పర"దేశి" కతలు: కన్ ఫ్యూజ్ డ్ దేశీస్!

-- తాటిపాముల మృత్యుంజయుడు

ఉదయం పదకొండు గంటలు కావస్తోంది. బయటికి లంచ్ కెళ్ళే హడావుడి మొదలయ్యింది. అందరం ఒకచోట గుమికూడసాగాం. గ్రూప్ లంచ్ కు వెళ్ళటనికి కారణలు రెండు. ఒకటి శుక్రవారం కావటం. రెండు, ఈ మధ్యనే ఇండియానుండి ఒక కొలీగ్ విజిటింగ్ పై వచ్చాడు. అతన్ని భోజనానికి తీసుకెళ్ళాలనే ఆలోచన. వచ్చినతని పేరు బాలసుబ్రహ్మణ్యం ఉరఫ్ బాలు.

బాలు వయసు పాతికలోపే. పెళ్ళి కాలేదు. హైద్రాబాద్ వదిలి విదేశానికి రావడం ఇదే మొదటిసారి. ఈమధ్య ఇండియాలోని మాకంపెనీలో (మాకంపెనీ ఏం ఖర్మ, అన్ని కంపెనీల్లో ఇదే తంతు) ఇంజనీర్లు తుమ్మితే ఊడిపోయె ముక్కుల్లా ఇలా జాయిన్ అయ్యి అలా ఎగనామం పెట్టి ఇంకో కంపెనీలో ఎక్కువ జీతంతో జాయిన్ అయి పోతున్నారు. ఇలాంటి వైపరీత్యం పూర్వం పెళ్ళిళ్ళ వేటలో వరకట్నాల విషయాల్లొ జరిగేదని వినేవాణ్ణి. ఇప్పుడు ఆ వ్యాధి కాస్తా ఐ.టీ. రంగంలో ప్రవేశించింది. తామరాకు మీద నీటిబొట్టుల్లా ఉంటున్న ఉద్యోగుల్ని నిలబెట్టుకోటానికి రొటేషన్ పద్ధతిపై మూణెళ్ళకొకర్ని అమెరికా రావటానికి అవకాశం కల్పిస్తున్నది.

ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆవేశంతో అమెరికా వచ్చాడు బాలు. పనిలో తెలివితేటలతో పాటు దుడుకుతనం కూడా కాస్తా ఎక్కువే. నేను ఆఫీసు పని గురించి ఫోనులో మాట్లాడినపుడు, కొన్నిసార్లు పని మీద హైద్రాబాద్ అఫీసు వెళ్ళినపుడు 'మీకేంటి, మీరు అమెరికాలో హాయిగా ఉన్నారు. నేను ఎప్పుడు వస్తానో ఏమో...', 'ఇండియా వస్తే మీకేమి మనీ ప్రాబ్లెం ఉండదు... డాలర్లలో సంపాదించి, రూపాయిల్లో ఖర్చు పెడతారు...' లాంటి మాటలు అనేవాదు. అప్పుడు నా ఫీలింగ్ అడకత్తెరలో పోకచెక్కలా ఉండేది. ఎందుకంటే అతని మాటల్లో పూర్తిగా నిజం లేదు. తనుకూడా నీళ్ళలోకి దిగితేనేగా లోతు తెలిసేది. ఏమీ అనక చిరునవ్వు సమాధానంగా ఇచ్చేవాణ్ణి.

అమెరికా వచ్చానన్న సంతోషంతో మా ఫ్లోర్ లో ఉన్న వారందరిని పేరు పేరునా (పేరు తెలియకుంటే మరీ నన్నూ, సుందర్రావునీ, వెంకటరమణనీ అడిగి తెలుసుకొని) 'హలో', 'హాయ్', 'ఐ యాం బాలూ' అంటూ పలకరించాడు. వచ్చిన రెండు రోజుల్లోనే బాలు ఉనికి అందరికి తెలిసిపోయింది.

వచ్చిన మొదటిరోజే లిండా దగ్గరికెళ్ళి 'హౌ ఆర్ యూ డూయింగ్ లిండా?' అన్నాడు. ఆవిడ 'ఫైన్ ' అంటూ 'నైస్ టు సీ యూ' అంది. వెనువెంటనే బాలూ 'హౌ ఈజ్ యువర్ హస్బండ్ డూయింగ్?' అని అడిగేసాడు. ఆ ప్రశ్నకు లిండా కొంత తడబడింది. 'ఐ యాం నౌ సింగిల్. ఐ మీన్ ఐ యాం డివోర్స్డ్.' అంది. బాలు కొద్దిగా వెనక్కు తగ్గాడు. అంతలోనే లిండా నవ్వుతూ 'ఐ హావ్ ఎన్ ఎక్స్ హస్బండ్. వుయ్ ఆర్ స్టిల్ గుడ్ ఫ్రెండ్స్ ' అంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక కొద్దిగా తడబడ్డాడు బాలు.

ఆ తర్వాత మాకు తెలిసింది మేము చెప్పాము. అమెరికాలో డైవోర్సులన్నీ శత్రుత్వంతో ముగియవు. విడిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు కలుసుకుంటారు. కలిసి డిన్నర్ చేస్తారు. సినిమాలకి, షికార్లకి వెళ్ళాటం మామూలే అని చెప్పాము.

బాలు అలా చొరవ తీసుకొని అడిగినందుకు లిండా ఏమీ అనుకోలేదు. ఎందుకంటే ఆవిడకు 'ఇండియన్ కల్చర్ ' ట్రెయినింగ్ ద్వారా తెలిసింది ఏమిటంటే 'ఇండియన్లు పరిచయం అయిన కొద్ది సమయంలోనే వ్యక్తిగత ప్రశ్నలు కూడా వేస్తారు ' అని.

ఓ పదిమందిమి జమ అయ్యాం. బాలు ఇంటి తిండి మిస్సవుతున్నాడని 'ఇండియన్ రెస్టారెంట్' కు వెళ్ళాలని నిశ్చయించాం. జేమ్స్ కి 'ఇండియన్ ' తిండి అనగానే ముఖం వెలిగిపోయింది. ఎందుకంటే అతను ఈ మధ్య ఎలర్జీస్ తో సతమతమవుతున్నాడు. 'చికెన్ కర్రీ' తింటే మసాలా ఘాటు నషాళానికి అంటి నాసికారంధ్రాలు తెరచుకొని సైనస్ బాధనుండి ఉపశమనం కలుగుతుందని అతని అభిప్రాయం.

ఎలివేటర్లో కిందకు వెళుతుంటే వేరే ఫ్లోర్లో పని చేసే జెన్నీఫర్, పీటర్ కలిసారు. వాళ్ళు కూడా లంచ్ కు బయటకు వెళ్ళూతున్నారు కాబట్టి మాతో కలిసి వస్తామన్నారు. వారికి బాలును పరిచయం చేశాం.

అందరం కలిసి రెస్టారెంట్ కు చేరుకున్నాం. బఫే భోజనం మొదలెట్టాం. మాటలు మొదలయ్యాయి. జెన్నీఫర్ ఆవిడ కుక్క గురించి చెప్పటం మొదలెట్టింది. ఆ కుక్కకి ఈ మధ్య జబ్బు చేసిందని, అందుకు తను, తన బాయ్ ఫ్రెండు ఎంతగా మానసికవేదన పడుతున్నది, ఎలాంటి మెడికల్ టెస్టులు చేయించింది అనర్గళంగా చెప్పుకువస్తున్నది. ఈ పెంపుడు జంతువుల విషయంలో అంతగా ప్రవేశం లేదు కాబట్టి నేను, సుందర్రావు, వెంకటరమణ శ్రోతలుగానే మిగిలిపోయాం. ఆవిడ మాట్లాడుతున్న కొన్ని పదాలు మాకు అర్థంగాక గ్రీకులా తోచింది.

ఇలాంటి సమయాల్లో నేను పూర్తిగా మౌనంగా ఉండకుండా, అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం లో ముచ్చటగా మూడు ప్రశ్నలు సంధిస్తాను. అవి 'మీ కుక్క పేరేంటి?', 'మీ కుక్క వయసు ఎంత?' మరియు 'అది ఏ జాతి కుక్క?'. కాని, మూడో ప్రశ్నతో అప్పుడప్పుడు వస్తుంది తిరకాసు. నాకు కుక్కల జాతుల్లో 'బుల్ డాగ్ ', లేదా 'డాల్మేషియన్ ' మొదలగు ఏవో రెండుమూడు పేర్లు తెలుసు గాని, ఇంకేదైనా కొత్త సంకరజాతి పేరు చెబితే పప్పులో కాలేస్తాను.

'ఇట్స్ గుడ్ దట్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఈజ్ సప్పోర్టివ్ ' అంది లిండా.

'కరెక్ట్! ఐ యాం లక్కీ దట్ హీ లైక్స్ మై డాగ్ మోర్ దాన్ ఐ లైక్. దట్ ఈజ్ ఒన్ ఆఫ్ ది రీజన్ ఐ ఆం లివింగ్ విత్ హిం' అంటూ కితాబిచ్చింది జెన్నీఫర్.

ఎక్కడో చదివినట్టు గుర్తు. అమెరికన్లు గర్ల్ ఫ్రెండ్ ప్రేమను పొందాలంటే ఆవిడకు ఏవైనా కుక్క, పిల్లిలాంటి పెట్స్ ఉంటే వాటిని కూడా సమానంగా ప్రేమించాలి. అప్పుడే సఖ్యత కుదిరినట్టు. లేకుంటే 'ఇంతే సంగతులు... చిత్తగించవలెను ' అన్నమాట.

'దట్ మీన్స్, జెన్నీ, యూ గైస్ విల్ బి మ్యార్రీడ్ సూన్ ' ప్రశ్నలా కాకుండా వ్యాఖ్యలా అనేసింది లిండా.

'నో డౌట్. హీ ఈజ్ ఏ గ్రేట్ గై. బట్ వియ్ విల్ రిమైన్ యాజ్ లాంగ్ టైం కంపేనియన్స్.' తమ నిర్ణయాన్ని చెప్పింది జెన్నీఫర్.

బాలుకు ఈమాటలు కొరుకుడు పడడం లేదు. 'లాంగ్ టర్మ్ కంపేనియన్ అంటే ఏమిటి ' అమాయకంగా, నెమ్మదిగా, ఎవరికీ వినపడకుండా అడిగాడు.

తెలుగు భాష మీద పట్టున్న సుందర్రావు కలుగజేసుకొని 'కంపేనియన్ అంటే తెలుగులో జతగాడు, చెలికాడు అనుకోవచ్చు.' అంటూ వివరించాడు.

అలా కొద్దిసేపు పెంపుడు కుక్క గురించి మాట్లాడుతుంటే లిండా తన పెంపుడు పిల్లి గురించి మాట్లాడటం ఆరంభించింది. ఆ పిల్లిని రాత్రి వరండాలో ఉంచితే మధ్యరాత్రి తలుపు మీద గోళ్ళతో గీకుతుందట, లోపలికి వస్తానని మారాం చేస్తుందట. తలుపు తెరవగానే పక్కలోకి దూరేస్తుందట. ఇలా సాగుతున్నాయి ఆవిడ పిల్లి ముద్దూముచ్చట్లు.

'హౌ ఎబౌట్ యూ, లిండా? డు యూ హేవ్ ఎనీ మ్యారేజ్ ప్లాన్స్?' జెన్నీఫర్ అడిగింది.

'డొంట్ నో. హీ ఈజ్ నాట్ ఆస్కింగ్ మీ టు మ్యారి హిం. ఐ యాం హ్యాపీ లైక్ దిస్. హీ ఈజ్ హస్బండ్ లైక్ బాయ్ ఫ్రెండ్' అంది జెన్నీఫర్.

అప్పుడప్పుడు ఇలాంటి సంగతులు కూడా తెలుస్తుంటాయి. టీవీలో కూడా చూస్తుంటాము. అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడతారు. కలిసి జీవిస్తారు. కాని అబ్బాయి అమ్మాయిని 'పెళ్ళి చేసుకుండామా?' అని అడగడు. అందుకు సరిగా అమ్మాయి కూడా 'భీష్మ ప్రతిజ్ఞ 'లా అడగదు.

మళ్ళీ తనే మాటలను కొనసాగిస్తూ 'ఐ యాం హ్యాపీ ది వే ఐ యాం? ఐ విల్ డిక్లేర్ హిం యాజ్ మై డొమెస్టిక్ పార్ట్ నర్. దట్ వే హీ ఈజ్ ఆల్సో కవర్డ్ ఫర్ మెడికల్ బెనిఫిట్శ్ తమ సరికొత్త నిర్ణయాన్ని చెప్పింది.

ఈ మాటలకి ఇబ్బందిగా కదిలాడు బాలు. 'డొమెస్టిక్ పార్ట్ నర్ అంటే ఏమిటీ' మళ్ళీ అమాయకంగా ముఖమెట్టి అడిగాడు.

సుందర్రావు మళ్ళీ కలుగజేసుకొని 'పార్ట్ నర్ అంటే భాగస్వామి అని మనకు తెలుసు. వ్యాపారంలో భాగస్వాములంటే పెట్టుబడులతో పాటు లాభనష్టాలు కూడా భరించాలి. అలాగే డొమెస్టిక్ పార్ట్ నర్ అంటే గృహభాగస్వామి అనుకోవచ్చు. నేను ఎక్కడో చదివినట్టు గుర్తు. డొమెస్టిక్ పార్ట్ నర్ అంటే కలిసి జీవిస్తూ, కలిసి ఇంటీ ఖర్చులు భరిస్తూ, ఒకరికొకరు తోడునీడలా ఉండే వాళ్ళని అమెరికన్ గవర్నమెంట్ డొమెస్టిక్ పార్ట్ నర్స్ అంటూ పరిగణించ వచ్చునని శాసనం జారీ చేసిందని.' అంటూ మాకు జ్ఞానబోధ చేసాడు.

భోజనాలు పూర్తి కావచ్చాయి. బిల్లు పేచేసి బయటకు నడుద్దామని లేస్తుండగా, పీటర్ 'ఐ హావ్ ఎన్ అనౌన్స్ మెంట్ టు మేక్' అన్నాడు. మేమంతా ఆగి అతను ఏం చెబుతాడా అని ఆసక్తిగా వింటుంటే, 'ఐ యాం అరేంజింగ్ ఎ గేట్ టుగెదర్ ఇన్ మై న్యూ హోం దిస్ ఫ్రైడే. ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు జాయిన్ ఇఫ్ యూ హేవ్ టైం.' అన్నాడు.

'ష్యూర్. థాంక్స్!' బయటకు నడుస్తుంటే, మళ్ళీ అన్నాడు. 'బై ది వే, యూ ఆర్ వెల్కం టు బ్రింగ్ యువర్ సిగ్నిఫికంట్ అదర్ ' అని.

మళ్ళీ బాలు మానవునికి, గీతలో అర్జునునికి ఒకదానివెనక ఇంకొక సందేహం కలిగినట్టు, కలిగింది అనుమానం 'సిగ్నిఫికంట్ అదర్ అంటే ఏంటని?'

నేను సుందర్రావుకేసి చూసాను, ఇప్పటివరకు జతగాడు, భాగస్వామి అంటూ సరిగానే భాష్యం చెప్పాడు, ఇప్పుడు ఏం చెబుతాడా అని. అతనికి మాటలు దొరకనట్టున్నాయి. ఇక నా సంగతి సరేసరి. ఇంటికెళ్ళి బ్రౌన్నిఘంటువు తిరగెయ్యాలని నిశ్చయించుకున్నాను.

కొత్తగా నేర్చుకొన్న పద పరిజ్ఞానంతో తడబడుతున్న బాలూని చూసి 'నీవేం వర్రీ గాకు. మేం గూడా నీతో సమానంగా కన్ ఫ్యూజ్ అయ్యాం. చూశావా, మేం అమెరికాలో హాయిగా ఉంటుంన్నాం అన్నావు. ఇప్పుడు నీకు అర్థం అయ్యి ఉంటుంది, మా సాధకబాధకాలేంటో. మేమేమి అమెరికన్లలా పుట్టి పెరగలేదుగా ఇవన్నీ అర్థం కావడానికి, అనుభవంలోకి రావడానికి. వియ్ ఆర్ ఆల్ కన్ ఫ్యూజ్ డ్ దేశీస్! ' అన్నాను.