడు యింటిలోకి ఆహ్వానిస్తూ.

"సారీ. ఎన్నిసార్లు కబురంపినా రాకపోతే ఈ రకంగా మిమ్మల్ని రప్పించుకోవాల్సి వచ్చింది" కూచోమని సైగ చేస్తూ అన్నాడు ఈశ్వరరావు.

"సరే. నన్నెందుకు పిలిచారో చెప్పండి" అడిగాడు రామ్మూర్తి.

"మీరు పీజీ పూర్తిచేసిన వెంటనే మా కాలేజిలో పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చాను. మీరు మర్చిపోయారేమో. మీ జీతాన్ని నెలకు ఐదు వేలతో ప్రారంభించి డెబ్బయ్ ఐదు వేలకు పెంచాను. ఇప్పుడు మీరొచ్చిన కారు నేను బహుమతిగా ఇచ్చిందే".

"ఆ కృతజ్ఞతతోనే మీ కాలేజీ అద్భుతమైన విజయాలు సాధించటం కోసం ఆహర్నిశలూ పనిచేసాను. పదేళ్ళపాటు అంకితభావంతో శ్రమించి మీ కాలేజీని కార్పొరేట్ కాలేజీల్లో నెంబర్ వన్ గా తీర్చి దిద్దాను. కానీ దానికి ప్రతిఫలంగా నేను పొందిందెంత? యంసెట్లో మొదటి మూడు ర్యాంకులూ, ఐ ఐ టి లో అత్యధికంగా సీట్లు సాధించి మీకు బహుమతిగా ఇచ్చినందుకు ప్రతిగా ఆఫ్టరాల్ ఓ కారు బహుమతిగా ఇచ్చారన్న విషయం మీరు మర్చిపోయి ఉంటారు."

"మీకు డబ్బే ముఖ్యమయితే ఆ విషయం నాకు చెప్పి ఉండాల్సింది. మీరు కోరినంత జీతం ఇచ్చి ఉండేవాడిని. అంతేగానీ ఇలా మా కాలేజీని వదిలి వెళ్ళటం న్యాయంకాదు".

"నా ప్రతిభను గుర్తించి దానికి తగిన జీతం మీరు నిర్ణయించాలి తప్ప, నాకు నేను ఇంత కావాలని అడిగి నా ఆత్మాభిమానాన్ని కించపర్చుకోలేను. సునందా కాలేజి వాళ్ళు రెండింతలు జీతం ఇస్తామన్నారు. అందుకే వెళ్ళిపోయాను. ఐనా మీ కాలేజిలో జీవితాంతం పని చేస్తాననేమీ బాండు పేపర్ రాసివ్వలేదుగా. నా కిష్టమొచ్చిన సంస్థతో పని చేసే స్వాతంత్ర్యం నాకు లేదా?"

"సరే. జరిగిందేదో జరిగిపోయింది. మీరు తిరిగి మా కాలేజీకొచ్చేయండి. నెలకు రెండు లక్షలు జీతం ఇస్తాను"

"సారీ. అలా చేయలేను. నాకూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి".

"ఏమిటి మీ ఎథిక్స్? నమ్మిన నా లాంటి వాళ్లని వెన్ను పోటు పొడవటమా? మీ వల్ల నేనెంత నష్టపోయానో తెలుసా మీకు? మీరు సునందాలోకి మారిపోయారని తెలిసి మా విద్యార్థులు టీసీలు తీసుకుని సునందాలో చేరిపోతున్నారు. మా కాలేజీలో చేరాల్సిన విద్యార్థులు మనసు మార్చుకుని మా ప్రత్యర్థి కాలేజీనే ఎన్నుకుని తప్పు చేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విని ఆ కాలేజీని వదిలి వెనక్కి వచ్చేయండి. మీకు అన్ని విధాలా మంచిది"

"అంటే బెదిరిస్తున్నారా?"

"మీరెలా అనుకున్నా సరే. బతిమాలింపు అనుకోండి"

"సారీ. అది జరగని పని. నేనిక వెళ్తాను" రామ్మూర్తి లేచి నిలబడ్డాడు.

"సరే. అదే మీ చివరి మాటైతే నా మాట కూడా విని వెళ్లండి. ఇప్పటివరకూ సునందా కాలేజీ యాజమాన్యమే నా శత్రువర్గం అనుకున్నాను. ఈ రోజు నుండి మీరు కూడా నా శత్రువే. నా కాలేజీ ప్రతిష్ఠ నాశనం చేయడానికి పూనుకున్నవాళ్ళనెవరినీ వదిలిపెట్టను. అవసరమైతే వాళ్ళని అంతం చేయడానికి కూడా వెనుకాడను"

రామ్మూర్తి విసురుగా బైటికొచ్చాడు. ఆ ముగ్గురూ రాతి స్తంభాల్లా అక్కడే నిలబడి ఉన్నారు. వాళ్ళకు చెప్పి కొట్టిస్తాడేమోనన్న భయం .... వేగంగా కారు దగ్గరికి నడిచి కారుని స్టార్ట్ చేసాడు. వాళ్ళెవరూ కదల్లెదు. బతుకు జీవుడా అనుకుంటూ కారుని ముందుకి పోనిచ్చాడు.

***************************************************************************

హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఎనిమిదో వీధిలో ఒక ఇంటి అడ్రస్ కోసం వెతుక్కుంటున్నాడు సుందరం. అతని చేతిలో పదికి పైగా కంప్యూటర్ షీట్లున్నాయి. ఒక్కో షీటులో ఇరవై అడ్రసులున్నాయి.

తను వెదుకుతున్న ఇంటి నంబర్ కనిపించగానే అతనికి ప్రాణం లేచొచ్చింది. అబ్బ ఎంత సతాయించిందీ ఇల్లు .... గంటకు పైగా పట్టింది అనుకున్నాడు కాలింగ్ బెల్ల్ నొక్కుతూ. రెణ్ణిముషాలు ఎదురుచూసినా ఎవ్వరూ తలుపు తీయలేదు. మరలా బెల్ నొక్కాడు. మరో మూడు నిమిషాలు ఎదురు చూసాక తలుపు తెరుచుకుంది. దాదాపు నలబైయేళ్ళున్న ఒక స్త్రీ చిరాగ్గా మొహం పెట్టి ఏం కావాలన్నట్లు చూసింది. ఆమె నిద్రలోంచి వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

" సారీ టు డిస్ట్రబ్ యూ మ్యాం" సుందరం ఇబ్బందిగా నవ్వడానికి ప్రయత్నించాడు.

"సేల్స్ కోసమా ... ఈ టైంలో వచ్చి ఎందుకు సతాయిస్తారు? వెళ్ళండి ప్లీజ్" ఆమె విసురుగా తలుపు మూయబోయింది.

"స్వప్న మీ అమ్మాయే కదండీ" పెద్దగా అరిచినట్లు చెప్పాడు సుందరం.

ఆమె తలుపుని వెంటనే తెరిచి అతని మొహంలోకి ఆశ్చర్యంగానో, కుతూహలంగానో చూసింది.

"అవును మా అమ్మాయే. మీకెలా తెలుసు? ఇంతకూ మీరెవరు? ఆమె తల్లి మనస్సులో రకరకాల ప్రశ్నలు .... రకరకాల భయాలు.....

"మీ అమ్మాయికి యస్ యస్సీలో ఆరు వందలకుగాను ఐదువందల నలభై నాలుగు మార్కులు వచ్చాయి కదండీ"

"అవును. ఓ. మీరు మా అమ్మాయి చదివిన స్కూలు నుండీ వచ్చారా?" అందామె నవ్వుతూ.

"కాదండీ. నేను శ్రీచరిత కాలేజీనుండొచ్చాను. మీ అమ్మాయికి సంబంధించిన వివరాలు వాళ్ళ స్కూలునుంచి తీసుకుని మా కంప్యూటర్లో ఫీడ్ చేసుకున్నాం"

ఆమెకు విషయం అర్థంకాలేదు. అతను ఎందుకొచ్చాడొ తెలీటం లేదు. లోపలికి పిలవాలా వద్దా అనే మీమాంస. అతనెవరో ఎందుకొచ్చాడో పూర్తిగా తెలీకుండా లోపలికి పిలిచి రిస్క్ తీసుకోదల్చుకోలేదు. అసలే హైద్రాబాద్ .....

"సరే. విషయం ఏమిటో చెప్పండి" అందామె.

"నా పెరు సుందరం. శ్రీచరిత కాలేజీలో లెక్చరర్ని. మీ అమ్మాయిని ఇంటర్మీడియెట్ ఎక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నారు?"

సునందా కాలెజీ అని చెప్పడానికి ఆమె మొహమాట పడి, "ఇంకా నిర్ణయించుకోలేదండీ" అంది.

"మీ అమ్మాయిని మా కాలేజీలో చెర్పించండి. మంచి ఫ్యాకల్టీ ఉంది. ప్రత్యేకమైన శ్రధ్ధతీసుకొని పాఠాలు చెప్తారు. యంసెట్లో ర్యాంకు గ్యారంటీ. ఇంతకూ మీ అమ్మాయిని డాక్టర్ చేయాలనుకుంటున్నారా, ఇంజినీర్ గా చూడాలనుకుంటున్నారా?"

"డాక్టర్"

"మేడిసన్ లో సీటు కావాలంటే మా కాలేజ్ బెస్ట్. మీ అమ్మాయికి వచ్చిన మార్కుల దృష్ట్యా ఫీజులో ట్వంటీ ఫైవ్ పర్శెంట్ కన్సెషన్ కూడా ఇస్తాం. మార్కులు ఐదు వందల యాభై దాటిన వాళ్లకి ఫిఫ్టీ పర్శెంట్ కన్సెషనిస్తున్నాం"

"సరేనండీ. మమ్మల్ని ఆలోచించుకోనీయండి"

"అలాగే మ్యాం. మీవారి సెల్ నెంబర్ చెప్పండి"

"సారీ. అవసరమైతే మేమే కాంటాక్ట్ చేస్తాం"

"పోనీలెండి. మీ ల్యాండ్ లైన్ నంబర్ మా దగ్గిర ఉంది. నాలుగురోజులు పోయాక ఫోన్ చెయ్యమంటారా?"

ఆమెకు కోపం వచ్చింది. దాన్ని తమాయించుకుంటూ "మీరేమనుకోనంటే ఒక మాట. ఇదంతా మా ప్రైవసీని భగ్నం చేయడమని మీ కనిపించడంలేదా? ఈ సమయంలో ఇళ్ళకొచ్చి డిస్ట్రబ్ చెయ్యటమే తప్పు. మరలా ఫోన్లు చేసి ఎందుకు విసిగిస్తారు? శ్రీచరిత కాలేజిలో చేర్పించాలనుకుంటే మీరు చెప్పినా చెప్పకున్నా అక్కడే జాయిన్ చేస్తాం. ఈ ప్రచారమేమిటి వస్తువుల్ని అమ్మినట్లు? మీరు లెక్చరర్ అయితే ఉండాల్సింది క్లాసురూముల్లో... చేయాల్సిన పని పాఠాలు చెప్పటం. ఇదేమిటి సేల్స్ మెన్ లా ఇంటింటికీ తిరిగి.... మంచి నిద్రని పాడు చేశారు తెలుసా ... దయచేసి మరలా ఫోన్లు చేయకండి. అసలు మా అడ్రస్లూ, ఫోన్ నెంబర్లూ ఇచ్చిన ఆ స్కూల్ మీద కేసు వెయ్యాలి".

"సారీ సారీ... ఐ యం రియల్లీ సారీ" గిరుక్కున వెనక్కి తిరిగి అక్కడినుంచీ వచ్చేసాడు. అతనికి కన్నీళ్ళు తిరిగాయి. ఏమిటీ ఉద్యోగం... ఏమిటీ బతుకు అంపించింది. ఆమె కోపంగా మాట్లాడినా నిజమే మాట్లాడింది. చదువుని వ్యాపార వస్తువులా యింటింటికీ తిరిగి అమ్మడానికి తనని వాడుకుంటొంది యాజమాన్యం.

మూణ్ణెల్ల క్రితం లెక్చరర్ ఉద్యోగాలకోసం జరిగిన ఇంటర్వ్యూలో "యూ ఆర్ సెలెక్టెడ్" అని విన్నప్పుడు ఎంత సంబరపడ్డాడొ ... నెలకు ఎనిమిదివేల జీతం... తన కష్టాలన్నీ తీరిపోయాయని ఆనందపడ్డాడు. నాన్న తనపదొ ఏట చనిపోతే అమ్మ ఎంత కష్టపడి చదివించిందో తనకు తెలుసు. "మీకు బైక్ ఉందా" అని అప్పుడు ఎందుకడిగారో తర్వాతగానీ అర్థంకాలేదు. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడంకోసమే తనలాంటి పదిమందిని పార్ట్ టైం ఉద్యోగాల్లోకి తీసుకున్నారు.

ఓక కొత్త స్టూడెంట్ ని జాయిన్ చేస్తే వెయ్యి రూపాయల కమీషన్ అదనంగా ఇస్తామని ఆశ పెట్టారు. ఆ ఆశతోనే ఎన్ని అవమానలెదురైనా ఎన్ని ఛీత్కారాలెదురైనా సహించి పనిచేస్తున్నాడు. డబ్బులేమి సిగ్గునీ, లజ్జనీ ఎలా చంపేస్తుందో అతనికి అనుభవపూర్వకంగా తెలిసింది. యస్ యస్సీ పరీక్షలు జరుగుతున్నప్పుడెదురైన అనుభవం గుర్తొచ్చి అతనికి దుఃఖం పొంగుకొచ్చింది.

పరీక్షాకేంద్రాల దగ్గిరకెళ్ళి తమ కాలేజీ గురించి కాన్వాస్ చెయ్యాల్సిందిగా యాజమాన్యం ఆదేశించింది. రోకట్లో తలపెట్టాక రోకటి పోటుకి వెరవటం దేనికని కృష్ణవేణి స్కూలు దగ్గిరకెళ్ళాడు సుందరం. ఆ రోజు మేథమెటిక్స్ పరీక్ష జరుగుతోంది. పరీక్షహాలు బయట షామియానా వేసారు. రెండొందలకు పైగా ప్లాస్టిక్ కుర్చీలు వేసి ఉన్నాయి. ఎండ మండి పోతోంది. తమ పిల్లలకు తోడుగా వచ్చిన తల్లితండ్రులు పేపర్లతో, కర్చీఫ్లతో విసురుకుంటూ కూచుని ఉన్నారు.

ముగ్గురు ఆడవాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. సుందరం వాళ్ళ దగ్గిరకు వెళ్ళి పక్కనే ఉన్న కుర్చీలో కూచున్నాడు. అందులో ఒకావిడని ఉద్దేశిస్తూ " మీ అబ్బాయా అమ్మాయా పరీక్ష రాస్తుంది" అని అడిగాడు.

"మా అబ్బాయి"

"బాగా తెలివిగలవాడనుకుంటాను"

"ఫర్లేదు. వాడి మార్కులగురించి దిగులు పడ్తుంటే 'ఐదొందలకు పైగా తెచ్చుకుంటాను మమ్మీ' అని ప్రామిస్ చేసాడు" అందామె గర్వంగా.

"ఈ రోజుల్లో ఐదొందల మార్కులంటే పెద్ద విషయమెమీ కాదు. మూలన కూచున్న ముసలమ్మచేత పరీక్షరాయించినా అన్ని మార్కులొస్తాయి. ఐదొందల అరవై దాటాలి అదీ స్కోరంటే. మా వాడు క్రికెట్ ఎంత బాగా ఆడ్తాడో చదువులో కూడా అంతే. తప్పకుండా ఐదువందల ఎనభైకి పైగా తెచ్చుకుంటాడు. ఐదువందల అరవై ఐతే డెఫినెట్ అంది మరొక ఆవిడ.

"ఇంటర్లో ఏ కాలెజిలో జాయిన్ చేయాలనుకుంటున్నారు?" అని అడిగినప్పుడు ఆమె సుందరం వైపు ఎగాదిగా చూసి "ఎందుకునాయనా అలా అడిగావు? నీ వయసు చూస్తే పదో తరగతి చదివే పిల్లలుండే అవకాశమే లేదు. అసలు పెళ్లయిందా" అని అడిగింది.

"లెదండీ" అన్నాడు సిగ్గుపడుతూ సుందరం. "నేను శ్రీ చరిత కాలేజిలో లెక్చరర్ గా పని చేస్తున్నానండీ. మీ పిల్లల్ని శ్రీచరిత కాలేజిలోనే చేర్పించండి. మీరు కన్న కలల్ని సాకారంచేసే ఒకే ఒక విద్యాసంస్థ శ్రీచరిత"

"ఆలూ లేదూ చూలూ లేదు అన్న సామెతలా ఇప్పుడే ఏం తొందరొచ్చింది? పరీక్షలు పూర్తి కావాలి. రిజల్ట్స్ రావాలి. ఇంకా రెండు నెలల టైం ఉందిగా. పిల్లాడు కడుపులో ఉన్నప్పుడే నర్సరీ స్కూల్లో అడ్మిషన్ తీసి పేట్టుకొనే పరిస్థితి దాపురించిందని జోకుల్లో చదివి ఎంత విడ్డూరం అనుకున్నాను. ఈ జాడ్యం మీ కార్పొరేట్ కాలేజీలకు కూడా పాకిందన్నమాట"

"ఇప్పుడంతా స్పీడ్ యుగం కదండీ. దానికి తోడు కాలేజీల మధ్య కట్ త్రోట్ కాంపిటీషన్." సుందరం గొంతు పెగుల్చుకుని అన్నాడు.

"మీ కాలేజీ గొప్పదని మీరు ప్రచారం చేసినంత మాత్రాన నమ్మి జాయిన్ చేసేంత వెర్రి వెధవలా తల్లితండ్రులు? ఇలా రోడ్లు పట్టుకుని తిరిగేకంటే చదువు చెప్పటం పైన ధ్యాస పెట్టండి. మంచి రిజల్స్ చూపించండి. దానికి మించిన ప్రచారం మొరోటి ఉండదని మీ యాజమాన్యానికి చెప్పండి. ఇదేమైనా వళ్ళు రుద్దుకునే సబ్బా భారీగా యాడ్స్ గుప్పించడానికి? చదువండీ .... సరస్వతీ దేవి" అందామె కోపంగా.

ఇప్పుడు ప్రతీదీ ప్రచారాలపైనా, హంగూ ఆర్భాటాలపైనా ఆధారపడి మనగలుతోందని ... చదువు కూడా అంతేననీ చెప్పాలనుకున్నాడు. నర్సరీ క్లాసునుంచే కంప్యూటర్ శిక్షణ అని ఓ స్కూలు ప్రచారం చేస్తోంది. 'మీ పిల్లలకు ఎల్కేజీ నుంచే గుర్రపుస్వారీ, స్విమింగ్ నేర్పించే ఏకైక విద్యాసంస్థ ' అని మరొకడంటాడు. ఏసీ క్లాసు రూములు, ఏసీ బస్సులు మరో స్కూల్ అట్రాక్షన్. వీటికి చదువుకీ ఉన్న బాదరాయణ సంబంధమేమిటో ఎంత బుర్ర బద్దలుకొట్టుకున్నా అర్థం కాదు. కానీ ఆ స్కూళ్ళు నిండి పోతుంటాయి. అడ్మిషన్లు దొరకవు. భారీగా డొనేషన్లు ... ఇవన్నీ చెప్పాలనుకున్నాడు సుందరం. కానీ నోరు పెగల్లేదు.

"చదువుని బిజినెస్ చేయకండి. మీ కార్పొరేట్ కాలేజీలు పవిత్రమైన విద్యావ్యస్థకు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. ఇంకా ఎందుకు చదువుని అంగట్లో సరుక్కన్నా హీనంగా దిగజారుస్తారు? దయచేసి వెళ్ళిపోండి" ఆమె మరింత ఆవేశంగా మాట్లాడుతోంది.

సుందరానికి బాధనిపించింది. ఆమె ఆవేశంలొ, ఆక్రోశంలో అర్థం ఉందనిపించింది. తన ఉద్యోగం మీద తనకే అసహ్యం వేసింది. ప్లాట్లు అమ్మిపెడితే కమీషన్లిస్తారు. ధరని బట్టి ఓ ప్లాటుకి రెండువేలనుంచీ ముట్టొచ్చు. తమ కాలేజీలో కొత్త అడ్మిషన్ చేరిస్తే వెయ్యి రూపాయల కమీషన్ ఇస్తారు. రెండిటికీ పెద్ద తేడా లేదనిపించింది. ఇందులోనే తక్కువ కమీషన్ ఇస్తారు. ... లెక్చరర్ ఉద్యోగం కన్నా ప్లాట్ల వ్యాపారం మెరుగైందనిపించింది. ఆ రాత్రంతా ఆలోచించి మానేయాలనుకున్నాడు. కానీ మరునాడు నిద్ర లేవగానే తను చదివిన చదువు గుర్తొచ్చి, ఆ జీతం డబ్బులు తనకెంత అవసరమో గుర్తొచ్చి మరో పరీక్షాకేంద్రానికి కాన్వాస్ చేయడానికి వెళ్ళాడు.

(సశేషం)

భావుకతను సృజనాత్మకతను రంగరించిన కథనశైలితో విశేష ప్రతిభ కలిగిన కథకుడు, నవలాకారుడు శ్రీ సలీం. కథా ప్రక్రియలో తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి పురస్కారం,వెండి మేఘం నవలకు తెలుగు యూనివర్శిటీ సాహిత్య పురస్కారం (రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు), వి. ఆర్. నార్ల పురస్కారం లభించాయి. 'రూపాయి చెట్టూ కథా సంపుటికి మాడభూషి రంగాచారి స్మారక అవార్డు, కాలుతున్న పూలతోట నవలకు బండారు ఈశ్వరమ్మ స్మారక పురస్కారం లభించాయి.