పద్యం-హృద్యం

-- తల్లాప్రగడ

ముందుమాట: ముందుమాట: ఈ శీర్షికతో తెలుగు పద్యంలో ఉన్న అందాన్ని, గొప్పతనాన్ని పదిమందికీ అందించి, వారినీ ఈ ప్రక్రియకు దగ్గిర చేసి, పద్యానికుండవల్సిన మర్యాదని గుర్తుచేయడమే మా సంకల్పం. మరుగు పడిన పద్యాన్ని మళ్ళీ మెరుగు పరచి, భాషను సరళీకృతం చేస్తే, పద్యాలంటే ఉన్న భయం తొలుగుతుంది. వాడుక భాషలో పద్యాలు వ్రాస్తే, అటు పద్యమూ నిలబడుతుంది, ఇటు ప్రజలకూ అర్థమవుతుంది. అందుచేత వాడుకభాషా ప్రయోగాలకు మేము ప్రాముఖ్యత ఇవ్వదలిచాము. ముందు ముందు ఈ శీర్షికను పాఠకులందరూ పాల్గునే విధంగా రూపొందిస్తాము. అలాగే మంచి పద్యాలకు భాష్యం, తాత్పర్యాలు, కూడా ప్రచురిస్తాము. అందరూ ఆనందించాలి, ఆస్వాదించాలి, ఆదరించాలి, అదే మాకు పదివేలు (డాలర్లు)!!!!

సమస్యాపూరణం:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము.

మీ జవాబులు ఈ మెయిల్(rao@infoyogi.com) ద్వారా కాని ఫాక్స్ ద్వారా కానీ : 408-516-8945 మాకు జులై 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.పద్యంలో యతిప్రాసల నియమాల సులువుగా అవగాహన అవ్వడానికి పాఠకుల సౌకర్యార్థం ఈ లంకెని నొక్కండి.

ఈ మాసం సమస్య

"తే.గీ. :// రావణుని బంటు వయితివి రామచంద్ర "

క్రితమాసం సమస్య ( శ్రీ పుల్లెల శ్యామసుందర్ గారు ఇచ్చిన సమస్య) :
"కం:// పిల్లల నొకటేయవలెనె పిల్లల తల్లీ "

మొదటి పూరణ - డా: ఐ.యస్. ప్రసాద్, హైదరాబాద్

కం:// అల్లరి చిల్లరగదిరుగు
పిల్లల తోడై చదువును పక్కకు నెట్టే
సెల్లపుడు ఆటలాడెడు
పిల్లల నొకటేయవలెనె పిల్లల తల్లీ!

రెండవ పూరణ - పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే,

కం:// మెల్లగ ఇంటిలొ దూరుతు
పిల్లలకొఱకున్న గడ్డ పెరుగును తాగే
పిల్లులను వాటి గంపెడు
పిల్లల నొకటేయవలెనె పిల్లల తల్లీ!


మూడవ పూరణ - కె.వి.యస్. శ్రీరాం, బెంగళూరు

కం:// పిల్లలు మాటల లొంగరు
పిల్లల నొకటేయవలెనె పిల్లల తల్లీ!
పిల్లలు పిడుగులు అనియెడి
కల్లలు నమ్మకు, కరుణతొ గాచుము జననీ


మరొక పూరణ

కం:// మెల్లగ జెప్పిన మాటల
నొల్లక మరియాదతెలియకుండగ నెపుడున్
ప్రల్లదమాడుచుయుండెడి
పిల్లల నొకటేయవలెనె పిల్లల తల్లీ!


నాల్గవ పూరణ - తల్లాప్రగడ, శాన్ హోసే,

కం:// కల్లది మాంసరహితముగ
పిల్లకి చికెను బిరియాని పెట్టుట! అందున్
మెల్లగవండుచు కోడుల
పిల్లలనొకటేయవలనె పిల్లల తల్లీ!!!


ఐదవ పూరణ - రానారె, హ్యూస్టన్ (రామనాధ రెడ్డి ఎర్రపు రెడ్డి)

కం:// కల్లును తాగిన కోతుల
నల్లరి మూకలనుచు తెగనాడగదగునే?
మెల్లన సముదాయింపక
పిల్లలనొకటేయవలనే పిల్లలతల్లీ!??
(పెద్దలకు ఓపిక పోవడం వల్లగానీ నిజానికి పిల్లలని కొట్టడం అవసరమా?)


ఆరవ పూరణ - గరిమెళ్ళ సుబ్బలక్ష్మి, హైదరాబాదు

కం:// అల్లరి హద్దులు దాటిన
వల్లెయనుచు యూరకొనుట వలదు నీకూ!
ఛెళ్ళని నీతిని దప్పిన
పిల్లలనొకటేయవలనే పిల్లలతల్లీ!పాఠకుల నుంచీ ఇంకొన్ని మంచి పద్యాలు: పుల్లెల శ్యామసుందర్ గారి పద్యం

కం:// ఇక్కడి జీవితమింతే
లెక్కకు సౌకర్యమున్న లేదులె సమయం
ఎక్కడ! తీరిక దొరకదు
చక్కగ పద్యము గురించి చదువుట కొఱకైభక్త హనుమ -- తల్లాప్రగడ

సందర్భం: అశోకవనంలో హనుమంతుడు ప్రవేశించాడు. ఆక్కడ మౌనంగా కనులుమూసుకుని ధ్యానంలోనున్న సీతామ్మవారిని చూడగానే తన మనసులో కలిగిన భావోద్రేకం ఈ విధంగా ఉంది!

సీ// తపనమా యదిలేక తనరారు తపమునా? తనువు చెక్కెనుకాని తళుకు తెగదు!
తన్మయమ్మే తానై తమమునే తుంచెడి,తారణ తాపసి తన్వి తాను!
తరుణి చుట్టూ చూడ తారాడు రక్కసుల్!తలుపుకూడాలేని తావలమ్ము!
తలివమ్ము లేదునూ తలియైననూ లేదు, కరకునేలేతల్లి కంటగించు!

తే.గీ.// ఈ తలోదరినీ దరికీ ఈడ్చి వాడు,
తెలిసి తలమించు భారాన్ని తెచ్చినాడు!
తప్పదిక తప్పులెంచుకో, తిప్పలెన్నో
రావణుడికి నా చేతిలో రామచంద్ర!

ప్రతిపదార్థం:

తపనమా = అది తాపమా (లేక తపించడమా)?
యదిలేక = లేకుంటే
తనరారు = అతిశయించు, చాలా గొప్పదైనటువంటి
తపమునా= తపస్సా?
తనువు = శరీరం
చెక్కెనుకాని = చిక్కింది కానీ
తళుకు తెగదు = ఆ అందం తగ్గలేదు!
తన్మయమ్మే తానై = తత్స్వరూపమే తాను అయ్యి
తమమునే = చీకటినే (లేక భాధలనే)
తుంచెడి = తగ్గించే, (లేక తొలగించే)
తారణ = తరింప చేయునటువంటి
తాపసి = మహా తపస్వి అయినటువంటి
తన్వి తాను = అందాలరాశి అయినటువంటి ఆమె!
తరుణి = ఆ యవ్వనము కలబోసిన ఆమె
చుట్టూ చూడ = చుట్టూ చూస్తే
తారాడు రక్కసుల్ = అటూ ఇటూ తిరిగుతూ కాపలా కాసే రాక్షసులు!
తలుపుకూడాలేని = ఆమె నివాసం చూస్తే తలుపుకూడాలేని
తావలమ్ము = నివాసము
తలివమ్ము లేదునూ = పడుకోటానికి ఒక మంచం లేదూ,
తలియైననూ లేదు= తింటానికి ఒక కంచం కూడా లేదు
కరకునేలేతల్లి = ఒట్టి కరుకు నేల మీదే ఉన్నావేతల్లి
కంటగించు = ఎదిరించవమ్మా!

ఈ తలోదరిని = ఈ సన్నని నడుముగల వనితను
ఈ దరికీ ఈడ్చి వాడు = ఈ మూలకు (లంకకు) ఈడ్చుకొచ్చి వాడు (రావణుడు)
తెలిసి = అంతా తెలిసే
తలమించు భారాన్ని తెచ్చినాడు = తన తలకు మించిన భారాన్ని తెచ్చాడు
తప్పదిక = తప్పదిక
తప్పులెంచుకో = తప్పులను లెక్కపెట్టుకో (వాడి పాపం పండింది అని అనడం)
తిప్పలెన్నో = ఇక కష్టాలెన్ని వస్తాయో
రావణుడికి = రావణాసురిడికి
నా చేతిలో = నా చేతిలో
రామచంద్ర!= రామచంద్రుడా!